జీర్ణం...జీర్ణం...వాతాపి జీర్ణం!
జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులను మనందరం ఏదో ఓ సందర్భంలో ఎదుర్కొంటూ ఉంటాం. ఒక సందర్భంలో ఆకలి మందగిస్తుంది. మరోసారి అజీర్తి చేస్తుంది. ఇంకోసారి తిన్న వెంటనే పొట్టలో మంట మొదలవుతుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఈ సమస్యలు ఎందుకొస్తాయి? వాటికి పరిష్కారాలేంటి? చికిత్సలేంటి? జీర్ణం...జీర్ణం...వాతాపి జీర్ణంలా అరుగుదల సక్రమంగా ఉండాలంటే ఏం చేయాలి?
బండి నడుస్తున్నంత వరకూ ఫరవాలేదు. మొరాయించినప్పుడే దాని ఇంజన్‌లోకి తొంగి చూస్తాం. అవసరమైన మరమ్మతులు చేయించి తిరిగి పరిగెత్తిస్తాం.
అలాంటి పరిస్థితే మన జీర్ణ వ్యవస్థది కూడా! తిన్నది అరిగించుకుని శక్తి సమకూరుతున్నంత వరకూ దానికో వ్యవస్థ ఒకటుందనే విషయాన్నే మర్చిపోతాం. ఎప్పుడైనా అది మొండికేసి, ఫలితంగా ఏదైనా ఇబ్బంది తలెత్తితే, అప్పుడు కంగారు పడిపోయి వైద్యుల్ని ఆశ్రయిస్తాం. కానీ ఆ సమస్యలే తలెత్తకుండా నియంత్రించుకోగలిగే మార్గాలు మన ముందరే ఉంటాయి. వాటిని తెలుసుకుని మసలుకోగలిగితే ఏ సమస్యా ఉండదు. జీర్ణ వ్యవస్థకు సంబంధించి సాధారణంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...
అజీర్తి
దరినీ అడపా దడపా వేధించే సమస్యే ఇది. అరుగుదల మందగించటం మూలంగా తలెత్తే అజీర్తితోపాటు అల్సర్లు, గాల్‌బ్లాడర్ డిసీజ్‌ల వల్ల కూడా అజీర్తి మొదలవుతుంది. కాబట్టి ఈ లక్షణం తాత్కాలికంగా కనిపించి కనుమరుగైతే ఫరవాలేదు. కానీ పదే పదే తిరగబెడుతుంటే తప్పక వైద్యుల్ని కలవాలి.లక్షణాలు: పొట్టలో మంట, పొత్తి కడుపు నొప్పి, కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ (బ్లోటింగ్), త్రేన్పులు, వాంతులు, కడుపులో శబ్దాలు.
కారణాలివే: మనం తిన్న ఆహారం పూర్తిగా అరగటానికి కనీసం 4 గంటల సమయం పడుతుంది. ఆలోగా మళ్లీ ఆహారం తీసుకుంటే అజీర్తి తలెత్తటం ఖాయం. కనిపించిన ప్రతి పదార్థం రుచి చూసే అలవాటు కొందరికి ఉంటుంది. ఇంకొందరికి ఆకలి వేసినా వేయకపోయినా ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. ఇలాంటి వాళ్లకు అజీర్తి తలెత్తటం ఎంతో సహజం. అలాగే అవసరానికి మించి తిన్నా, త్వరత్వరగా తిన్నా, ఆహారాన్ని పూర్తిగా నమలకుండా తిన్నా, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తిన్నా, ఒత్తిడిలో ఉండి ఆహారం తీసుకున్నా.. అజీర్తి తలెత్తుతుంది.
పరిష్కారాలు: ఆహారం తినే వేళలు సక్రమంగా పాటించాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. అలాగే తినేటప్పుడు కొందరికి మాట్లాడే అలవాటు ఉంటుంది. దీని వల్ల ఆహారంతోపాటు గాలిని కూడా మింగేస్తారు. దాంతో కడుపులో గాలి చేరి అజీర్తిని కలిగిస్తుంది. కాబట్టి ఆహారం తినేటప్పుడు మాట్లాడకూడదు. ఆహారం తింటున్నప్పుడు కాకుండా తిన్న తర్వాతే నీళ్లు తాగాలి. రాత్రి బాగా పొద్దుపోయాక తినకూడదు. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తగ్గించాలి. అజీర్తిని పెంచే కాఫీ, మద్యపానం, ధూమపానం మానేయాలి.
