భీష్మ యోగి
భీష్మ ఏకాదశి జనవరి 27 2018
లోకరీతి, లోకనీతి తెలిసి మెలిగేవారు, స్థితప్రజ్ఞులు, నియమానువర్తులను లోకం ఏదోరూపంలో స్మరిస్తూనే ఉంటుంది. యుగాలు గడిచినా అలాంటి మహనీయుల జయంతులు, వర్ధంతులు స్మరణదినాలుగా నిలిచిపోతాయి. అలాంటి రోజుల్లో మాఘ శుక్ల ఏకాదశి ఒకటి. ఈరోజుకు జయైకాదశి అని పేరు. భీష్ముడి పేరిట భీష్మైకాదశి అని ప్రసిద్ధమైంది.
గంగాదేవికి శంతన మహారాజు ద్వారా జన్మించిన ఎనిమిదో సంతానం దేవవ్రతుడు. తొలి ఏడుగురి సంతానాన్ని నది పాలు చేసింది గంగ. అయినా తానేం చేసినా ఎదురాడకుండా ఉన్నన్నాళ్లే కాపురం చేస్తానన్న గంగ మాటకు కట్టుబడి శంతనుడు కిమ్మనలేదు. దేవవ్రతుణ్నీ అలాగే చేయబోతే వారించాడు శంతనుడు. దాంతో ఆ బిడ్డను వదిలిపెట్టి గంగ వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల పేర్లతో ఆ శిశువు శాంతనవుడు, గాంగేయుడుగా ప్రసిద్ధుడయ్యాడు. వసిష్ఠ మహర్షి దగ్గర శిష్యరికం చేశాడు. అస్త్రశస్త్రాది యుద్ధవిద్యల్లో, ధర్మశాస్త్రాల్లో నిష్ణాతుడయ్యాడు. యౌవరాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు. కొద్ది రోజుల్లో తండ్రి తరవాత రాజుగా పట్టాభిషిక్తుడు కావాల్సి ఉంది. అలాంటి సమయంలో సత్యవతి మీద తన తండ్రి మనసుపడ్డాడని, ఆమెకు కలిగిన సంతానాన్ని రాజు చేస్తేనే ఆమె శంతనుణ్ని వివాహమాడుతుందని దాశరాజు షరతు విధించాడని తెలుసుకున్నాడు. పట్టపురాణి బిడ్డను వదిలి, మనసుపడ్డదాని బిడ్డను రాజుగా చేయడమెలాగని తండ్రి మథనపడుతున్నాడనీ వింటాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జన్మనిచ్చిన తండ్రి కోరిక తీర్చడం కొడుకుగా తన ధర్మమని భావించాడు దేవవ్రతుడు. వెంటనే దాశరాజు దగ్గరకెళ్లాడు. ఆమెకు పుట్టిన బిడ్డలకే రాజ్యాధికారం కల్పించడం కోసం తాను రాజ్యాధికారాన్ని వదులుకుంటున్నానని చెప్పాడు. ఆ మాటకు దాశరాజు- నీకు పుట్టిన బిడ్డలు అడ్డుపడరని నమ్మకమేమిటని నిలదీస్తాడు. అదీ నిజమేననిపించి క్షణం ఆలోచించాడు. తేరుకుని తాను వివాహమే చేసుకోకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని ప్రతిజ్ఞ చేశాడు. అలా భీష్మ(భీకర)మైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ రోజు నుంచీ భీష్ముడిగా ప్రసిద్ధుడయ్యాడు.
సత్యవతికి శంతనుడి ద్వారా చిత్రాంగుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు బిడ్డలు కలిగారు. చిత్రాంగుడు రాజయ్యాక గంధర్వులతో యుద్ధం చేస్తూ మరణించాడు. విచిత్రవీర్యుణ్ని రాజుగా చేసి అంబిక, అంబాలికలనిచ్చి వివాహం చేశాడు భీష్ముడు. అతడూ సంతానరహితుడిగానే మరణించాడు. తన వంశం నిర్వంశం కాబోతూంది, ఆ ప్రమాదం నుంచి కాపాడాలనే ఆలోచనతో పినతల్లి అయిన సత్యవతి భీష్ముణ్ని పిలిచింది. రాజ ధర్మానుసారం తమ్ముడి భార్యల్ని సంతానవతులుగా చేయమని కోరింది. అలా చేస్తే తన ప్రతిజ్ఞకు భంగం కలిగి తన సంతానమే రాజ్యమేలినట్లవుతుందనిపించి నిరాకరించాడు. అయినప్పటికీ- వేదశాస్త్రాలు తెలిసిన వ్యాసుడి ద్వారా వారిని సంతానవతులుగా చేయించాడు. ఆ సంతానమే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు.
