నాన్న మనసు
ఒక లాలన, ఒక దీవెన కలగలిస్తే- అవి అమ్మ, నాన్న అవుతాయి! వాటిలో మొదటిది తేటతెల్లం. రెండోది గుంభనం. అమ్మది గారం. నాన్నది గాంభీర్యం. గారానికి వైశాల్యం సహజ లక్షణం. గాంభీర్యానికి లోతెక్కువ కనుకనే, అమ్మదనం విస్పష్టంగా గోచరిస్తుంది. బాహాటంగా వెల్లడి అవుతుంది. నాన్నరికం అంతర్వాహినిగా సాగిపోతుంటుంది. అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
నిజానికి నాన్నంటే ముగ్గురమ్మల గారాబు ముద్దుబిడ్డ. మొదటి అమ్మ- తన కన్నతల్లి. రెండో అమ్మ- తోడబుట్టిన సోదరి. మూడోది- తన కడుపున పుట్టిన కూతురు. వారు ముగ్గురూ నాన్నను లాలిస్తారు, సాధిస్తారు, శాసిస్తారు! వారిని నాన్న ప్రేమిస్తాడు. వారి ముందు పసివాడవుతాడు. లోకంలో ఎక్కువమంది నాన్నలు ఆ ముగ్గురికీ ఒదిగే ఉంటారు. అలాంటి నాన్నకే, ఆడది అమ్మగా తోస్తుంది. అమ్మ అంటే ఏమిటో బాగా తెలుస్తుంది. అలా తెలిసిన నాన్నల దగ్గర అమ్మలు ఆనందంగా ఉంటారు. వారి పిల్లలు అదృష్టవంతులవుతారు.
కొడుకు దగ్గరకొచ్చేసరికి, నాన్న గొడుగుగా మారిపోతాడు. అన్నివేళలా నీడగా నిలుస్తాడు, తోడుగా నడుస్తాడు, మార్గమై పిలుస్తాడు, మనిషిగా మలుస్తాడు. హితుడిగా, స్నేహితుడిగా కుమారుణ్ని కాస్తాడు.
ప్రాచీన జానపద గాథల్లో ఒక ఉదంతం- తండ్రీ తనయుల అనుబంధం గురించి అద్భుతంగా చెబుతుంది. మహాయోధుడని పేరు గడించిన కొడుకు వద్దకు తండ్రి వెళ్తాడు. ప్రేమగా అతణ్ని దగ్గరకు తీసుకుని చిరునవ్వుతో- ప్రపంచంలో అందరికన్నా శక్తిమంతుడెవరని ప్రశ్నిస్తాడు. దానికి అతడు ‘ప్రస్తుతానికి నేనే’ అని బదులిస్తాడు. తండ్రి మొహంలో ఒకింత నిరాశ తొంగి చూస్తుంది. ‘మా నాన్న’ అనే సమాధానాన్ని ఆశించిన కారణంగా జనించిన అసంతృప్తి అది! తల వాల్చుకుని తండ్రి నిర్లిప్తంగా వెనుతిరగ్గానే కొడుకు మళ్ళీ ‘ఇప్పుడు కాదు’ అంటాడు. తనను ఓదార్చడానికి ఆ మాట అన్నాడేమోనని అతడి కళ్ళలోకి ఆయన చూస్తాడు.
‘ఈ ప్రపంచంలో అందరికన్నా మహాశక్తిశాలి అయిన మా నాన్న నా భుజం చుట్టూ చేతులు వేసినప్పుడల్లా- నాకీ భూమండలాన్నంతటినీ గెలిచేంత ధైర్యం వస్తుంది. ఆ ప్రశ్న వేసినప్పుడు, నువ్వు నా చుట్టూ చేతులు వేసి ఉన్నావు నాన్నా! అందుకే నా నోట ఆ మాట వచ్చింది. నిజానికి నువ్వే కదా నా బలం!’ అంటాడు కొడుకు.
