సంక్రాంతి వైభవం
సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని ‘ఉత్తరాయణ పుణ్యకాలం’గా పరిగణించిన సనాతన సిద్ధాంతంలో- ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. ఈ సంక్రమణ ఘడియలకు ముందు వెనకల కాలమంతా పుణ్యతమం అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి.
మంచి పనికి ఏ కాలమైనా మంచిదే అనే సిద్ధాంతం అటుంచి, కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైన, శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైనదని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి, సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయమిది. దేశమంతటా ఈ పర్వానికి ప్రాముఖ్యమున్నా, పద్ధతుల్లో విభిన్నత్వం కనిపిస్తుంది.
‘తిల సంక్రాంతి’గా కొన్నిచోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి, పదార్థాల్లో ప్రసాదాల్లో వినియోగిస్తారు. అంతే కాక తెల్ల నువ్వుల్ని, మధుర పదార్థాలను పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకొనే సంప్రదాయం ఉంది.
వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో పంట చేతికందే సందర్భమిది. సంపదను, ఆనందాన్ని కుటుంబంతో, సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి. దైవీయమైన పవిత్రతతో పాటు, మానవీయమైన సత్సంబంధాల సౌహార్దమూ ఈ పండుగల సత్సంప్రదాయాల్లో మేళవిస్తుంది.
రంగవల్లుల శోభలో దివ్యత్వంతో పాటు కళానైపుణ్యం కనిపిస్తుంది. ప్రతి ఇంటి ముంగిలీ ఒక పత్రంగా, చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి.
స్నానం, దానం, పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు- సంక్రాంతి ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రకృతి పట్ల కృతజ్ఞతను, ప్రేమను ప్రకటించే పండుగల్లో ఈ సంక్రమణానికి ప్రాధాన్యముంది. ఈ పుణ్యదినాన పంచుకున్నవి, ఇచ్చినవి అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధ ఈ సత్కార్యాలను ప్రేరేపిస్తోంది.
కృష్ణపక్షంలో సంక్రమణం కలిగిన కారణంగా- మంచి వృష్టిని, ఆరోగ్యాన్ని, సస్య సంపదలను ప్రసాదిస్తుందని పంచాంగ శాస్త్రం చెప్పిన ఫలశ్రుతి. ఈరోజు శివుడికి ఆవునేతితో అభిషేకం, నువ్వుల నూనె దీపం, బియ్యం కలిపిన తిలలతో పూజ, తిలలతో కూడిన పదార్థాల నివేదన- శాస్త్రం చెప్పిన విధులు.
పుణ్యస్నానాలకు మకర మాసం (చాంద్రమానం ప్రకారం రానున్న మాఘం) ప్రముఖ మైనది కనుక- ఈ రోజు నుంచి నదీ స్నానాదుల్ని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే గంగా-యమునా-సరస్వతుల సంగమమైన త్రివేణీ తీర్థస్నానం ఉత్తరాదిలో ఒక మహా విశేషం. ఈ రోజున ఏ పుణ్యనదిలోనైనా స్నానం విశేష ఫలప్రదం. అది కుదరనివారు గృహంలో భగవత్ స్మరణతో, స్నానమంత్రాలతో స్నానం చేస్తారు. దానాల్లో ఈ రోజున వస్త్రధానానికి ప్రాధాన్యం ఇస్తారు.
దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెబుతోంది. సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం, శక్తి... ఈ రెండూ సౌరశక్తి విశేషాలు. వాటిలో దైవీయమైన శక్తిని గ్రహించిన మహర్షులు ఈ పర్వాన సౌరశక్తి ఉపాసనను పేర్కొన్నారు. సూర్యుణ్ని నారాయణుడిగా; శోభను, శక్తిని పోషించే ఆయన మహిమను ‘లక్ష్మి’గా సంభావించారు.
