MohanPublications Print Books Online store clik Here Devullu.com

చందన చర్చిత..._significance of sacred sandalwood


 చందన చర్చిత... significance of sacred sandalwood Sandalwood Sandal Powder Sandal Tree Red Sandal Sandal Incense Sandal Wood Eenadu Eenadu Makarandam Makarandam Bhakthi Pustakalu Bhakti Pustakau BhakthiPustakalu BhaktiPustakalu


చందన చర్చిత...

       చందనం పైపూత కాదు... . చందనం పరిమళం కాదు... ఓ అమూల్య సంప్రదాయం... అదో ఆధ్యాత్మిక సుగంధం... సృష్టిలో ఎన్ని వృక్షాలున్నా ఈ చెట్టు అణువణువూ ఎందుకు పూజనీయమైంది?

        చందనం అమూల్యమైన దేవతావృక్షం. మరే ఇతర వృక్షానికి దక్కని అరుదైన స్థానం దీనికి దక్కింది. షోడశ ఉపచారాల్లో తొమ్మిదో ఉపచారం గంధ సమర్పణ. కేవలం పూజల్లో ఉపయోగించటానికి మాత్రమే కాదు... భారతీయ సంస్కృతిలో చందనానికో ఓ ప్రత్యేకత ఉంది. ఇంటికి అతిథులు వస్తే, వారికి చందనం ఇవ్వకుండా పంపించేవారు కాదు ఒకప్పుడు. ఇప్పటికీ వివాహాది వేడుకల్లో వచ్చే అతిథులకు తొలిగా చందనాన్ని అలంకరించి స్వాగతం పలుకుతారు. స్త్రీలు చేసుకునే నోములు, వ్రతాల్లో సువాసినులకు చందనం అలంకరించటం తప్పనిసరి. సాధారణంగా నోములు నోచుకునేటప్పుడు సువాసినులకు గంధాన్ని కంఠభాగంలో అలంకరిస్తారు. యోగశాస్త్రం ప్రకారం కంఠ ప్రాంతంలో విశుద్ధి చక్రం ఉంటుంది. రెండువేళ్లతో గంధాన్ని తీసుకుని, చక్కగా కంఠాన్ని తాకుతూ చందనం రాయటం వల్ల విశుద్ధి ఉత్తేజితమవుతుంది. ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం, ఆధ్యాత్మికత కలగలసిన సంప్రదాయం ఇది. వివాహ శుభలేఖల్లో కూడా ‘మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి...’ అని రాస్తారు. చందనంతో చేసే సత్కారానికి గొప్పస్థానం ఉంది. కనుకనే దేవతలు సైతం తమకు ప్రీతిపాత్రమైన వస్తువుగా స్వీకరించారు.