ఎసిడిటీ
ఎసిడిటీని పిహెచ్ విలువలో కొలుస్తారు. ఇది 0 నుంచి 14 మధ్య ఉంటుంది. ‘0’ అత్యంత ఎక్కువ ఎసిడిటీ తత్వానికి సూచన. మనం తాగే నీటి పిహెచ్ వాల్యూ...‘7’. జీర్ణాశయంలో తయారయ్యే యాసిడ్ పిహెచ్ వాల్యూ 1.5 - 3.5. అయితే ఈ అంకెల్లో హెచ్చుదలలే ఎసిడిటీకి కారణమవుతూ ఉంటాయి. మనం తినే పదార్థాల పిహెచ్ వాల్యూ, జీర్ణకోశంలో తయారయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ పరిమాణాల వల్లే ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది.
లక్షణాలు: తిన్న వెంటనే ఛాతీలో విపరీతమైన మంట, నొప్పి. పుల్లని త్రేన్పులు.
కారణాలు: జీర్ణకోశంలో అవసరానికి మించి ఎక్కువ యాసిడ్ ఉత్పత్తి అయితే ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. మనం నమిలి మింగిన ఆహారం అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి చేరే మార్గంలో ఒక వన్ వే ఫ్లాప్ ఉంటుంది. ఇది మింగిన ఆహారం తిరిగి అన్నవాహికలోకి రాకుండా నియంత్రిస్తుంది. కొన్ని సందర్భాల్లో గొంతులోకి తన్నుకొచ్చే ఆహారం, యాసిడ్ వల్ల ఈ ఫ్లాప్ పైపొరలు దెబ్బతిని ఎసిడిటీ సమస్య మొదలవుతుంది. దాంతో ఛాతీలో మంట మొదలవుతుంది. ఎసిడిటీకి కారణాలు అనేకం. కొందరు ఆహార వేళల్ని అనుసరించరు. దాంతో జీర్ణాశయంలో యాసిడ్ ఎక్కువగా నిల్వ ఉండిపోయి ఇబ్బంది పెడుతుంది. అరుదుగా కొందరి జీర్ణాశయంలో ‘హెలికోబాక్టర్ పైలోరి’ అనే బ్యాక్టీరియా చేరి దాని వల్ల ఎసిడిటీ మొదలవ్వొచ్చు. నొప్పి నివారణ మందులు వాడినా, క్యాన్సర్, అల్సర్ ఉన్నా ఎసిడిటీ తప్పదు.
పరిష్కారాలు: ఎసిడిటీ మొదలవగానే యాంటాసిడ్ మాత్ర లోచ సిరప్పో తీసుకుని పనిలో పడిపోతూ ఉంటాం. కానీ దానికి మూల కారణాలను సరిదిద్దుకోం. దాంతో తాత్కాలిక ఉపశమనం కలిగినా తిరిగి సమస్య మొదలవుతుంది. కాబట్టి ఎసిడిటీకి అసలు కారణాన్ని కనిపెట్టి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. వేళకు ఆహారం తినటం, మసాలాలు, కారం ఎక్కువగా ఉండే పదార్థాలు తగ్గించటం చేయాలి. రాత్రి పడుకోబోయే ముందు ఆహారం తీసుకోవటం మానేయాలి. నిద్రకు రెండు గంటల ముందు వరకూ ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. నిమ్మజాతి పళ్లు, కూరగాయలకు దూరంగా ఉండాలి. ఎసిడిటీకి కారణమయ్యే ఒత్తిడిని తగ్గించుకోవటానికి యోగాలాంటివి అలవాటు చేసుకోవాలి.
