గూగుల్ సరే... ఇవి అంతకుమించి
మనకు కావల్సిన వెబ్‌సైట్ పూర్తి అడ్రస్ తెలిసినా ముందు www.google.co.in అని సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి తర్వాత అందులో ఆ వెబ్‌సైట్ అడ్రస్ టైప్ చేస్తుంటారు. అంతగా గూగుల్ ప్రజలకు చేరువైంది. గూగుల్ కంటే అదనంగా సౌకర్యాలు అందించే సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి. సమాచార శోధన, నెటిజన్ల అవసరాల తీర్చడంలో ఇవీ ముందుంటున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందామా!
శబ్దాల డబ్బా
రైలు వేగంగా వెళ్తున్న శబ్దం కావాలా, కారు హారన్ శబ్దం వింటారా, ఏనుగు ఘీంకారం ఎలా ఉంటుందో మీ సిస్టమ్‌లోనే వింటారా? వాటి కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో వెతకనక్కర్లేదు. రకరకాల శబ్దాలను ఒకే దగ్గర అందించే సెర్చ్ ఇంజిన్FindSounds లోకి వెళ్తే సరి. అందులో వివిధ ఫార్మేట్లలో శబ్దాలుంటాయి. మీరు చేయాల్సిందల్లా సెర్చ్ బార్‌లో మీకు కావల్సిన శబ్దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం ఇవ్వడమే. రిజల్యూషన్, శాంపిల్ రేట్, ఫార్మేట్ అంటూ శోధన ఫలితాలను వర్గీకరించుకోవచ్చు.
పిల్లలకు ప్రత్యేకం
అంతర్జాలంలో దొరికే సమాచారమంతా పిల్లలు చూడదగ్గది కాదు. ఫ్యామిలీ ఫిల్టర్ అంటూ గూగుల్ కాస్త అడ్డుపెట్టినా ఎక్కడో దగ్గర అసభ్యకరమైన సమాచారం పిల్లల కంట పడుతూనే ఉంది. Kiddle బ్రౌజర్‌లో ‘పెద్దల’ సమాచారం.. పిల్లలకు కనిపించకుండా చేయొచ్చు. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సెర్చ్ ఇంజిన్‌లో అశ్లీల సమాచారానికి సంబంధించిన విషయాలను సెర్చ్ చేస్తే శోధన ఫలితాలు చూపించడానికి నిరాకరిస్తుంది. బ్లాంక్ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది.
వీడియోల ఖజానా
ఫలానా సినిమా పాట లేదా ట్రైలర్ కోసం గూగుల్‌లో వెతుకుతుంటారు. అప్పుడు మీకు కావల్సిన వీడియోతోపాటు ఇతర సమాచారమూ వస్తుంది. కేవలం వీడియోలు మాత్రమే కావాలి అనుకుంటే ప్రత్యేక వీడియోల సెర్చ్ ఇంజిన్ అవసరం. JustWatchఅలాంటిదే. ఇందులో ప్రపంచంలోని ముఖ్యమైన వెబ్ ఛానళ్లు, ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్లలోని వీడియోల వివరాలు ఉంటాయి. వాటిని క్లిక్ చేసి సంబంధిత వెబ్‌సైట్‌లో ఆ వీడియోలు వీక్షించొచ్చు. ఇందులో సినిమా సంబంధిత వీడియోలతోపాటు టీవీ షోలు కూడా ఉన్నాయి.
నాసా సమాచారం
వాతావరణ మార్పులు, కొత్త కొత్త గ్రహాలు, జీవరాశుల జాడలు... ఇలా నాసా అందించని సమాచారమంటూ ఉండదు. అంతటి సమాచారం అందించే నాసా గురించి తెలుసుకోవడానికి ఏవేవో సెర్చ్ ఇంజిన్‌ల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని కోసం నాసా ప్రత్యేకంగా NASA Images అనే ఓ సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించింది. సంస్థ కార్యకలాపాలు, తాజా ఫొటోలు, ఆసక్తికరమైన వీడియోలు, ప్రత్యేక వార్తలు అందించేలా దీన్ని రూపొందించారు. ఇందులో 1,40,000 ఫొటోలు, వీడియోలు, ఆడియో ఫైల్స్ ఉన్నాయి.
మొక్కలు నాటుతారు
‘మా సెర్చ్ ఇంజిన్‌లో 45 సార్లు సమాచారం కోసం సెర్చ్ చేస్తే మేం ఒక మొక్క నాటుతాం!’... ఆసక్తికరంగా ఉంది కదా ఈ ప్రకటన. Ecosiaసెర్చ్ ఇంజిన్ ఈ పని చేస్తోంది. మామూలుగా ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే... అందులో ఉండే ప్రకటనల వల్ల ఆ సెర్చ్ ఇంజిన్‌కు డబ్బులు వస్తాయి. ఎకోసియాకు అలా వచ్చిన సంపాదన నుంచి 80 శాతం డబ్బును మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి విరాళంగా ఇస్తోంది. అలా బుర్కినా ఫాసో, మడగాస్కర్, ఇండోనేసియా, పెరూ, టాంజానియా లాంటి దేశాల్లో మొక్కలు నాటుతున్నారు. ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారనే విషయం సెర్చ్ ఇంజిన్ హోమ్ పేజీ మీద ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. ఎకోసియా వాడితే సమాచార శోధన, సామాజిక సేవ రెండూ చేసేయొచ్చు అన్నమాట.
