MohanPublications Print Books Price List clik Here BhaktiBooks.In

మహా మృత్యుంజయ మంత్రం_Mahamrityunjaya Mantram


మహా మృత్యుంజయ మంత్రం_Mahamrityunjaya Mantram Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

మహా మృత్యుంజయ మంత్రం!


ఓం త్య్రంబకం, యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుక మివ బంధనాత్‌ మృత్యోర్ముక్షీయ మామృతాత్‌॥
మరణ భయం ఉన్నప్పుడు, ఆయుఃవృద్ధికి మృత్యుంజయ 
మంత్రం పఠించాలని సూచిస్తుంటారు. అయితే ఈ మంత్ర అర్థం, 
పరమార్థం తెలుసుకుని శ్రద్ధగా పఠిస్తే మరింత మంచిది. 
అందుకే మహా మృత్యుంజయ మంత్ర పద తాత్పర్యాలు..

ఓం
భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మజ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మ అనే అక్షరాల సంగమమే ఓంకారం. ఋగ్వేదం నుండి అకారం, యజుర్వేదం నుండి ఉకారం, సామవేదం నుండి మ కారం పుట్టాయి. ఈ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుంటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూరుస్తుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరుచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మనుస్మరించాలి. 


త్య్రంబకం

భూత, భవిష్యత, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్య్రంబకమంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలోనున్న సూక్ష్మరూప నేత్రం మూడవనేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహక శక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్య్రంబకం అని కీర్తిస్తున్నాం. 


యజామహే

అంటే ధ్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ ప్రచండ జ్వాలలకు సమస్త లోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు.. హాహాకారాలు.. సమస్తలోక జనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి కరిగిపోయిన స్వామి హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకొని నీలకంఠుడూ సమస్త లోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం. 


సుగంధిం

సు-మంచిదైన, గంధ- సువానసన ద్రవ్యం. మంచి వాసనలతో కూడుకొన్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు ఆ స్వామి మనపై తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం. ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని అడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవేరుస్తాడు. 


పుష్టివర్ధనం

మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్న ఆ స్వామి సర్వత్రా నెలకొనియున్నాడు. సృష్టి యావత్తూ ఆయన అధీనంలో ఉంది. ఆయన మనల్ని తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగిపోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడా కబడలేదు. ఈలోపు ఎక్కడినుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దానిబారి నుండి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగివస్తాడా అని కాపు కాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లోనున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులి భయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి జాగరణ చేయడంతో శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వవ్యాపకుడైన ఆ స్వామి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. 


ఉర్వారుకం ఇవ బంధనం

దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనల్ని అన్ని సమస్యల నుండి గట్టెక్కించుతాడు. 


మృత్యోర్ముక్షీయ

అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని మృత్యువు నుంచి కూడా మనకు రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమే కాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రపత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే. 
ప్రకృతతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే ప్రాణికి అంతా అనుమానమయంగానే కనబడుతుంది. ఇటువంటివన్నీ చావువంటివే. ఇలా మనల్ని అన్ని రకాల మరణాల నుండి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం. 


అమృతాత్

స్వామి అల్ప సంతోషి. సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ కింది విధంగా స్తుతించాడు. 
శివుని శిరమున కాసిన్ని నీళ్లు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు
శివలింగంపై కాసిన నీళ్లు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసిసప్పటికీ ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్పతరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు. 
సర్వేజనా సుఖినో భవంతు!                                -తపోఋషి రాజశేఖర శర్మ--------------------------


మహా మృత్యుంజయ మంత్రం : తాత్పర్యం


మహా మృత్యుంజయ మంత్రం:

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ 


ప్రతి పదార్ధం: ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవ నాదము; త్రయంబకం = మూడు కన్నులు గలవాడు; యజామహే = పూజించు చున్నాము; సుగంధిం = సుగంధ భరితుడు; పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ; వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించు వాడు; ఉర్వారుకం = దోస పండు; ఇవ = వలె; బంధనాత్ = బంధమును తొలగించు; మృత్యోర్ = మృత్యువు నుండి;అమృతాత్ = అమృతత్వము కొరకు / అమరత్వము కొరకు; మాం = నన్ను; ముక్షీయ = విడిపించు.


తాత్పర్యం: అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించు చున్నాము. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినటుల (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించు గాక!


ప్రాశస్త్యము: మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ "మహా మృత్యుంజయ మంత్రం" పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనం లో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం. ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్ప వచ్చు. అంతేకాక ఆపదలు కలిగినపుడు కూడా దీనిని చదువుకో వచ్చును. సాధారణంగా ముమ్మారు గాని, తొమ్మిది మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్ఖన దీనిని పారాయణం చేస్తారు.


ఓం నమః శివాయ! 


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం