MohanPublications Print Books Online store clik Here Devullu.com

పసి వాంతి పట్టించుకోవాల్సిందే!_children vomiting


పసి వాంతి పట్టించుకోవాల్సిందే!

    పసికందు పెదవులపై నవ్వులు విరబూస్తుంటే పెద్దవాళ్ల మనసు ఆనంద కెరటాల్లో తేలిపోతుంది. చిన్నారి బోసి నోట కేరింతలు ప్రతిధ్వనిస్తుంటే ఇల్లంతా స్వర్గసీమలా మారుతుంది. ఉంగా ఉంగా అంటూ తల్లిపాలు తాగే శిశువులు కావొచ్చు. వద్దని మారాం చేస్తూ ఉగ్గు ఆరగించే చిన్నారులు కావొచ్చు. కొత్త చిరుతిళ్లు చేసిపెట్టమని కోరే పిల్లలు కావొచ్చు. ఇలా పిల్లలు బొజ్జలన్నీ నిండుతుంటే మన కడుపూ నిండినంత సంబరమేస్తుంది. కానీ తాగిన పాలు తాగినట్టే, తిన్న ఉగ్గు తిన్నట్టే బయటకు వచ్చేస్తుంటే? భళ్లున వాంతి చేసుకుంటుంటే? ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. నిజానికి పిల్లల్లో వాంతులకు చాలాసార్లు భయపడాల్సినంత సమస్యేమీ ఉండకపోవచ్చు. పాలు సరిగా పట్టకపోవటం, జీర్ణకోశ ఇన్‌ఫెక్షన్లు, కలుషితాహారం వంటి మామూలు విషయాలే దీనికి కారణం కావొచ్చు. కానీ అరుదుగానే అయినా- పిల్లల్లో వాంతులు తీవ్ర సమస్యలకూ సంకేతాలు కావొచ్చు. వీటిని సకాలంలో గుర్తించి, చికిత్స చేయకపోతే బిడ్డ ప్రాణాలకే ముప్పు తలెత్తొచ్చు. అందుకే ఎలాంటి వాంతులను మామూలుగా తీసుకోవాలి? వేటిని తీవ్రంగా పరిగణించాలి? అనే దానిపై సమగ్ర కథనం అందిస్తోంది ఈవారం సుఖీభవ!

కడుపులో ఏదో కలియ తిప్పుతున్నట్టు.. లోపల ఉన్నదంతా పైకి తన్నుకొస్తున్నట్టు.. పేగులన్నీ లుంగలు చుట్టుకుపోతున్నట్టు.. ఏదో తెలియని బాధ, వికారం! వాంతికి ముందు సరిగ్గా ఇలాగే అనిపిస్తుంది. కడుపులోంచి భూగోళమే బయటకు వచ్చేస్తోందేమోననీ తోస్తుంది. నిజానికి వాంతిని ఒకరకంగా మనల్ని కాపాడే ప్రక్రియనే చెప్పుకోవచ్చు. చెడిపోయిన ఆహారం తినటం, కలుషితమైన నీటిని తాగటం మూలంగా బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవుల వంటివి మనకు తెలియకుండానే జీర్ణకోశంలోకి ప్రవేశించొచ్చు. ఇలాంటి వాటిని శరీరం వాంతి రూపంలో తొలగించుకోవటానికి ప్రయత్నిస్తుంటుంది. చాలా సందర్భాల్లో జరిగేది ఇదే. పిల్లల్లో కనబడేవి చాలావరకు ఇలాంటి వాంతులే. వీటికి తోడుగా విరేచనాలు కూడా ఉండొచ్చు. వీటితో పెద్ద ప్రమాదమేమీ లేదు. ఓఆర్‌ఎస్‌ ద్రావణం పట్టటం, అవసరమైతే వాంతులు తగ్గే మందులు వేయటం వంటి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఒకట్రెండు రోజుల్లోనే తగ్గిపోతాయి. అయితే కొన్ని రకాల వాంతులు విడవకుండా, పదేపదే వేధిస్తుంటాయి. కొద్దిరోజుల పాటు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ మళ్లీ విజృంభిస్తుంటాయి. ఇవి పిల్లలను చాలా ఇబ్బంది పెడతాయి. కొన్నిరకాల వాంతులకు తీవ్రమైన సమస్యలు కూడా కారణం కావొచ్చు. అందువల్ల వీటిపై అవగాహన పెంచుకోవటం మంచిది.

