అందానికి.. బంధానికి జంటగా వ్యాయామం!
పరిణయమాడిన ప్రతి జంటా కలకాలం కలిసి ఉండాలనే కోరుకుంటారు. అలా చివరివరకూ జంటగా కొనసాగే దంపతులకు ఒకరి గురించి మరొకరికి అవగాహన అత్యావశ్యకం. భాగస్వామి అలవాట్లు, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, సాధకబాధకాలు క్షుణ్ణంగా తెలియాలి. ఒకే పనిని ఇద్దరూ కలిసి చేయడం వల్ల కొంతమేరకు ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. కబుర్లు చెప్పుకునే సమయమూ చిక్కుతుంది. ప్రస్తుత ఉరుకులు పరుగుల కాలంలో ప్రత్యేకంగా ఓ పనిని ఇందు కోసం కేటాయించుకోవడం కష్టసాధ్యమే. ప్రతిరోజూ వ్యాయామాన్ని ఎవరికి వారు కాకుండా దంపతులిద్దరూ కలిసి చేయడం ఈ సమస్యకు సమాధానమవుతుంది. దీనివల్ల ఇద్దరికీ కొంత సమయం ప్రత్యేకంగా దొరుకుతుంది. ఇలా కలిసి వ్యాయామం చేయడం వల్ల శరీర ధారుడ్యం, ఆరోగ్యంతో పాటు దాంపత్యజీవితానికి అనేకరకాలుగా మేలు చేకూరుతుందంటున్నారు నిపుణులు. దంపతుల మధ్య తలెత్తే చిన్నచిన్న సమస్యలకు కుటుంబ సలహాకేంద్రా (ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్)ల వరకు వెళ్లవలసిన అవసరమూ రాదంటున్నారు.
* భాగస్వామితో కలిసి వ్యాయామం చేయడం వల్ల ఇద్దరిలోనూ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. శారీరకంగానే కాదు, మానసికంగానూ దృఢపడతారు. ఇది అన్యోన్య దాంపత్యానికి దారితీస్తుంది.
* ఎండార్ఫిన్ హార్మోన్లు (హ్యాపీ హార్మోన్లు) సహజంగా విడుదలయ్యేందుకు జతగా వ్యాయామం చేయడం చక్కని మార్గం. అవి మానసిక స్థితిని మార్చి ఆనందం వైపు మళ్లిస్తాయి.
* జంటగా వ్యాయామం చేయడం వల్ల ప్రత్యేకంగా కొంత సమయం దొరుకుతుంది. అది ఒకరి భావాలను మరొకరు పంచుకోవడానికి చక్కని అవకాశం. ఇద్దరి మధ్యా బంధం చిక్కబడుతుంది.
* ఒకేరకమైన వ్యాయామం కలిసి చేయడం, దాన్నే ఒకరి తరువాత మరొకరు చేస్తూండడం వల్ల మాటలు లేని ఆ వాతావరణంలో మనసులు మరింత దగ్గరైన మధురమైన అనుభూతి కలుగుతుంది.
* నిర్దేశించుకున్న ఫిట్‌నెస్ లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు. బద్ధకంగా ఉన్నా, మనసు బాగా లేకున్నా ఒకర్నొకరు ఉత్సాహపరుచుకుని వ్యాయామం చేసే వీలుంటుంది.
* వ్యాయామం మిషగా ప్రతిరోజూ కాసేపు అలా కబుర్లు కలబోసుకోడం వల్ల ఒత్తిడి, అలసట దరిదాపుల్లోకి రావు. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నచిన్న విషయాలకు చిరాకుపరాకులు కలగనేకలగవు.
* కలిసి వ్యాయామం చేయడం వల్ల తమపై తమకు నమ్మకం పెరిగి అది శృంగారం పైనా దృష్టి పెట్టేలా చేస్తుందంటున్నారు నిపుణులు. ఇద్దరిలోనూ దగ్గరితనం మరింత కుదురుకుంటుంది. జీవితం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. కలిసి బరువులెత్తడం వల్ల శృంగార పరమైన హార్మోనులు విడుదలవుతా యంటున్నారు.
* మెదడులోని ఆనందానికి కేంద్రమైన డొపమైన్‌ను ఉత్తేజపరిచి జ్ఞాపకశక్తిని ఇనుమడింపజేస్తుందని అధ్యయనకారులు చెబుతున్నారు. ఒకరివి ఒకరు పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ముఖ్యతేదీలను గుర్తుపెట్టుకుని మరింత సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకునేందుకు దోహదం చేస్తుంది.
* వ్యాయామం చేస్తున్నపుడు ఏర్పడే కదలికలు కణజాలానికి సరిపడా ఆక్సిజన్, పోషకాలు అందేలా చేసి శరీర దృఢత్వాన్ని పెంచుతుంది. అది గుండె పనితీరును మరింత మెరుగుపరిచి ఏ సమయంలోనైనా, ఏ పని చేయడానికైనా ఉత్సాహం చూపుతారు.
* వారానికి నూటయాభై నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల అరవై ఐదు శాతం నిద్ర నాణ్యత పెరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మధ్యాహ్నం నిద్ర వచ్చే అవకాశం కూడా తక్కువై రోజువారీ పనిలో చురుకుదనమూ పెరుగుతుంది.
* చెమటలు పట్టేవరకు వ్యాయామం చేయడం వల్ల మెదడుకు ధారాళంగా ఆక్సిజన్ అంది చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆయా అంశాలపై ఇద్దరి మధ్య సానుకూలమైన చర్చలు జరుగుతాయి. అది దంపతులకే కాక కుటుంబపరంగానూ మేలు చేస్తుంది.
* ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమై జీవితకాలమూ పెరుగుతుంది.
- సంధ్యారాణి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565