MohanPublications Print Books Online store clik Here Devullu.com

నీలా నువ్వుండటమే... యోగా!- Yoga


నీలా నువ్వుండటమే... యోగా!
నీలోంచి నీ వూబకాయాన్ని తరిమేశాకా, నీలోంచి నీ జీవనశైలి రుగ్మతల్ని తీసేశాకా, నీలోంచి నీ మానసిక దౌర్బల్యాల్ని తొలగించాకా...మిగిలిన నువ్వే - అసలుసిసలు నువ్వు! ఆ అచ్చమైన మనిషి యోగాతోనే రూపుదిద్దుకుంటాడు.(జూన్‌ 21, అంతర్జాతీయ యోగా దినోత్సవం)
నువ్వు అంటే...నాలుగు అడుగులు వేయగానే ఆయాసపడిపోయే నీ భారీ శరీరమా? 
నువ్వు అంటే...భూమి గుండ్రంగా ఉండును - అని పిల్లలకు చూపడానికి పనికొచ్చే నీ బానపొట్టా? 
నువ్వు అంటే...పరగడుపున మింగే బీపీ మాత్రా, పగలొకసారీ రాత్రొకసారీ ఠంచనుగా వేసుకునే మధుమేహం బిళ్లా? 
నువ్వు అంటే...ఏ చిన్న సమస్యో రాగానే వణికిపోయే నీ బలహీన మనస్తత్వమా? 
నువ్వు అంటే...కాసిన్ని ఆస్తులు సంపాదించగానే కన్నూమిన్నూగానని నీ అహంభావమా? 
...కాదు కాదు. ఇవేవీ కాదు. 
నీ సహజ రూపం ఏమిటో, నీ వాస్తవ స్వభావం ఏదో తెలుసుకోడానికి...హిమాలయాల దాకా వెళ్లాల్సిన పన్లేదు, గురువుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన అవసరం లేదు, గూగుల్‌ సెర్చింజిన్‌ గోలే అక్కర్లేదు. ఐదారేళ్ల పిల్లల్ని గమనిస్తే చాలు. నీ ప్రశ్నకు సమాధానం దొరికిపోతుంది. ఆ పసివాళ్లని చూడండి! బుల్లిబుల్లి అడుగులేస్తూ ఇల్లంతా పరిగెడతారు. ఆడుతూ పాడుతూ జానెడంత నడుమును చక్రంలా తిప్పేస్తారు. ఏ మాత్రం కష్టపడకుండా విల్లులా ఒంగిపోతారు. చేతులతో పాదాల్ని సునాయాసంగా పట్టుకుంటారు. ఆ మొహంలో మహా నిర్మలత్వం! బొమ్మల కోసమో, బిస్కెట్ల కోసమో మారాం చేసినా...అదీ కాసేపే! మరునిమిషమే హాయిగా నవ్వేస్తారు. వాళ్లకి ద్వేషం తెలియదు, అసూయ తెలియదు. స్వార్థం తెలియదు. అది నిత్య యోగస్థితి! ఒకప్పుడు, నువ్వూ ఇలానే ఉండేవాడివి. నీ స్వభావమూ దాదాపుగా అదే. నీ శరీరంలోని అనారోగ్యాల్నీ, నీ మనసులోని జాడ్యాల్నీ శుభ్రంగా తొలగించుకుంటే...మిగిలేది పసిపాప లాంటి, ఆ నువ్వే. ఆ చెత్తంతా వదిలించుకోడానికి ఒకటే మార్గం - యో...గా!
నీ శరీరం...నీది కాదు! 
నీ ఆకారం ఏమిటి ఇలా మారిపోయింది, కొబ్బరిచెట్టులా నిటారుగా ఉండాల్సిన వాడివి... కాపుకొచ్చిన మామిడి కొమ్మలా ఒంగిపోయావెందుకు? నీ పొట్టేమిటి అలా ముందుకొచ్చింది, చొక్కా లోపల స్టీలు బిందె దాచుకున్నట్టు? ఆ నడుమేమిటి అంతగా ముడతలు పడిపోయింది, చుట్టూ క్యారీ బ్యాగులు తగిలించుకున్నట్టు? 
ఈ వంకరటింకర రూపం, ఈ బాన పొట్ట, ఈ కొవ్వుపట్టిన నడుమూ...ఇవేవీ నీవి కాదు. నీ సహజ రూపంలో ఏ ఒక్కటీ లేవు. అసలు, మనిషి అన్నవాడి ఆకృతే ఇలా ఉండదు. 
నీది కాని బరువును దించేసుకో. 
నీకు అక్కర్లేని కొవ్వును కరిగించుకో. 
నిన్ను గుర్తుపట్టకుండా చేస్తున్న ముడతల్ని సరిచేసుకో. 
అలా అని ప్లాస్టిక్‌ సర్జరీల పేరుతో కార్పొరేట్‌ ఆసుపత్రులకు లక్షలకు లక్షలు సమర్పించుకోవద్దు. బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌ కోసం ఆస్తుల్ని కరిగించుకోవద్దు. మందులూ మాత్రల జోలికి వెళ్లనే వెళ్లొద్దు. నీ శరీరాన్ని నీకు తిరిగిచ్చే శక్తి యోగాకు ఉంది.
కూర్చోవడం, లేవడం...నిత్య జీవితంలో భాగం. ఎన్నిసార్లయినా సునాయాసంగా కూర్చోగలగాలి, ఎన్నిసార్లయినా అనాయాసంగా లేవగలగాలి. దీనివల్ల మోకాళ్లకు వ్యాయామం అవుతుంది, పొట్ట మీద ఒత్తిడి పడుతుంది. పిక్కబలమూ పెరుగుతుంది. కానీ నువ్వేమో, బాసింపట్టేసుకుని కూర్చోవడం దాదాపుగా మరచిపోయావు, ఆ అలవాటే తప్పిపోయింది. పొరపాటున కూర్చున్నావా, లేవలేవు. లేచావా, కూర్చోలేవు. భోజనానికి బల్ల కావాలి, పూజకు స్టూలు ఉండాలి. సేదదీరాలంటే కుర్చీ వేయాల్సిందే. సృష్టికర్త మనిషి శరీరాన్ని నేల మీద కూర్చోడానికి అనువుగా రూపొందించాడు. మనిషే...బద్ధకంతో ఆ వెసులుబాటును దూరం చేసుకుంటున్నాడు. గతం గతః యోగా మళ్లీ నిన్ను మూలాల్లోకి తీసుకెళ్తుంది. సిద్ధాసనం, పద్మాసనం, సుఖాసనం బుద్ధిగా కూర్చోబెడతాయి.
నిలబడితే రామబాణం గుర్తుకురావాలి. అంత నిటారుగా ఉండాల్సినవాడివి. నానా వంకర్లూ పోతున్నావు. వాలినట్టుగా - మెడ దగ్గరో వంపు, ఒంగినట్టుగా - వెన్నెముక దగ్గరో వంపు, జారినట్టుగా - నడుము దగ్గరో వంపు, నిక్కబొడుచుకున్నట్టుగా - పిరుదుల దగ్గరో వంపు! మొత్తంగా అష్టావక్రుడిలా తయారవుతున్నావు. ఏం ఫర్వాలేదు. తాడాసనం వాలులేకుండా నిలబడటం నేర్పుతుంది. త్రికోణాసనం, ధనురాసనం. పశ్చిమోత్తాసనం కొయ్యబారిపోయిన నడుమును మెల్లగా, విల్లులా వంచేస్తాయి. క్రమంగా పిరుదుల దగ్గర పేరుకుపోయిన కొవ్వంతా కరిగిపోతుంది.