మలబద్ధకం
ఎక్కువ శాతం మంది నిర్లక్ష్యం చేసే లక్షణమిది. మలబద్ధకం తలెత్తిందంటే పేగుల కదలికలు సాధారణం కంటే మందగించాయని, ఆ కదలికలు ఇబ్బందిగా పరిణమించాయని అర్థం. అయితే మల విసర్జన మనిషి మనిషికీ మారుతుంది. కొందరు రోజులో మూడు సార్లు వెళ్తే మరికొందరు వారంలో రెండు సార్లే వెళ్తారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు మల విసర్జన కాకపోతే మలబద్ధకంగా భావించాలి. అలాగే మూడు రోజుల తర్వాత విసర్జన సమయంలో మలం మరీ గట్టిగా, ఇబ్బందికరంగా మారినా మలబద్ధకమనే అనుకోవాలి.
లక్షణాలు: పెద్ద పేగుల్లో కదలికలు లేకపోవటం, మలం...గట్టిగా, చిన్నవిగా ఉండటం. మల విసర్జన తర్వాత పొట్ట పూర్తిగా ఖాళీ అవలేదని అనిపించటం, పొట్ట ఉబ్బరం, పొట్టలో నొప్పి.
కారణాలు: కాల్షియం, అల్యూమినియం ఉండే యాంటాసిడ్లు వాడినా, ఆహార వేళలు మారినా, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకున్నా, శారీరక వ్యాయామం లోపించినా, మల విసర్జన కోరికను బలవంతంగా అణుచుకునే అలవాటున్నా, ఒత్తిడి, హైపోథైరాయిడ్ సమస్యలు
పరిష్కారాలు: మలబద్ధకాన్ని వదలించటం తేలికే! రోజూ తాగే నీటితోపాటు మరో నాలుగు గ్లాసుల నీళ్లు ఎక్కువ తాగాలి. ఉదయాన్నే గోరు వెచ్చని ద్రవాలు తాగాలి. ఆహారంలో పళ్లు, కూరగాయలు పెంచాలి. విరేచనం తేలికగా అవటం కోసం రెండు వారాలకు మించి లాక్సేటివ్స్ వాడకూడదు. ఆలోగా సమస్య అదుపులోకి రాకపోతే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
ఆకలి మందగించటం
తినాలనే కోరిక మందగిస్తే ఆకలి మందగించినట్టే భావించాలి. ఈ లక్షణాన్ని అందరూ ఏదో ఓ సందర్భంలో ఎదుర్కొంటారు. కానీ రోజుల తరబడి ఆకలి లేకుండా తప్పనిసరై తినే పరిస్థితి నెలకొంటే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.
లక్షణాలు: అంతకుముందు ఇష్టంగా తినే పదార్థాలు కూడా తినాలని అనిపించకపోవటం, ఆహారానికి, ఆహారానికి మధ్య గంటల విరామం తీసుకున్నా ఆకలి అనిపించకపోవటం, కొద్ది ఆహారానికే చాలనిపించటం.
కారణాలు: అజీర్తి నెలకొన్నా ఆ సమస్య తొలిగేవరకూ ఆకలి మందగిస్తుంది. మానసిక ఒత్తిడి, భయం, మానసిక సమస్యల్లో కూడా ఆకలి తగ్గుతుంది. అలాగే, కామెర్లు, హైపోథైరాయిడ్ వ్యాధుల ప్రధాన లక్షణం కూడా ఆకలి మందగించటమే!
పరిష్కారాలు: ఆకలి మందగించటానికి అసలు కారణాన్ని కనిపెట్టగలిగితే ఈ సమస్యను అధిగమించటం కష్టమేం కాదు. ఆకలి తగ్గటానికి కారణమైన వ్యాధులకు చికిత్స చేయటం, అజీర్తి ఉంటే దాన్ని తొలగించుకోవటంతో సమస్యను తేలికగా పరిష్కరించుకోవచ్చు. ఆకలి తగ్గిందని ఆహారం తీసుకోకపోయినా ప్రమాదమే! పోషకాహార లోపం ఏర్పడటం, శరీర బరువు తగ్గటంలాంటివి జరగకుండా కొద్ది కొద్ది పరిమాణాల్లో ఆహారం తీసుకుంటూ క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఆహారంలో ఎక్కువ క్యాలరీలు, ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి.
చిరుతిళ్ల మీద ధ్యాస
రుచిగా ఉంటేనే ఆహారాన్ని ఇష్టంగా తినగలం. అయితే ఆహారపుటలవాట్లకు తగ్గట్టు రోజుకి మూడు పూటలా ఇంటి భోజనం మాత్రమే తినే అలవాటు కొందరికుంటే మరికొందరికి చిరుతిళ్లతోనే ఆకలి తీర్చుకునే అలవాటు ఉంటుంది. ఇంకొందరు ఆహార ప్రియులు రుచిగా, ప్రత్యేకంగా ఉండే ఆహారాన్నే ఇష్టంగా తింటారు. ఇలాంటి వాళ్లు చిరుతిళ్లకు బానిసలయ్యే అవకాశాలు ఎక్కువ.
లక్షణాలు: ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా ఆహార వేళలను పాటించకుండా ఉండటం, ఆకలి అనిపించగానే ఇంపుగా, రుచిగా ఉండే ఎలాంటి
పదార్థాన్నైనా తినేయటం, కొత్త రుచుల కోసం వెతుక్కోవటం... చిరుతిళ్లకు బానిసలైన వారి లక్షణాలు.
కారణాలు: ఈ అలవాటుకు చాలా చిన్న వయసులోనే బీజం పడుతుంది. ఏడ్చే పిల్లలకు తల్లితండ్రులు చాక్లెట్ కొనిపెట్టి ఏడుపు మాన్పిస్తూ ఉంటారు. దీన్ని అలుసుగా తీసుకునే పిల్లలు బయటి తిండిని అలవాటు చేసుకుంటారు. అదే అలవాటు వయసుతోపాటు పెరుగుతూ పోతుంది. దాంతో ఇంట్లో వండే కమ్మని భోజనం బదులుగా బయట దొరికే జంక్ ఫుడ్‌కు అలవాటు పడతారు.
పరిష్కారాలు: చిరుతిళ్ల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. వాటిలో ఉండే అధిక కొవ్వులు, నూనెలు ఆరోగ్యాన్ని హరిస్తాయి. ఆహార వేళలు పాటించకుండా తినే చిరుతిళ్ల వల్ల ఎసిడిటీ, అజీర్తి, విరేచనాలు వేధిస్తాయి. కాబట్టి ఇలాంటి వారికి క్రమక్రమంగా ఇంటి భోజనం అలవాటు చేయాలి.
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (ఐ.బి.ఎస్)
25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కుల్లో కనిపించే ఈ వ్యాధి స్త్రీలలోనే ఎక్కువ. కడుపులో కలిగే భిన్నమైన మార్పులతో ఇబ్బంది పెట్టే ఈ సమస్య ప్రమాదకరమైనది కాకపోయినా దైనందిన జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీర్ఘకాలంపాటు వేధిస్తుంది. ఈ సమస్య వల్ల కొందరు ఉద్యోగ వేళలు మార్చుకోవటం లేదా ఇంటి నుంచి పని చేయటం, అరుదుగా కొందరు పూర్తిగా ఉద్యోగమే మానుకుని ఇంటికే పరిమితమైపోవటం చేస్తూ ఉంటారు. ఐ.బి.ఎ్‌సలో కూడా రకాలున్నాయి. కొందరికి ఐ.బి.ఎ్‌సతోపాటు మలబద్ధకం, ఐ.బి.ఎ్‌సతోపాటు డయేరియా, ఇంకొందరికి రెండూ కలిసి ఉంటాయి.
లక్షణాలు: రోజు మొత్తంలో ఎక్కువ సార్లు విరేచనం కావటం లేదా మలబద్ధకంగా ఉండటం ఐ.బి.ఎస్ లక్షణం. అలాగే మలం కూడా పల్చగా, గట్టిగా, మెత్తగా లేదా నీళ్లలా....ఇలా మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు మలబద్ధకం వేధిస్తే, కొన్నిసార్లు విరేచనాలు విసిగిస్తాయి. పొట్టలో నొప్పి, శబ్దాలు ఉంటాయి.
కారణాలు: అధ్యయనాల ద్వారా శరీరంలో చోటు చేసుకునే కొన్ని మార్పుల వల్ల ఐ.బి.ఎస్ సమస్య తలెత్తుతుందని తేలింది. పెద్దపేగు సున్నితంగా తయారైనా, స్వల్ప ప్రేరణలకే ఎక్కువగా స్పందిస్తున్నా ఐ.బి.ఎస్ మొదలవుతుంది. కొన్ని రకాల ఫుడ్ అలర్జీలు, ఐరన్ మందులు, కొన్ని యాంటాసిడ్‌లు, ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా ఐ.బి.ఎస్ తలెత్తవచ్చు.
పరిష్కారాలు: సాధారణంగా ఆహార శైలి, అలవాట్లలో మార్పుల వల్ల ఐ.బి.ఎస్ రావొచ్చు. ఐ.బి.ఎ్‌సను నియంత్రించాలంటే కెఫీన్ ఉండే కాఫీ, టీలు, సోడాలు మానేయాలి. పీచు ఎక్కువగా ఉండే పళ్లు, కూరగాయలు, నట్స్, ధాన్యాలు తీసుకోవాలి. రోజుకి 8 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలు చేయాలి. పాల ఉత్పత్తుల వాడకం తగ్గించాలి. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి.
కడుపులో నొప్పి ఎందుకు?
పొట్ట ప్రాంతంలో నొప్పి వచ్చే ప్రదేశాన్ని బట్టి కారణాన్ని కనిపెట్టొచ్చు. తిన్న ఆహారం జీర్ణం కాకపోయినా, కలుషిత ఆహారం తీసుకున్నా కడుపు నొప్పి తప్పదు. ఈ నొప్పుల్లో రకాలున్నాయి. అవేంటంటే....
ఎసిడిటీ నొప్పి: మసాలాలు, పులుపు, కారాలతో కూడిన పదార్థాలు తినటం వల్ల ఎసిడిటీ మొదలై పొట్టలో నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి పొట్ట పైభాగంలో మొదలవుతుంది. కడుపు ఉబ్బరం, బిర్రుగా తయారవుతుంది. కొన్నిసార్లు పొట్టలో కత్తితో పొడిచినంత నొప్పి కూడా రావొచ్చు. సాధారణంగా ఈ నొప్పి ఒకటి, రెండు రోజుల్లో తగ్గిపోతుంది. ఆ సమయంలో పెరుగు, మజ్జిగ తీసుకుంటూ ఉప్పు, పులుపు, కారాలు తగ్గిస్తే ఎసిడిటీ తాలూకు నొప్పి తగ్గిపోతుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నా.. రెండు రోజులకు మించి నొప్పి వేధిస్తే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి.
గాల్ బ్లాడర్ స్టోన్స్: గాల్ బ్లాడర్‌లో రాళ్లున్న వాళ్లు నూనె పదార్థాలు తిన్న వెంటనే కడుపులో నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి కుడి వైపు డొక్కలో మొదలవుతుంది. నొప్పి భరించలేనంత ఉంటుంది. వాంతులు కూడా అవుతాయి. ఇలా గాల్‌బ్లాడర్‌లో రాళ్లున్న వ్యక్తులు నూనె పదార్థాలు తిన్నప్పుడు గాల్ బ్లాడర్ నుంచి రాళ్లు బయటకి రావటానికి ప్రయత్నిస్తాయి. దాంతో పొట్టలో నొప్పి మొదలవుతుంది.
ప్యాంక్రియాటిక్ పెయిన్: మద్యపానం సేవిస్తూ..నూనెతో కూడిన పదార్థాలు తినేవారికి ఈ నొప్పి వస్తుంది. ప్యాంక్రియాస్ ఎంతో తీవ్రంగా వస్తుంది. పొట్ట మధ్య భాగం, పైన నొప్పి ఉంటుంది. పొట్ట నుంచి వీపులోకి నొప్పి ప్రసరిస్తుంది. పాంక్రియాస్ వెనక భాగంలో ఉంటుంది కాబట్టి వెల్లకిలా పడుకుంటే దాని మీద ఒత్తిడి పడి నొప్పి ఎక్కువవుతుంది. దీంతో రోగి బోర్లా పడుకోవటానికి ఇష్టపడతాడు. సెలైన్లు, యాంటీబయాటిక్స్‌తో ఈ నొప్పిని అదుపులోకి తేవొచ్చు.