నాన్నలు అయ్యేదాకా ఆ బలం ఎంతటిదో తెలుసుకోలేకపోవడం, చాలామంది విషయంలో నగ్నసత్యం. ఆయన అంటే ఏమిటో తెలిసేలోపు, వారు నాన్న పాత్రలోకి ప్రవేశించడం నాన్నల దురదృష్టం! అప్పటికే తండ్రితనం తలకెక్కుతుంది. కొత్త మోజు బలపడుతుంది. కొడుకు పాత్ర పాతవాసన కొడుతుంది. ప్రాధాన్యక్రమంలో నాన్న రెండో వరసలోకి జారిపోతాడు. చాలామందికి ఈ దశలో నాన్న బరువుగా మారతాడు. బలం కాస్తా బాధ్యత అవుతుంది. మమకారం పలచనవుతుంది. నాన్నలో ఆశాభంగం మొదలవుతుంది. దూరం పెరుగుతూ వస్తుంది. వెలితిగా అనిపిస్తుంది. నాన్న ఒంటరివాడవుతాడు.
జీవితంలో అనివార్యమైన ఆ వెలితిని పూడ్చుకోవడానికే చాలామంది నాన్నలు మనవలకు దగ్గరవుతారు. వాళ్ళలో కొడుకుల్ని చూసుకుంటారు. తృప్తిపడతారు. నాన్న పాత్ర అటుపై తాతగా తర్జుమా అవుతుంది. తాను తాత కాకుంటే తనకు వృద్ధాశ్రమమే గతి అవుతుందన్న భయం పీడిస్తుంది. మనవడితో కాలం గడుస్తుంది, ఆపద గట్టెక్కుతుంది. ఆ మేరకు నాన్నలు భాగ్యవంతులనే చెప్పాలి.
మరికొందరి నాన్నల విషయంలో అదృష్టం వెక్కిరిస్తుంది. ‘అమ్మలు దేనికైనా ‘పని’కొస్తారు’ అని కొడుకులు అనుకుంటే- ఆ కాస్త నీడా ఆవిరవుతుంది, తోడు జారిపోతుంది. పండుటాకులాంటి నాన్నకు చెట్టంత కొడుకు ఆధారం కాకపోగా- చిటారు కొమ్మలాంటి బలహీనమైన అమ్మ అండ, ఆసరా రెండూ దూరమవుతాయి. వూరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నాన్నల పాత్ర, జీవన యాత్ర ముగింపుకొస్తాయి. ‘నాన్నా! మీరు ఎప్పటికీ నాన్నే కాబట్టి మమ్మల్ని క్షమించండి’ అని మనసున్న కొడుకు గుండె వెక్కివెక్కి ఏడుస్తుంది.
ఎంతకాదన్నా, ఈ విషయంలో కొంతలో కొంత అమ్మలే అదృష్టవంతులు! - ఎర్రాప్రగడ రామకృష్ణ
నాన్న తోడుంటే -ఏదైనా సాధించవచ్చు
పిల్లల్ని పెంచడంలో తల్లి పాత్రని ఎవ్వరూ కాదనలేరు. కానీ బిడ్డల మీద తండ్రి ప్రభావం కూడా అసాధారణమే అంటున్నారు పరిశోధకులు. ఈ మధ్యకాలంలో వెలుగుచూసిన కొన్ని పరిశోధనల తండ్రి కేవలం తెరచాటు మనిషి మాత్రమే కాదనీ... పిల్లలు ఎదిగేందుకు అతని తోడ్పాటు చాలా అవసరమనీ తేల్చి చెబుతున్నాయి. వాటిలో కొన్ని...
తండ్రిలానే ఉంటాము
పిల్లవాడు పుట్టగానే అతనిది తల్లి పోలికా తండ్రి పోలికా అని బేరీజు వేస్తుంటారు. ఎదిగేకొద్దీ తండ్రి బుద్ధులు వచ్చాయా, తల్లి అందం వచ్చిందా అని తరచి చూసుకుంటారు. నిజానికి పిల్లవాడికి తల్లీ, తండ్రీ ఇద్దరి నుంచీ సమానమైన లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. పైగా మన కణాలకు జీవాన్నిచ్చే ‘మైటోకాండ్రియా’ కేవలం తల్లి నుంచే పిల్లలకు వస్తుంది. కానీ ఈ మధ్య జరిగిన ఓ పరిశోధనలో తండ్రి జన్యువులే పిల్లవాడి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయని తేలింది. తండ్రి నుంచి పిల్లవాడికి సంక్రమించిన genetic mutations మరింత బలంగా ఉంటాయట. కాబట్టి వంశపారంపర్యమైన వ్యాధులు వచ్చినా, మంచి రోగనిరోధకశక్తి ఉన్నా... తండ్రిదే కీలకపాత్ర కావచ్చు.
తండ్రి ప్రేమకి మంచి మార్కులు
టీనేజి పిల్లలకి చదువు మీద ధ్యాస అంతగా ఉండదు. అసలే పరిపరివిధాలా పోతున్న మనసుకి ఆర్థిక సమస్యలు కూడా తోడైతే ఇక చెప్పేదేమంది. చదువు కాస్తా చెట్టెక్కి తీరుతుంది. కానీ తండ్రి కనుక వీరికి అండగా నిలిస్తే... ఎలాంటి సమస్యనైనా దాటుకుని చదువులో ముందుండి తీరతారట. అయితే ఈ ప్రభావం ఆడపిల్లల మీద ఒకలా మగపిల్లల మీద ఒకలా ఉండటం గమనార్హం! తండ్రి నుంచి అందే ప్రేమతో ఆడపిల్లలు లెక్కలలో బాగా రాణిస్తే, ఆయన నుంచి వచ్చే ఆత్మవిశ్వాసంతో మగపిల్లలు ఇంగ్లిష్లో మంచి మార్కులు సాధించడాన్ని గమనించారు.
తండ్రి పక్కనుంటే డిప్రెషన్ దూరం
చక్కగా చూసుకునే నాన్న పక్కన ఉంటే, పిల్లవాడికి ఎలాంటి ఢోకా ఉండదంటున్నారు స్వీడన్కు చెందిన పరిశోధకులు. దాదాపు 20 ఏళ్లపాటు శోధించి తేల్చిన విషయం ఇది. ప్రేమతో మెలిగే తండ్రి ఉన్న మగపిల్లలు లేనిపోని గొడవల జోలికీ, చెడు వ్యసనాల జోలికీ పోకుండా ఉంటారట. ఇక ఆడపిల్లలేమో మానసిక సమస్యలకి దూరంగా నిబ్బంగా జీవించగలుగుతారట. వంద కాదు వెయ్యి కాదు... దాదాపు ఇరవైవేల మంది పిల్లలను పరిశీలించిన తర్వాత తేల్చిన విషయమిది!
తండ్రి ద్వేషం
పిల్లల్ని తండ్రి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. పిల్లల్ని దగ్గరకు తీస్తే ఎక్కడ పాడైపోతారో అని చాలామంది తండ్రులు, పిల్లలని దూరం పెడుతుంటారు. కారణం ఏదైనా కానీయండి... తల్లికంటే కూడా తండ్రి నుంచి వచ్చే వ్యతిరేకతే పిల్లల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందట. ఆ ప్రభావం వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. దాదాపు పదివేల మంది మీద జరిగిన 36 పరిశోధనల సారాంశమిది! మరెందుకాలస్యం. భేషజాలను పక్కన పెడదాం! తండ్రి కూడా తల్లితో సమానంగా పిల్లలకి ప్రేమ పంచగలడని నిరూపిద్దాం. హ్యాపీ ఫాదర్స్ డే!
కృష్ణునికి తగ్గ కొడుకు - ప్రద్యుమ్నుడు!
కృష్ణభగవానుడి గొప్పతనం గురించి చెప్పుకొనేదేముంది. బాల్యంలో అల్లరి చేసిన యశోదాకృష్ణుని మొదలుకొని... జీవితసారాన్ని తేల్చిచెప్పిన గీతాకృష్ణుని వరకూ ఆయనలోని ప్రతి అడుగూ హిందువులకు పూజనీయమే! కృష్ణుని అన్ని పాత్రలలోనూ చూసిన మనకి తండ్రిగా ఆయన గురించి తెలిసింది తక్కువే! కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుని గురించి తెలుసుకుంటే... ఆ లోటూ తీరిపోతుంది.
మన్మథుని పునర్జన్మ
కృష్ణునికి చాలామంది కుమారులే ఉన్నారు. కానీ వారిలో ప్రద్యుమ్నుడు ముఖ్యుడు. ఒకనాడు శివుని తపస్సుని భంగం చేయబోయి ఆయన కోపానికి భస్మమైన మన్మథుని కథ తెలిసిందే! లోకకళ్యాణం కోసం ప్రయత్నించి భస్మమైపోయిన తన భర్తని చూసి రతీదేవి గుండె పగిలిపోయింది. తన భర్తని ఎలాగైనా తిరిగి జీవింపచేయమంటూ పరమేశ్వరుని వేడుకుంది. అప్పటికే కోపం చల్లారిన ఈశ్వరుడు, ఆమె భర్త శ్రీకృష్ణుని ఇంట పుడతాడంటూ వరమిస్తారు. అలా శ్రీకృష్ణునికీ, రుక్మిణికీ ప్రద్యుమ్నుని రూపంలో జన్మిస్తాడు మన్మథుడు.
శంభరాసురుని వధ
ప్రద్యుమ్నుడు భూలోకంలో జన్మించే సమయంలో శంభరాసురుడు అనే రాక్షసుడు ప్రజలను పీడించసాగాడు. ఆయనకు ప్రద్యుమ్నుని చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావు లేదన్న వరం ఒకటి ఉంది. దాంతో చిన్నప్పుడే ప్రద్యుమ్నుని వధించి తనకి శత్రుశేషం లేకుండా చూసుకోవాలనుకున్నాడు శంభరాసురుడు. పొత్తిళ్లలో ఉండగానే ప్రద్యుమ్నుని ఎత్తుకుపోయి సముద్రంలో పడేస్తాడు.
సముద్రంలో పడిన ప్రద్యుమ్నుని ఒక చేప మింగుతుంది. విధివశాత్తూ ఆ చేప శంభరాసురుని రాజ్యంలోని జాలర్లకే చిక్కుతుంది. ఆ భారీ చేపను చూసిన జాలర్లు దానిని శంభరాసురునికి బహుమతిగా అందిస్తారు. ఆయన వంటవారు దానిని కోసిచూస్తే ఏముంది! చేప పొట్టలో అందమైన బాలుడు కనిపిస్తాడు. రాజాస్థానంలోని ఒక యువతి ఆ బాలుని పెంచి పెద్దచేస్తుంది. ఎలా పెరిగినా, ఎక్కడ పెరిగినా ప్రద్యుమ్నుడు యోధునిలాగే ఎదిగాడు. ఒకనాడు శంభరాసురుని రాజ్యానికి వచ్చిన నారదుని ద్వారా తన అసలు తండ్రి ఎవరన్న విషయాన్ని తెలుసుకుంటాడు ప్రద్యుమ్నుడు. తనని చంపతలపెట్టిన శంభరాసురుని మీద పగతీర్చుకునేందుకు బయల్దేరాడు. శంభరాసురునికీ, ప్రద్యుమ్నుడికీ మధ్య జరిగిన భీకర పోరులో ఆ లోకకంటకుడు మరణించాడు.
ద్వారకకు చేరి
శంభరాసురుని వధ తర్వాత ప్రద్యుమ్నుడు తన తండ్రిని వెతుక్కుంటూ ద్వారకకు చేరుకున్నాడు. రాజ్యంలోకి అడుగుపెట్టగానే కృష్ణుని పోలిన ఆ యువకుడిని చూసి జనమంతా గుమికూడారు. ఆపై అతను చెప్పిన వివరాలు తెలుసుకున్న రుక్మిణీదేవి... తన పొత్తిళ్లలోంచి కనపడకుండా పోయిన బిడ్డ అతనే అని తెలుసుకుంది. మొత్తానికి ప్రద్యుమ్నుని రాకతో కథ కొంతవరకూ సుఖాంతమయ్యింది. అసలే గొప్ప వీరుడైన ప్రద్యుమ్నుడు, శ్రీకృష్ణుని తర్ఫీదులో మరింత రాటుదేలాడు. తండ్రికి తగ్గ తనయుడన్న పేరు తెచ్చుకొన్నాడు.
నికుంభుని వధ
తండ్రికి తోడుగా ప్రద్యుమ్నుడు, కొడుకుని గమనించుకుంటూ కృష్ణుడు ఉండేవారు. అలా వారిద్దరూ కలిసి ఒక రాక్షసునే ఎదుర్కొన్న సందర్భం కూడా ఉంది. నికుంభుడనే రాక్షసుడు పరమశివభక్తుడు. దేవుని చేతిలో కానీ, దేవతల చేతిలో కానీ, దానవుల చేతిలో కానీ తనకు చావు ఉండకూడదనే వరాన్ని పొందినవాడు. మానవులు తననేమీ చేయలేరన్న అహంతో వారి నుంచి చావు రాకూడదన్న వరాన్ని మాత్రం కోరుకోలేదు నికుంభుడు. అదే అతని పాలిట శాపంగా మారింది. మానవ జన్మనెత్తిన శ్రీకృష్ణుని చేతిలో అతని చావు మూడింది. భానుమతి అనే యాదవ రాకుమార్తెని ఎత్తుకుపోయే ప్రయత్నంలో నికుంభుడు కృష్ణుని ఎదుర్కొంటాడు. ఒకవైపు కృష్ణుడు, మరోవైపు ప్రద్యుమ్నుడు ఆ రాక్షసుని ఎదిరించి అతన్ని తుదుముట్టిస్తారు.
తండ్రిని నొప్పించకుండా
కురుక్షేత్ర సంగ్రామంలో యాదవులంతా కౌరవులవైపు, కృష్ణుడు మాత్రం పాండవుల పక్షాన నిలిచిన విషయం తెలసిందే! కానీ ప్రద్యుమ్నుడు మాత్రం తండ్రికి వ్యతిరేకమైన పక్షంలో ఉండేందుకు ఇష్టపడలేదు. కురుక్షేత్ర సంగ్రామానికి దూరంగానే ఉన్నాడు. ప్రద్యుమ్నుని శ్రీకృష్ణుని అంశగా భావిస్తారు. పైగా వైష్ణవాస్త్రం అనే అద్భుతమైన అస్త్రం కలిగినవాడు. అలాంటి ప్రద్యుమ్నుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఉంటే పోరు ఇంకెంత రసరవత్తంగా ఉండేదో!
ప్రద్యుమ్నుడు తన మేనమామ కూతురైన రుక్మావతిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ పుట్టిన అనిరుద్ధుడు కూడా అసమాన్యునిగా పేరుగాంచాడు. ఇంతలో యాదవులంతా కొట్టుకుని చస్తారనే మునుల శాపం నిజమైంది. ఆ కొట్లాను ఆపే ప్రయత్నంలో ప్రద్యుమ్నుడు కూడా మరణిస్తాడు. చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతూ సాగిన అతని కథ అలా అంతమవుతుంది. కానీ తండ్రికి తగ్గ తనయుడన్న పేరు మాత్రం నిలిచిపోయింది.

No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565