MohanPublications Print Books Online store clik Here Devullu.com

పుడమి తల్లికి ప్రణామాలు_Goddess_Bhumi_Devi

పుడమి తల్లికి ప్రణామాలు Goddess Bhumi Devi bhoodevi bhumatha bhoomatha bhudevi goddess earth prithvi goddess prithvi bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu


పుడమి తల్లికి ప్రణామాలుపంచభూతాలలో పృధివికి మాత్రమే దైవత్వం, మాతృత్వం రెండూ ఆపాదించారు శాస్త్రకారులు. అగ్ని దేవుడు, వాయు దేవుడు, వరుణ దేవుడు, ఆకాశరాజు అంటాం... ఒక్క పృధివిని మాత్రమే భూమాత అంటాం. భూదేవి లాంటి విశేషణాలు మిగతా భూతాలకు లేవు. అందుకే ఆమెకు నిత్యం గౌరవంగా వందనాలు సమర్పించాలి. ఉదయాన్నే నిద్ర లేస్తూనే మన పాదాలను భూమి మీద మోపుతూ, ‘అమ్మా! మేం నీ గుండెల మీద నడుస్తున్నాం. మా పాదాలతో నిన్ను బాధిస్తున్నాం. మమ్ము క్షమించు తల్లీ’’ అని ప్రార్థిస్తాం. మహోత్కృష్టమైన భూమి గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు పురాణాలలో గోచరిస్తాయి.

ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, పునరుత్పత్తి... ఇది సృష్టిక్రమం అని వేదాలు చెబుతున్నాయి. ఓషధులకు భూమి ప్రధానమైనది. ‘భూమి’ శబ్దానికి అన్నిటినీ భరించగలిగేది అని ఒక అర్థం ఉంది. అచల, అనంత... ఒక్కో కారణంగా ఒక్కో పేరు వచ్చింది. భూమి తాను కదులుతున్నప్పటికీ భూమి మీద నివసించే ప్రాణులు, ఇతర వస్తువులను నిశ్చలంగా ఉంచే శక్తి కలిగి ఉంది. అంటే కంపం లేకుండా ఉంచుతుందన్నమాట. అందుకే భూమాతను అచల అంటారు.

ఎంత బరువువైనా భరించగల శక్తి భూమికి మాత్రమే ఉంది. సహనానికి మారుపేరు పుడమి. పిల్లలను కనిపెంచడానికి తల్లిదండ్రులకున్నంత సహనం భూమాతకు ఉంది. అంత సహనం కలిగిన భూమాత తన కుమారుడి వల్ల ప్రజలకు చేటు జరుగుతోందని గ్రహించి, తన కుమారుడని కూడా చూడకుండా, నరకాసురుడిని సంహరించింది.

మాతృత్వం...
పంచభూతాలలో భూమికి మాత్రమే దైవత్వం, మాతృత్వం అనే రెండు లక్షణాలు ఉన్నాయి. వేదాలు మాతృదేవోభవ అని చెప్పిన వాక్యం భూమికి సైతం వర్తిస్తుందని పండితులు చెబుతున్నారు. భూమిని దైవంగా భావించి గౌరవించాలి. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి ఆ తల్లిని బయటకు తీసి, భూభారాన్ని ఆయన స్వయంగా మోశాడు. భరించే వాడు భర్త కనుక, భూదేవికి విష్ణుమూర్తి భర్త అయ్యాడు.

అనేక నామాలు...
భూమి, భూదేవి, భూమా దేవి, భూమి దేవి, వసుంధర, వసుధ, వైష్ణవి, కాశ్యపి, ఉర్వి, హిరణ్యం, వసుమతి... ఈ పదాలతో నేలతల్లిని పిలుస్తాం. విష్ణుమూర్తి అవతారమైన వరాహావతారంలో వరాహుని భార్య భూమి. లక్ష్మీదేవి రెండు అంశలలో భూదేవి ఒక అంశ. ఆమె నిరంతరం నారాయణునితోనే దర్శనమిస్తుంది. కశ్యప ప్రజాపతి కుమార్తె భూదేవి. అందుకే కాశ్యపి అని పేరు.

వీరంతా భూగర్భ ఉద్భవులే...
భూమాత అనేకమంది దేవతామూర్తులకు జన్మనిచ్చింది. సీతలాగే పద్మావతీదేవి కూడా ఆకాశరాజు పొలం దున్నుతుండగా దొరుకుతుంది. ఆండాళ్‌ కూడా పెరియాళ్వార్‌ నాటిన తులసి చెట్టు కింద దొరుకుతుంది.

పంచభూతాలలో మొట్టమొదటగా నమస్కరించేది భూమాతనే. పృథివ్యాపస్తేజో వాయురాకాశః... అని పంచభూతాలను వరుసక్రమంలో చెబుతాం. దేవునికి అర్చించే పుష్పాల జన్మస్థానం భూమి. కుసుమాలు భూమి నుండి ఉద్భవిస్తున్నప్పుడే వాటికి సువాసన సమకూరుతుంది. అంటే భూమి విత్తనంతో సమ్మేళనం చెందుతున్నప్పుడే ఈ ఘుమఘుమలు సమకూరతాయి. ఈ కారణంగానే భూమిని ‘గంధవతీ పృథివీ’ అంటారు. అటువంటి భూమిని సంక్షోభానికి, తాపానికి గురి చేయకుండా ఉండటం ఆమె బిడ్డలుగా మనందరి బాధ్యత.

రూపవిలాసం... భూదేవి చతుర్భుజి. ఒక చేతిలో దానిమ్మ, ఒక చేతిలో జలపాత్ర, ఒక చేతిలో మూలికలతో నిండిన పాత్ర, మరో చేతిలో కూరలతో దర్శనమిస్తుంది. రెండు చేతులలో కుడిచేతిలో నీలోత్పలం (కుముదం లేదా ఉత్పలం, రేకలువ), ఎడమ హస్తం అభయముద్రతోను సాక్షాత్కరిస్తుంది.

అభయహస్తాన్నే లోలహస్త ముద్ర అని కూడా అంటారు. పృథివికి ఆఘ్రాణ శక్తి ఉంది. అందుకే పృథివిని నాసిక భాగంతో పోలుస్తారు. హస్తంలో పృథివిని ఉంగరం వేలుగా గణిస్తారు. పృధ్విని కేంద్ర స్థానంగాను, నిశ్చలత్వానికి ప్రతీకగాను శాస్త్రం చెబుతోంది. పృధ్వితో జలం కలిస్తే తియ్యటి రుచి ఏర్పడుతుంది. పృథివితో అగ్ని కలిస్తే చేదు రుచి ఉద్భవిస్తుంది.

– డా. పురాణపండ వైజయంతి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం