MohanPublications Print Books Online store clik Here Devullu.com

జగన్నాధ స్వామి వైభవం- పూరీజగన్నాధ ఆలయం, Puri Jaganadha Swamy Vibhogam

జగన్నాధ స్వామి వైభవం- పూరీజగన్నాధ ఆలయం, Puri Jaganadha Swamy Vibhogam


జగన్నాధ స్వామి వైభవం- పూరీజగన్నాధ ఆలయం
పూరీ క్షేత్రంలో సోదర, సోదరీ సహితుడై కొలువున్న 'జగన్నాథ స్వామీ' ఆలయానికి ఓ ప్రత్యేకత వుంది. ఆ ఉత్సవ మూర్తి ఆకారంలోనే కాదు, ఆయనకు సమర్పించే ప్రసాదాలలోనూ ఓ ప్రత్యేకత, ఆయనకు జరిగే వేడుకల్లోనూ, ఉత్సవాలలోనూ, ఓ ప్రత్యేకత చోటు చేసుకుంటుంది. విశేషించి జగన్నాథుని రథయాత్ర అంటే, ఆబాలగోపాలానికి ఓ పర్వమే, ఓ వేడుకే, ఓ ఆనంద సందోహ, సంభ్రమ, సంతోష మరీచికే.
పూరీక్షేత్రవిశిష్టత
ఉత్కళ రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి విశ్వ, విశిష్ట స్థానం కలగటానికి కారణం శ్రీ జగన్నాథుడే. ఒకసారి చరిత్ర పుటంలోనికి ప్రయాణిస్తే, చారిత్రాత్మక విషయాలనే స్పృశిస్తామే కానీ, వాటి వెనుకవున్నపురాణ, ఇతిహాస, సత్యాలను గ్రహించడం, నమ్మడం, అంత తేలికైన విషయంగా కనిపించదు. సత్యం ఎప్పుడూ గోప్యంగానే వుంటుంది. మానవ నమ్మకానికి దూరంగానే వుంటుంది. కానీ, అదెప్పుడూ అందరినీ ఆకర్షిస్తూనే వుంటుంది. అందుకు ప్రత్యక్ష సాక్షి పూరీ జగన్నాథుడే. ఏ ఆలయంలోనైనా గర్భాలయంలోని మూల విరాట్టు కరచరణాలతో, సర్వాలంకారాలతో, నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. కానీ పూరీ జగన్నాథుడు మాత్రం కరచరణాలు లేకుండా, కొలువుదీరి దర్శనమిస్తాడు. జగన్నాథుడు సవరల దేవుడనీ, నీలమ్దవుడనే పేరుతో గిరుజనుల నుంచి పూజలందుకున్నాడనీ స్థలపురాణం చెబుతోంది. అయితే జగన్నాథుడు అందరి దేవుడుగా ప్రసిద్ధి పొందాడు.అందుకే మనం సర్వం జగన్నాథం అంటాం.ఇదే ఆయన ప్రత్యేకత. ఈ ప్రత్యేకతకు ఓ కథ వుంది.
ఆ కథ ఏమిటంటే...
పూర్వం ద్వాపర యుగంలో మనదేశాన్ని 'ఇంద్రద్యుమ్న' మహారాజు పరిపాలించే వాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఒకసారి శ్రీ మహావిష్ణువు 'ఇంద్రద్యుమ్నుని ' కలలో కనిపించి, తన కోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించమని, ఆదేశించాడు. ఇంద్రద్యుమ్నుడు మహావిష్ణువు ఆదేశాన్ని మహద్భాగ్యంగా స్వీకరించి, ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే ప్రతిష్టా మూర్తుల రూపాలు ఎలా వుండాలనే విషయంలో సంగ్దిద్ధానికి గురి అయ్యాడు. ఎందుకంటే కలలో కనిపించిన విష్ణువు రూపాన్ని తను శిల్పంగా మలచలేడు. సాధారణ శిల్పులు తను దర్శించిన రూపాన్ని వారు శిల్పంగా మలచలేరు. కారణం వారికి మహావిష్ణువు దర్శనం కలుగకపోవడమే. ఈ విషయంలో మహారాజుకు చింత రోజురోజుకీ ఎక్కువ కాసాగింది.
