ఉషాకిరణాలు
సూర్యుడు ఆది దేవుడు. జ్యోతి స్వరూపుడు. జీవకోటికి నిత్యమూ దర్శనమిస్తున్న ప్రత్యక్ష దైవం. సకల ప్రాణులకు ప్రభాకరుడే జీవశక్తిని, చైతన్యదీప్తిని ప్రసాదిస్తున్నాడు. అందుకే ఆయనను పాలన కర్త శ్రీమన్నారాయణమూర్తితో పోల్చుకొని ‘సూర్యనారాయణుడు’ అని పిలుచుకుంటారు భక్తులు. భానుడు కాలస్వరూపుడు. కాల విభాగాలైన మాసాలకు, అయనాలకు, రుతువులకు, గ్రహాలకు, శీతోష్ణాదులకు ఆయనే కారణభూతుడు. సృష్టిలో పన్నెండుమంది ఆదిత్యులు ఉన్నారని; సమస్త జీవజాలానికి, సృష్టివిధానానికి వారే ఆధారమని ‘భవిష్య పురాణం’ చెబుతోంది.
నవగ్రహాల్లో సూర్యుడే మొదటివాడు. కాలచక్రాన్ని ఆయనే తిప్పుతున్నాడు. సూర్య గతి కారణంగా, కాలం నిరాటంకంగా ముందుకు సాగుతోంది. సూర్యారాధన దేహసంబంధ దోషాల్ని తొలగిస్తుందని ‘బ్రహ్మాండ పురాణం’ విశదీకరిస్తోంది.
భాస్కరుడు ఉదయిస్తూ చీకటిని తరిమికొడతాడు. ఇది లోకం ప్రత్యక్షంగా చూస్తున్న నిత్యసత్యం. ఉషాకిరణాలు సంపదను, దీర్ఘాయువును, రక్షణను కలిగిస్తాయి. భాను కిరణాల ద్వారా మానసిక నిర్మలత ప్రాప్తిస్తుంది. జీవరాశి అంతటికీ ఆయనే హితుడు కాబట్టి, ‘మిత్రుడు’ అని సంబోధించింది రుగ్వేదం. ఉపాసన వల్ల వర్చస్సు, దృష్టి, జ్ఞానం లభిస్తాయని ‘శుక్ల యజుర్వేదం’ మంత్రాలు చెబుతాయి. ఆదిత్యుడు ఆరోగ్యాన్ని, తేజస్సును, బలాన్ని ప్రసాదిస్తాడని సామవేదం పలుకుతోంది. పలు బాధల్ని నివారిస్తాడంటోంది అధర్వణ వేదం.
ప్రతిరోజూ ఉదయాన స్నానం చేసి, సూర్యుణ్ని ధ్యానిస్తూ జలధారతో అర్ఘ్యమివ్వాలి. అది సప్తవిధ పాపాలూ సమసిపోయేలా చేస్తుందంటారు. మానవాళికి ఆయన భౌతికంగా ప్రేరణశక్తిని కలిగిస్తాడని గాయత్రీ మంత్రం వర్ణిస్తుంది. సూర్యశక్తి అపారం. విశ్వమానవాళికి కావాల్సినంత వర్షం లభించడానికి కారకుడై ‘ఘన వృష్టి’ అని ఖ్యాతి పొందాడు. లోకులు వర్షం కురిసినప్పటి తడిలోనే ఉండిపోతే, క్రిమికీటకాదులు ప్రబలి వ్యాధులు వ్యాపిస్తాయి. అలా కాకుండా తగినంత ఎండనిచ్చి రోగాల బారినుంచి వారిని కాపాడుతూ ‘ఆతపి’ అనే పేరు గడించాడు. పాపపుణ్యాలన్నింటికీ లోకసాక్షి అయ్యాడు.
ప్రభాకరుడికి ‘వెలుగు నిధి’ అనే పేరుంది. వెలుగు లేకుంటే, అంతా చీకటిమయమే. విజ్ఞానానికి వెలుగు, అజ్ఞానానికి చీకటి ప్రతీకలు. విద్య అంటే- చదవటం, రాయటం మాత్రమే కాదు. విజ్ఞానమే విద్య. అందరూ వెలుగునే కోరుకోవాలి. ఆ బాటలోనే పయనించాలి!
- యం.సి.శివశంకరశాస్త్రి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565