కురు పాండవుల మధ్య రాజ్యార్హత అంశం వివాదాస్పదమై యుద్ధానికి దారి తీసింది. కౌరవ పక్షం వహించాడు భీష్ముడు. ధర్మబద్ధంగా యుద్ధం చేశాడు. అయినా పాండవ పక్షపాతం చూపుతున్నాడంటూ సైన్యాధ్యక్ష పదవినుంచి వైదొలగమన్నాడు దుర్యోధనుడు. అయినా కౌరవుల క్షేమం కోరి తప్పుకోవడానికి ఇష్టపడలేదు. భీష్ముడు సైన్యాధ్యక్షుడిగా ఉన్నంతకాలం కౌరవుల్ని జయించడం అసాధ్యమనిపించింది పాండవులకు. అందుకే భీష్ముణ్ని రహస్యంగా కలిసి మార్గం చూపించమని వేడుకున్నారు. అతడు సూచించిన విధంగా శిఖండిని యుద్ధంలో ఎదురుగా నిలబెట్టారు. యుద్ధనియమం ప్రకారం- భీష్ముడు అస్త్రసన్యాసం చేశాడు. అదే అదనుగా అర్జునుడు వేసిన బాణం దెబ్బకు నేలకూలాడు. అంతటి మహానుభావుడు నేలమీద పడటం అరిష్టమని తలచి అప్పటికప్పుడు బాణాలతో అంపశయ్య ఏర్పరచాడు అర్జునుడు. దానిపై మేనువాల్చిన అతడు కొద్దిరోజుల్లో రానున్న ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలిస్తే కైవల్యం సంభవిస్తుందని తలపోశాడు. దేవతలు ఇచ్చిన వరప్రభావంతో మరణాన్ని నియంత్రించుకున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం, అందునా మాఘ మాసం, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఏకాదశినాడు తన నిర్యాణానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా మాఘ శుక్ల సప్తమి మొదలుకుని, ఏకాదశి నాటికి పూర్తిగా విష్ణువులో లీనమైపోయాడు. ఆ అయిదురోజుల్నీ భీష్మ పంచకం అంటారని పురాణ కథనం. భీష్ముడి నిర్యాణ విధి జగతికి స్మరణదినమైంది. ఆయన పేరు మీదే ఆ తిథికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది.
భూత, భవిష్యత్తులను మనోనేత్రంతో దర్శించడాన్ని ‘దివ్యదృష్టి’గా చెబుతారు. దైవాన్ని దర్శించడాన్నీ ఆ దృష్టిగానే భావించాలి. మనిషిగా దిగివచ్చిన దేవుణ్ని గుర్తించాలంటే, దివ్య చక్షువులు ఉండితీరాలి. మహాభారత కాలంలో మహావిష్ణువే కృష్ణుడిగా దిగివచ్చాడని చాలా కొద్దిమంది గుర్తించారు. వారిలో భీష్ముడు అగ్రగణ్యుడు. కృష్ణుణ్ని ఆయన నారాయణుడిగానే సంభావించాడు. అదొక యోగ ఫలం.
ఏ యోగ సాధన ఏ ఫలితమిస్తుందో పతంజలి మహర్షి ‘యోగ సూత్రాలు’ వివరించాయి.వాటి ప్రకారం, బ్రహ్మచర్యం వల్ల ‘దివ్యత్వం’ లభిస్తుంది. బ్రహ్మచర్య నిశిత వైభవానికి నికార్సయిన ఉదాహరణ భీష్మాచార్యుడు. మహాకవి జాషువా చెప్పినట్లు, ఆయన మూడు తరాలకు తాత! అవసానదశలోనూ భీష్ముడి నుంచి వ్యక్తమైన అవక్ర విక్రమ పరాక్రమానికి, విష్ణు సహస్రాన్ని వెల్లడించే స్థాయి మానసిక ధృతికి, దృఢత్వానికి- ఆయన త్రికరణ శుద్ధిగా పాటించిన బ్రహ్మచర్య వ్రతమే కారణమంటారు. భీష్ముడి వల్ల బ్రహ్మచర్యం ఒక అద్భుత నియమంగా లోకంలో గుర్తింపు పొందింది. మహాభారతంలోని భీష్మపర్వం నిజానికి వీరనాయక పర్వం! భీష్ముడు కర్మవీరుడు. ప్రతిజ్ఞ కారణంగా ఆయనను భీష్ముడన్నారు గాని- ప్రతాపం, శత్రుసంహార తీక్షణత, క్షత్రియ ధర్మనిర్వహణ పారీణత, ధర్మనిబద్ధత... అన్నీ భీష్మమే!