తన భక్తుడు పడుతున్న ఆవేదన శ్రీమహావిష్ణువుకు అర్థమయ్యి, తానే ఒక శిల్పాచార్యునిగా రూపం ధరించి, ఇంద్రద్యుమ్న మహారాజు దగ్గరకు వచ్చి, మీకు సంతృప్తి కలిగే విధంగా మూలవిరాట్టు నిర్మాణం చేస్తాననీ, అయితే తన పని పూర్తి అయ్యేంత వరకూ, ఎవరూ తన గదిలోనికి ప్రవేశించరాదని, తనంతట తాను బయటకు వచ్చేవరకు, తనపనికి ఎవరూ అంతరాయం కలిగించరాదని నిబంధన విధించాడు. మహారాజు అందుకు సమ్మతించాడు. ఒక ఏకాంత మందిరంలో మాయాశిల్పి పని ప్రారంభించాడు. వారాలు, నెలలు గడుస్తున్నాయి. ఏకాంత మందిరంలో పని జరుగుతున్నట్టు శబ్దాలు వస్తూనే వున్నాయి. మూలవిరాట్టు రూపాన్ని చూడాలనే ఆత్రుత, మహారాజు దంపతులకు ఎక్కువ కాసాగింది. కొద్ది రోజులకు ఏకాంత మందిరం నుంచి శబ్దాలు రావడం మానేశాయి. రాజ దంపతులకు ఆతృతతో పాటు అనుమానం కూడా ఎక్కువైంది. నిద్రాహారాలు లేకుండా ఏకాంత మందిరంలో పని చేస్తున్న శిల్పి మరణించి వుంటాడేమోనని సందేహం కలిగింది.
అంతే శిల్పి నియమాన్ని త్రోసిపుచ్చి, ఏకాంత మందిరంలోకి ప్రవేశించారు రాజదంపతులు. వారి ప్రవేశంతో నియమభంగం అయిందని గ్రహించిన మాయాశిల్పి మరుక్షణంలో మాయమయ్యాడు. అక్కడ దర్శనమిచ్చిన మూడు మూర్తులను చూసి, ఆశ్చర్య పోయాడు ఇంద్రద్యుమ్నుడు. కరచరణాలు లేకుండా, వున్న ఆ మొండి విగ్రహాలను ఆలయంలో ఎలా ప్రతిష్ఠించాలా అనే సందేహం ఆయనకు మరింత వ్యధను కలిగించింది. ఆ రాత్రి శ్రీ మహావిష్ణువు ఇంద్రద్యుమ్నుని కలలో కనిపించి, ''మహారాజా, బాధపడకు. ఇదంతా నా సంకల్పం. ఆ శిల్పాలనే ఆలయంలో ప్రతిష్ఠించు. నేను ఆ రూపాలతోనే కొలువుతీరి జగన్నాథుడు అనే పేర సర్వజన కోరికలూ తీరుస్తూ వవుంటాను '' అని పలికి అదృశ్యమయ్యాడు. ఇంద్రద్యుమ్నుడు ఆ మూర్తులనే ఆలయంలో ప్రతిష్ఠించాడు. అవే నేటికీ సర్వజనుల చేత పూజలందుకుంటున్న బలభద్ర, సుభద్ర, జగన్నాథులు. ఇది పురాణకథ.
మూలవిరాట్టు ప్రత్యేకత
సాధారణంగా ఏ ఆలయంలోనైనా భగవంతుడు భార్యాసమేతుడై కొలువుతీరి వుంటాడు. కానీ పూరీ క్షేత్రంలోని జగన్నాథుడు మాత్రం తన సోదరుడు 'బలభద్రుడు 'తోనూ, సోదరి 'సుభద్ర 'తోనూ, కొలువుతీరి సేవలు అందుకొంటూ వుంటాడు. సుమారు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన జగన్నాథుని ఆలయంతోపాటు వినాయకునికి, లక్ష్మీ పార్వతులకు, శివునకు, నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు వున్నాయి.
రథయాత్ర
జగన్నాథుని వైభవానికి, వేడుకకు నిలువెత్తు నిదర్శనంగా, కన్నుల పండుగగా జరిగేది జగన్నాధుని రథయాత్ర. ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియనాడు ప్రారంభమవుతుంది. ఈ రథయాత్రలో మూడు ప్రధాన రథాలు వుంటాయి.
1. బలభద్రుని రథం
2. సుభద్రా దేవి రథం
3. జగన్నాధుని రథం
ఈ మూడు రథాలు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు కొత్తవి తయారుచేస్తారు. రథయాత్ర ముగిసాక ఈ రథాలను భగ్నం (విరిచేస్తారు) చేస్తారు. జగన్నాధుడు ఊరేగే రథాన్ని నందిఘోష అంటారు. ఈ రథం 34న్నర అడుగుల ఎత్తు వుంటుంది.
18చక్రాలు వుంటాయి.
'బలభద్రుడు ' ఊరేగే రథాన్ని ' తాళద్వజ' అంటారు. ఈ రధం 33 అడుగుల ఎత్తు కలిగి వుంటుంది. ఈ రథానికి 16 చక్రాలు వుంటాయి.
సుభద్రాదేవి ఊరేగే రథాన్ని దేవదాలన అంటారు. ఈ రథం 31న్నర అడుగుల ఎత్తు వుంటుంది. ఈ రథానికి14 చక్రాలు వుంటాయి.
ఈ మూడు రథాలు అలంకరించడానికి 12 వందల మీటర్ల పట్టు వస్త్రాన్ని ముంబాయిలోని సెంచరీమిల్స్ వారు విరాళంగా సమర్పిస్తారు.
ఈ రథయాత్ర జగన్నాథుని ప్రదాన ఆలయం నుంచి మొదలై, ' గుండిచ' ఆలయం దగ్గర ముగుస్తుంది. జగన్నాథుడు ' గుండిచ' ఆలయం దగ్గర9 రాత్రులు ' శ్రీ మందిరం'లో విడిది చేస్తారు. ఈ రథయాత్రలో ఎందరో భక్తులు పాల్గోని శక్తి వంచన లేకుండా రథాన్ని లాగుతూ, భజన పాటలు పాడుతూ, స్వామికి సేవలు అందిస్తారు. ఈ రథయాత్రను ' గుండిచ జాతర' అని అంటారు. జగన్నాథుడు శ్రీమందిరంలో విడిది చేసే 9 రాత్రులను వేసవి సెలవు దినాలుగా భావించి భక్తులు సేవిస్తారు. ఈ తొమ్మిది రోజులు జగన్నాధుడు అక్కడే పూజాదికాలు అందుకుంటాడు. ఈ తొమ్మిది రోజులు జగన్నాధుని ప్రధాన ఆలయం మూలవిరాట్టు శూన్యంగా వుంటుంది. సాధారణంగా రథాలలో ఉత్సవమూర్తులనే ఊరేగిస్తారు. కానీ జగన్నాధుని రథయాత్రలో మూలవిరాట్టులే ఊరేగడం ప్రత్యేకత. జాతి, మత, కుల భేదాలు లేకుండా అందరూ పాల్గొంటారు.
పూరీ క్షేత్రానికి సమీప గ్రామమైన నారాయణపూర్ లో నివసించే సుమారు వెయ్యి కుటుంబాలు ఈ మూడురథాల తయారీలోనూ, రథయాత్రలో ' జైజగన్నాథ' అని అరుస్తూ రథాన్ని లాగడంలోనూ పాల్గొనడం మరో ప్రత్యేకత.
ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక విశేష పూజ జరుగుతుంది. ఈ పూజలో గర్భాలయాలలోని మూల విరాట్టులను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఊరిచివర దహనం చేసేస్తారు. తరువాత కొత్త మూలవిరాట్టులను పునః ప్రతిష్టిస్తారు.జగన్నాథునికి రథయాత్రలో భగవంతుడికి ఏమైనా లోటుపాట్లు జరిగితే ఎంతగా ప్రయత్నించినా రథం అంగుళం కూడా ముందుకు సాగదు. రథం ఆగిపోయినప్పుడు భక్తులంతా తాము ఏదైనా అపచారం చేసినట్లయితే క్షమించవలసిందిగా వేడుకుంటూ కొబ్బరికాయలు కొడితేనే రథం కదులుతుంది.ఆ రథచక్రాల పరిమాణం, పట్టు కలిపి రథాన్ని కదిపే జనశక్తి యిందులో ధ్వనిస్తాయి. 'వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాలోస్తున్నాయ్...' అంటూ శ్రీ శ్రీ అన్న మాటలు మనకు గుర్తుకు వస్తాయి.
