MohanPublications Print Books Online store clik Here Devullu.com

బంధాన్ని బలపరిచే విహారాలు ViharaYatra

బంధాన్ని బలపరిచే
               విహారాలు

‘ప్రేమ యాత్రలకు బృందావనమూ నందనవనమూ ఏలనో / కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో..’ పాట మనందరికీ సుపరిచితమే! నచ్చిన వ్యక్తి తోడుంటే మండుటెండ కూడా పండువెన్నెలను తలపిస్తుందనేది పింగళివారి మధురభావన. ఆ భావుకత్వాన్ని ఎంతమాత్రం తప్పుపట్టలేంగానీ ఏ ­రూ వెళ్ళకుండా ఇల్లే ప్రపంచమనుకుని ఇంట్లోనే కూర్చుంటే యాంత్రికత వచ్చేస్తుందంటున్నారు మానసిక నిపుణులు. దాంపత్యానికి సంబంధించిన అధ్యయనాల్లోనూ దైనందిన జీవితపు బరువుబాధ్యతల నుండి కాస్తంత ఆటవిడుపు లేకుంటే డస్సిపోతారని, అపుడపుడూ విహారాలకు వెళ్ళడంవల్ల మనోల్లాసం కలగడమేగాక ఆలుమగల అనుబంధం గాఢమవుతుందని చెబుతున్నారు.
నిశ్చితార్థమయ్యాక కాబోయే భార్యాభర్తలు కాసేపు షికారుకెళ్ళినా, పెళ్ళయిన కొత్తలో ­టీ కొడైకెనాలంటూ ప్రణయయాత్రలు చేసినా ఆనందపారవశ్యాలు సొంతం చేసుకోడానికే! దగ్గర్లో ఉన్న పార్కు మొదలు దూరంగా ఉండే పర్యాటక ప్రదేశాల వరకూ వేటికవే దిగులు, ఒత్తిళ్ళను పోగొట్టే దివ్యౌషధాలు. కనుక సంసార బాధ్యతల నుండి కాస్తంత విరామం, వినోదం కోసం విహారయాత్రలకు వెళ్తే సరి ఎంచక్కా రీచార్జయిపోతాం. మనసు హుషారుగా ఉరకలేస్తుంది. యాంత్రిక బాటనొదిలి కాసేపు ఉద్యానవనంలో విహరించినట్లుంటుంది.
దైనందిన జీవితంలో బాధ్యతలను ఇష్టంగా, మరింత మెరుగ్గా నిర్వహించేందుకు అడపాదడపా ప్రయాణాలు వేసుకోవాల్సిందే! దాంతో రోజూవారీ దిగుళ్ళు గుబుళ్ళు మాయమై జీవనమాధుర్యం అనుభూతికొస్తుంది. ఆధునిక పోటీ ప్రపంచంలో పనుల ఒత్తిడే కాదు.. టీవీ, ఫోను, కంప్యూటర్ల కారణంగానూ భాగస్వామితో గడిపే సమయం తగ్గుతోంది. విహారయాత్రలు వాటిని కచ్చితంగా పక్కనపెడతాయి. నవ్వుతూ తుళ్ళుతూ కమ్మటి కబుర్లు చెప్పుకుంటూ సరదాగా, సంతోషంగా కాలయాపన చేసేందుకు వెసులుబాటు చిక్కుతుంది. అందువల్ల ఆర్నెల్లకోసారయినా అవకాశం కల్పించుకుని కుటుంబంతో లేదంటే కనీసం భాగస్వామితో కలిసి బంధుమిత్రుల ­ళ్ళకో, దర్శనీయ స్థలాలకో వెళ్తుండాలి. ఈ ఆనందాల విందుపై ఆశవున్నా అదనపు ఖర్చని భయపడేవారెక్కువ.. నిజానికి యాత్రలవల్ల పొందే అమోఘ ప్రయోజనాల ముందు అందుకోసం ఖర్చుపెట్టే సొమ్ము అత్యల్పమంటే అతిశయోక్తి కాదు.
లాభాలెన్నో!
* పరిసరాల మార్పుతో యాంత్రికత పోయి హాయిగా సేదదీరగలుగుతారు. రోజూవారీ అలసటలు, అసహనాలు లేకపోవడంవల్ల ఒత్తిడి తగ్గి వ్యక్తిత్వం వికసిస్తుంది.
* సరదాగా, సంతోషంగా గడపడంవల్ల మనసు, మెదడు చురుగ్గా పనిచేస్తాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
* అపరిచితుల నడుమ బెరుకు, భయాలు మరచి యథేచ్ఛగా గడపగలుగుతారు. హాయిగా తిరుగుతూ ఆటపాటలతో గడపడంవల్ల ఒంట్లోని అధిక కొవ్వు తగ్గుతుంది.
* ఇంట్లో ఎవరి పనుల్లో వారుంటారు. విహారసమయాల్లో మానసికంగా, శారీరకంగా దగ్గరై, పరస్పర అవగాహన పెరుగుతుంది.
* ఇద్దరూ అన్యోన్యంగా మెలగడంవల్ల సఖ్యత పెరిగి, బాంధవ్యం బలపడుతుంది.
* మూస ధోరణికి స్వస్తిచెప్పి మనసు లోతుల్లోంచి మాట్లాడుకోగలుగుతారు.
* జీవిత భాగస్వామి సాన్నిహిత్యం, ప్రకృతి పరిశీలనలతో ఆందోళనలు, అనారోగ్యాలు దూరమవుతాయి.
* కొత్త వాతావరణం, కొంగొత్త ప్రదేశాల దర్శనం, విభిన్న వంటల ఆస్వాదన, వినూత్న సామగ్రి కొనుగోలు ఇద్దరినీ ఆనందాల్లో ముంచెత్తుతుంది.
* ఇద్దరిమధ్యా ఒకవేళ అపార్థాలేమైనా ఉంటే విహారాల్లో ఇట్టే తొలగిపోతాయి.
* కొత్త అనుభవాలు, అనుభూతుల్ని ప్రోది చేసుకున్న ఆ క్షణాలు మదిలో మధురస్మృతులుగా ఉంటాయి.
- నాగరత్న

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list