చిన్న పేగు, పెద్ద పేగుల్లో ఇన్‌ఫెక్షన్: వర్షాకాలం ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. దాంతో చిన్నపేగు, పెద్దపేగులు ఇన్‌ఫెక్షన్‌కు గురై బొడ్డు చుట్టూ నొప్పి, విరేచనాలు మొదలవుతాయి. ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల వాంతులు కూడా అవుతాయి. ఈ సమస్యను మందులతో అదుపు చేయొచ్చు. అలాగే ఒకసారి ఇన్‌ఫెక్షన్‌కు గురయిన రోగులు శభ్రమైన ఆహారం, నీరు మాత్రమే తీసుకోవాలి.
ఎప్పుడు తినాలి? ఏం తినాలి?
ఆహార వేళలు క్రమం తప్పకుండా కచ్చితంగా పాటించటం వల్ల ఎసిడిటీ, అజీర్తి లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. భోజనానికి, భోజనానికి మధ్య మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ సమయం పాటించటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు అస్థవ్యస్థమవుతుంది. అలాగే ఆకలి వేసినప్పుడే తినాలి. ఏ కారణం చేతనైనా ఆకలి వేయకపోతే సమయానికి తినాలి కాబట్టి తినటం కూడా సరైన పద్ధతి కాదు.
ఎలా తినాలి?: ఆహారాన్ని గబగబా తినే అలవాటు మంచిది కాదు. అలాగే తినే సమయంలో మాట్లాడకూడదు. ఇలా చేస్తే ఆహారంతోపాటు గాలి కూడా జీర్ణాశయంలోకి చేరి అజీర్తిని కలిగిస్తుంది. నోట్లోనే సగం ఆహారం జీర్ణమవుతుంది. కాబట్టి పదార్థాలను బాగా నమిలి మింగాలి. తినే సమయంలో కాకుండా తిన్న తర్వాతే నీళ్లు తాగాలి.
ఏప్పుడు, ఏం తినాలి?: బలవర్థక పోషకాలైన ప్రొటీన్లను ఉదయం అల్పాహారంలో తీసుకోవాలి. గుడ్లు, అరటిపళ్లు లాంటివి బ్రేక్‌ఫా్‌స్టలో చేర్చుకుంటే రోజు మొత్తం అలసటకు లోనవకుండా ఉంటాం. సాధారణంగా భోజనం తర్వాత పళ్లు తినటం మన అలవాటు. కానీ పళ్లను ఖాళీ కడుపుతో తినాలి. లేదా భోజన విరామ సమయంలో తినాలి. ఎసిడిటీకి కారణమయ్యే పళ్లను రాత్రి వేళ తినకూడదు. తేలికగా అరిగే వీలులేని మాంసాహారాన్ని రాత్రి వేళ తగ్గించాలి. నిద్రకు రెండు గంటల ముందే ఆహారం తినటం ముగించాలి. ఉదయం భారీగా, మధ్యాహ్నం మధ్యస్థంగా, రాత్రి వేళ స్వల్పంగా ఆహారం తీసుకోవాలి.
ఎంత తినాలి?: రోజుకి అవసరమయ్యే క్యాలరీల సంఖ్య జీవనశైలి, వయసులనుబట్టి మారుతుంది. కాబట్టి వాటికి తగినట్టు ఆహార నియమాలు పాటించాలి. అలాగే మెటబాలిజం వేగంగా ఉండే యుక్తవయస్కులు, క్రీడాకారులు, రోజు మొత్తంలో ఎక్కువ సమయంపాటు నడక, ఇతరత్రా పనులు చేసే ఉద్యోగులు ఖర్చయ్యే క్యాలరీలకు సరిపడా ఆహారం తీసుకోవాలి. ఇంటి పట్టున విశ్రాంతిలో ఉండే వృద్ధులు తేలికగా అరిగే, తక్కువ క్యాలరీలుండే ఆహారం తీసుకోవాలి. ఎవరికి ఎన్ని క్యాలరీలు అవసరం? అందుకోసం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? అనే విషయాల మీద అవగాహన ఏర్పడాలంటే డైటీషియన్‌ను సంప్రదించాలి.
డాక్టర్. భవానీ రాజు,
సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,హైదరాబాద్ .
good infermation thany
ReplyDelete