తల్లిదండ్రులేం చేయాలి? 
పసికందుల్లో వాంతులు అవుతుంటే చాలామంది పాలు పట్టటం మానేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కొద్దికొద్దిగా పాలు పడుతుండాలి. వాంతి తగ్గుతున్నకొద్దీ కాస్త ఎక్కువగా పాలు పట్టాలి. నెలల పిల్లలు, పెద్ద పిల్లలకు ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగించటం మంచిది. ఓఆర్‌ఎస్‌ అందుబాటులో లేకపోతే చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటిని తరచుగా తాగించాలి. అలాగే వాంతి తగ్గటానికి తోడ్పడే మందులు వేయాలి. ముఖ్యంగా వాంతులవుతున్నప్పుడు పిల్లలు చాలా అసౌకర్యానికి, భయానికి గురవుతుంటారు కాబట్టి వారికి భరోసా ఇవ్వాలి.

వాంతి ఎలా అవుతుంది? 
మన శరీరంలోని ఆయా భాగాల్లోని నాడుల నుంచి అందే సంకేతాలు మెదడులోని నాలుగో వెంట్రికల్‌ అడుగు భాగాన ఉండే కెమికల్‌ ట్రిగ్గర్‌ జోన్‌ను ప్రేరేపిస్తాయి. దీంతో నాడీ వ్యవస్థలు ఉత్తేజితమై.. పొట్టలోని కండరాలు, డయాఫ్రం పొర సంకోచించటం, ఛాతీ కుహరం వదులు కావటం వంటి వాటి మూలంగా జీర్ణాశయంలోని పదార్థాలు బలంగా బయటకు తోసుకొస్తాయి. ఇదే వాంతి!
ఎప్పుడు ప్రమాదకరం?
* వాంతులు తరచుగా అవుతుండటం 
* రోజురోజుకీ బరువు తగ్గుతుండటం 
* దూరంగా చిమ్మినట్లు వాంతి రావటం 
* ఆకుపచ్చగా పసరు వాంతులు 
* రక్తం వాంతులు 
* తీవ్ర కడుపునొప్పితో వాంతులు 
* వాంతి అనంతరం మూర్ఛ రావటం 
* డీహైడ్రేషన్‌ లక్షణాలు కనబడటం 
* కడుపుబ్బరంతో వాంతులు

వాంతులు రకరకాలు!
* విడవని వాంతులు: పిల్లలు ఎప్పుడో అప్పుడు వాంతి చేసుకోవటం సహజమే. అయితే కొందరు తరచుగా, విడవకుండా (పర్టిస్టెంట్‌) వాంతులు చేసుకుంటుంటారు. అంటే ఒక వారం పాటు ఆగకుండా వాంతులు అవ్వొచ్చు. ఒక వారం తగ్గి మళ్లీ వాంతులు కావొచ్చు. ఇలా విడకుండా పదేపదే వేధిస్తుంటాయి. ఇవి ఒంట్లో నీటిశాతం తగ్గటం, బరువు తగ్గటం వంటివి వాటికి దారితీస్తాయి.

* చిమ్ముకొచ్చే వాంతులు: చిన్నపిల్లల్లో చాలామందిలో ఎలాంటి ఆయాసం లేకుండా.. పాలు గొంతులోకి వచ్చేసి.. కొద్దికొద్దిగా ముద్దలు ముద్దలుగా వాంతులు (రిగర్జిటేషన్‌) అవుతుంటాయి. చాలాసార్లు ఇవి తల్లి భుజం మీదే కారిపోతుంటాయి కూడా. ఇవేమీ ప్రమాదకరం కాదు. కానీ కాస్త దూరం వరకు చిమ్మినట్లు (ప్రొజెక్టైల్‌) వాంతులు అవుతుంటే లోపల ఏదో సమస్య ఉందనే అర్థం. పేగుల్లో ఏదైనా అడ్డంకి ఉన్నప్పుడు ఆహారం దాన్ని దాటుకొని వెళ్లలేక.. ఎగదన్నుకొని వచ్చి చిమ్మినట్లు వాంతి అవుతుంది. 

