మొబైల్ వేగం...మీ చేతుల్లోనే ఉంది!
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నా, అది వేగంగా పని చేయకపోతే విసుగొస్తుంది. మరి మీ మొబైల్ వేగం మందగించినప్పుడల్లా కొన్ని చిట్కాలతో దాన్ని పెంచవచ్చని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం.
వాల్‌పేపరే కదా అనుకోవద్దు!
మొబైల్ స్క్రీన్ మీద అక్వేరియంలోని చేపలు, ఎగిరే గాలి పటాలు లాంటి కదలాడే వాల్‌పేపర్లు పెడుతుంటారు. ఇవి చూడటానికి బాగున్నా మొబైల్ వేగాన్ని తగ్గించేస్తాయి. తక్కువ ర్యామ్, పాత తరం ప్రోసెసర్లు ఉన్నవాటిలో అయితే మరీ ఇబ్బంది. మూవింగ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటాయి. లేకపోతే తెర మీద ఆ కదలికలు కుదరవు. కాబట్టి వీలైనంతగా సాధారణమైన వాల్‌పేపర్లు వాడుకోవడం మంచిది. ఉదాహరణకు ర్యామ్‌ను ఎక్కువగా ఉపయోగించే క్రోమ్ లాంటి ఆప్‌ను ఎక్కువసేపు వాడిన తర్వాత మినిమైజ్ చేస్తే మొబైల్ స్క్రీన్ కాసేపు ‘లోడింగ్’ అని వచ్చి ఆగుతుంది. మీ ర్యామ్ స్క్రీన్‌సేవర్, క్రోమ్‌ను ఒకేసారి రన్ చేసి డౌన్ అవ్వడమే కారణం.
ఇచ్చిన లాంచరే ఎందుకు?
స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ కనిపించే విధానం, ఐకాన్లు, నోటిఫికేషన్లు, మెనూ .. ఇవన్నీ మొబైల్ లాంచర్ కిందకే వస్తాయి. ప్రతి మొబైల్‌లో ఇన్‌బిల్ట్‌గా ఓ లాంచర్ ఉంటుంది. అది మొబైల్ ప్రత్యేక ఫీచర్లను తెలిపేలా ఎక్కువ సైజులో ఉంటూ ఎక్కువ ర్యామ్‌ను వినియోగిస్తుంటుంది. కాబట్టి తక్కువ యానిమేషన్లతో ర్యామ్ యూసేజ్ మితంగా ఉండే లాంచర్లను వాడితే మంచిది. ప్లేస్టోర్‌లో రకరకాల ఫీచర్లతో లాంచర్లు ఉన్నాయి. గూగుల్ నౌ, ఈవ్, నోవా, మైక్రోసాఫ్ట్ యారో అంటూ ప్రతి సంస్థ లాంచర్లను రూపొందించింది.
ఉన్న బ్రౌజర్ బెటరా?
కంప్యూటర్‌లో బ్రౌజర్ అనగానే మనకు ఫైర్‌ఫాక్స్, క్రోమ్ గుర్తుకొస్తాయి. అదే మొబైల్‌లో అయితే ఒక డీఫాల్ట్ బ్రౌజర్ ఉంటుంది. అందులో కొన్ని ప్రత్యేక ఫీచర్లున్నా... వాటి వల్ల ర్యామ్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ప్లే స్టోర్‌లో ఉన్న మరికొన్ని బ్రౌజర్లు వేగంగా పని చేస్తాయి. సమాచార శోధన చేసేటప్పుడు త్వరితగతిన ఫలితాలు పొందడానికి ఇవి ఉపయోగపడతాయి. గూగుల్ క్రోమ్ ఈ విషయంలో ముందుంది. ఒపెరా బ్రౌజర్ కూడా మంచి ఎంపికే. అందులో ఉన్న పాప్‌అప్ బ్లాకర్, డేటా సేవర్ ఆప్షన్లు బ్రౌజర్ వేగంగా స్పందించడానికి ఉపకరిస్తాయి.
వేరే ఏమన్నా ఉన్నాయా?
ఫేస్‌బుక్ ఆప్‌ను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే... మీ ఫోన్ 15 శాతం తక్కువ వేగంగా పని చేస్తుంది. ఇదీ అంతర్జాతీయ టెక్ నిపుణుల మాట. సుమారు 80 ఎంబీ ఉండే ఆప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే డేటాతో కలిపి అది 500 ఎంబీ ఆక్రమిస్తుంది. స్నాప్ చాట్ ఆప్ విషయంలోనూ ఇదే పరిస్థితి. అందుకే ఇలాంటి ఆప్స్ అవసరం లేదు అనుకుంటే తొలగించడం మంచిది. ఫేస్‌బుక్‌కు బదులు ఫేస్‌బుక్ లైట్ ఉంది. ప్రధాన ఆప్‌లో ఉండే చాలా సౌకర్యాలను దీంట్లోనూ పొందొచ్చు. ఇది తక్కువ ర్యామ్ యూసేజీతో పని చేస్తుంది. అలా మిగిలిన ఆప్స్‌కు ఏవైనా ప్రత్యామ్నాయాలు చూసుకొని వాటిని వినియోగించండి.
