శ్రీపతి నిలయం చంపకధామం!
SriPati Nilayam Champakadhamam
#శ్రీపతి_నిలయం_చంపకధామం!
#SriPatiNilayam_Champakadhamam
శ్రీపతి నిలయం చంపకధామం!
చుట్టూ కనువిందుచేసే సువర్ణముఖీ పర్వతశ్రేణులూ, నింగే హద్దుగా నిర్మించిన రాజగోపుర అందాల నడుమ శ్రీదేవీ భూదేవీ సమేతంగా ఆ సిరినాథుడే కొలువైన దివ్య క్షేత్రం చంపకధామం. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామి చంపకధామనాథుడిగా ప్రసిద్ధి చెందాడు.
‘శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమల నయనం యోగిహృద్ధ్యాన గమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథం’
అంటే... శాంత స్వరూపుడూ, విశ్వానికి ఆధారమైనవాడూ, సకల శుభాలనూ ఒనగూర్చేవాడూ అయిన ఆ మహావిష్ణువుకు భక్తితో ఓ నమస్కారం చేస్తే చాలు, నేనున్నానంటూ అభయాన్ని ప్రసాదిస్తాడని భావం. అంతటి మహిమగల ఆ స్వామి వెలసిన దివ్య క్షేత్రమే చంపకధామం. శతాబ్దాల క్రితం బెంగళూరు నగరం చుట్టూ అనేక అరణ్యాలు వ్యాపించి ఉండేవి. వీటిలో నేటికీ చారిత్రక సాక్ష్యంగా నిలుస్తోంది సంపంగి వనం. ప్రస్తుత బెంగళూరు నగరానికి దాదాపు ముప్ఫై కిలోమీటర్ల దూరంలో బన్నేరుగట్ట అనే ప్రాంతంలో ఉందిది. పూర్వకాలంలో ఈ నేలంతా సంపంగి వనాలతో నిండి ఉండేదట. దీని మధ్యలో సుందరమైన సువర్ణముఖి కొండల దిగువన చంపకధామ ఆలయం నెలకొని ఉంది. ఇక్కడ శ్రీదేవీ, భూదేవీ సమేతంగా శ్రీమహావిష్ణువు కొలువై భక్తులపాలిట కొంగుబంగారంగా భాసిల్లుతున్నాడు. సంపంగిని సంస్కృతంలో చంపకం అని పిలుస్తారు. ఈ వనంలోనే కొలువుదీరిన మహావిష్ణువును చంపకధామస్వామిగా కీర్తిస్తారు.
చారిత్రక నేపథ్యం...
జనమేజయ మహారాజు సర్పయాగం చేపట్టడంవల్ల సర్పదోషానికి గురయ్యాడు. దాంతో ఆయనకు కుష్టువ్యాధి సోకింది. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. ఆవేదనా పూరితుడైన జనమేజయుడు రాజ్యాన్ని వదిలి, అరణ్యాల బాట పట్టాడు. అలా నడుస్తూ నడుస్తూ ఒకనాడు చంపక వనాన్ని చేరి, ఒక చెట్టునీడన కూర్చున్నాడు. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక ప్రవాహంలో ఈదుకుంటూ వచ్చిన ఒక శునకం జనమేజయుడి దగ్గరగా వచ్చి, తడి శరీరాన్ని విదిలించింది. వాటిలో కొన్ని నీటి తుంపరలు అతడి శరీరంపై చిందాయి. ఆ నీటి తుంపరలు పడిన మేరకు అతడి శరీరంపై ఉన్న వ్యాధి మాయమైంది. సంభ్రమాశ్చర్యాలకు లోనైన జనమేజయుడు అక్కడి నీటిప్రవాహంలో ఏదో మహిమ ఉందని గ్రహించి, వెంటనే దానిలో స్నానం చేశాడు. అంతే, అతని వ్యాధి నయమైపోవడమేకాకుండా మొహమంతా బంగారువర్ణంతో మెరవడం మొదలైంది. అప్పటి నుంచీ ఈ ప్రవాహాన్ని సువర్ణముఖిగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో కొలువైన శ్రీమహావిష్ణువు విగ్రహం ఏర్పాటుపై చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాధి తగ్గడం ఆ మహావిష్ణువు మహిమేనని భావించిన జనమేజయుడు ఒక గుట్టమీద శ్రీదేవి, భూదేవి సమేతుడైన విష్ణుమూర్తి విగ్రహాలను ప్రతిష్ఠించి, పూజించాడని కొందరూ, కాదు వీటిని పాండవులు ఏర్పాటుచేశారని మరికొందరూ పేర్కొంటున్నారు. తర్వాతి కాలంలో 12వ శతాబ్దానికి చెందిన హోయసల రాజవంశీయులు ఇక్కడున్న విగ్రహాలకు ఆలయాన్ని నిర్మించారని ఆలయంమీద చెక్కించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్రవిడశైలిలో రూపుదిద్దుకున్న ఈ ఆలయాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు.
ఆకట్టుకునే శిల్పకళ...
సుందరంగా చెక్కిన రాతి స్తంభాలపైన నిర్మితమైన ఈ ఆలయం నాటి చరిత్రకు సాక్షిగా నిలుస్తోంది. సుమారు 108 అడుగులున్న రాజగోపురం ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఈ గోపురం మీద వివిధ పురాణేతిహాసాలను తెలుపుతూ చెక్కిన విగ్రహాలు చూపరులను సమ్మోహనపరుస్తాయి. ఇక లోపలి ప్రాంగణంలో ఎడమవైపున శ్రీమహాలక్ష్మి అమ్మవారు ప్రప్రథమంగా దర్శనమిస్తుంది. ధ్వజస్తంభం దాటి కొంతదూరం వెళితే గర్భగుడి ప్రవేశద్వారానికి ఇరువైపులా జయవిజయుల విగ్రహాలు కనిపిస్తాయి. గర్భగుడిలోకి చేరుకోగానే ఇరు సతులతోకూడిన సుందర చంపకధామస్వామి రూపం భక్తులకు దర్శనమిస్తుంది. చంపకధామ స్వామి ఆలయానికి వెనక భాగంలో సువర్ణముఖి కొండపై లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంది. ఈ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న ప్రఖ్యాత బన్నేరుగట్ట జాతీయ ఉద్యానవనం పర్యటకులను ఆకట్టుకుంటోంది.
విశేషపూజలు...
అలంకారప్రియుడైన శ్రీమహావిష్ణువుకు రోజూ జరిగే అభిషేకాలూ, అలంకారాలూ, మహామంగళహారతులతోపాటు ప్రతి శనివారం విశేషపూజలు నిర్వహిస్తారు. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో, మార్గశిర, ధనుర్మాసాల్లో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. శ్రావణమాసంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు లక్షలసంఖ్యలో భక్తులు తరలివస్తారు. తనను దర్శించిన ప్రతి భక్తుడిమీదా ఆ స్వామి కరుణాకటాక్ష వీక్షణాలు ఉంటాయన్నది భక్తుల విశ్వాసం. చంపకధామేశ్వరుడి దేవస్థానానికి చేరుకోవడానికి బెంగుళూరులోని అన్ని ప్రాంతాల నుంచీ బస్సు సౌకర్యం ఉంది.
- జి.జగదీశ్వరి, న్యూస్‌టుడే, బెంగళూరు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565