* పసరు వాంతులు: కాలేయం నుంచి ఉత్పత్తయిన పైత్యరసం జీర్ణాశయంలోకి ప్రవేశించే మార్గానికి కింద ఏదైనా సమస్య తలెత్తితే వాంతితో పాటు పైత్యరసం కూడా బయటకు వస్తుంది. దీంతో పసుపు-ఆకుపచ్చరంగులో వాంతి అవుతుంది. పైత్యరసం కొంతసేపు నిల్వ ఉన్నాక వాంతి అయితే ముదురు ఆకుపచ్చరంగులో కనబడొచ్చు. అందువల్ల పిల్లలు ఒక్కసారి పసరు వాంతి చేసుకున్నా లోపల ఏదో సమస్య ఉందేమోనని అనుమానించాలి. సమస్య పైత్యరసం ప్రవేశించే మార్గానికి ముందుంటే వాంతిలో పసరు ఉండదు.
 
* రక్తపు వాంతులు: కొందరు శిశువులు కాన్పు సమయంలో రక్తాన్ని మింగుతుంటారు. తల్లి చనుమొనలకు ఏర్పడిన సన్నటి చీలికలు ద్వారానూ పాలు తాగేటప్పుడు కొంత రక్తాన్ని లోపలికి తీసుకోవచ్చు. కొందరికి పుట్టుకతోనే రక్తం గడ్డకట్టటంలో లోపం మూలంగా తాత్కాలికంగా పేగుల్లో రక్తస్రావం అవుతుంటుంది (ఇది విటమిన్‌ కె ఇవ్వగానే సర్దుకుంటుంది). ఇలాంటి రక్తం వాంతితో కలిసి బయటకు వస్తుంటుంది. ఇవేమీ ప్రమాదకరమైనవి కావు. అయితే రక్తం పెద్దమొత్తంలో, తరచుగా పడుతున్నా.. రక్తం రంగు బాగా ఎర్రగా, ముదురుగా కనబడుతున్నా తాత్సారం చేయరాదు. ఇది లోపల ఎక్కడో పేగు మడతపడి, కుళ్లిపోతోందనటానికి సూచిక కావొచ్చు. కాలేయం దెబ్బతినటం వల్ల పోర్టల్‌ సిరలో ఒత్తిడి పెరిగి.. పేగుల్లోని రక్తనాళాలు ఉబ్బటం వల్ల వాంతిలో రక్తం పడుతుంది. కాలేయం గట్టిపడటం వల్ల తలెత్తే రక్తస్రావ సమస్యల మూలంగానూ రక్తపు వాంతులు కావొచ్చు.
* మలం వాంతులు: పేగుల్లో అడ్డంకి తలెత్తటం వల్ల కొందరికి వాంతిలో మల పదార్థం కనబడుతుంది. ముఖ్యంగా చిన్నపేగు చివరి భాగంలో ఏదైనా అడ్డంకి ఉంటే.. పేగు కదలికలు దాన్ని దాటుకొని ముందుకు వెళ్లలేవు. దీంతో మల పదార్థాలు జీర్ణాశయంలోకి వచ్చి వాంతితో పాటు కలిసి బయటకు వస్తుంటాయి. ఇది చాలా ప్రమాదరకమైన సమస్య. దీనికి వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.

నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం
వాంతులు తరచుగా వేధిస్తుంటే ఒంట్లో నీటిశాతం తగ్గుతుంది (డీహైడ్రేషన్‌). దీంతో కళ్లు లోపలికి పోవటం, నాలుక పొడిబారటం, నీరసం, మూత్రం సరిగా రాకపోవటం వంటి లక్షణాలు పొడసూపుతాయి. రక్తంలో ఎలక్ట్రోలైట్ల స్థాయులూ పడిపోతాయి. దీన్ని పట్టించుకోకపోతే ప్రాణాపాయ స్థితి కూడా తలెత్తొచ్చు. తరచుగా వాంతులు కావటం వల్ల అన్నవాహికలో సన్నటి పగుళ్లు ఏర్పడి.. వాంతితో పాటు రక్తం పడొచ్చు. మరీ చిన్న పిల్లల్లో వూపిరితిత్తుల్లోకి వాంతి వెళ్లకుండా చూసే రక్షణ వ్యవస్థ సరిగా ఉండదు. దీంతో కొంత వాంతి వూపిరితిత్తుల్లోకి వెళ్లిపోవచ్చు. ఇది న్యుమోనియాకు దారితీస్తుంది. వీరిలో రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోయి మూర్ఛ కూడా రావొచ్చు. ఒకోసారి నిద్రలోనే వాంతి వచ్చి పిల్లలు హఠాత్తుగా చనిపోవచ్చు కూడా. అలాగే దీర్ఘకాలం వాంతులు వేధిస్తుంటే బరువు తగ్గిపోతుంది. జీర్ణాశయ రసాలు పైకి ఎగదన్నుకొని రావటం వల్ల దంతాలపైన ఉండే ఎనామిల్‌ పొర సైతం దెబ్బతినొచ్చు. ఛాతీలో మంట, నోరు చేదుగా అనిపించటం వంటివీ వేధించొచ్చు.

వయసును బట్టి కారణాలు
పిల్లల్లో వాంతులకు రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. తల్లికి పాలు పట్టే విధానం తెలియకపోవటం, ఇన్‌ఫెక్షన్లు, జీర్ణరసాలు పైకి ఎగదన్నకుండా చూసే కండర వలయం బిగువు తగ్గటం వంటి మామూలు కారణాలే కాదు.. పేగు మడత పడటం, పేగుల్లో అడ్డంకి తీవ్ర సమస్యలూ వాంతులకు దారితీస్తాయి. ఇవి ఆయా వయసులను బట్టి ఆధారపడి ఉంటాయి.
పసికందుల్లో..

* మామూలు కారణాలు: తల్లికి సరిగా పాలు పట్టే విధానం తెలియకపోవటం ప్రధాన కారణం. శిశువులు పాలతో పాటు గాలినీ మింగుతుంటారు. ఇది బయటకు వచ్చే క్రమంలో పాలను కూడా వెంటబెట్టుకు వస్తుంది. పాలిచ్చిన తర్వాత పిల్లలను కొద్దిసేపు భుజం మీద వేసుకొని వీపు మీద తడితే.. గాలి త్రేన్పు రూపంలో బయటకు వస్తుంది. దీంతో వాంతి కాకుండా చూసుకోవచ్చు. అతిగా పాలు పట్టటం, జీర్ణాశయంలోని ఆహారం పైకి ఎగదన్నకుండా చూసే కండర వలయం సమర్థంగా పనిచేయకపోవటంతోనూ వాంతి కావొచ్చు. పాల ప్రోటీన్‌ పడకపోవటం మూలంగానూ కొందరు వాంతి చేసుకోవచ్చు. వీరికి లాక్టోజెన్‌ లేని పోత పాలు పడితే సమస్య చాలావరకు కుదరుకుంటుంది. అలాగే మూత్రకోశం, జీర్ణకోశం, శ్వాసకోశంలో, రక్తంలో, మెదడులో.. ఇలా ఎక్కడ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినా వాంతులకు దారితీయొచ్చు.

