మహోదయ అమావాస్య
మన హిందూ సంప్రదాయంలో తిథులకి ఒక మహోన్నత స్థానం ఉంది కదా. అటు ఏకాదశికి ఎంత ప్రత్యేకత ఉందో ఇటు అమావాస్యకి కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఉత్తరాయణం ప్రారంభం అయ్యాకా వచ్చే మాసాలలో మొదటిదైన పుష్యమాసం ఆఖరి రోజైన అమావాస్యని పుష్య బహుళ అమావాస్య అని అంటారు. ఈ రోజుని వివిధ ప్రాంతాల వారు వివిధ పద్ధతులతో ఎంతో దివ్యంగా జరుపుకుంటారు.
భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య మహాలయ అమావాస్య అయితే ఈ సారి పుష్య మాసంలో వచ్చిన ఈ అమావాస్య మహోదయ అమావాస్య అని చెప్పుకోవచ్చు. అమావాస్య, ఆదివారం,శ్రవణా నక్షత్రం మూడు కలిసి వస్తే దానిని అర్ధోదయ అమావాస్య అంటారట. ఈ మూడింటిలో ఏదో ఒకటి లోపించి మిగిలిన రెండు కలిస్తే దానిని మహోదయం అంటారట. ఈ రోజు అమావాస్య శ్రవణా నక్షత్రం కలిసాయి కాబట్టి ఇది మహోదయ అమావాస్య. ఎంతో మహత్తరమైన రోజు.
ఈ ప్రత్యేకమైన రోజున ఎంతో మంది సముద్ర స్నానం ఆచరిస్తారు. ఎందుకో తెలుసా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో వచ్చే పుష్య,మాఘ మాసాల సూర్యకిరణాల్లో ఆరోగ్యకారకాల మోతాదు ఎక్కువగా ఉంటుందని మన ధార్మిక గ్రంథాలే కాదు ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. ప్రవాహపు నీటిలోనే కాదు సూర్యరశ్మి సోకే నదీజలాలు, బావిలో ఉండే నీరు ఇలా వేటిలో స్నానం చేసినా ఆరోగ్యపరంగా ఎంతో మంచిదంటారు మన పెద్దవాళ్ళు.
కొన్ని ప్రాంతాలలో వారు ఈ అమావాస్య రోజున దేవుని ఎదుట వరిపిండితో చేసిన చలివిడిదీపంలో ఆవునెయ్యి వేసి దీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే కడుపుచలవ అంటారు. పిల్లలు కలుగని వారు ఈ దీపం ఘనమయ్యకా ఆ బొడ్డుని(కాలిన ఒత్తుని) పాలతో కలిపి మింగితే త్వరలోనే మాతృత్వం సిద్దిస్తుందని తరతరాలుగా వస్తున్న నమ్మకం కూడా.
అలాగే సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామికి ఈ రోజు కొండ దిగువన ఊరిలో ఉన్న పుష్కరిణిలో ఎంతో ఘనంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. గోదావరికి గల ఏడూ పాయలలో ఒకటైన తుల్యభాగ తూర్పుగోదావరి లోని చోల్లంగిలో గల సముద్రం లో వచ్చి కలుస్తుంది. ఇక్కడ సాగర నదీ జలాలలో స్నానాలు చేయటం,పితృదేవతలకి పిండప్రధానం చేయటం,ఇక్కడ కొలువుతీరిన స్వామివారిని దర్శించుకోవటం అనాదిగా వస్తున్న ఆచారాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.
ఇదే రోజు ఇంకో వైపు ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ గ్రామంలో ఉన్న నాగోబా ఆలయంలో గిరిజనులు జాతర నిర్వహిస్తారు. 16 రోజులపాటు సాగే ఈ జాతరకి పెద్దఎత్తున గిరిజనులు తరలివచ్చి తమ కులదైవమయిన నాగోబాకి తమ భక్తిప్రపత్తులు చాటుకుంటారు.
తిరువళ్ళూరులోని శ్రీ వీర రాఘవేంద్ర స్వామి వారి తిరువీధి కూడా ఈ పుష్య బహుళ అమావాస్య రోజే నిర్వహిస్తారట. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న అమావాస్య కాబట్టే ఇది మహోదయ అమావాస్య అయింది. ఇలాంటి మరో అమావాస్య కోసం నిరీక్షిద్దాం.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565