MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఉనికికీ ఉన్నతికీ బాటలు వేసేది ఆయనే!-FATHERSDAY



ఉనికికీ ఉన్నతికీ 
బాటలు వేసేది ఆయనే!
ధీర గంభీరం ఆయన రూపం. 
కష్టనష్టాలకు వెరవనిది ఆయన నైజం. 
పలుకు మేఘధ్వని. క్షణం తీరిక దొరకని పని. 
అమ్మ నుంచి అందరూ ఏ పనికైనా ఆయన అనుమతికోసం వేచి చూడాల్సిందే. 
ఆయనే మా నాన్న! అలాంటి నాన్న ఆరోజు చిన్నపిల్లాళ్లా కళ్లనీళ్ల పర్యంతమవుతూ బేలలా చూశారు. 

ఇంతకీ అదేరోజనుకున్నారు. నా పెళ్లిరోజు!
పెళ్లయ్యేంతవరకూ అజమాయిషీ చేసి అందరికీ మర్యాదలు చేసి, వేడుక ఘనంగా నిర్వహించిన ఆయన అప్పగింతల వేళ కురిసిన మేఘమే అయ్యారు. ‘నెత్తిన చన్నీళ్లకుండ’ అనిపించుకున్న అమ్మే ఆయనను సంబాళించాల్సి రావడం విచిత్రం.

నాన్న కూడా ఏడుస్తాడన్నమాట! నిజమే! ఆలోచిస్తే ఇప్పుడు చాలా విషయాలు అర్థమవుతున్నాయి.

పైకి రాయిలా అన్పించినా నాన్న మనసు వెన్న.
ఆ రోజు నాకు బాగా గుర్తు.. కాలేజీకి నన్ను స్కూటర్‌ మీద తీసుకెళ్తున్నాడు నాన్న. నా బద్దకం వల్లే ఆ రోజు చాలా ఆలస్యమైంది. అందుకే ఎప్పటికన్నా కాస్త స్పీడుగానే ఆయన బండి డ్రైవ్‌ చేస్తున్నాడు.

అంతలోనే దురదృష్టం పక్క సందులోంచి వ్యాన్‌ రూపంలో వచ్చేసి మా స్కూటర్‌ను ఢీకొంది. ఇద్దరికీ తీవ్రగాయాలు.. నడవలేకపోతున్నాను. తను గాయాలతో బాధపడుతూ కూడా తన చేతులమీద ఆస్పత్రికి తీసుకుని వెళ్లి చికిత్స చేయించిన విషయం గుర్తొచ్చింది.
పెళ్లిపందిరి అని కూడా చూడకుండా నాన్న భుజంపై తలాన్చి భోరుమన్నాను.

మనసుకు ఏ బాధ కలిగినా ఏడ్చేసి ఆ బాధనుంచి కొంతలో కొంత ఉపశమనం పొందుతుంది అమ్మ.
మరి నాన్న? తను ఏడిస్తే కుటుంబం డీలాపడిపోతుందని ఏ బాధనైనా గుండెల్లోనే దిగమింగుతాడు.
ఆయన కన్నీళ్లు మాకోసం తను పడే శ్రమవల్ల చెమట రూపంలో వెలికి వస్తాయన్పిస్తుంది నాకు..
అమ్మ ప్రాణంపోసి అవనిమీద నిలబెడితే- నాన్న బతకడానికి అవసరమైన విద్య, వ్యక్తిత్వం అందించి జీవితాంతం నాకాళ్లమీద నేను నిలిచేలా చేశాడు.
అమ్మ కడుపు నింపడానికి చూస్తే నాన్న కలేజా నింపడానికి ప్రయత్నించాడు.
తను ఏ మాత్రం కళ్లాలు వదిలినా పిల్లలు క్రమశిక్షణ తప్పుతారని గంభీరమనే ముసుగులో మా కోసం అనుక్షణం తపించేవాడు మా నాన్న!
మా నాన్నే కాదు.. అందరి నాన్నలూ అంతే!

అలాంటి ఓ నాన్న గురించి చెప్పుకుందామా?
పిల్లలు తమకేది మంచిదో తెలుసుకోలేరనీ చాలా మంది తండ్రుల్లా ఆ నాన్నగారు అనుకోలేదు. కూతురు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించేశాడు. ఇందులో గొప్పేముందనుకోకండి.. కచ్చితంగా గొప్పతనం ఉంది. తన కూతురు ప్రేమించిన అబ్బాయికి ఇదివరకే రెండుసార్లు కిడ్నీ మార్పిడి జరిగింది. ఈ విషయం తెల్సి కూడా ఆ తండ్రి వారి ప్రేమను పెద్దమనసుతో అంగీకరించాడు. అంతేకాదు, మూడోసారి కిడ్నీ విఫలమై బాధపడుతున్న కాబోయే అల్లుడికి తన కిడ్నీల్లో ఒకదాన్ని దానమిచ్చాడు. ఆ తర్వాత కన్యాదానం చేసి మనసారా ఆశీర్వదించాడు. ఓ తండ్రి తన బిడ్డ సుఖసంతోషాలకోసం ఎంత త్యాగానికైనా ఒడిగడతాడనడానికిదో నిదర్శనం! ఇంతకీ ఆ తండ్రి ఎవరో కాదు, గుజరాతీ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించే ఫిరోజ్‌వోహ్రా. ఇలాంటి తండ్రులెందరో ఇంకా తెరమరుగునే ఉంటారు.. ఉంటున్నారు.

పిల్లల్ని తీర్చిదిద్దడంలో కీలకం! 
సంసారానికి భార్యాభర్తలిరువురూ సారథులే అయినా పిల్లలను తీర్చిదిద్దడంలో, పద్ధతిగా పెంచడంలో భర్త పాత్రే కీలకం. తల్లి పిల్లల్ని ప్రేమాప్యాయతలు రంగరించి పెంచితే- వారు అదుపాజ్ఞలలో బాధ్యత ఎరిగి మెలిగేలా చేసేది నాన్నే. ప్రతి తల్లీ తన పిల్లలను సుగుణాల గనిగా భావించి మురిసిపోతుంటే, నాన్నమాత్రం వారి గెలుపుకోసం అలుపెరుగక శ్రమిస్తాడు. అమ్మప్రేమ బాహాటంగా వ్యక్తమవుతుంది. నాన్నప్రేమ, నిగూఢంగా ఉంటుంది.. ఆయన ఆకాశంలా ఉన్నతుడు. సముద్రంలా గంభీరుడు. ‘ఆచార్యాణాం శతం పితా’ అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంటే- తండ్రి వందమంది ఆచార్యులతో సమానం.
కొడుకులకు తల్లులంటే, కూతుళ్లకు తండ్రులంటే ఎక్కువ ఇష్టమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు. ముఖ్యంగా కూతురు అత్తింటికి వెళ్లేటప్పుడు నాన్న బాధ వర్ణనాతీతం.. ఎన్నడూ కంటతడి పెట్టని ఆయన, అల్లుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేసి, కూతురిని సాగనంపేటప్పుడు కన్నీరుమున్నీరవుతాడు.

పిల్లల బాగుకోసం, వారి భవిష్యత్తుకోసం తన జీవితాన్నే ధారపోసిన తండ్రికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ప్రేమాప్యాయతలను మించి మననుంచి ఏదీ ఆశించడని గుర్తుంచుకుంటే మంచిది                                                                              (నేడు పితృ దినోత్సవం)- ఆద్య

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list