ఆయన తన జీవితకాలంలో ఇద్దరు అవతార పురుషులతో నేరుగా తలపడాల్సి వచ్చింది. అంబకు ఆశ్రయమిచ్చిన తన అస్త్రవిద్యా గురువు పరశురాముణ్ని భీష్ముడు యుద్ధంలో పరాజితుణ్ని చేశాడు. గురువు కాబట్టి ‘ఓడించాడు’ అనకుండా ‘మెప్పించాడు’ అన డం సమంజసం. అదీ భీష్మ హృదయం! శ్రీకృష్ణుడి విషయంలోనూ అదే జరిగింది. ఆయుధం పట్టనన్న ఆయనతో చక్రాయుధం పట్టించాడు భీష్ముడు. ‘భµ¼క్తుడి చేతిలో ఓడిపోవడాన్ని భగవంతుడు ఇష్టపడతాడు’ అని లోకానికి నిరూపించాడు. ‘నాకోసం నీ శపథాన్ని సైతం విడిచిపెట్టావా మహానుభావా!’ అని కన్నీటి పర్యంతమయ్యాడు. అదే మరొకరు అయితే ‘ముందేం చెప్పావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు’ అని శ్రీకృష్ణుణ్ని నిలదీసేవాడు. ‘కృష్ణుడు మాట తప్పాడు కనుక - నా చేతిలో ఓడిపోయినట్లే, ఆయన చేత ఆయుధం పట్టించాను’ అని సంబరపడేవాడు.
భీష్ముడు మేరునగ ధీరోదాత్తుడు. అసమాన స్థిరచిత్తుడు. ‘నీ చేతిలో మరణం కన్నా ఈ జీవితానికి ధన్యత ఏముంది’ అని కృష్ణుడితో అన్నాడు.‘సందేహించవద్దు. చక్రం విడిచిపెట్టు’ అని ప్రాధేయపడ్డాడు. అదీ స్థితప్రజ్ఞత అంటే! పరాక్రమంతో పరశురాముడిపై, భక్తితో కృష్ణుడిపై పైచేయి సాధించిన భీష్ముడు- దాన్ని ఎన్నడూ ప్రకటించకపోవడం గమనిస్తే, మానవుడు ఎక్కడ తగ్గాలో అర్థమవుతుంది. ఏది నిజమైన గెలుపో తెలుస్తుంది. భక్తి వల్ల భావోద్వేగాలు నెమ్మదించిన సన్నివేశమది. పరాక్రమం అనే మాటను తిరిగి నిర్వచించిన ఘట్టం అది.
‘కృష్ణుడి అసలు రూపం మీకు తెలియదు. ఆయన తోడుగా ఉన్నంతకాలం పాండవుల్ని జయించడం అసాధ్యం’ అని కౌరవులకు భీష్ముడు ఎంతగానో చెప్పిచూశాడు. ఆ హితబోధను పెడచెవిన పెట్టిన సుయోధనుడు, భీష్ముడి పట్ల పరుషంగా ప్రవర్తించాడు. ఆయన తన క్రోధాన్ని యుద్ధరంగంలో ప్రదర్శించాడు. ఒక దశలో కృష్ణుడే భీష్మసంహారానికి సిద్ధమైనా, నిగ్రహించుకొన్నాడు. ధర్మజుడికి దిక్కుతోచలేదు. సరాసరి వెళ్లి ‘త్రిశూలాన్ని దాచి, మూడో కంటిని మూసి, యుద్ధానికి దిగిన రుద్రుడిలా ఉన్నావు. తాతా! నిన్నెలా జయించాలి’ అని అడిగాడు. తనను పడగొట్టే మార్గాన్ని నిస్సంకోచంగా వివరించాడాయన.
ప్రపంచ సాహిత్యంలో భీష్ముడి వంటి కర్మయోధులు, త్యాగమూర్తులు అరుదుగా తటస్థపడతారు. భరతముని ప్రతిపాదించిన దానవీరం, దయావీరం, యుద్ధవీరంతోపాటు విద్యానాథుడు అనే లాక్షణికుడు చెప్పిన ధర్మవీరాన్నీ ఆ యోద్ధ జీవితంలో గ్రహించవచ్చు. ఆ వీరత్వాలతోనే భీష్ముడు తన గురువును, ఇష్టదైవాన్నీ మెప్పించగలిగాడు. భారత వీరులందరితోనూ పూజలందుకొన్న ఉదాత్త వ్యక్తిత్వం భీష్మ పితామహుడిది.భారతానికి, భరతావనికి ఆయన గర్వకారణం! - వై.శ్రీలక్ష్మి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565