సంక్రాంతినాటి సూర్య శోభయే కాక, పంటల శోభ, సంపదల పుష్టి... అన్నీ కలిసి సంక్రాంతి లక్ష్మీభావన. శాస్త్రీయమైన సత్కర్మలు, సంప్రదాయసిద్ధమైన కళలు, ఉత్సాహాల ఉత్సవాలు, బంధుమిత్రుల ఆత్మీయతల వేడుకలు- వెరసి సంక్రాంతి వైభవాలు!
- సామవేదం షణ్ముఖశర్మ
సంక్రాంతి ఆచారాలు - వైదిక రహస్యాలు
హైందవ సంప్రదాయంలో ప్రతి పండుగలోనూ ఆధ్యాత్మిక రహస్యంతో పాటు వైద్య విశేషం, విజ్ఞానశాస్త్ర దృక్పథం, సామాజిక స్పృహ... ఇలా ఎన్నో దాగుంటాయి ఆయా పండుగ వచ్చిన కాలాన్ని బట్టీ - ఆ పండుగకి ఏర్పాటు చేయబడిన ఆచారాలని బట్టీ. ఆ దృక్కోణంలో చూస్తే సాధారణమైన పండుగల్లోనే ఇన్ని విశేషాలు కన్పిస్తూంటే, ఈ సంక్రాంతిని ‘పెద్ద పండుగ’ అని వ్యవహరించారంటే దీన్లో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నట్లే. సంక్రాంతిని కొన్ని ప్రాంతాలలో పతంగుల పండుగగా జరుపుకుంటారు. దృష్టాదృష్టాలకుప్రతీకగా ఈ సంప్రదాయాన్ని పేర్కొంటారు.
యోగం అంటే రెంటి కలయిక అని అర్థం. శరీరం- మనసూ అనేవే ఆ రెండూ . శరీరానికి స్నానాన్ని చేయించినా మనసు అపవిత్రంగానూ దురాచనలతోనూ ఉంటే అది ‘యోగం’ (రెంటి కలయిక) కా(లే)దు. అదే తీరుగా మనసెంతో పరిశుభ్రంగా ఉన్నా శరీరం స్వేదమయంగానూ అలసటతోనూ సహకరించ(లే)ని స్థితిలోనూ ఉన్నట్లయితే అది కూడా ‘యోగం’ అయ్యే వీల్లేదన్నారు పెద్దలు. ఆ కారణంగా శరీరమూ మనస్సూ అనే రెండూ పవిత్రంగా ఉండేందుకు స్నానాలని చేయాలని ఓ నియమాన్ని చేశారు పెద్దలు.
కార్తీకం నెలపొడుగునా స్నానాలని చేసినట్లే ఈ మార్గశీర్ష పుష్యమాసాల్లో కూడా ప్రతిరోజూ స్నానాలని చేయాలన్నారు. దీనికి మరో రహస్యాన్ని కూడా జోడించవచ్చు. చంద్రుని పుట్టు నక్షత్రం మృగశిర. మృగశిర + పూర్ణిమ చంద్రుడు కలిస్తే అది మార్గశీర్ష మాసం అవుతుంది. చంద్రునికి ఇష్టురాలైన భార్య ‘రోహిణి’ (రోహిణి శశినం యథా). ఈ రోహిణి, మృగశిర అనే రెండు నక్షత్రాలూ ఉండే రాశి ‘వృషభం’.
కాబట్టి ఈ మార్గశీర్షం నెలపొడుగునా స్నానాలని చేస్తే తన జన్మ నక్షత్రానికి సంబంధించిన మాసంలో స్నానాలని చేస్తూన్న మనకి చంద్రుడు మనశ్శాంతిని (చంద్రమా మనసో జాతః) అందిస్తాడు. చలీ మంచూ బాగా ఉన్న కాలంలో తెల్లవారుజామున స్నానాలని చేయగలిగిన స్థితిలో గనుక మన శరీరమే ఉన్నట్లయితే యోగ దర్శనానికి భౌతికంగా సిద్ధమైనట్టేననేది సత్యం.