* తీవ్రమైన కారణాలు: కొందరికి పుట్టుకతోనే పేగులు మరోవైపునకు తిరిగి ఉండటం (మాల్‌ రొటేషన్‌) వల్ల విడవకుండా పసరు వాంతులు అవుతుంటాయి. సాధారణంగా మన పేగులు ఒక క్రమపద్ధతిలోకి తిరిగి.. కుదురుకొని పోతాయి. కానీ కొందరు పిల్లల్లో పేగులు సరిగా కుదురుకోవు. దీన్ని అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి సరిదిద్దాల్సి ఉంటుంది. లేకపోతే పేగులు మడతపడిపోయి, ఆ భాగానికి రక్త సరఫరా జరగక కుళ్లిపోతుంది. ఒకోసారి ప్రాణాపాయం కూడా సంభవించొచ్చు. అలాగే పేగులో ఎక్కడైనా అడ్డంకి తలెత్తినా కూడా వాంతులకు దారితీస్తుంది. పేగు పూర్తిగా ఏర్పడకుండా మధ్యలో కొంతభాగం ఖాళీగా ఉన్నవారిలోనూ.. పేగుల్లో రక్షణ వ్యవస్థ దెబ్బతినటం వల్ల పేగుల గోడల్లో తలెత్తే ఇన్‌ఫెక్షన్‌ (నెక్రొటైజింగ్‌ ఎంటెరో కొలైటిస్‌) మూలంగానూ.. నాడులు సరిగా అభివృద్ధి చెందకపోవటం వల్ల పేగుల్లో కొంతభాగంలో కదలికలు తగ్గటం వల్ల కూడా పసరు వాంతులు రావొచ్చు. ఇలాంటి తీవ్ర సమస్యలకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఇక జీర్ణాశయం చివరి భాగంలోని కండరం మందం కావటం వల్ల కూడా రోజురోజుకీ మార్గం మూసుకుపోయి వాంతులు కావొచ్చు. వీరిలో పాలివ్వగానే పొట్ట మీద గడ్డలాంటిది కదులుతూ కనబడుతుంది. దీన్ని తేలికైన శస్త్రచికిత్స ద్వారా సరిదిద్దొచ్చు.
నెలల పిల్లల్లో..

* జీఈఆర్‌డీ: నెలల పిల్లల్లో వాంతులకు ప్రధాన కారణం జీర్ణాశయ రసాలను పైకి ఎగదన్నకుండా చూసే కండర వలయం బిగువు తగ్గటం. దీంతో ఆహారంతో పాటు ఆమ్లాలు కూడా పైకి ఎగదన్నుకొని వచ్చి అన్నవాహిక దెబ్బతినటం (జీఈఆర్‌డీ) మొదలవుతుంది. ఫలితంగా అప్రయత్నంగానే వాంతి అయిపోతుంటుంది. ముఖ్యంగా ఘనాహారం కన్నా ద్రవాలే ఎక్కువగా బయటకు వస్తుంటాయి. సమస్య మామూలుగా ఉంటే చికిత్స ఏమీ అవసరం లేదు. పాలు తాగించాక, ఘనాహారం తినిపించాక పిల్లలను భుజం మీద వేసుకొని తట్టటం, తల కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. సమస్య మధ్యస్థంగా ఉన్నవారికి- జీర్ణాశయం నుంచి ఆహారం త్వరగా కదిలేలా చేసే ప్రొకైనెటిక్‌ మందులు, వాంతులను తగ్గించే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. పొట్టలో పాలను చిక్కబరిచే పొడి కూడా బాగా పనిచేస్తుంది. ఇక సమస్య తీవ్రంగా గలవారికి- ఫండోప్లైకేషన్‌ శస్త్రచికిత్సతో కండర వలయాన్ని బిగుతుగా చేస్తారు.

* పేగులు చొచ్చుకెళ్లటం: పేగులు ఒకదానిలోకి మరోటి చొచ్చుకెళ్లటం (ఇంటససెప్షన్‌) కూడా వాంతులకు దారితీస్తుంది. ఇది 6-9 ఏళ్ల పిల్లల్లో ఎక్కువ. ఇందులో హఠాత్తుగా కడుపునొప్పితో పాటు పసరు వాంతులవుతాయి. సమయం గడుస్తున్నకొద్దీ వాంతులతో పాటు మలంలో జిగురు, రక్తం కూడా పడుతుంది. దీనికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. లేకపోతే చొచ్చుకెళ్లిన పేగు కుళ్లిపోవచ్చు.

