సరస్వతీ దేవితోపాటు సరస్వతీ ఆకు కూడా పూజనీయమే. ఆ ఆకుకు అంతటి విలువ ఉంది మరి. సరస్వతీ ఆకు అనగానే అది ఔషధ మొక్క అనే విషయం మనలో చాలామందికి గుర్తొస్తుంది. కానీ దాన్ని చక్కని అలంకరణ మొక్కగా కూడా పెంచుకోవచ్చు.
సరస్వతీ ఆకును ‘సెంటెల్లా’, ‘గోటుకోలా’, ‘ఫౌంటేన్ ఆఫ్ యూత్’ అని రకరకాలుగా పిలుస్తారు. సంస్కృతంలో దీన్ని మండూక పర్ణి అంటారు. దీని శాస్త్రీయ నామం ‘సెంటెల్లా ఏషియాటికా’. ఇది మన ఆసియా ఖండానికి చెందిన మొక్క.
సరస్వతీ ఆకు తడినేలలో పెరిగే బహువార్షికం. నేలమీద పాకే కాండంతో, ప్రతి కణుపు వద్దా వేర్లతో అల్లుకుపోతుంది. ఈ మొక్క తేమగా ఉండే నేలలో, చల్లని వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. ఇది చిన్నగా ఆరు అంగుళాలు మించని ఎత్తులో నేలమీద నుంచి మొదలై విసనకర్ర ఆకారపు ఆకులతో ఉంటుంది. ఈ ఆకులు లేతాకుపచ్చ రంగులో ఉంటాయి. ఎండ కంటే కొద్దిపాటి నీడ సరస్వతీ ఆకుకు అనువుగా ఉంటుంది. నీడ ఎక్కువైనా దీనికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంట్లో పెంచుకునేటప్పుడు అంత తేమ నేలలు ఉండవు కాబట్టి క్రమం తప్పకుండా నీళ్లు పోస్తుంటే సరిపోతుంది. దీనికి నేల సారవంతంగా, నీరు నిలవకుండా తేమగా ఉండాలి కాబట్టి కంపోస్టు, కోకోపీట్, ఇసుక కలిపిన మట్టి మిశ్రమం అనువుగా ఉంటుంది. దీనికి చీడపీడల ప్రమాదం దాదాపు లేనట్లే. రసాయన ఎరువులు కాకుండా జీవామృతం లేదా ఇతర సేంద్రియ ఎరువులు వాడటం మంచిది.
వెడల్పు కుండీల్లో... సరస్వతీ ఆకు చక్కని గ్రౌండ్ కవర్‌లా పనిచేస్తుంది. ఇది వేలాడే కుండీల్లో/చెట్ల కింద నీడలో పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది. లోతు తక్కువగా, వెడల్పుగా ఉండే కుండీల్లో పెంచుకుని వరండాల్లోనూ, బాల్కనీల్లోనూ అమర్చుకోవచ్చు. మిశ్రమ అమరికల్లో గ్రౌండ్ కవర్‌గా వాడుకోవచ్చు. బాట పక్కన బోర్డరు మొక్కల మొదట్లో కూడా నాటుకోవచ్చు.
ఆయుర్వేదంలో దశాబ్దాలుగా దీన్ని మెదడుకు సంబంధించిన మందుగా వాడుతున్నారు. జ్ఞాపకశక్తి, తెలివి పెరగడానికి విరివిగా ఉపయోగిస్తారు. జలుబూ, జ్వరం, విరేచనాలూ, కామెర్లు.. మూర్ఛ, మూత్రకోశ వ్యాధులు, నిద్రలేమీ- ఒకటేమిటి దీన్ని సర్వరోగనివారిణిగా నమ్ముతారు. ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా దీని ఔషధ విలువలకు ప్రాచుర్యం లభిస్తోంది.
పోషకాలూ ఎక్కువే... సరస్వతీ ఆకులో పోషక విలువలు కూడా ఎక్కువే. దీనిలో అనేక విటమిన్లూ, ఖనిజ లవణాలూ, శరీరానికి ఉపయోగపడే రసాయనాలు ఉంటాయి. దీన్ని సలాడ్‌గా కూడా వాడతారు. బర్మా, శ్రీలంకా, ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల్లో దీని వాడకం ఎక్కువ. శ్రీలంకలోనైతే దీని ఆకులను ఇతర ఆకుకూరలతోపాటు మార్కెట్లో అమ్ముతుంటారు.
అతిగా వద్దు... సరస్వతీ ఆకుకు ఇన్ని సుగుణాలున్నా దీన్ని అదేపనిగా వాడకూడదు. ఆరువారాలు వాడిన తరువాత కొంత విరామం ఇచ్చి తిరిగి వాడుకోవచ్చు. అలాగే కాలేయ సంబంధ వ్యాధులున్నవారు వైద్యుల సలహా మేరకు ఈ ఆకులను వాడటం మంచిదట. కణుపు మొక్కలను విడదీసి నాటుకుని సరస్వతీ ఆకును సులువుగా ప్రవర్థనం చేయొచ్చు. అయితే కలుషితమైన నీటిలో పెరిగినప్పుడు ఆ కాలుష్య కారక రసాయనాలను గ్రహించుకునే శక్తి దీనికి ఎక్కువ. అందువల్ల అలాంటి ప్రాంతాల నుంచి మొక్కలను సేకరించుకోవద్దు. అందం, ఆరోగ్యం, పోషకాలు మూడూ విరివిగా ఉండే సరస్వతీ ఆకును మీ తోటలో భాగస్వామిని చేసేందుకు ఇంకా ఆలస్యం ఎందుకు?
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565