సుగుణ నందనం...
* కంసుడి ఆహ్వానం అందుకున్న శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడితో కలిసి ద్వారకకు బయల్దేరతాడు. రాచనగరిలోకి ప్రవేశించి, అక్కడి విశేషాలన్నీ పరిశీలిస్తూ, రాజవీధుల్లో నడుచుకుంటూ వెళుతుంటారు ఇద్దరు. ఇంతలో కురూపిగా ఉన్న ఓ ముదుసలి కుబ్జ... ‘కన్నయ్యా!’ అంటూ వారి దగ్గరకు వస్తుంది. ఎంతో ప్రేమగా, ‘ఆగవయ్యా! నీ కోసం ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నాను. ఇదిగో! నీ కోసం చందనం తెచ్చానయ్యా. ఏదీ ఇటు తిరుగు...’ అంటూ నీలమేఘశ్యాముడికి అద్దుతుంది. శ్రీకృష్ణుడు కూడా అంతే ప్రేమగా స్వీకరిస్తాడు. నువ్వు చేసిన చందన సేవ నాకు చాలా ఆనందాన్నిచ్చిందంటూ ఆమె చుబుకాన్ని పైకెత్తుతాడు. ఆశ్చర్యం...! అష్టవంకరులు తిరిగి ఉండే కుబ్జ అపురూప సౌందర్యరాశిగా మారిపోతుంది. కురూపిని కుందనపు బొమ్మగా మార్చింది చందనమే కదా.
* పరమేశ్వరుడి అభిషేకద్రవ్యాల్లో చందనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చందనంతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయంటారు. లలితాదేవికి ‘చందనద్రవదిగ్ధాంగీ’ అనే పేరు ఉంది. ఆమె శరీరమంతా చందనంతో నిండిపోయి ఉంటుందట.
* నారద, తుంబురులు దేవగాయకులు. ఇద్దరూ సంగీత విద్యలో ఆరితేరినవారు. ఓ సందర్భంలో తుంబురుడి గానాన్ని, ఆయన వీణావాదనాన్ని మెచ్చుకున్న విష్ణుమూర్తి తాను ధరించిన హారాన్ని, బంగారువస్త్రాన్ని, ఇంకా అనేక బహుమతులు ఇచ్చి అతడిని సత్కరిస్తాడు. ఇదంతా చూసిన నారదుడికి ఈర్ష్య కలిగింది. కారణం... తుంబురుడు పొందిన రత్నాభరణాలు చూసి కాదట. తన కన్నా బాగా పాడినందుకు, విష్ణువు మెచ్చుకున్నందుకు కూడా కాదట. విష్ణుమూర్తి తాను ధరించే చందనాన్ని స్వయంగా తుంబురుడికి పూయడం నారదుడికి అసూయ కలిగించింది. చందనం పూయటం అవతలి వ్యక్తికి మనం ఇస్తున్న గౌరవానికి ప్రతీక. ఇదే నారదుడికి మాత్సర్యం కలిగించింది.
అయం భగవాన్‌! శ్రీమదఖిల మహీమండల మండల ధరణీధరమండలాఖండలస్య... వేదాల్ని ఔపోసన పట్టిన వైష్ణవస్వాములు సుస్వరంగా ఏడుకొండలవాడి వైభవాన్ని కీర్తిస్తున్నారు. ఇంతలో అర్చకస్వాములు శ్రీవారి మూలవిరాట్‌కు నమస్కరించి, ముందురోజు చేసిన అలంకారాలన్నిటినీ (నిర్మాల్యం) ఒక్కొక్కటిగా తీయటం ప్రారంభించారు. అదేక్రమంలో స్వామి వక్షస్థలంపై ఉన్న లక్ష్మీదేవికి నిన్నటిరోజున అలంకరించిన చందనాన్ని ఒకే ముద్దగా బయటకు తీశారు. పరమాద్భుతం... మాటలకందని మధురానుభూతి... ఇంతకీ ఏం జరిగింది? సాక్షాత్తు లక్ష్మీదేవి ఆకారాన్ని ఆ చందనం సంతరించుకుంది. ఆహా! చందనం చేసుకున్న పుణ్యభాగ్యాన్ని లెక్కించగలమా? లోకనాయకుడి వక్షస్థలాన్ని చేరుకుని, ఏకంగా దేవేరి రూపును తనదిగా చేసుకుంది. గోవిందా! చందనంగా మారి, నీ మేనికి నిత్యం అంటుకుని ఉండే భాగ్యాన్ని కలిగించు స్వామీ!.. భక్తుల హృదయాలు మౌనంగా స్వామిని వేడుకుంటున్నాయి.

   * చందనాన్ని అరగదీసి, గంధాన్ని తీస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, సందర్భాన్ని బట్టి, కాలాన్నిబట్టి చందనగంధాన్ని తీసేవిధానంలో కొన్ని అనుఘటకాలు చేర్చుతారు. మామూలు నీరు కాకుండా పన్నీరు పోసి, చందన గంధాన్ని తీస్తే మరింత సువాసన వెదజల్లుతుంది. వేసవికాలంలో పచ్చకర్పూరం, చలికాలంలో కస్తూరి చేర్చి, గంధాన్ని తీస్తారు. పునుగు, జువ్వాది, వట్టివేళ్లు, బావంచాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు కూడా చేర్చి, చందనగంధం తీస్తారు.