సృష్టికర్త నిన్ను రబ్బరు బొమ్మతో పోటీపడేలా రూపొందించాడు. నీ శరీరంలోని ప్రతి భాగాన్నీ ఏమాత్రం కష్టపడకుండా హాయిగా అందుకోగలగాలి. నువ్వేమో, బిర్రబిగుసుకుపోయావు. అయినా సరే, భయపడాల్సిన పన్లేదు. యోగా అండగా ఉంది. పాదహస్తాసనాన్ని సాధన చేస్తే...చేతులతో పాదాల్ని పట్టుకోవడం పెద్ద శ్రమేం కాదు... నడుమును పూర్తిగా వంచేసి, కాళ్ల మధ్యలోంచి వెనక్కి చూసేయగలవు, అచ్చంగా పసిపిల్లాడిలా. పవనముక్తాసనంలో, వెల్లకిలా పడుకుని రెండు మోకాళ్లనూ చుబుకం దగ్గరికి సునాయాసంగా లాక్కోగలవు. త్రికోణాసనం, భుజంగాసనం, ధనురాసనం, చక్రాసనం...ఇలా రుషి పరంపర వందలకొద్దీ ఆసనాల్ని కానుకగా ఇచ్చింది. ఇవన్నీ శరీరం మీద నియంత్రణ సాధించడానికి ఉద్దేశించినవే. రోజువారీ జీవితంలో...మన శరీరంలో మహా అయితే, పాతిక ముప్ఫై శాతానికి మించి కదలిక ఉండదు. అదే, ఆసనాలతో నూటికి నూరుశాతం చైతన్యం వస్తుంది. దీనివల్ల అవయవాలన్నీ స్వాధీనంలో ఉంటాయి. చెప్పినట్టు నడుచుకుంటాయి. ‘ఈ శరీరం నాదే..’ అని సగర్వంగా ప్రకటించుకోవచ్చిక!
నీ రోగాలు...నీవి కాదు! 
సృష్టికర్త మనిషిని సృష్టించాడు. 
మనిషి రోగాల్ని సృష్టించుకున్నాడు. 
సృష్టికర్త వందేళ్లు బతకమని భూమ్మీదికి పంపాడు. 
మనిషి అరవైలలో పడగానే పాడె ఎక్కేస్తున్నాడు. 
ఈ అల్పాయువులూ అనారోగ్యాలూ స్వయంకృతం. మనిషి స్వతహాగా పరిపూర్ణ ఆరోగ్యవంతుడు. అతడిలో బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉంది. అది కూడా ‘ఇక నావల్ల కాదు..’ అని చేతులెత్తేసే పరిస్థితి తెచ్చుకున్నాడు. నిన్నమొన్నటి దాకా ఇన్నిన్ని...జీవనశైలి రుగ్మతల్లేవు. అధిక రక్తపోట్లు లేవు, మధుమేహాల్లేవు, గుండె జబ్బుల్లేవు, నడుము నొప్పుల్లేవు. వూబకాయాల్లేవు, దృష్టిదోషాల్లేవు.
యోగాయుధంతో నీ ఒంట్లో తిష్టవేసిన రోగాల్ని తరిమేసెయ్‌. యోగాలో అంతర్లీనంగా వైద్యమూ ఉంది. ‘యోగా థెరపీ’ అన్న మాట విస్తృతంగా ప్రాచుర్యంలోకి వస్తోంది. యోగాను ప్రత్యామ్నాయ చికిత్సా విధానంగానో, మిగతా వైద్యాలకు అనుబంధ చికిత్సగానో ఆమోదించే వైద్యుల సంఖ్యా పెరుగుతోంది. యోగా జీవనవిధానంలో ఓ భాగమైతే చిన్నాచితకా అనారోగ్యాలు కూడా నీ దరిదాపుల్లోకి రాలేవు. యోగా రోగనిరోధక శక్తిని పెంచుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ మియామీలోని టచ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశీలనలో వెల్లడైంది. వెన్నెముక సమస్యలకు యోగాలో పరిష్కారం ఉందని బెంగళూరులోని వివేకానంద యోగా విశ్వవిద్యాలయం నిరూపించింది. క్యాన్సర్‌ రోగులకు కఠిన చికిత్సల్ని తట్టుకునే శక్తిని యోగా ఇస్తోందనీ, దీనివల్ల మిగతా రోగులతో పోలిస్తే యోగా సాధన చేస్తున్నవారే తొందరగా కోలుకుంటున్నారనీ అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు యోగాను ఆశ్రయించి చక్కని ఫలితాల్ని సాధించినట్టు యేల్‌ యూనివర్సిటీ నిపుణులు నిర్ధరించారు. టైప్‌-2 మధుమేహ పీడితులకు యోగా కొండంత ధైర్యాన్నిచ్చింది. మల్టిపుల్‌ స్లె్కరోసిస్‌, పార్కిన్సన్స్‌, ఆస్టియో ఆర్థైటిస్‌ వ్యాధి పీడితులకూ యోగా ఉపశమనాన్ని ప్రసాదించినట్టు తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీఎస్‌ఎమ్‌ మెడికల్‌ యూనివర్సిటీ యోగా మీద అనేక పరిశోధనలు చేసి... వూబకాయాన్ని నియంత్రించడంలో యోగాకు తిరుగులేదని గణాంకాలతో సహా నిరూపించింది. కాలేయ, గుండె సమస్యలకూ యోగాలో జవాబు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. యోగసాధకుల్లో డీఎన్‌ఏ చాలా చైతన్యస్థితిలో ఉంటుందనీ, కణాలు ఆరోగ్యంతో తొణికిసలాడుతుంటాయనీ దిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ గుర్తించింది.
ఒంట్లోంచి ఒక్కో రుగ్మతా తొలగిపోతున్నకొద్దీ, వ్యాధి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతున్నకొద్దీ...నీలోని పరిపూర్ణ ఆరోగ్యవంతుడు బయటికొస్తాడు. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది, జీవనకాంక్ష అధికం అవుతుంది. ప్రతి ఆలోచనలో, ప్రతి నిర్ణయంలో ఆశావాదం ప్రతిఫలిస్తుంది.

నీ శ్వాస... నీది కాదు! 
పూర్వం యోగాచార్యులు శ్వాసగతిని బట్టి ఎన్నేళ్లు బతుకుతావన్నది చెప్పేవారు. ఎక్కువ శ్వాస - తక్కువ ఆయుర్దాయం. తక్కువ శ్వాస - ఎక్కువ ఆయుర్దాయం...ఇదో కొలమానం. నిమిషానికి ముప్ఫైరెండుసార్లు శ్వాసించే కోతి మహా అయితే పదేళ్లు జీవిస్తుంది. నిమిషానికి నాలుగైదుసార్లు మాత్రమే శ్వాసించే తాబేలు నిక్షేపంగా వేయి నుంచి రెండువేల సంవత్సరాలు బతుకుతుంది.
శ్వాసగతికీ మానసిక స్థితికీ సంబంధం ఉంది. హాయిగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస తగ్గుతుంది. కోపంలో ఉన్నప్పుడూ అసహనంతో వూగిపోతున్నప్పుడూ శ్వాస పెరుగుతుంది. ఆధునిక జీవితంలో కోపతాపాలకు కొదవేం ఉంటుంది. శ్వాస పెరుగుతూపోతుంది, ఆయువు తరుగుతూ ఉంటుంది.
ఉరుకులూ పరుగులూ లేని రోజుల్లో...మనిషి నిమిషానికి పది నుంచి పన్నెండుసార్లు శ్వాసించేవాడని యోగాచార్యులు చెబుతారు. అదే నీ అసలు సిసలు శ్వాస. ఆ ప్రకారంగా నీ ఆయుర్దాయమూ నిండు నూరేళ్లు! ఒత్తిళ్లతో, అభద్రతలతో, అసంతృప్తులతో శ్వాస...నిమిషానికి ఇరవై దాటుతో ంది. అంటే, ఇప్పుడు నువ్వు శ్వాసిస్తున్న పద్ధతి కూడా నీది కాదు! మళ్లీ, శ్వాసను నియంత్రణలోకి తెచ్చుకోవాల్సిందే.
