MohanPublications Print Books Online store clik Here Devullu.com

Thyagaraya

BHAKTIPUSTAKALU
#త్యాగరాగసుధ

   రాగ తాళాల్ని సొగసుగా జతపరచిన ధన్యజీవి త్యాగయ్య. పరమాత్మ గుణగణాల్ని దివ్యంగా గానం చేసిన సప్త స్వర శోభితుడాయన! సంగీతానికి గల సమ్మోహన శక్తి అది.నాదోపాసన ద్వారా భగవంతుడి దరి చేరవచ్చని నిరూపించిన ఆ వాగ్గేయకారుడు, మహోన్నత భక్తి సాధనలోనే తరించాడు. వేంకటేశ్వరుణ్ని గానం చేసి అన్నమయ్య, మువ్వగోపాలుణ్ని స్మరించి క్షేత్రయ్య చరితార్థులయ్యారు. రామభక్తితో భజన సాగించి కంచెర్ల గోపన్న, సంగీత నృత్య కళల్ని దైవానుగ్రహంగా భావించి నారాయణ తీర్థులు ధన్యులయ్యారు. వారి కోవకు చెందిన త్యాగరాజు ఎంతటి సంగీతజ్ఞుడో అంతటి సాహితీ ద్రష్ట. ఆయన రచనలు ద్రాక్షా పాకం వంటివి. ఆ కీర్తనలు పండిత పామర రంజకాలు.
తరతరాలకూ గానామృతాన్ని పంచిపెట్టిన త్యాగరాజుకు కళలన్నీ వారసత్వంగా అబ్బినవే! తాత గిరిరాజ కవి గురించి బంగాళరాగ కృతిలో ‘గిరిరాజసుతా తనయ’ అంటూ స్తుతించాడు. కొన్ని అపురూప రాగాల్ని సాధన చేసి గురువు శొంఠి వేంకటరమణయ్య మన్ననలు పొందాడు. చెంచు కాంభోజి, సుపోషిణి, వీర వసంత రాగాలు- గానం చేయడానికి కష్టతరమైనవి. ఎందరో సంగీత సాధకులు అలాంటి రాగాలను ఆలపించేందుకే జంకేవారు. కానీ త్యాగయ్య ఆ రాగాలనే జతకూర్చి కీర్తనలు రాశాడు. ‘తొలి నేను చేసిన పూజా ఫలమిలాగే’ (కోకిల ధ్వని) కీర్తనను అపురూప రాగంలోనే గానం చేశాడు. గురువు ఇంట చేసిన కచేరీలో ‘ఎందరో మహానుభావులు’ కీర్తన (శ్రీరాగం)లో స్వరపరచి పాడాడు. ఇది పంచరత్న కృతుల్లో అయిదోది.
త్యాగయ్య సంగీత సంప్రదాయంలో ఎన్నో విశేషాల్ని పరిశోధించాడు. ‘సంగతి’ అనే ప్రక్రియను ప్రారంభించింది ఆయనే! దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలకు తానే ఆద్యుడు. ‘రామ రామ నీవారముగామా (ఆనందభైరవి), ఉయ్యాలలూగవయ్య (నీలాంబరి) వంటివి ఉత్సవ సంప్రదాయ కీర్తనలు. ఇలాంటి కీర్తనలే ఖరహరప్రియ, హరికాంభోజి రాగాల్లోనూ ఉన్నాయి. శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ సంగీతమని త్యాగరాజు భావన. పల్లవి, అనుపల్లవి, చరణం ప్రక్రియలకూ ఆద్యుడై నిలిచాడు. సామవేదంలో పేర్కొన్నవాటిలో అరవై ఆరు రాగాలను ఎంచుకొని, తన కీర్తనల కోసం వినియోగించడం మరో విశేషం.
‘దయజూచుటకిది వేళరా’ కీర్తనను త్యాగయ్య గానవర్ధిని రాగంలో స్వరపరచాడు. ఇలాంటి పలు అపురూప రాగాలకు జీవం పోశాడాయన. ధన సంపాదనపై అనురక్తి కన్నా శ్రీరాముడిపై భక్తి కలిగి ఉండటమే గొప్ప అని తలచాడు. ‘నిధి చాల సుఖమా... రాముని సన్నిధి సేవ సుఖమా’ (కల్యాణి), ‘ఎంత రానీ తనకెంత పోనీ నీ చెంత విడువజాల శ్రీరామా(హరికాంభోజి) వంటి కీర్తనలతో ‘సంగీతం అనేది భగవంతుడి ప్రేమను పొందే మార్గం’ అని చాటాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, ‘నగుమోము గనలేని నా జాలి తెలిసీ నను బ్రోవగ రారాదా’ అంటూ ఆర్తిపడ్డాడు. ‘జగమేలే పరమాత్మా... ఎవరితో మొరలిడుదూ’ అని వేడుకోవడం త్యాగయ్య భక్తిభావానికి పరాకాష్ఠ.
ఆయన సాహిత్యం అసామాన్యమైనది. ‘ఇంద్ర నీలమణి సన్నిభావ ఘన చంద్రసూర్య నయనా ప్రమేయ’ , ‘పరమ భాగవత మౌనివర శశి విభాకర సనకస నందన దిగీశ సుర కింపురుష’ వంటి పద సమాసాలు త్యాగయ్య అగణిత ప్రతిభకు ఘన నిదర్శనాలు. ఆయనకు సామాజిక స్పృహ అధికం. ఆ రచనల్లో జాతీయాలు కొల్లలుగా కనిపిస్తాయి. ‘శాంతము లేక సౌఖ్యము లేదు,’ ‘తలకు వచ్చిన బాధ తలపాగకు చేటు’ వంటివీ ఆ వాగ్గేయకారుడి చతురతకు ప్రతీకలు. రామ మంత్ర ప్రభావంతో నాదోపాసకుడైన త్యాగరాజు- భక్తి రాజ్యానికి రారాజు!
- అప్పరుసు రమాకాంతరావు

No comments:

Post a comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list