నృసింహావతారం
దశావతారాలలో అత్యంత మధురమైన ప్రాధాన్యం పొందింది నృసింహావతారం. యజ్ఞ వరాహావతారం హిరణ్యాక్షుడిని సంహరించింది. హిరణ్యాక్షుడు మరణించాడని తెలుసుకున్నాడు హిరణ్య కశిపుడు. సంహరించిన విష్ణుభగవానుని మిద ‘చంపాడు’ అని కోపం పెట్టుకుంటాడు తప్ప చంపడానికి కారణమేమిటో తెలుసుకోకపోవడమే రాక్షసత్వం. హిరణ్యకశిపుని వృత్తాంతంలో అదే పెద్ద సమస్య అయింది.
ఆయన మంత్రులను, పరివారాన్ని పిలిచి.. విష్ణువు నా సోదరుణ్ని నిర్జించాడు. నాకు విష్ణువును నిర్జించాలని కోరిక అన్నాడు. విష్ణువును నిర్జించడం సాధ్యం కాదు. ఆయనకు అచ్యుతుడు అని పేరు. చ్యుత్ అంటే తీసివేయడం. అచ్యుత్ అంటే తీసివేయడానికి వీలు లేదు. ఆయనను తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు. భాగవతంలో ఒక మాట ఉన్నది. హిరణ్యకశిపుడు అన్ని లోకాలలోనూ విష్ణువు కోసం వెతికాడు. ఆయన ‘వాడు నా కోసం వెతికాడు.
నేను వాడి గుండెలలోనే ఉన్నాన’ని చెప్పాడు. ఇక హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుడి వరం ఉంది. అదేంటంటే.. పంచభూతాలలో గాలిలో, భూమి మిద, అగ్నిలో, నీటిలో చచ్చిపోడు. వాయువు వలన చనిపోడు. జంతువుల వలన, పాముల వలన, నరుల వలన, మృగాల వలన చనిపోడు. ఇంట్లో, బయట, పగలు, రాత్రి, ఏ దిక్కుల యందూ చనిపోడు. ఇంక చచ్చిపోవడానికి ఏముంటుంది? కానీ, సర్వజ్ఞుడైన పరమేశ్వరుడికి వీటికి మినహాంపు తీసుకుని రావడం తెలుసు. అందుకే తన భక్తుడైన ప్రహ్లాదుని మాట వమ్ము చేయకుండా వచ్చాడు. అలాగని.. శంఖ, చక్ర, గదాపద్మాలు పట్టుకున్న ఎమన్నారాయణుడుగా వచ్చి హిరణ్యకశిపుని సంహారం చేయడానికి బ్రహ్మగారు ఇచ్చిన వరం ప్రతిబంధకం. ఆయన ఎన్నివరాలిచ్చాడో అన్ని వరాలకు మినహాయింపుగా రావాలి.
అలాగే వచ్చాడు. ఒక స్తంభంలోంచి. పెళపెళా శబ్దాలు చేస్తూ ఆ స్తంభం బద్దలై, అందులో నుంచి విస్ఫులింగాలు పైకి వచ్చి పెద్ద కాంతిమండలం కనపడి కన్నులతో చూడలేనంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది. అందులోనుంచి పట్టుపుట్టం కట్టుకుని నృసింహావతారంలో స్వామి నిలబడ్డారు. అడుగు తీసి అడుగు వేస్తూ పెద్ద గర్జన చేస్తూ అపారమైన కోపంతో.. తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు నిగ్రహించడాన్న కోపాన్ని ఆపుకోలేక పెద్ద గర్జన చేస్తూ వెళ్లి హిరణ్యకశిపుని డొక్కల దగ్గర పట్టకుని పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకుని వచ్చి ప్రదోష వేళ, గడప మిద తన తొడలపైన పెట్టకుని.. గోళ్లను అతడి కడుపులోకి దింపి చీల్చి నిర్జించాడు.
అహో వీర్యం అహో శౌర్యమ్ అహో బాహుబలం బలమ్
నారాయణ పరం తేజమ్ అహోబలం అహోబలం
- చాగంటి కోటేశ్వరరావు శర్మ
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565