   * ఆహ్లాదంతో పాటు ఎన్నో ఆరోగ్యకరమైన విలువలు చందనంలో ఉన్నాయి. చల్లదనాన్ని కలిగించటంతో పాటు శరీరంలోపల ఉండే తాపాన్ని కూడా చందనం తొలగిస్తుంది. ఈకారణంగానే ఆయుర్వేదవైద్యంలో చందనాన్ని విరివిగా ఉపయోగిస్తారు. గంధాన్ని కొద్దిమోతాదులో కొబ్బరినీరులో కలుపుకుని తాగితే వెర్రిదాహం తగ్గుతుంది. చందనతైలం శరీరానికి చలువ చేస్తుంది.జ్వరం హెచ్చుస్థాయిలో ఉంటే చందనాన్ని శరీరానికి పూత పూస్తే ఉష్ణోగ్రత నెమ్మదిస్తుంది. కణతల దగ్గర చందనాన్ని రాసుకుంటే, శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. అయ్యప్పదీక్షాపరులు కణతల దగ్గర గంధం రాసుకోవటంలో అంతరార్థం ఇదే. మంత్రసాధన చేసే వాళ్లు చందనాన్ని ఛాతి, నుదురు, తలమీద రాసుకోవటం కూడా ఇందుకే.
* బాగా పెరిగిన చందన వృక్షాన్ని చూడగానే మనిషి గొడ్డలి తీసుకుని బయల్దేరతాడు. ఆ వృక్షాన్ని చిన్నచిన్న భాగాలుగా నరికి, వ్యాపారం చేసుకుంటాడు. అప్పటిదాకా పచ్చపచ్చని కొమ్మలతో వెలిగిన వృక్షం ముక్కలుగా మారిపోతుంది. ఇక్కడే చందనం ఇచ్చే సందేశం దాగుంది. తనను నరికిన గొడ్డలికి కూడా చందనం సుగంధాన్ని అద్దుతుంది. తనను నరుకుతూ, ఆయాసంతో తన కిందే సేదతీరటానికి కూర్చున్న మనిషికి తన సుగంధ పరిమళాలను అందించి, చల్లదనాన్నిస్తుంది. తనను మరింత చిన్నచిన్న ముక్కలుగా చేసి, రాతిమీద అరగదీసి, చూర్ణం చేసినా, అలా చేసిన కొద్దీ మరింత సువాసన వెదజల్లుతుంది. చివరకు తనను అరగదీసిన చేతికి, రాతికీ కూడా మరింత సువాసన అందిస్తుంది. కేవలం సువాసనాభరితంగా ఉండటం మాత్రమే కాదు... ఆ సువాసనలను అనుసరించి ఉండే బాధల్ని కూడా భరించాలని... ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలకు గురికావలసి వచ్చినా ఉత్తమ లక్షణాలను కోల్పోకూడదనే సందేశాన్నిస్తుంది. అలాగే కష్టాల కొలిమిలో ఎంతగా అరిగినా, మరిగినా, కరిగినా.... మనిషి తనదైన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. కష్టాలను ఆనందంగా స్వీకరించి, కొలిమిలో కాలిన బంగారంలా మరింతగా మెరిసిపోవాలి.
     ఏ దైవానికీ లేని ఎన్నో విశిష్టతలు సింహగిరి నరహరికే సొంతం. ఏ దేవాలయంలోనైనా మూలమూర్తి ఏడాదంతా ఒకే రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ, సంవత్సరమంతా నిత్య రూపంలో దర్శనమిస్తూ... ఒక్కరోజు మాత్రమే నిజ రూపంతో భక్తులను అనుగ్రహించే ఏకైక పుణ్యక్షేత్రం సింహాచలం. 364రోజులు చందనంలో ఉంటూ నిత్యరూపంతో పూజలందుకునే స్వామి... వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) నాడు మాత్రమే నిజరూపంతో సేవలందుకుంటాడు. వేడుకగా జరిగే ఈ ప్రక్రియలో ముఖ్య ఘట్టాలివీ...
