అన్నం పరబ్రహ్మం
మనిషి జీవితాన్ని నిలబెట్టడానికి ఎన్నో ప్రాణులు తమ జీవితాల్ని సమర్పించుకుంటున్నాయి. ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే, అతడు తాను తీసుకునే ఆహారం పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలో తెలుస్తుంది. ఆ పవిత్ర భావం కలిగినప్పుడు, మనిషి సహజంగా తనకు ఎంత అవసరమో అంతే ఆహారం తీసుకుంటాడు. వృథాకు తావుండదు.
ఏ రకమైన ఆహారం, ఏ విధంగా పనిచేస్తుందన్న అవగాహన ఎంతో ముఖ్యం. ఇద్దరు వ్యక్తులు- ఒకేలాంటి ఆరోగ్యం కలిగినవారు, ఒకే రకమైన పోషక విలువలు గల ఆహారం తీసుకున్నారు. ఒకరు ఎంతో ఆనందంతో స్వీకరిస్తే, మరొకరు పోషణ నిమిత్తం అని భావించారు. ఆనందంతో ఆహారం తీసుకున్న వ్యక్తికి, తక్కువ పరిమాణంలోని ఆహారం ఎక్కువ పోషణ అందించిందని వెల్లడైంది. దీనికి శాస్త్రీయపరమైన ఆధారముంది. జీవితం పట్ల అవగాహన కలిగిన ఎవరికైనా ఇదెంత యథార్థమో అర్థమవుతుంది. ఆహారాన్ని కృతజ్ఞతాభావం, పూజ్యభావంతో స్వీకరించినప్పుడు అది మహాప్రసాదం అవుతుంది. ఎంత పరిమాణంలో తీసుకున్నా, దేహావసరాలకు దోహదపడి అద్భుత ఫలితాలనిస్తుంది.
మరో ఆయువు తనలో భాగమవుతోందనే వాస్తవాన్ని మనిషి అవగాహన చేసుకోవాలి. ఆ విచక్షణ అతడికి అవసరం. గొప్ప సంతృప్తినిచ్చే ఈ భావాన్ని తెలుసుకుంటే చాలు. ఇదే ప్రేమ, భక్తి, ఆత్మసమర్పణ భావం! ఆధ్యాత్మిక స్థితిని చేరుకోవడానికి ఇది అంతిమ లక్ష్యం.
ఆహారం తీసుకునేముందు ధ్యానం చేయాలి. కళ్ళుమూసుకుని, శరీరానికి అవసరమయ్యే పవిత్ర ఆహారంగా భావించాలి. ఆహారం నమిలి తినాలి. అప్పుడే ఆనందం.
లోకంలో ఆహారం కనిపిస్తుంది... కదిలిస్తుంది... శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రభావాన్ని కలిగిస్తుంది. భీష్ముడు మరణశయ్యపై ఉన్నప్పుడు ఏం చెప్పాడు? దుష్ట ఆలోచనలు కలిగిన దుర్యోధనుడి ఆహారం తిన్న ఫలితంగానే- నిండుసభలో ద్రౌపది అవమానానికి గురవుతున్న సందర్భంలో తాను మానసికంగా బలహీనుణ్ని అయ్యానని, అంపశయ్య మీద పడుకున్నప్పుడే ఆ దుష్ఫలితం పోయిందనే కదా!
భగవంతుడికి ప్రసాదంగా సమర్పితమయ్యేది ఆహారం. యజ్ఞయాగాదుల్లో, అగ్నికి ప్రార్థనలో భాగంగా ఆహారాన్ని సమర్పించడం కృతజ్ఞతకు చిహ్నం.
ఆహారాన్ని నలుగురితోనూ పంచుకోవడం విశ్వప్రేమకు తార్కా ణం. అది ఏకత్వ భావన కలిగిస్తుంది. ఏ పదార్థమైనా, అంతా ఏకమై ఆహార రూపంలో మనిషిలోకి చేరుతుంది. భుజించడం అనే ఒకే ఒక స్వల్పక్రియ ద్వారా, ఆ కలయిక విశేష అనుభవంగా రూపుదిద్దుకుంటుంది. సర్వం సృష్టికర్త ఇష్టానుసారమే! సంస్కృతంలో ‘సహనా భవతు... సహనౌ భునక్తు...’ అనే ప్రార్థన ఉంది. ‘కలిసి ఉందాం, కలిసి భుజిద్దాం, కలిసి శక్తిని ఉత్పత్తి చేద్దాం. మన శక్తికి హద్దన్నదే లేదు, ఏ శత్రుభావమూ లేదు. శాంతి...శాంతి...శాంతి’- ఆ విధంగా ప్రతి మనిషీ తనను తాను సంసిద్ధుణ్ని చేసుకోవాలి.
స్వీకరించేటప్పుడు, ఆహారం పట్ల పవిత్ర భావాన్ని అంతరంగంలో నిలపాలి. పరిపూర్ణ విశ్వాసంతో ఆస్వాదించాలి.
ఒక స్థితి నుంచి మరో స్థితిలోకి ఆహారం రూపాంతరం చెందుతుంది. ఒకప్పుడు మట్టి, కొన్నాళ్ళకు అందులో నుంచి మొక్క... ఒక్కో దశ దాటి అది రుచుల్ని సంతరించుకుంటుంది. చివరికి ఆహారమవుతుంది. ఆ తరవాత మనిషిలోకి చేరుతుంది. మట్టి- మానవ స్వభావంలోకి మార్పు చెందడం ఓ పరిణామాత్మక దశ. మనిషి సంకల్పిస్తే ఇదే మట్టిని భగవత్ స్వరూపంగా మార్చి పదిలపరచుకోవచ్చు.
దైవీగుణాలతో శాంతిని ప్రసరింపజేసే ఆహారాన్ని ‘అన్నపూర్ణ’గా కొలుస్తాం. ‘అన్నం బ్రహ్మం’- ఆహారమే దైవం. మానవ నిజజీవితంలో- పీల్చే గాలి, తాగే నీరు, నడిచే నేల... వీటి సమ్మిళితమే ఆహారం. అంతా దైవమయమే, అంతా వూపిరి నిలిపేదే! దేనికదే ఉంటే, అది ఆహారం అనిపించుకోదు. అన్నీ కలిసినప్పుడే- మెతుకైనా, బతుకైనా... అప్పుడే ఏ జీవికైనా భవిష్యత్తు!
- మంత్రవాది మహేశ్వర్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565