ఆ ప్రయత్నంలో సహకరించేదే...ప్రాణాయామం! ప్రాణం అంటే శ్వాస కాదు. ఆ శ్వాసను తీసుకునేట్టు చేసే ఓ నిగూఢ శక్తి. ఒక నిష్పత్తి ప్రకారం...ఒక నాసికా రంధ్రం ద్వారా తీసుకున్న గాలిని...కాసేపు బిగబట్టి...మరో నాసికా రంధ్రం నుంచి నిదానంగా వదిలి, కాసేపు శూన్యస్థితిని అనుభవించడమే (పూరక-కుంభక-రేచక-శూన్యక) ప్రాణాయామంలో జరిగే పని. ఆసనాలతో శరీరం మీద పట్టు సాధించినట్టే...ప్రాణాయామలో మన శ్వాస మీదా, ఆ శ్వాసలోని గాలి మీదా నియంత్రణ సాధిస్తాం. వూపిరితిత్తుల సామర్థ్యాన్ని నూటికి నూరుశాతం ఉపయోగించుకుంటాం. అప్పుడిక శ్వాస నీ అధీనంలోకి వచ్చినట్టే. నీ శ్వాస నీ చేతిలో ఉందంటే, శతాయుఃప్రమాణమూ నీదైపోతుంది.
యోగ చికిత్స!
శరీరం రోగాల పుట్టగా మారితే, మనసు కూడా భయాల కుప్పగానో బాధల భోషాణంలానో మారిపోతుంది. ఇక, వికాసం అసాధ్యం. అందుకే పతంజలి మహర్షి...శారీరక ఆరోగ్యానికి యోగాసనాల్ని అందించారు. ప్రతి ఆసనం పరిపూర్ణ ఆరోగ్యానికి సహకరించేదే అయినా, ప్రత్యేకించి ఏదో ఓ జాడ్యాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. వివిధ ఆరోగ్య సమస్యలకు యోగాచార్యులు.
రక్తపోటు సమస్యలు
ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లన్నీ కలసి ఆరోగ్యానికి శూలపుపోట్లు అవుతున్నాయి. అధికరక్తపోటు ఉన్నవాళ్లకి సుప్రభాత ఆసనాలూ, సూక్ష్మ వ్యాయామాలూ సూచిస్తారు. అల్పరక్తపోటు ఉన్నవాళ్లు...సూర్య నమస్కారాలూ, తాడాసనం, తిర్యక్‌ తాడాసనం, కటి చక్రాసనం సాధన చేయాలంటారు.
అలసట
పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోకపోవడం, కంటినిండా నిద్ర కరవు కావడం, వూబకాయం...మనిషిని ఇట్టే అలసిపోయేలా చేస్తాయి. భుజంగాసనం, శలభాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, సూర్యనమస్కారాలు...క్రమం తప్పకుండా చేస్తే శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. యోగనిద్ర అనేది ధ్యానం లాంటి ఓ ప్రత్యేక ప్రక్రియ. ఆసనాలతో పాటూ యోగనిద్రనూ సిఫార్సు చేస్తారు నిపుణులు.
వెన్నునొప్పి
శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, కూర్చునే పద్ధతిలో లోపాలూ, గంటలకొద్దీ కదలకుండా పనిచేయడం...తదితర జీవనశైలి లోపాలు మనిషిని వెన్నంటి వేధిస్తున్నాయి. తాడాసనం, తిర్యక్‌ తాడాసనం, కటి చక్రాసనం, భుజంగాసనం, శలభాసనం వెన్నునొప్పిని నియంత్రిస్తాయి.
ఎసిడిటీ
సకాలంలో తినకపోవడం, తిన్నా మితిమీరి తినడం, తినాల్సిన వాటిని తినకపోవడం, తినకూడని వాటితో పొట్ట నింపేసుకోవడం - ఇలా ఎసిడిటీకి అనేక కారణాలు. భోజనం తర్వాత ఓ పది నిమిషాలు వజ్రాసనం వేయడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎసిడిటీ మానసికమైన ఇబ్బందుల వల్లా రావచ్చు. ధ్యానంతో ఆ మనో రుగ్మతని నివారించుకోవచ్చు.
