MohanPublications Print Books Online store clik Here Devullu.com

జన జాతర_MedaramJatara


జన జాతర
 
 
జన జాతర_MedaramJatara MedaramJatara TelanganaTribalFestival TelanganaTraditionalFestival
 
విశ్వంలో శాంతి సౌభాగ్యాలు నిలిపేందుకు దేవతలు దివ్యరూపాల్లోను, మానవ రూపాల్లోను భూమిపై అవతరిస్తుంటారన్నది విశ్వాసం. దుష్టత్వాన్ని నిర్మూలించి, సాధుజీవుల్ని కాపాడుతుంటారన్నది నమ్మకం. దివ్యగుణాలు గల మానవులూ దేవతల్లా ధర్మ పరిరక్షణకు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. సమాజం కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పిస్తుంటారు. అందరూ వారిని ‘మహాత్ములు’గా కొలుస్తారు. అటువంటిమహనీయుల త్యాగనిరతిని స్మరిస్తూ, లోకులు జాతర జరపడం పరిపాటి. వాటిలో ప్రధానమైంది- సమ్మక్క సారలమ్మ జాతర. జనజీవన సంస్కృతిలో భాగమైన ఇది, ఉత్తర భారతదేశంలోని ‘కుంభమేళా’ను తలపిస్తుంది.

ఉత్తర తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన తాడ్వాయి ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఇక్కడి అడవులు, కొండలు, కోనల మధ్య గిరిజన సంస్కృతికి ప్రతీకగా ఈ జాతర జరుగుతుంది. తెలుగునేల నలు చెరగుల నుంచే కాకుండా; మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది జనం ఈ వేడుకలతో మమేకం అవుతుంటారు.

ఈ జాతర వెనక ఒక చారిత్రక కథ ఉంది. పూర్వం జగిత్యాల ప్రాంతంలోని పొలాస (పొలవాస)ను మేడరాజు అనే గిరిజన దొర పాలించేవాడు. ఆయన కూతురు సమ్మక్క. ఆమెకు తన మేనల్లుడైన మేడారం పాలకుడికి ఇచ్చి వివాహం చేశాడు మేడరాజు. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలాసపై దండెత్తి వెళ్లాడు. ఆ శౌర్యానికి తట్టుకోలేక మేడరాజు పొలాస నుంచి వెళ్లిపోయి, మేడారంలో అజ్ఞాతవాసం చేశాడు.

మేడారం పాలకుడు కాకతీయులకు సామంతుడు. కరవు కాటకాలు ఏర్పడటంతో, ఆ రాజులకు పన్నులు కట్టలేకపోయాడు. మేడరాజుకు ఆశ్రయం- అగ్నికి ఆజ్యంలా మారింది. మేడారం పాలకుడు గిరిజనుల్ని రెచ్చగొడుతున్నాడని, తన సార్వభౌమత్వాన్ని చిన్నచూపు చూస్తున్నాడని ప్రతాపరుద్రుడు మండిపడ్డాడు. మాఘ శుద్ధ పౌర్ణమినాడు మేడారం మీద దండెత్తాడు.
సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న వీరోచితంగా పోరాడారు. కాకతీయుల సైన్యం ధాటికి తట్టుకోలేక మేడరాజు, సారలమ్మ, నాగులమ్మ యుద్ధంలో మరణించారు. అవమానాన్ని తట్టుకోలేక జంపన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు.

సమ్మక్క వీరోచితంగా పోరాడి, కాకతీయ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది. ప్రతాపరుద్రుడు సైతం ఆమె వీరత్వాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. గాయపడిన సమ్మక్క రక్తధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమిస్తుంది. చిలుకల గుట్ట వైపు వెళుతూ, అందరూ చూస్తుండగానే మాయమవుతుంది. వెదుకుతూ వెళ్లిన అనుచరులకు ఆమెజాడ కనిపించదు. మాయమైన చోట పసుపు, కుంకుమల భరిణె కనిపిస్తుంది. పవిత్ర భరిణెను సమ్మక్కగా భావించి, ప్రతి రెండేళ్లకూ ఒకసారి మాఘ శుద్ధ పూర్ణిమనాడు సమ్మక్క జాతర జరపడం ఓ సంప్రదాయంగా మారింది.
నాలుగురోజులు జరిగే ఈ జాతరలో మొదటిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె వద్దకు తెస్తారు.రెండోరోజున-చిలుకల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడోరోజున సమ్మక్క, సారలమ్మ గద్దెపై కొలువుతీరి, భక్తుల్ని అనుగ్రహిస్తారు. నాలుగో రోజు సాయంకాలం ఇద్దరినీ యుద్ధభూమికి తెస్తారు. ఆ ఇద్దరు అమ్మలకూ బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇదంతా గిరిజన పూజారుల పర్యవేక్షణలోనే జరుగుతుంది.

సుదీర్ఘ చరిత్ర కలిగిన సమ్మక్క సారలమ్మ జాతర ఓ మహాపర్వంగా కొనసాగుతుంది. ఈ నాలుగు రోజుల తిరణాలలో జనం అసంఖ్యాకంగా ఉంటారు. పల్లెల ఒడిలో స్నేహ సౌజన్యాల్ని పెంపొందించే జాతరలు జనజీవన సంస్కృతికి అద్దం పడతాయి. సామాన్య జనుల వేషభాషలు, అభిరుచులు, కళలు, జీవన విధానాలు ఆవిష్కృతమవుతుంటాయి.
సంస్కృతి, సంప్రదాయం, నాగరికత- మనిషిని ఉన్నత స్థానంలో నిలుపుతాయి. అతడిలో సుగుణాలు రత్నాల్లా వెలుగొందడానికి ఇటువంటి జాతరలు దోహదం చేస్తాయి. జీవితం అంటే కేవలం తిండి, నిద్ర, సౌఖ్యం కాదని; మానసికోన్నతి సాధించడమేనని అందరూ తెలుసుకున్నప్పుడు- సమ్మక్క సారలమ్మ జాతరలోని పరమార్థం అవగతమవుతుంది.
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list