MohanPublications Print Books Online store clik Here Devullu.com

ధ్వజస్థంభం_పుట్టుక_DWAJASTAMBHAM

DWAJASTAMBHAM ధ్వజస్థంభం_పుట్టుక



మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.


భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.

శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.

మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list