Sri Adinarayana Swamy Temple,
Kodakkeni village
కంచికి వెళ్లకపోతే... కొడకంచికి పోదాం!
పుణ్య తీర్థం
పచ్చని పంటపొలాలు, పక్కనే కోనేరు కల్గి ఉండి జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధిగాంచి సుమారు 900 ఏళ్ల చరిత్ర కల్గిన శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీఆదినారాయణ స్వామి దేవాలయం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు స్వామివారి సన్నిధిలో కంచి తరహాలో పూజలు నిర్వహిస్తుంటారు. కంచికి వెళ్లకున్నా కొడకంచికి మాత్రం వెళ్లాలనే నానుడి అనాదిగా ఉంది. కొడకంచి గ్రామంలో కొలువైన ఆదినారాయణ స్వామి దేవాలయ విశిష్టతపై ప్రత్యేక కథనం.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో విష్ణుమూర్తి 900 ఏళ్ల క్రితం... శ్రీదేవీ, భూదేవీ సమేతంగా ఆదినారాయణ స్వామిగా కొడకంచి గుట్టపై వెలిశాడని పెద్దలు చెబుతారు. ఈ దేవాలయం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచింది. ప్రతి ఏటా మాఘమాసంలో నిర్వహించే ఈ ఉత్సవాలకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన భక్తులు విచ్చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటారు. సామాన్యులతోపాటు అన్ని పార్టీల నేతలు ఏ కార్యం చేపట్టినా ముందుగా స్వామివారిని దర్శించుకోవటం ఆనవాయితీ.
ఆలయ చరిత్ర
900 ఏళ్ల క్రితం అల్లాణి వంశస్తుడైన రామోజీరావుకు స్వామివారు కలలోకి వచ్చి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అల్లాణి వంశస్తులతో పాటు, గ్రామ ప్రజలందరూ కలసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి స్వామి వారు అల్లాణి వారి కలలోకి వచ్చి తెల్లవారే లోపు మీ ఇంటిముందు గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడపక్షే వారిని తానున్న స్థానానికి తీసుకువెళ్తుందని, ఈ విగ్రహాన్ని కొడకంచి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గల ఓ గుట్టపై ప్రతిష్టించాలని చెప్పారు. గరుడపక్షి చూపిన దారిలో అటవీ ప్రాంతంలోకి వెళ్లిన అల్లాణి వంశస్తులకు స్వామివారి విగ్రహం లభించింది. ఈ విగ్రహాన్ని కొడకంచిలోని ఓ గుట్టపై ప్రతిష్టించారు. అప్పటినుంచి నేటి వరకు కంచిలో స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడి స్వామివారికి కూడా అలాగే పూజలు నిర్వహిస్తున్నారు.
ఘనంగా బ్రహ్మోత్సవాలు
ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. పది రోజులపాటు స్వామి వారి ఉత్సవాలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఘనంగా జరుపుతారు.
మరికొన్ని విశేషాలు
ఆదినారాయణ స్వామి దేవాలయ ఆవరణలో ఆంజనేయ స్వామి దేవాయం, శివాలయాలు కూడా ఉన్నాయి. వంద ఏళ్ల కింద తయారు చేయించిన స్వామివారి రథం ప్రత్యేక ఆకర్షణ. దాదాపు వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం శి«థిలావస్థకు చేరటంతో దాతల సహకారంతో నూతనంగా మండపాన్ని నిర్మించారు. ఆలయం పక్కనే అందమైన కోనేరు, గుండం ఉంటుంది. పండగల సమయంలో అర్చకులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
కంచి తర్వాత వెండి, బంగారు బల్లులు ఇక్కడే!
కంచిలో ఉన్న విధంగానే ఇక్కడి ఆలయం, అర్చనలు ఉంటాయి. అంతేకాదు, కొడకంచిలోని ఆదినారాయణ స్వామి ఆలయంలో కూడా బంగారు, వెండి బల్లులు ఉన్నాయి. ఈ వెండి, బంగారు బల్లులను స్పర్శిస్తే సకల పాపాలు తొలగి పోతాయని, బల్లిదోషæ నివారణ కూడా జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. కంచిలో ఉన్న విధంగా ఆలయం ఆవరణలో ఉన్న కొలనులో స్నానం చేసి, దేవాలయంలోని వెండి, బంగారు బల్లులను స్పర్శిస్తే కంచికి వెళ్లినంత పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తుంటారు. అందుకే ‘కంచికి వెళ్లలేకున్నా కొడకంచికి వెళ్లాలనే’ నానుడి ఉంది. వాస్తవానికి కంచి తర్వాత ఇక్కడే బంగారు, వెండి బల్లులు ఉండటంతో కడకంచిగా అప్పట్లో ఈ గ్రామం విరాజిల్లింది. రానురాను కడకంచి కాస్తా కొడకంచిగా మారింది.
దేవాలయానికి వెళ్లటం ఇలా ...
హైదరాబాద్ నగరం నుంచి కొడకంచికి బస్సులున్నాయి. బాలానగర్ నుంచి బొంతపల్లి కమాన్ వరకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి. బొంతపల్లి కమాన్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరం గల కొడకంచికి బస్సు సౌకర్యం ఉంది. పటాన్‌చెరు నుంచి 16 కిలోమీటర్ల దూరంలోగల కొడకంచి గ్రామానికి ప్రతి గంటకు బస్సులున్నాయి. అదే విధంగా సంగారెడ్డి, మెదక్ తదితర పట్టణాల నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది.
– వడ్ల శ్రీధర్‌చారి సాక్షి, జిన్నారం
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565