   గంధం కోసం మేలురకం చందనం చెక్కలను కేరళ నుంచి తీసుకువస్తున్నారు. అరగదీసేందుకు వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తారు. దీనికోసం ఆలయంలోని బేడామండపంలో అమర్చిన ప్రత్యేక రాళ్లపై ఈ ప్రక్రియ జరుగుతుంది.
     ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ప్రధానార్చక స్వామి తొలిచెక్కను అరగదీస్తారు. దీంతో అరగదీత కార్యక్రమానికి అంకురారోపణ జరుగుతుంది. శ్రీగంధాన్ని ప్రతిరోజు ఆలయ స్థానాచార్యులు తూకం వేసి భద్రపరుస్తారు.
     అరగదీసిన గంధంలో అర్చకులు 60 రకాల వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు మిళితం చేస్తారు. ఈ నేపథ్యంలోనే అప్పన్న స్వామి దేహం నుంచి వేరుచేసిన నిర్మాల్య చందనానికి ఔషద గుణాలున్నాయని భక్తుల విశ్వాసం.
     చందనోత్సవం రోజున స్వామి మూలవిరాట్ను గంగధార జలాలతో అభిషేకిస్తారు. ఇందుకు 108 వెండి కలశాలను వినియోగిస్తారు. ఉత్సవానికి ముందు రోజునే ఈ కలశాలకు రంగుల దారాలను చుట్టి సిద్ధం చేస్తారు. ఆస్థాన మండపంలో వీటిని ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు.
నిజరూపంలోని శ్వేతవరాహ స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. వెయ్యి కలశాలతో  ఆలయ ఈశాన్యంలో ఉన్న గంగధార జలాలను తీసుకొచ్చి వాటితో  స్వామిని అభిషేకించిన అనంతరం తిగిరి చందనంతో అలంకరిస్తారు. దీంతో చందనోత్సవం పూర్తవుతుంది.
- శ్రీధర్‌ అల్లు, అడివివరం.
- మేకల సత్యనారాయణ, సింహాచలం.
(చిత్రాలు దాచినవి)
పరిమళమే..పరిమళమే..
చందనంతో పాటు మరో ఏడు పరిమళ ద్రవ్యాలు కలిపి తీసే గంధానికి అష్టగంధం అని పేరు. కస్తూరి, గోరోజనం, కుంకుమపువ్వు, దేవదారు, పచ్చకర్పూరం, అగిలు, శ్రీగంధం, రక్తచందనం - కలిపి తయారుచేసిన గంధానికి యంత్రపూజల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది.
- కప్పగంతు రామకృష్ణ
గార్దభచందన న్యాయం
చందనంపేరు మీద ఏర్పడిన లోకోక్తి ఇది. గంధపు చెక్కల మూటను ఎంతకాలం మోసినా గాడిద చందనంలోని సుగంధాన్ని ఆస్వాదించలేదు. అలాగే, అవివేకి, మూర్ఖుడు ఎంతకాలం సజ్జనుల సాంగత్యం చేసినా వారిలోని గొప్పదనాన్ని గుర్తించలేడని ఈ లోకోక్తికి అర్థం.