తలనొప్పి
ప్రపంచ ప్రజల్ని తలపట్టుకునేలా చేస్తున్న తీవ్ర సమస్య ఇది. తలనొప్పి కొంతమేర శారీరక సమస్య, కొంతమేర మానసిక సమస్యా. మిగతా ఆసనాలు వేస్తూనే శశాంకాసనం మీద మరింత దృష్టిపెట్టాలని అంటారు. ప్రాణాయామాన్ని జోడిస్తే మరీ మంచిది.
వూబకాయం
సకల రుగ్మతలకూ మూలపుటమ్మ ఇది. వూబకాయం ఉంటే, అధిక రక్తపోటు ఉన్నట్టే, గుండె జబ్బులకు ఆస్కారం ఉన్నట్టే, మధుమేహానికి దగ్గరవుతున్నట్టే. యోగా, ఆహార విధానంలో మార్పులూ, తగినంత వ్యాయామమూ, వైద్య పరమైన సూచనలూ...ఇలా బహుముఖ వ్యూహంతో ఆ రాకాసిని ఓడించేయాలి. వజ్రాసనం, ఉష్ట్రాసనం, గోముఖాసనం, అర్ధ మత్సే్యంద్రాసనం, మత్సా్యసనం వూబకాయాన్ని తరిమికొట్టడంలో సాయపడతాయి.
మధుమేహం
జీవితంలోని మాధుర్యాన్ని మింగేస్తున్న మహా చేదైన వ్యాధి. కొందరిలో అనువంశికంగా రావచ్చు, కొందరిలో జీవనశైలి లోపాలవల్లా, వూబకాయం వల్లా కూడా రావచ్చు. సూర్య నమస్కారాలు, తాడాసనం, తిర్యక్‌ తాడాసనం, కటి చక్రాసనం, యోగ ముద్రాసనం, గోముఖాసనం...మొదలైనవి సిఫార్సు చేస్తారు. ఆహార నియమాల్ని పాటిస్తూనే యోగ, ప్రాణాయామం చేయాలి.
పతంజలికి ప్రణామాలు...
యోగర్షి పతంజలి అందించిన యోగ సూత్రాలు మానవజాతికి వరాలు. పతంజలి ఎవరో, ఎక్కడివాడో, ఏ కాలంలో ఉన్నాడో కచ్చితంగా తెలియదు. ఆయన రచనల్ని బట్టి క్రీస్తుపూర్వం రెండు లేదా మూడో శతాబ్దానికి చెందినవాడై ఉంటాడని భావించాల్సి ఉంటుంది. మహారణ్యాల్లో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న రుషులు శరీర దారుఢ్యం కోసం అనేక ఆసనాల్ని రూపొందించుకున్నారు. వాటిని సేకరించి...యోగాకు ఓ శాస్త్రప్రతిపత్తిని కల్పించిన ఘనత పతంజలిదే. ఆయన దృష్టిలో యోగా వ్యాయామం కాదు...ఆధ్యాత్మిక జీవన శైలిలో ఓ భాగం. ఆయుర్వేదాన్నీ, వ్యాకరణాన్నీ సంకలనం చేసిన ఘనత కూడా పతంజలిదే అన్న వాదనా ఉంది. ‘యోగా ద్వారా మనసునూ, ఆయుర్వేదం ద్వారా శరీరాన్నీ, వ్యాకరణం ద్వారా భాషనూ శుద్ధి చేసిన పతంజలికి ప్రణామాలు’ అని భోజమార్తాండుడు అనే ప్రాచీన రచయిత తన గ్రంథంలో ప్రస్తావించడమే దీనికి కారణం. పురాణాల ప్రకారం...అత్రి మహర్షి, అనసూయల తనయుడు పతంజలి. ఆదిశేషుడి అవతారమని విశ్వసించేవారూ ఉన్నారు.

నీ మనసు..నీది కాదు! 
నువ్వు నిత్యానందుడివి. నీ సంతోషానికి కారణాలు అక్కర్లేదు. నువ్వు నవ్వాలంటే తాయిలాలు ఇవ్వక్కర్లేదు. అలాంటి వాడివి కాస్తా, అకారణ దుఃఖానికి అడ్రసుగా మారిపోయావు.
నువ్వు ప్రేమస్వరూపుడివి. పశుపక్ష్యాదులతో సహా సకల ప్రాణినీ ప్రేమిస్తావు. అదంతా మరచిపోయి...హోదాల్ని బట్టీ, ఆస్తిపాస్తుల్ని బట్టీ మర్యాదలివ్వడం మొదలుపెట్టావు.
నువ్వు ఏకాగ్రచిత్తుడివి. ఏం ఆలోచించాలో అదే ఆలోచిస్తావు. ఏ లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్యానికే గురిపెడతావు. ఆ ఘనత మసకబారిపోయింది. నీ చూపొకచోట, ఆలోచన ఒక చోట. కళ్లముందు కనిపించేదొకటి, బుర్రలో దోబూచులాడేది మరొకటి.

ఈ అస్థిరత్వానికి కారణం - మనసే!
నీ ఆలోచనల్ని ఇరుకిరుకుగా చేసిందీ, నీ బతుకును నూతిలోని కప్పగా మార్చిందీ నీ మనసే.
మనం మనసు చేతిలో మరబొమ్మలైపోయాం. ఆడించినట్టల్లా ఆడతాం. పాడించినట్టల్లా పాడతాం. అన్నీ ఉంటాయి. అయినా ఏమీ లేనంత వెలితి. అందరూ ఉంటారు. కానీ, ఒంటరిగా బతికేస్తున్న భావన. సెల్‌ఫోన్‌ కాంటాక్ట్‌లిస్టులో వందల నంబర్లు ఉంటాయి. మనసు విప్పి మాట్లాడుకుందామంటే ఒక్కరూ దొరకరు. అపార్ట్‌మెంట్‌ చుట్టూ ఇరవైనాలుగు గంటల భద్రత. మనసులో మాత్రం తెలియని అభద్రత. గుండెల్లో ఒకటి, మాట్లాడేది ఒకటి. బయటికి నవ్వుతాం, లోలోపల ఏడ్చేస్తాం. లోలోపల నవ్వుకుంటాం. బయటికి ఏడ్చేస్తాం. ఇరవై నాలుగు గంటలూ మొహానికి ఓ ముసుగంటూ ఉండాల్సిందే.
మనసు....చెదలుపట్టిపోయింది. 
బుద్ధి....బురదలో చిక్కుకుంది. 
ఆత్మ...అజ్ఞానపు పొరల మధ్య బందీ అయిపోయింది. 
పతంజలి అష్టాంగయోగంలోని...ఎనిమిది మెట్లూ మనోశక్తికి ఎనిమిది మార్గాలు. ‘యమ’ సంఘ జీవితం గురించి వివరిస్తుంది. నలుగురిలో ఎలా నడుచుకోవాలో బోధిస్తుంది. అందులో మళ్లీ ఐదు సూత్రాలు. అహింస- హింసకు దూరంగా ఉండటం, సత్యం- ధర్మమార్గంలోనే ప్రయాణించడం, అపరిగ్రహం- ఇతరుల సొమ్మును ఆశించకపోవడం, అస్తేయం- నాదీ అన్న సంకుచిత భావనను వదిలిపెట్టడం. బ్రహ్మచర్యం - బంధాల్లో నైతికతను పాటించడం, ఇక, ‘నియమం’ వ్యక్తి వికాసానికి దోహదపడే సూత్రాల సమాహారం. శౌచం (పరిశుభ్రత), సంతోషం (అంతర్‌ దృష్టి), తపస్సు (కర్తవ్యనిష్ట), స్వాధ్యాయం (ఆత్మవికాసం), ఈశ్వర ప్రణిధానం (నేను నిమిత్తమాత్రుడిని అన్న ఎరుక). మూడోది ‘ఆసనం’ - యోగాసనాలు. నాలుగోది ‘ప్రాణాయామం’ - ప్రాణశక్తి మీద నియంత్రణ. ఐదోది ‘ప్రత్యాహారం’ - మనసును ప్రాపంచిక విషయాలకు దూరంగా తీసుకెళ్లడం. ‘ధారణ’ - అలౌకిక భావనల్ని మనసుకు దగ్గర చేసుకోవడం.‘ధ్యానం’...అంతరాత్మతో జరిపే నిశ్శబ్ద సంభాషణ. ‘సమాధి’ - నేను అన్న భావన నుంచి, మనం అన్న మహాసముద్రంలో మిళితం కావడం. చాలు...ఈమాత్రం నియమాలు చాలు, తామరాకు మీద నీటి బిందువులా...జీవితంలో నెగ్గుకురావచ్చు. ఆ ప్రయత్నానికి అవసరమైన మనోశక్తినిస్తుంది ధ్యానం.
