ఇంద్రియాలను జయించే విద్య కావాలి!
మహిమలు, మాయలు, మంత్రాలు, గారడీ విద్యలు... ఇలాంటి విద్యలన్నీ జ్ఞాన మార్గానికీ, ధమ్మ సాధనకీ తగినవి కావని బుద్ధుడు ప్రబోధించాడు. మూఢనమ్మకాలు, జాతకాలూ, శకునాల పేరుతో జనం దగ్గర నుంచి ధనం రాబట్టుకోవడాన్ని అనైతిక సంపాదనగా ఎంచాడు. అలాంటి జీవనం అధమాధమ జీవనంగా భావించాడు. తన శిష్యులైన బౌద్ధ భిక్షువులతో... ‘‘మీరెప్పుడూ ఇలాంటి నమ్మకాల పేరుతో జనాన్ని మోసగించకండి. ఆ సొమ్ముతో జీవించకండి’’ అని చెప్పేవాడు. దీనికి సంబంధించిన ఒక కథ... బౌద్ధ వాఙ్మయంలో కనిపిస్తుంది.
బౌద్ధ భిక్షువుల్లో పిండోల భరద్వాజుడు ఒకడు. చిన్నతనం నుంచి అన్ని రకాల విద్యలతో పాటు ఇంద్రజాల విద్యలూ నేర్చుకున్నాడు. బుద్ధుని ప్రబోధం విని బౌద్ధ సంఘంలో చేరాడు. బుద్ధుడు చెప్పే ధర్మంపై, ధార్మిక విద్యలపై శ్రద్ధ కనబరిచాడు. కానీ, వెనుకటి ఇంద్రజాల విద్య మీద మక్కువ మాత్రం చంపుకోలేకపోయాడు.
ఒక రోజు శ్రావస్తి నగరంలో.. పెద్ద కూడలి దగ్గర జనం గుమిగూడి ఉండడాన్ని చూసి అక్కడికి వెళ్లాడు భరద్వాజుడు. అక్కడ ఒక వ్యాపారి ఎర్ర చందనంతో తయారు చేసి, వజ్రాలు పొదిగిన అతి ఖరీదైన భిక్షాపాత్రను నిటారుగా నిలబెట్టిన పెద్ద కర్ర చివర ఉంచాడు. ఆ పాత్రను ఏ సాధనం లేకుండా.. ఎవరు కిందకు దించగలరో వారికే దానిని ఇచ్చేస్తానని ప్రకటించాడు. అప్పుడు భరద్వాజుడు తన ఇంద్రజాల విద్యను ప్రయోగించి.. దానిని కిందకు దించి తన చేతుల్లో పడేలా చేశాడు.
అన్న మాట ప్రకారం వ్యాపారి ఆ పాత్రను అతనికి ఇచ్చేశాడు. ఎంతో ఆనందంతో ఆ పాత్రను తీసుకుని భరద్వాజుడు ఆరామానికి వెళ్లాడు. దానిని తీసుకెళ్లి బుద్ధునికి సమర్పించాడు. ఆ భిక్షాపాత్రను భరద్వాజుడు ఎలా సంపాదించాడో తెలుసుకున్న బుద్ధుడు... ‘ధర్మాచార్యులు ధర్మ మార్గంలోనే జీవించాలి. గారడీ విద్యల జ్ఞానం ధర్మాన్ని చూపించలేదు. మీరిలాంటి ఇంద్రజాల విద్యలు ప్రదర్శిస్తే... ప్రజలకు వాటి పట్ల మోజు పెరుగుతుందే కానీ, ధర్మ మార్గాన్ని గురించి ఆలోచించలేరు. ధర్మానికి దూరమవుతారు. అది మన పని కాదు. మనకు కావలసింది, మనం నేర్చుకోవాల్సింది, మనం నేర్పాల్సింది- ఇంద్రియాల్ని జయించే విద్యలే! అంతే కానీ, ఇంద్రజాల విద్యలు కాదు’’ అంటూ.. ఆ పాత్రను పగులగొట్టి.. దూరంగా పారవేయించాడు.
తన తప్పు తెలుసుకున్న పిండోల భరద్వాజుడు ఆనాటి నుంచి గారడీ విద్యలు మాని... ధర్మ విద్యలు నేర్చి.. మంచి భిక్షువుగా పేరు సంపాదించాడు.
- బొర్రా గోవర్ధన్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565