* హెర్నియా చిక్కుబడటం: కడుపు గోడ నుంచి బయటకు తోసుకొచ్చిన పేగు (హెర్నియా) తిరిగి లోపలికి వెళ్లకుండా చిక్కుకుపోతే పసరు వాంతులు కావొచ్చు. తరచుగా గజ్జల్లో తోసుకొచ్చిన పేగు పట్టుకుపోవటం చూస్తుంటాం. అరుదుగా బొడ్డు దగ్గర హెర్నియా కూడా పట్టుకుపోవచ్చు. అందువల్ల పిల్లలు ఏడుస్తూ వాంతులు చేసుకుంటుంటే ఒకసారి ఒళ్లంతా పరీక్షించటం మంచిది.

* పేగుల్లో అడ్డంకులు: నులిపురుగులు ఉండలాగా చుట్టుకుపోయి పేగుల్లో అడ్డుపడటం.. ఏదైనా ఇన్‌ఫెక్షన్‌తో ఏర్పడే చీము గడ్డలు పగలటం వల్ల పేగులు అతుక్కుపోవటం.. ఒకోసారి లోపల సన్నటి పొరలు చుట్టుకుపోవటం వంటి వాటితోనూ పేగుల్లో అడ్డంకి తలెత్తొచ్చు. దీంతోనూ వాంతులు కావొచ్చు.

* మెదడులో ఒత్తిడి: తలకు గాయాలు, మెదడు పొరల్లో ఇన్‌ఫెక్షన్‌ (మెనింజైటిస్‌) మూలంగా మెదడులో రక్తం, ద్రవం పేరుకుపోయి ఒత్తిడి పెరగొచ్చు. దీంతో తెల్లగా, చిమ్మినట్లుగా వాంతులవుతాయి. మందులతో కొంతవరకు ఒత్తిడిని తగ్గించొచ్చు. అవసరమైతే పుర్రెకు రంధ్రం చేసి లోపల ఒత్తిడిని తగ్గించాల్సి ఉంటుంది.

* ఎంజైమ్‌ల లోపం: కొందరికి పుట్టుకతోనే ఎంజైమ్‌ల లోపం తలెత్తుతుంటుంది. దీంతో గ్యాలక్టోజిమా వంటి మెలబాలిక్‌ సమస్యలు మొదలవుతాయి. ఇవి కూడా వాంతులు తెచ్చిపెడతాయి. కడుపుబ్బరం, వయసుకు తగినట్టుగా పెరగకపోవటం వంటివీ కనబడతాయి. వీరికి ఆయా సమస్యలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది.
పెద్ద పిల్లల్లో..

* అపెండిక్స్‌ వాపు: ఇది 5-8 ఏళ్ల పిల్లల్లో ఎక్కువ. ఇందులో నొప్పి, జ్వరంతో పాటు వాంతులు కూడా అవుతాయి. దీన్ని సాధ్యమైనంతవరకు మందులతో తగ్గించటానికి ప్రయత్నిస్తారు. తగ్గకపోతే శస్త్రచికిత్స చేసి అపెండిక్స్‌ను తొలగిస్తారు. పేగుల్లో అడ్డంకులు, కంజెనటల్‌ బ్యాండ్స్‌, హెర్నియా చిక్కుకుపోవటం వంటి సమస్యలు వీరిలోనూ ఉండొచ్చు.

* డయాబెటిక్‌ కీటోఅసిడోసిస్‌. మధుమేహం గల పిల్లలు సరైన చికిత్స తీసుకోకపోయినా, ఇన్సులిన్‌ తీసుకొని ఆహారం తీసుకోకపోయినా కీటోఅసిడోసిస్‌ సమస్య తలెత్తుతుంది. ఇందులోనూ తీవ్రమైన వాంతులు అవుతాయి. అందువల్ల మధుమేహం పిల్లల్లో తీవ్రమైన వాంతులవుతూ, ఒంట్లో నీటిశాతం తగ్గుతున్న లక్షణాలు కనబడుతుంటే కీటోఅసిడోసిస్‌ను అనుమానించాలి.





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list