రంగవల్లికలు
రంగమంటే హృదయం అనే వేదిక అని అర్థం. ‘వల్లిక’ అంటే తీగ అని అర్థం. ప్రతి వ్యక్తికీ తన బుద్ధి అనే దాని ఆధారంగా అనేకమైన వల్లికలు (ఆలోచనలు) వస్తూ ఉంటాయి. ఆ అన్నిటికీ కేంద్రం (ముగ్గులో మధ్యగా ఉన్న గడి లేదా గదిలాంటి భాగం) సూర్యుని గడి కాబట్టి అక్కడ కుంకుమని వేస్తారు మహిళలు. కాబట్టి ఏ సూర్యుడు బుద్ధికి అధిష్ఠాతో ఆ బుద్ధి సక్రమమైన వేళ ఆ సక్రమ బుద్ధికి అనుగుణంగానే ఈ వల్లికలన్నీ ఉంటాయనేది యోగదృష్టి.ఆ సక్రమాలోచనలకి అనుగుణంగానే మనసు ఆదేశాలనిస్తూంటే శరీరం తన అవయవాలైన చేయి కాలు కన్ను... అనే వీటితో ఆయా పనులని చేయిస్తూంటుందన్నమాట.
గొబ్బెమ్మలు
స్నానాలనేవి పురుషులకే కాదు. స్త్రీలకి కూడా నిర్దేశింపబడినవే. అందుకే వారికి సరిపడిన తీరులో వాళ్లని కూడా యోగమార్గంలోకి ప్రవేశింపజేసి వారిక్కూడా యోగదర్శనానుభూతిని కల్పించాలనే ఉద్దేశ్యంతో స్త్రీలకి గోపి+బొమ్మలని (గొబ్బెమ్మ) ఏర్పాటు చేశారు. నడుమ కన్పించే పెద్ద గొబ్బెమ్మ ఆండాళ్ తల్లి అంటే గోదాదేవి. చుట్టూరా ఉండే చిన్న చిన్న గొబ్బెమ్మలనీ కృష్ణ భక్తురాండ్రకి సంకేతాలు. ఈ అన్నిటికీ చుట్టూరా కృష్ణ సంకీర్తనని చేస్తూ (నృత్యాభినయంతో కూడా) స్త్రీలు పాటలని పాడుతూ ప్రదక్షిణలని చేస్తారు. నడుమ ఉన్న ఆ నిర్వ్యాజ భక్తికి (కోరికలు ఏమీలేని భక్తి) తార్కాణమైన గోదాదేవిలా చిత్తాన్ని భగవంతుని చుట్టూ ప్రదక్షిణాకారంగా తిప్పుతూ ఉండాలనేది దీనిలోని రహస్యమన్నమాట.
మొదటిరోజు ‘భోగి’
భోగము అంటే పాము పడగ అని అర్థం. భోగి అంటే అలా పడగ కలిగినది ‘పాము’ అని అర్థం. అలా ఎత్తిన పడగతో పాము ఎలా ఉంటుందో అదే తీరుగా వ్యక్తి కూడా శరీరంలోని వెన్నెముకని లాగి పట్టి స్థిరాసనంలో (బాసింపెట్టు) ఉంటూ, ముక్కు మీదుగా దృష్టిని ప్రసరింపజేస్తూ కళ్లని మూసుకుని తన ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే అదే ‘యోగ దర్శన’మౌతుందని చెప్పడానికీ, ఆ యోగ ప్రారంభానికి సరైన రోజు నేడే అని తెలియజేయడానికీ సంకేతంగా పండుగలోని మూడు రోజుల్లోనూ మొదటి రోజుని ‘భోగి’ అని పిలిచారు. యోగ ధ్యానాన్ని చేస్తూన్న వేళ బుద్ధి సక్రమంగా ఉండాలని చెప్పడానికీ, దాన్ని బాల్యం నుండీ అలవాటు చేయాలని చెప్పడానికీ సంకేతంగానే - పిల్లలకి రేగుపళ్లని పోస్తూ వాటిని ‘భోగిపళ్లు’గా వ్యవహరించారు.