ధ్యానం...మనసుకు అభ్యంగన స్నానం. ధ్యానంలో ఏ ఆలోచననూ స్వీకరించం, ఏ ఆలోచననూ తొక్కిపెట్టం, కొత్త ఆలోచనల్ని ఆహ్వానించం, పాత ఆలోచనల్ని కొనసాగించం. వాటిని గమనిస్తూ ఉంటామంతే - సినిమా థియేటర్‌లో ప్రేక్షకుడిలా! పువ్వు మీద వాలిన సీతాకోక చిలుకలా, కాసేపటికి వాటంతట అవే ఎగిరిపోతాయి. ధ్యానంతో ఒంటబట్టే ఆ ఎరుక ...మహాశక్తిమంతమైంది.
యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలోని మానసికశాస్త్ర విభాగం...నెలలు నిండుతున్న గర్భిణులతో యోగా, ధ్యానం సాధన చేయించింది. ఆతర్వాత...పరిశీలిస్తే, మిగతావారి కంటే యోగా సాధన చేసిన మహిళల్లోనే ఒత్తిడి తక్కువగా కనిపించింది. సుఖప్రసవాలూ వారివే. యోగశక్తి ఎంత బలమైందంటే ధూమపానం, మత్తుమందు, మద్యం లాంటి వ్యసనాలకు బానిసైనవాళ్లను బయటికి తీసుకురావడంలో దీన్నో మార్గంగా ఎంచుకుంటున్నారు మానసిక నిపుణులు. అమెరికాలోని ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ ప్రతినిధులు మురికివాడల్లో నివసిస్తున్న సగటు విద్యార్థులతో క్రమం తప్పకుండా యోగా చేయించారు. మునుపటితో పోలిస్తే ఆ పిల్లల్లో ఏకాగ్రత పెరిగిందట, క్రమశిక్షణ కూడా మెరుగుపడిందట. మెదడుకు తనను తాను మార్చుకునే గుణం ఉంది. ధ్యానం ఆ సానుకూలమైన మార్పుకు సంబంధించిన సంకేతాల్ని మెదడుకు పంపుతుంది. కాబట్టే, ధ్యానాన్ని జీవితంలో ఓ భాగం చేసుకున్నవారిలో...సంక్షోభ సమయాల్లో కూడా డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించవు, ఆశావాదాన్ని అస్సలు వదిలిపెట్టరు.
యోగా, ప్రాణాయామం, ధ్యానం... 
దీర్ఘకాలంలో...సాధకుల మానసిక స్థితిలో, ఆలోచనల్లో సానుకూలమైన మార్పును తీసుకొచ్చినట్టు హార్వర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనాలు నిరూపించాయి. మునుపెన్నడూ లేనంత దయాగుణం కనిపించింది. అహంకారం అడుగంటింది. జయాపజయాల్ని సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞతనూ గుర్తించారు. ఇవన్నీ - కొత్తగా పుట్టుకొచ్చిన లక్షణాలేం కాదు. మునుపటి నుంచీ ఉన్నవే. కాకపోతే, పరిస్థితులూ పరిసరాల కారణంగా మరుగునపడిపోయాయి. ఆ సహజ ప్రవృత్తిని యోగా తట్టిలేపింది. 
ఆ స్థాయికి కనుక చేరుకోగలిగితే... 
మీరు ... 
అచ్చమైన మీరే! 
స్వచ్ఛమైన మీరే!

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list