ఔషధసేవ
జగన్నాధునికి నిత్య పూజలు జరిగే సాధారణ దినాలలో రోజుకి ఆరుసార్లు చొప్పున వివిధ రకాలైన సుమారు 54 ప్రసాదాలు నివేదన చేస్తారు. అందుకే ీ థయాత్ర ప్రారంభమైన రోజు నుంచి శ్రీమందిరంలో విడిది చేసిన 9 రోజులు స్వామి వారికి సమర్పించే నివేదనలో నియంత్రణ వుంటుంది. ఏడాది పొడుగునా ఇన్ని రకాల ప్రసాదాలు ఆరగించే స్వామికి ఆరోగ్యం దెబ్బతింటుందేమోనన్న భావనతో నైవేద్యాలకు ఆటవిడుపు ప్రకటించి స్వామిపారికి రకరకాలైన ఆయుర్వేద ఔషధాలను నైవేద్యంగా సేవింపచేస్తారు. ఇటువంటి ఔషధసేవ జగన్నాధుని ఆలయంలో తప్ప మరెక్కడా కనిపించదు.
పూరి జగన్నాథుని ఆలయం గురించి ఏడు అద్భుతమైన విషయాలు....
1) ఆలయంపై జెండా ఎప్పుడు గాలికి"Opposite direction" లో ఉంటుంది.
2) ఆలయంపై ఉండే సుదర్శన చక్రాన్ని మనం పూరి పట్టణం లో ఎక్కడ ఉన్నా మనవైపు చూస్తునట్టే కనిపిస్తుంది.
3) మాములుగా అయితే సముద్రం నుంచి భూమికి గాలి వస్తుంది మరియు సంధ్యా వేళలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ పూరి పట్టణంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.
4) పక్షులు గానీ, విమానాలు గానీ ఆలయం మీద వెళ్ళవు.
5) గుమ్మానికి ఉండే కప్పు నీడ ఏ సమయంలోనైనా, ఏ దిశలో అయినా అస్సలు కనిపించదు.
6) ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలనే ఉంటుంది. దానిని దాదాపు 20 లక్షలు మందికి పెట్టవచ్చు. అయినా అది వృధా అవ్వదు, తక్కువ అవ్వదు !
7) జగన్నాథుని ఆలయంలోని వంటశాలలోచక్కల నిప్పు మీద 7 మట్టిపాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. అయినా ముందు పైన ఉండే మట్టిపాత్ర వేడి అవుతుంది, చివరిగా క్రింద ఉండేదివేడి అవుతుంది. ఆలయంలోని సింహ ద్వారంలోకి ఒక అడుగు వేయగానే సముద్రం శబ్దం వినపడదు, అదే ఒక అడుగు వెనక్కి వేస్తే శబ్దం వినిపిస్తుంది.
ప్రపంచంలోని అతిపెద్ద వంటశాల పూరి జగన్నాథునిదే. ఇదే భోజనశాల కూడా. స్వామివారికి సమర్పించే నైవేద్య, భోజనాలన్నీ ఇక్కడే తయారవుతాయి. ఈ ప్రసాదాలన్నీ పర్యవేక్షించేది శ్రీ మహాలక్ష్మీదేవి. పాక కళాకోవిదులైన ఎందరో బ్రాహ్మణులు (పాండాలు) ముక్కుకి, నోటికి గుడ్డలు కట్టుకుని పదార్థాల వాసన కూడా చూడకుండా, భయభక్తులతో, ప్రతినిత్యం సుమారు 54రకాల పదార్థాలను స్వామివారి నైవేద్యానకి సిద్ధం చేస్తారు. పొరపాటున ముక్కుకు కట్టిన గుడ్డ జారితే, వండిన పదార్థాలను వృథా చేసి, మరలా కొత్తగా నైవేద్యాలను అన్నింటినీ సిద్ధం చేస్తారు. ఆ ప్రసాదాలనే భక్తులకు విక్రయిస్తారు. జగన్నాథుజు ప్రసాదప్రియుడు. అందుకే ఇన్ని రకాల నైవేద్యాలు.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list