సంక్రాంతి
సూర్యుడు ఈ రోజున ధనూ రాశి నుండి మకర రాశిలోకి జరుగుతాడు కాబట్టే దీన్ని ‘మకర సంక్రమణం’ అన్నారు.ఇప్పటివరకూ ఉన్న బుద్ధి కంటే వేరైన తీరులో బుద్ధిని సక్రమంగా ఉంచుకోవడమే ‘మకర సంక్రాంతి’లోని రహస్యం. ఇది నిజం కాబట్టే ఈ రోజున బుద్ధికి అధిష్ఠాత అయిన సూర్యుణ్ని ఆరాధించవలసిన రోజుగా నిర్ణయించారు పెద్దలు. అంతేకాదు. మన బుద్ధిని సక్రమంగా ఉండేలా - ఉంచేలా ఆశీర్వదించగల శక్తి ఉన్న పితృదేవతలని ఆరాధించవలసిన రోజుగా కూడా తెల్పారు పెద్దలు. పెద్దలకి (పితృదేవతలకి) పెట్టుకోవలసిన (నైవేద్యాలని) పండుగ అయిన కారణంగానూ దీన్ని ‘పెద్ద పండుగ’ అన్నారు - అలాగే వ్యవహరిస్తున్నారు కూడా.
సంక్రాంతి సూర్యోదయం
జనవరి 14 మకర సంక్రాంతి
పరమాత్మ ప్రత్యక్ష స్వరూపమే ప్రకృతి. ఈ ప్రకృతినుంచి పొందే ప్రతి ప్రయోజనమూ ఆయన కారుణ్యంగా భావించడం మన సంస్కృతి. సూర్యమంత్రాలు, వృక్షసూక్తాలు, పృథ్వీసూక్తాలు, గృహమంత్రాలు, నదీ స్తుతులు... ఇలా వేదపురాణాది శాస్త్రాల్లో ఎన్నెన్నో భాగాలు ప్రకృతిలోని పరమేశ్వర చైతన్యాన్ని దర్శించే జ్ఞానాంశాలు.
ప్రపంచంలో అనేక ప్రాచీన నాగరికతలు సూర్యారాధనను ప్రధానంగా కలిగి ఉన్నాయి. వాటి రూపురేఖలు వివిధ దాడులవల్ల క్రమంగా రూపుమాసినా, మనదేశంలో మాత్రం ఆదిత్యోపాసన అనేక పద్ధతుల్లో నిలిచి ఉంది. ఆదిత్యుని కొందరు మంత్రంతో, స్తుతితో, జపంతో, యంత్రంతో ఆరాధిస్తారు. కొందరు నమస్కారాలతో హోమాలతో అర్చిస్తారు. కొందరు కొన్ని పర్వాల్లో కొన్ని విధానాలతో కొలుచుకుంటారు.
సౌరమానం ప్రకారం, సూర్యుడు మకరరాశిలో సంక్రమించే పర్వంనుంచి 'మకరమాసం' ప్రారంభమవుతుంది. చాంద్రమానంలో 'మాఘమాసం' అని వ్యవహరించే నెల కూడా ఈ మకర మాసానికి చెందినదే. అందుకే ఈ రోజు నుంచి కుంభ సంక్రమణం వరకు ప్రతిరోజూ సూర్యారాధనను విశేషంగా శాస్త్రాలు బోధించాయి.
సూర్యుడు ప్రాణదాత, శక్తిప్రదాత, అన్నదాత- అని పురాణ వచనాలే కాదు... వైజ్ఞానిక అవగాహన కూడా. ఈ అవగాహనను ఆరాధనగా మలచి, భాస్కరుడిలోని భగవత్తత్వాన్ని ప్రచోదనం చేసి ప్రభావాన్ని పొందే ప్రక్రియలను భారతీయ ఉపాసన శాస్త్రాల్లో పలురీతుల్లో ప్రస్తావించారు. ఆ కారణంవల్లే రామాయణ భారతాది ఇతిహాసాల్లో, పద్దెనిమిది పురాణాల్లో, ఉపపురాణాల్లో ఆదిత్య హృదయాది అంశాలే కాక, అనేక సంకేతార్థాలతో సూర్య మహిమలను వివరించారు. వాటి ప్రకారం సూర్యోదయ పూర్వకాలం నుంచి సూర్యాస్తమయం వరకు సుప్రభాతంతో మొదలై సంధ్యాకాలం వరకు ఎన్నోరకాల నియమాలతో, క్రమశిక్షణాబద్ధమైన దినచర్యను ధార్మిక గ్రంథాలు చెప్పాయి.