యాంటీ వైరస్‌కు యాంటీ
స్మార్ట్‌ఫోన్లలో యాంటీవైరస్ ఆప్‌లు వినియోగించే విషయంలో చాలా రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కువమంది యాంటీ వైరస్ ఆప్‌లు మొబైల్ వేగాన్ని తగ్గిస్తాయని అంటున్నారు. ప్రతి మొబైల్‌లోనూ డీఫాల్ట్‌గా దీని కోసం ఓ ఆప్‌ను ఇస్తున్నారు. అది మీ అవసరాలకు తగ్గట్టు పని చేస్తుంది. దీనికి అదనంగా మరో యాంటీ వైరస్ అవసరం లేదు. ప్లేస్టోర్‌లో యాంటీవైరస్ పేరుతో చాలా ఆప్‌లు ఉన్నాయి. ప్రముఖ సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి. ఇవి కంప్యూటర్లలో ఉపయోగపడినంతగా మొబైల్స్‌లో ప్రభావం చూపలేకపోతున్నాయి.
సింక్ అయితే
మనకు సోషల్ నెట్‌వర్క్ ఆప్స్, వాతావరణ వివరాలు తెలిపే ఆప్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు పంపిస్తుంటాయి. ఆ ఆప్స్ ఆటోమేటిక్ సింక్ అయినప్పుడే ఆ వివరాలు వస్తాయి. ఫోన్ వేగం మందగించడానికి ఇవీ ఒక కారణమే. అనవసరం అనుకున్న ఆప్స్ సింక్ టైమింగ్‌ను మార్చేయండి. ఉదాహరణకు గూగుల్ మ్యాప్స్ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ వివరాలు నోటిఫికేషన్ల రూపంలో పంపిస్తుంటుంది. అంటే దీని కోసం మ్యాప్స్ ఆప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్నట్లే. దీన్ని ఆఫ్ చేస్తే ఫోన్ మీద భారం తగ్గినట్టే. అలాగే వైఫై వినియోగిస్తున్నప్పుడే మొబైల్ ఆటో సింక్ అయ్యేలా మార్పులు చేసుకోవచ్చు. దీని కోసం మొబైల్ సెట్టింగ్స్‌లో సింక్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. అందులో ‘ఆటో సింక్ ఆన్ వైఫై ఓన్లీ’ ఆప్షన్‌ను ఎంచుకోండి. లేదంటే ఆటో సింక్‌ను పూర్తి ఆఫ్ చేయండి.
ఇబ్బంది పెడితేనే కాదు
మొబైల్‌లో సమస్య వచ్చినప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ చేస్తుంటాం. అలా కాకుండా అప్పుడప్పుడు రీసెట్ చేస్తే మొబైల్ పని చేసే తీరులో మార్పు ఉంటుంది. అయితే ప్రతిసారి డేటాను బ్యాకప్ తీసుకోవాలి. తర్వాత రెస్టోర్ చేసుకోవాలి. దీనికి మీరు సిద్ధమైతే.. కుదిరినప్పుడల్లా మొబైల్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిదని టెక్ నిపుణుల సూచన. దీని కోసం సెట్టింగ్స్‌లోని బ్యాకప్ అండ్ రీసెట్ ఆప్షన్‌లోకి వెళ్లండి. అందులోని ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్‌ను ఒత్తితే సరి.
స్పీడ్ కిల్లర్స్
బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే ఆప్స్‌ను క్లియర్ చేయడం కోసమని కొన్ని, బ్యాటరీని అధికంగా వినియోగించే ఆప్స్‌ను ఆపేయడానికని ఇంకొన్ని ఆప్‌లు ప్లే స్టోర్‌లో ఉన్నాయి. టాస్క్ కిల్లర్స్‌గా పిలిచే ఈ ఆప్స్‌ను మొబైల్ స్పీడ్ కిల్లర్స్ అంటున్నారు నిపుణులు. ఈ ఆప్‌లు మొబైల్ వేగాన్ని పెంచకపోగా మరింత తగ్గిస్తాయిట. కొత్త తరం మొబైల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే ఆప్స్‌ను క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక ఆప్‌ను మినిమైజ్ చేస్తే కాసేపటికి అది నిద్రావస్థలోకి వెళ్లిపోతుంది. తర్వాత దాన్ని మళ్లీ ఓపెన్ చేస్తేనే యాక్టివేట్ అవుతుంది.
వాటిని నమ్మకండి
మొబైల్‌లో ఈ చిన్న మార్పు చేసుకోండి, మీ ఫోన్ వేగం అమాంతం పెరిగిపోతుంది. కాకపోతే మీ ఫోన్‌ను రూట్ చేయాలని కొంతమంది చెబుతుంటారు. ఇది నిపుణులకు, ప్రయోగాలు చేసేవాళ్లకు ఓకే కానీ సాధారణ వినియోగదారులకు కాదు. డెవలపర్ మోడ్ కూడా ఇలాంటిదే. ర్యామ్ బూస్టర్, ఎస్డీ కార్డు స్పీడ్ అప్పర్ అంటూ కొన్ని సాఫ్ట్‌వేర్ల గురించి అంతర్జాలంలో కథనాలు వస్తున్నాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసుకునే బదులు పై చిట్కాలు వాడుకుంటే మంచిది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565