తిరుక్కడిగై
నమో భక్తవత్సలా... నమో యోగాంజనేయా! సాధారణంగా నరసింహస్వామి అనగానే ఆయన ఉగ్రరూపమే కన్నులముందు కదలాడుతుంది. ఆయన ప్రసన్నవదనంతో కనిపించే ఆలయాలు ఉన్నప్పటికీ యోగభంగిమ లో కనిపించే ఆలయాలు మాత్రం అరుదు. అలా ఆ స్వామి యోగభంగిమలో సాక్షాత్కరించే క్షేత్రమే తిరుక్కడిగై. తమిళనాడులోని తిరుత్తణికి కొద్దిదూరంలో ఉండే తిరుక్కడిగై 108 వైష్ణవదివ్యదేశాలలో ఒకటి. దీనికే చోళంగిపురం, చోళసింహపురం, షోలింగూర్ అనే పేర్లున్నాయి. ఇది అత్యంత మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.
స్వామివారిని ఇక్కడి వారు అక్కారప్పన్ అని పిలుచుకుంటారు. ఇక్కడి తీర్థానికి అమృత తీర్థమని పేరు. అమ్మవారు అమృతవల్లి తాయారు అనే పేరుతో పూజలు అందుకుంటున్నారు. స్వామివారి ఉత్సవమూర్తికి భక్తవత్సలన్ అని పేరు. ఈ స్వామి సన్నిధికి వెనక ఆదికేశవర్ అంటే ఆదికేశవ స్వామి భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఇక్కడికి సమీపంలోనే గల చిన్న కొండపైన యోగాంజనేయస్వామి ఆలయం ఉంది. ఆంజనేయుడు కూడా యోగముద్రలో చతుర్భుజాలతో శంఖచక్రగదాభయ హస్తాలతో దర్శనమిస్తాడు.
ఆంజనేయుని సన్నిధికి తిరుక్కోవిల్ అని పేరు. ప్రతివారం వేలాదిగా భక్తులు విచ్చేసి, స్వామివార్లకు పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయించుకుని తమ సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంటారు. ముఖ్యంగా దీర్ఘరోగులు, మానసిక రోగులు, నరాల బలహీనతలు ఉన్నవారు, మూర్ఛవ్యాధి ఉన్నవారు, రక్తహీనతతో బాధపడేవారు, పిశాచ భ్రమలు ఉన్నవారు ఈ రెండు ఆలయాలలోనూ పూజలు చేయించుకుంటారు. ఈ క్షేత్రానికి పాద శ్రీరంగమని, పుష్కరిణికి తిరుక్కావేరి అనీ పేర్లున్నాయి. స్థలపురాణం: హిరణ్యకశిపుని సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు నారసింహావతారం ధరిస్తాడని తెలిసిన సప్తరుషులు స్వామిని దర్శించుకునేందుకుగాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మహావిష్ణువు తన అవతార ధారణకు తగిన సమయం కోసం వేచి ఉన్నాడు.
అదే సమయంలో హిరణ్యకశిపుడు ‘‘ఏడీ, ఈ స్తంభంలో ఉన్నాడా ఆ శ్రీహరి? అంటూ మదాంధకారంతో స్తంభాన్ని ఒక్క తాపు తన్నడంతో మహావిష్ణువు ఉగ్రనరసింహావతారం ధరించి ఆ స్తంభం నుంచి వెలుపలికి వచ్చి దుష్టదానవుడిని చీల్చి చెండాడిన విషయం తెలిసిందే. ఈలోగా సప్తర్షులు తన ఆగమనం కోసం వేచి ఉన్నారని గ్రహించిన విష్ణుమూర్తి వారికోసం క్షణకాలం ఈ ప్రదేశంలో వారికి యోగముద్రలో కనిపిస్తాడు. అదే రూపంలో పెరియమలై అనే కొండపైన వేలిశాడు. అదే తిరుక్కడిగై. కడిగై అంటే క్షణకాలం అని అర్థం. రాక్షస సంహారం అనంతరం కూడా నరసింహస్వామి ఉగ్రరూపం వీడకపోవడంతో ఆయనను శాంతపరచడం కోసం హనుమంతుడు ఇక్కడి చిన్నమలై అనే కొండపైన ఆయనకు అభిముఖంగా ఉండి ప్రార్థిస్తాడు. తిరుక్కడిగై అంటే పరమ పవిత్రమైన సమయం లేదా ప్రదేశం అని అర్థం చెప్పుకోవచ్చు.
విశ్వామిత్రుడు ఈ స్వామివారిని అర్చించి బ్రహ్మజ్ఞానం పొందాడని, నవగ్రహాలలో ఒకరైన బుధుడు ఈ స్వామిని సేవించి తనకు దుర్వాసుడు ఇచ్చిన శాపాన్ని పోగొట్టుకున్నాడని స్థలమహాత్మ్యం తెలుపుతోంది. ఆలయానికి చేరువలోగల బ్రహ్మపుష్కరిణిలో స్నానం చేస్తే దీర్ఘవ్యాధులు నయమవుతాయని, సింహకోష్టాకృతిలో గల ఆలయ విమాన గోపురాన్ని సందర్శిస్తే సర్వపాపాలూ పటాపంచలవుతాయనీ ప్రతీతి. తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం, శ్రీపురం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర స్వామి ఆలయం, అరుల్మిగు లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇక్కడికి దగ్గరలోని ఇతర చూడదగ్గ పుణ్యస్థలాలు.
ఎక్కడ ఉంది? ఎలా వెళ్లాలి?
తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని షోలింగూర్ అనే గ్రామంలో గల కొండపైన ఉందీ ఆలయం. ఎన్‌హెచ్ 4– ఎన్‌హెచ్ 46 జాతీయ రహదారిపై గల ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే ముందుగా తిరుత్తణి లేదా వెల్లూరుకు వెళ్లాలి. అక్కడినుంచి షోలింగూర్‌కు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి వెల్లూరుకు రైళ్లున్నాయి. (కాట్పాడి) లేదా అరక్కోణం, జోలార్‌పేటైలకు చేరుకోగలిగితే అక్కడి నుంచి తిరుక్కడిగైకి వెళ్లచ్చు.
– డి.వి.ఆర్. భాస్కర్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565