అన్నదాత అయిన సూర్యుడి నుంచే భూమిపై సర్వప్రాణులు ఆహారాన్ని, ప్రాణాన్ని పొందుతున్నాయి- కొన్ని ప్రత్యక్షంగా, ఇంకొన్ని పరోక్షంగా. సూర్యుడినుంచి ప్రత్యక్షంగా ఆహారశక్తిని గ్రహిస్తున్నవి వృక్షాలు. వాటి పత్రహరితం వల్ల ప్రకృతి పచ్చనిదవుతోంది. ఆ పచ్చదనం మానవాదులకు ఆహారమై ప్రాణదాయకమవుతోంది. కొందరు ఆర్ష విజ్ఞాన సంపన్నులు కొన్ని ప్రత్యేక కాలాల్లో సూర్యకిరణాలను ఒక పద్ధతిగా శరీరంతో గ్రహించి అనేక రుగ్మతలనుంచి ఉపశమనాన్ని పొందవచ్చని సూర్యకిరణ చికిత్సా ఫలాలను సోదాహరణంగా, అనుభవపూర్వకంగా రుజువు చేస్తున్నారు.
బీజాలు సంగ్రహించి, పొలాలు దున్నినది మొదలు- పంట చేతికొచ్చేవరకు సౌర గమనాన్ని అనుసరించి ఏర్పడిన రుతుచక్ర ప్రభావం ఉంది. సూర్యుడి కిరణ శక్తులే కాంతులై, వర్షాలై ప్రాణాలై పంటలు పండించాయన్న కృతజ్ఞతతో- పంట చేతికందిన తరవాత సంక్రమణాన్ని సూర్యపర్వంగా వేద కాలాలనుంచి ఈ దేశంలో నిర్వహిస్తున్నారు. మొదట పంటలోని బియ్యంతో మొదటిగా ఆవుపాలతో, ఆరుబయట సూర్యకాంతి సమక్షంలో పరమాన్నం వండి సూర్యుడికి నివేదించడం ఈ పర్వంలోని ప్రధాన కృత్యం. ఇలా వండి నివేదించిన పాయసం ఆయురారోగ్యకరమని ధార్మిక శాస్త్ర భావన.
ప్రభాకరునికి ప్రీతికరమైన పర్వాల్లో సంక్రమణం, వారాల్లో ఆది(రవి)వారం, తిథుల్లో సప్తమి- భారతీయులకు అత్యంత పవిత్రమైనవి. సూర్య పర్వమైన సంక్రమణం ప్రతి నెలలో ఒక గొప్పదినంగా ఉపాసకులు, సంప్రదాయజ్ఞులు పాటిస్తారు. ఆ దినాన ఇష్ట దేవతారాధన, పితృతర్పణ వంటివి అనుసరిస్తారు. సంక్రమణాల్లో ఉత్తరాయణ పుణ్యకాలగతమైన 'మకర సంక్రమణం' బహు ప్రాధాన్యమైనది. అందుకే ఈ రోజున చేసే స్నాన, జప, దానాది పవిత్ర కర్మలు అధిక సత్ఫలాలనిస్తాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. కొన్నిచోట్ల నేడు తీర్థస్నానానికీ ప్రాముఖ్యముంది. చైతన్య స్వరూపుడైన భానుడు జ్ఞానదీప్తిని అనుసరించి 'భా'రత 'భా'స్కరుడై కటాక్షించాలని ప్రార్థిద్దాం.
#సంక్రాంతి వెనుక
ఎవరికీ తెలియని
అయిదు కథలు
సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి... - పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట! - సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు.
శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది! తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు. - కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడు.
అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు. - సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.
- సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ అయిదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు... సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565