భాష నేర్చుకుంటుంటే
ఈ పదాన్ని ఇక్కడ వాడొచ్చా, ఈ వాక్యాన్ని ఇలానే రాయాలా, ఈ పదం అర్థమేమిటో... కొత్త భాష నేర్చుకునేవాళ్లకు ఎక్కువగా వచ్చే సందేహాలివి. ఇలాంటి వారి కోసం సలహాలివ్వడానికిLudwig సెర్చ్ ఇంజిన్ ఉంది. దీని సెర్చ్ బార్‌లో ఓ పదాన్ని ఎంటర్ చేస్తే దాని అర్థం, వినియోగం, దాంతో రాయగలిగే వాక్యాల నిర్మాణం లాంటి వివరాలు కనిపిస్తాయి. దీంతోపాటు ఆ పదం లేదా వాక్యాన్ని ప్రముఖ ఆంగ్ల వార్తల వెబ్‌సైట్లు, పత్రికలు ఏ సందర్భంలో, ఎలా వాడాయో అనే వివరాలూ పొందొచ్చు.
జాగ్రత్త... జాగ్రత్త
ఒకసారి గూగుల్‌లో ఏదైనా అంశం గురించి సెర్చ్ చేసిన తర్వాత... మీరు ఏ ఇతర వెబ్‌సైట్లు ఓపెన్ చేసినా గతంలో మీరు సెర్చ్ చేసిన అంశానికి సంబంధించిన ప్రకటనలే వస్తుంటాయి. మీ సెర్చ్ ఇంజిన్ యూసేజ్‌ని గూగుల్ ఎప్పటికప్పుడు మోనిటర్ చేయడమే దీనికి కారణం. ఇలాంటి ట్రాకింగ్ ఇబ్బంది లేని రక్షణ ఎక్కువగా ఉండే సెర్చ్ ఇంజిన్‌లు కొన్ని ఉన్నాయి. వాటిలో Qwant ఒకటి. ఇందులో వెతికే సమాచారాన్ని సెర్చ్ ఇంజిన్ భద్రపరుచుకోదు. ఇందులో ఖాతా ప్రారంభించి బుక్‌మార్క్స్‌ను సేవ్ చేసుకోవచ్చు కూడా.
బృంద శోధన కోసం
స్నేహితులతో కలసి వారాంతంలో విహార యాత్రకు వెళ్దామనుకున్నారు. ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం అంటూ అందరూ అంతర్జాలంలో శోధన మొదలెట్టారు. ఒకే విషయం మీద అందరూ వెతకడం సమయం వృథా కదా. ఒకరే వెతికి, వచ్చిన ఫలితాలను అందరూ చూడగలిగితే మంచి కదా. SearchTeamసెర్చ్ ఇంజిన్‌తో ఇది కుదురుతుంది. ఇందులో ఖాతా ప్రారంభించాక ఎవరెవరు కలసి సమాచార శోధన చేద్దామనుకుంటున్నారో వారి వివరాలు ఇవ్వాలి. అప్పుడు ఒకరు సెర్చ్ చేసిన సమాచారాన్ని మిగిలిన వాళ్లూ చూసుకోవచ్చు.
అంశాల వారీగా
సెర్చ్ ఇంజిన్‌లో సమాచారం కోసం శోధన ప్రారంభించినప్పుడు వివిధ ట్యాగ్స్ (ఆ సమాచారం కోసం రాసుకున్న సంక్షిప్త పదాలు) ఆధారంగా ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు ఈనాడు అని సెర్చ్ చేస్తే దానికి అనుబంధంగా ఉండే వెబ్‌సైట్లు, వీడియోలు, ఫొటోలు, వాటి వివరాలు కనిపిస్తాయి. శోధన ఫలితాల్లో అవి కనిపించడానికి ఏయే ట్యాగ్స్ ఉపకరించాయో మనం తెలుసుకోవచ్చు. Yippyసెర్చ్ ఇంజిన్ ఈ పని చేసిపెడుతుంది. ఇందులో సమాచారం కోసం సెర్చ్ చేస్తే ట్యాగ్స్ వారీగా వివరాలు కనిపిస్తాయి. దీని వల్ల సమాచార శోధన మరింత సులభమవుతుంది.
డెవలపర్ల కోసం
వెబ్ డెవలపర్ల కోసమూ ఓ ప్రత్యేక సెర్చ్ ఇంజిన్ అందుబాటులో ఉంది. అదే Libraries.io. ఇందులో వెబ్‌సైట్లు, ఆప్‌ల రూపకల్పన కోసం అవసరమయ్యే సాంకేతిక సమాచారం సిద్ధంగా ఉంటుంది. డెవలపర్లకు ఉపయోగపడే లైబ్రరీలు, మాడ్యూల్స్, ఫ్రేమ్ వర్క్స్ లాంటివి ఈ సెర్చ్ ఇంజిన్ ద్వారా పొందొచ్చు. ఇందులో 33 వేర్వేరు ప్యాకేజీ మేనేజర్స్‌లో 22,85,392 ఓపెన్ సోర్స్ లైబ్రరీలున్నాయి. వెబ్‌సైట్, ఆప్‌ల కోసం ప్రోగ్రామ్స్ రాసేవారికి SearchCode అనే సెర్చ్ ఇంజిన్ ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో 70 లక్షల ప్రోజెక్ట్‌లకు సంబంధించిన 20 బిలియన్ల లైన్లు ఉన్నాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565