Vemavaram kondalamma
కొలిచిన వారికి కొండంత అండ...
పుణ్య తీర్థం
అదేం చిత్రమో... ఆ ఊరికెళ్లి కొండ... అన్నామంటే కనీసం ఓ పదిమంది చెవులు రిక్కిస్తారు. ఆ ఊరేకాదు... చుట్టుపక్కల మండలాల్లోని వివిధ జిల్లాల్లో కూడా కొండా, కొండలమ్మ, కొండయ్య, కొండబాబు వంటి పేర్లు ఇంచుమించు ఇంటికొకటి చొప్పున వినిపిస్తుంటాయి. ఎందుకంటే, కొలిచిన వారికి కొండంత అండగా ఉన్న ఆ దేవత పేరును తమ కడుపున పుట్టిన బిడ్డలకు పెట్టుకుంటూ... ఆ తల్లి పేరునే నిత్యం తలుచుకుంటున్నారంటే ఆ అమ్మవారి పట్ల భక్తులకు ఎంత ప్రేమో అర్థం అవుతుంది.
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం వేమవరంలో ఎంఎన్‌కే రహదారి పక్కనే దివాన్ సాహెబ్ రోడ్డు మురుగు కాలువకు రివిట్‌మెంట్ కడుతున్నారు. ఆ గోడను కొండరాళ్లతో నిర్మిస్తుండగా వాటిలో ఒకరాయి అమ్మవారిని పోలినట్లుగా కనబడడంతో ఆ రాయిని నిర్మాణంలో కలపకుండా పక్కన పెట్టారు. కొద్దిరోజులకు ఆ రాయిని రోడ్డుపక్కన నిలబెట్టి... పసుపు కుంకుమలు చల్లి భక్తులు పూజలు చేసేవారు. ఇంతలో అక్కడికి కొందరు బాతులు పెంచుకునేవారు వచ్చారు. వారు ఆ రాయి పక్కనే కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. అమ్మవారి విగ్రహం పక్కనే ఉండటం వలన ఆ బాతులు విపరీతంగా గుడ్లు పెట్టేవని పెంపకం దారులకు నమ్మకం ఏర్పడింది. ఆ బాతుల యజమానికి అనుకోని రీతిలో విపరీతమైన లాభాలు వచ్చాయి. సీజన్ పూర్తికావటంతో ఆ బాతుల యజమాని గుంటూరు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బాతుల్ని లారీలో వేసుకునేటపుడు వాటితోపాటు అమ్మవారిని కూడా తీసుకెళ్లాడు. గుంటూరు వెళ్లగానే అక్కడ బాతుల్ని దించారు. వాటితోపాటు అమ్మవారిని కూడా దించారు. ఏమైందో ఏమో... వెంటనే బాతులన్నీ ఉన్నట్టుండి తలలు వేలాడేశాయి. దాంతో అతను తన తప్పిదానికి లెంపలు వేసుకుని మరలా అమ్మవారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేసి, ప్రస్తుతం పూజలందుకుంటున్న స్థానంలోనే నిలిపాడు. ఈ నిదర్శనం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రచారం జరిగింది. అప్పటినుంచి అమ్మచెంతకు వచ్చి కోరినంతనే ఆ కోర్కెలను తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి గాంచారు ఈ అమ్మవారు.
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం కొండలమ్మ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచారు. కొండరాళ్లలో దొరకటం వలన ఆ తల్లిని కొండలమ్మ అనే పేరుతో భక్తులు పిలుస్తున్నారు. ఈ తల్లి నేల మీదనే తల వరకే భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారి అసాధారణమైన మహిమలతో చాలా తక్కువ కాలంలోనే దశదిశలకు వ్యాపించింది. బిడ్డ పుట్టినా, పెళ్లి జరిగినా పిల్లాపాపలు, నూతన వధూవరులు తమ కోర్కెలు తీరాక ఆ తల్లి సన్నిధిలోనే మొక్కుబడులను చెల్లించుకోవటం పరిపాటిగా మారింది. అమ్మవారి ఆలయానికి ప్రతి ఆదివారం భక్తులు భారీసంఖ్యలో విచ్చేసి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. గురువారం కూడా అమ్మవారికి భక్తుల తాకిడి ఉంటుంది.
ఈ ఆలయం ఎక్కడ ఉంది?
అమ్మవారు కొలువైన ప్రాంతం మచిలీపట్నం–నూజివీడు–కత్తిపాడు ప్రధాన రహదారి కావటంతో ఎవరు రోడ్డు వెంబడి వెళ్లినా ఆమె దర్శనం కొరకు నిలుస్తున్నారు. వాహనాల్లోనే గాక నడిచి వెళ్లినా రాకపోకల్లో గుడివద్ద ఆగి... అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. పాలపొంగళ్లను సమర్పిస్తారు. దేవాదాయ శాఖ లెక్కల ప్రకారం... కృష్ణాజిల్లాలోని శక్తి ఆలయాల్లో ఆదాయంలో మూడవ స్థానంగా ఈ ఆలయానిదే కావడం విశేషం.
ఈ ఆలయానికి ఇలా వెళ్లాలి ...
విజయవాడ నుంచి బస్సు రూట్‌లో కొండలమ్మ గుడికి వెళ్లాలంటే గుడివాడ వరకు 50 కిలోమీటర్లు రావాలి. అక్కడి నుంచి జిల్లా కేంద్రం మచిలీపట్నం వెళ్లే బస్సులు ఉంటాయి. కేవలం 17 కిలోమీటర్ల దూరంలో అమ్మవారు వేంచేసిన వేమవరం గ్రామంలో భక్తులు దిగవచ్చు. అలాగే రైలు మార్గం ద్వారా మచిలీపట్నం నుంచి గాని విజయవాడ నుంచి గాని రావాలన్నా కౌతవరం లేక గుడ్లవల్లేరు, వడ్లమన్నాడు రైల్వేస్టేషన్లలో ఆగే రైళ్ల నుంచి రావచ్చు.
– అయికా రాంబాబు, సాక్షి, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565