 చందన చర్చిత... significance of sacred sandalwood Sandalwood Sandal Powder Sandal Tree Red Sandal Sandal Incense Sandal Wood Eenadu Eenadu Makarandam Makarandam Bhakthi Pustakalu Bhakti Pustakau BhakthiPustakalu BhaktiPustakalu


అపురూపం
అప్పన్న నిజరూప దర్శనం..!

    వరాహ నారసింహ అవతారాల సమ్మేళనంగా అలరారుతున్న సింహాద్రినాథుడు ద్వయరూపాల్లో దర్శనమిచ్చే భక్తవరదుడు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే లభించే సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని కొన్ని క్షణాల పాటైనా కనులారా వీక్షించడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవానికి విశాఖపట్నం జిల్లాలోని సింహగిరి ముస్తాబవుతోంది.     ఇదీ ఇతిహాసం: ప్రహ్లాదుడిని రక్షించేందుకు అవతరించిన నృసింహస్వామి విగ్రహ రూపంలో సింహగిరిపై వెలిశాడు. ఆ విగ్రహానికి ఆరాధన లేకపోవడంతో దాని చుట్టూ పెద్ద పుట్ట పెరిగింది. షట్‌ చక్రవర్తులలో ఒకరైన పురూరవుడు ఊర్వశితో కలిసి ఆకాశమార్గంలో విహరిస్తూ సింహగిరిపై రాత్రి విశ్రమించగా, అదే కొండపై తాను వున్నట్టు స్వామి అతని స్వప్నంలో కనిపించి చెబుతాడు. సింహగిరిపై ఈశాన్య దిక్కున గంగధారకు సమీపంలో పుట్టలో వున్న స్వామిని అక్షయ తృతీయనాడు చక్రవర్తి గుర్తిస్తాడు. పుట్టను తొలగించి గంగధార జలాలతో, పంచామృతాలతో స్వామిని అభిషేకించి, ఆరాధిస్తాడు.తాను చాలా ఏళ్లు వల్మీకం (పుట్ట)లో వున్నందున అలాంటి చల్లదనం కోసం పుట్టమన్నుకు బదులు గంధంతో తనను కప్పి ఉంచాలని పురూరవుడిని స్వామి ఆదేశిస్తాడు. దీంతో పుట్ట మన్ను బరువుకు సమానమైన శ్రీగంధాన్ని అక్షయ తృతీయ రోజున తొలిసారిగా పురూరవుడు సమర్పిస్తాడు. అప్పటి నుంచి వరాహలక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం ఆ రోజున నిర్వహిస్తూ వస్తున్నారు.

    చందన యాత్ర అంటే: ఏటా అక్షయతృతీయ రోజున స్వామి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగిస్తారు. ఆ రోజంతా స్వామి నిజరూపంలో భక్తులకు సాక్షాత్కరిస్తారు. మళ్లీ అదే రోజు రాత్రి చందన సమర్పణ చేస్తారు. సుమారు 12 మణుగుల (500 కిలోల) శ్రీచందనపు పూతతో స్వామిని నిత్య రూపంలోకి తీసుకువస్తారు. ఆ మొత్తం చందనాన్ని స్వామికి నాలుగు విడతలుగా సమర్పిస్తారు. వైశాఖ శుక్ల పక్ష తదియ (అక్షయ తృతీయ) నాడు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి చందన ఒలుపు ప్రారంభిస్తారు. బంగారు, వెండి బొరిగెలతో చందనం తొలగిస్తారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష పూజలు నిర్వహించి శిరస్సుపైన, ఛాతీపైన చందనాన్ని ముద్దలుగా పెడతారు. మొదట నిజరూప దర్శనాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకు కల్పిస్తారు. అనంతరం భక్తులను అనుమతిస్తారు. నిజరూపంలోని స్వామికి సహస్ర ఘటాభిషేకం జరుపుతారు. అదే రోజు రాత్రి భక్తుల దర్శనాల అనంతరం తొలివిడతగా మూడు మణుగుల (సుమారు 125 కిలోల) శ్రీచందనాన్ని పూతగా వేస్తారు. మిగిలిన తొమ్మిది మణుగుల చందనాన్ని వైశాఖ పూర్ణిమ, జేష్ట పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమలలో మూడేసి మణుగుల చొప్పున సమర్పిస్తారు. నాలుగు విడతల చందన సమర్పణతో స్వామి నిత్య రూపంలోకి వస్తారు.

ఎలా వెళ్ళాలి?: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ నుంచి సుమారు 13 కిలోమీటర్లు, ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో, విశాఖ విమానాశ్రయం నుంచి సుమారు ఏడున్నర కిలోమీటర్ల దూరంలో సింహాచలం ఉంది. సింహాచలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో సింహాచలం రైల్వే స్టేషన్‌ ఉంది. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి సింహాచలానికి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కొండదిగువ నుంచి సింహగిరి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులతోపాటు దేవస్థానం ట్రాన్స్‌పోర్టు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
వాసు, విశాఖపట్నం

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం