MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఎండ గండం గట్టెక్కేద్దాం_Summer Season


ఎండ గండం గట్టెక్కేద్దాం Summer Season summer sunny day hot weather hot and humid climate humid climate hot season in india bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu


ఎండ గండం గట్టెక్కేద్దాం

ఒంట్లో నీళ్లతోపాటు ఓపికనూ పీల్చేసే వేసవి కాలం ఇది. ఠారెత్తించే ఎండ, భరించలేని ఉక్కపోత, తట్టుకోలేనంత వడగాడ్పులు. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి? వేసవి వేడిమి నుంచి ఎలా తప్పించుకోవాలి?

కాఫీలు, పానీయాలు
వేసవి తాపం తీర్చేవి కచ్చితంగా నీళ్లే! నీళ్లకు మించిన ప్రాణధారం మరొకటి లేదు. అయితే చల్లగా, తీయగా ఉండి తాగాలనిపించే శీతల పానీయాలను ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ వీటిని తాగడం వల్ల దాహార్తి తీరకపోగా మరింత పెరుగుతుంది. వీటిలో ఉండే రసాయనాలు, చక్కెరలు ఎండదెబ్బకు గురయ్యే అవకాశాలను పెంచుతాయి. ఎనర్జీ డ్రింకులూ అలాంటివే! తక్షణ శక్తిని ఇచ్చే ఎనర్జీ డ్రింకుల వల్ల హానికారక రసాయనాలు శరీరంలో చేరి ఎండ నుంచి తట్టుకోగలిగే శక్తిని కుంటుపరుస్తాయి. కాబట్టి ఎనర్జీ, కూల్‌ డ్రింకులకు బదులుగా సురక్షితమైన పానీయాలనే ఎంచుకోవాలి. తాజా కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, మజ్జిగ, లస్సీ, పళ్ల రసాలు, నిమ్మ రసం మేలైనవి. అయితే ఏ పానీయం తాగినా వాటిలో ఐసు ముక్కలు కలుపుకోకూడదు. అలాగే ఫ్రిజ్‌లో విపరీతంగా చల్లబరిచి తాగకూడదు. కెఫీన్‌ ఉత్ర్పేరకం. కాబట్టి వేసవి కాలంలో కెఫీన్‌ కలిగి ఉండే కాఫీలను తగ్గించాలి. లేదంటే శరీరంలో వేడి పెరిగి ఎండ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

పిల్లలు, వృద్ధులు.. జాగ్రత్త!
పిల్లలు, వృద్ధులు... వీళ్లిద్దరూ దాహం వేస్తుందనే విషయాన్ని వ్యక్తపరచలేరు. తమకు తాముగా గ్రహించలేరు. కాబట్టి వాళ్లు అడిగినా, అడగకపోయినా తరచుగా నీళ్లు తాగిస్తూ ఉండాలి. నీళ్లు తాగడానికి ఇష్టపడకపోతే పళ్ల రసాలు, గ్లూకోజు నీళ్లు, మజ్జిగ ఇస్తూ ఉండాలి. పిల్లలు, వృద్ధులు వాతావరణ మార్పులకు త్వరగా అడ్జస్ట్‌ కాలేరు. వీళ్లలో రోగనిరోధకశక్తి, శరీర సామర్థ్యాలు తక్కువ. కాబట్టి పగటి వేళ బయటకు పంపకూడదు. తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను అందిస్తూ నీడ పట్టునే ఉంచాలి. సాయంత్రం 5 గంటల తర్వాత పిల్లలను ఆటలకు బయటకు పంపవచ్చు. ఎండదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇంట్లో చల్లదనం ఉండేలా చూసకోవాలి. ఇందుకోసం ఎ.సి, కూలర్లు వాడొచ్చు. ఇవి లేకపోయినా కిటికీలకు దుప్పట్టు, వట్టి వేళ్ల చాపలు కట్టుకోవచ్చు. పడుకునే గదిలో నీళ్లు నింపిన వెడల్పాటి టబ్బులు ఉంచి ఫ్యాన్‌ వేసినా గది చల్లబడుతుంది.

వేడి చేస్తుందా?
ఎండాకాలంలో ప్రత్యేకంగా చలువ పదార్థాలే తినాలని అంటూ ఉంటారు. నిల్వ పచ్చళ్లు, ఉప్పు, కారాలు, మసాలాలు తింటే వేడి చేస్తుందని అనుకుంటాం! విరేచనాలు అయినా, శగ గడ్డలు ఏర్పడినా మామిడి పళ్లు తిన్నాం కదా! వేడి చేసింది అనుకుంటారు. ఇలా వేడి చేయటాన్ని కొన్ని పదార్థాలతో ముడి పెడుతూ ఉంటాం! కానీ ఇది నిజం కాదు. వేడి చేయటానికి, శరీర ఉష్ణోగ్రత పెరగటానికి సంబంధం లేదు. అలాగే శరీర ఉష్ణోగ్రత పెరిగి జ్వరం వచ్చినా దాన్ని వేడి చేసిందనడం సరి కాదు. శరీర ఉష్ణోగ్రతను పెంచే ఎలాంటి ఆహారాన్నైనా పరిమితంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు.
ప్రతి ఏడాదీ వచ్చే వేసవే! అయినా ఈ కాలమొచ్చిందంటే గుండెల్లో దడ మొదలవుతుంది. పగటిపూట అడుగు బయట పెడితే ఎండదెబ్బ తగులుతుందేమోననే భయం! ఒక పక్క ఉక్కపోత, మరోపక్క వేసవి తెచ్చే చెమట, దాని వెంటే చెమట పొక్కుల బాధ! ఇలా ఒకటా, రెండా? వేసవి వెతలు మాటల్లో చెప్పలేనన్ని! అయితే కొన్ని జాగ్రత్తలు, అప్రమత్తతలు పాటిస్తే వేసవి కాలాన్ని సునాయాసంగా దాటేయొచ్చు!

ఈ సమయాల్లో జాగ్రత్త!
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో సూర్య కిరణాలు నేరుగా భూమి మీద పడతాయి. కాబట్టి ఆ సమయాల్లో ఎండలోకి వెళ్లకపోవడం మంచిది. ఈ సమయంలో కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి ఎండకు గురవడం మూలంగా శరీర ఉష్ణోగ్రత త్వరితంగా పెరిగిపోతే ఎండదెబ్బకు గురవుతాం! కొన్ని సందర్భాల్లో శరీర వేడి 104 నుంచి 106 డిగ్రీల వరకూ పెరిగిపోతుంది.

ఇలాంటి దుస్తులు మేలు!

చెమటను పీల్చుకునే వదులైన నూలు దుస్తులు వేసుకోవాలి. అలాగే అవి తేలిక రంగువై ఉండాలి. రాత్రివేళ లోదుస్తులు ధరించకుండా ఉండడమే మేలు! బిగుతుగా ఉండే జీన్స్‌, ఒంటికి అతుక్కుపోయే దుస్తులు, మందపాటి జాకెట్లు ఈ కాలంలో మానేయాలి. రేయాన్‌, సిల్క్‌, ఊలు, షిఫాన్‌, శాటిన్‌ దుస్తులు ఈ కాలంలో పూర్తిగా మానేయాలి.

సన్‌ ట్యాన్‌ రాకుండా!
ఎండకు గురయ్యే ముఖం, మెడ భాగం, ముంజేతులు సన్‌ ట్యాన్‌కు గురవుతూ ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఎండలోకి వెళ్లినా వెళ్లకపోయినా సన్‌స్ర్కీన్‌ లోషన్‌ అప్లై చేస్తూ ఉండాలి. ఎస్‌పిఎఫ్‌ 15 పైబడి ఉండే సన్‌స్ర్కీన్‌ లోషన్లు వాడడం మేలు. అలాగే ఎండలోకి వెళ్లే 15 నిమిషాల ముందు లోషన్‌ అప్లై చేసుకోవాలి. ఎండలో ఉన్నంతసేపు ప్రతి అరగంటకోసారి ఈ లోషన్‌ అప్లై చేస్తూ ఉండాలి.

ఎలాంటి చలువ అద్దాలు?
సూర్య కిరణాలు కంట్లో పడకుండా చూసుకోగలిగితే చాలు! ఇందుకోసం గొడుగు, హ్యాట్‌ వాడినా సరిపోతుంది. అయితే సూర్యకిరణాలతోపాటు వేడి గాలుల నుంచి రక్షణ కల్పించాలి అనుకుంటే ముదురు రంగు చలువ కళ్లద్దాలు వాడాలి! వీటిలో ఖరీదైనవే మంచివి అనుకుంటే పొరపాటు. చవక అద్దాలు ఖరీదైనవాటితో సమానమైన రక్షణనే కల్పిస్తాయి. నల్ల గొడుగులకు బదులుగా తేలిక రంగుల్లో గొడుగులు వాడడం మేలు!

డీ హైడ్రేషన్‌ రాకుండా!
వేసవిలో శరీరంలోని నీరు చెమట రూపంలో వెళ్లిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ నీటిని భర్తీ చేసే పదార్థాలే ఎక్కువగా తింటూ ఉండాలి. లేదంటే డీ హైడ్రేషన్‌ తప్పదు. ఈ సమస్యతో ఎండదెబ్బకు గురవకుండా ఉండాలంటే... నీరుండే కూరగాయలైన అనపకాయ, బీరకాయ, పొట్లకాయ, టమాటా, క్యాబేజీ, దోసకాయ తినాలి. అలాగే పుచ్చకాయ, ద్రాక్ష, తర్బూజా లాంటి నీరుండే పళ్లు తినాలి. దాహంతో సంబంధం లేకుండా గంట గంటకూ నీళ్లు తాగుతూనే ఉండాలి. దాహం వేస్తుందంటే అప్పటికే మన శరీరంలోని కణాలను దాహంతో అల్లాడుతున్నాయని అర్ధం. కాబట్టి అప్పటిదాకా ఆగకుండా అంతకంటే ముందే శరీరంలో నీటిని భర్తీ చేస్తూ ఉండాలి. స్వేదంతో కోల్పోయిన నీటిని మామూలు నీటితో భర్తీ చేస్తే సరిపోదు. స్వేదం ద్వారా లవణాలను (సోడియం, పొటాషియం) కూడా కోల్పోతాం కాబట్టి ఎండలో గడిపిన సమయం ఆధారంగా ఉప్పు కలిపిన నీటిని తాగుతూ ఉండాలి. మాంసాహారం తినే అలవాటున్నవాళ్లు మిగతా కాలాల్లో కంటే తక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో మాంసాహారం, మసాలాలు లేకుండా చూసుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం మాంసాహారానికి అనువైన వేళలు. వేసవిలో జీర్ణశక్తి మందగిస్తుంది. కాబట్టి భారీగా తినడం తగ్గించుకోవాలి. వీలైతే భోజనానికి బదులు సలాడ్లు, మిజ్జిగ, పళ్ల రసాలు తీసుకోవచ్చు.


దీర్ఘకాల రుగ్మతలుంటే?
రక్తపోటు బాధితులు: మందుల ప్రభావం వల్ల ఈ కాలంలో రక్తపోటు బాధితుల్లో మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తేలికగా ఎండదెబ్బకు గురయ్యే ప్రమాదం వీరిలో ఎక్కువ. ఇలా డీహైడ్రేషన్‌కు గురవకుండా ఉండాలంటే వేసవి కాలం మొత్తం కొంత మేరకు ఉప్పు మోతాదు పెంచుకోవచ్చు. నీళ్లలో, మజ్జిగలో ఉప్పు కలుపుకోవచ్చు. అయితే ఎంత ఉప్పు? అనేది వైద్యుల సూచన మేరకు పాటించాలి.
మధుమేహులు: మధుమేహులు కూడా ఈ కాలంలో త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతూ ఉంటారు. నీరసించిపోతూ ఉంటారు. కాబట్టి ప్రతి మూడు గంటలకోసారి ఆహారం తీసుకోవాలి. వైద్యుల సూచనల మేరకు పళ్లు, బిస్కెట్లు, సలాడ్లు తింటూ ఉండాలి.

ఎండ దెబ్బ తగిలితే?
ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఒక్కోసారి ఎండదెబ్బ నుంచి తప్పించుకోలేం! అసలు సమస్య ఎండదెబ్బో, కాదో కూడా ప్రారంభంలో అర్ధం కాదు. బడలికగా ఉండి, జ్వరం వచ్చినట్టు అనిపిస్తే ఎండకు ఒళ్లు అలసిపోయిందని అనుకుంటామే తప్ప ఎండదెబ్బకు గురయ్యామని తెలుసుకోలేం! కానీ వేసవిలో కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.

అవేంటంటే....

ఒళ్లు నొప్పులు, నీరసం, బడలిక
చమట పట్టకపోవడం
శరీరం వేడెక్కిపోవడం (102 నుంచి 106 డిగ్రీల జ్వరం)
చర్మం ముడతలు పడడం, పొడిబారడం
కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం
వాంతులు, విరేచనాలు
మూత్రం పచ్చగా మారడం
ఈ లక్షణాలుంటే ఎండదెబ్బగా భావించాలి. వెంటనే ఒంటికి చల్లని గాలి తగిలేలా చూసుకోవాలి. తడిబట్టతో ఒళ్లు తుడుచుకుంటూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలి. తర్వాత ఉప్పు, చక్కెర కలిపిన నీళ్లు తాగాలి. తీవ్రతను బట్టి వైద్యులను కలవాలి.


డాక్టర్‌ శ్యామల,
జనరల్‌ కన్సల్టెంట్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం