పూర్ణ వినియోగం
Purna Vinuyogam
+++++++++ పూర్ణ వినియోగం ++++++++
ప్రపంచంలో ఎవరికైనా ఉండేది ఇరవై నాలుగు గంటలే. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నా, దుర్వినియోగం చేసినా, ఎవరు ఎలా వినియోగించుకున్నా, సాధకుల వినియోగం వేరుగా ఉంటుంది. ఉండాలి. పెద్ద పనులకు, ప్రధానమైన పనులకు, గొప్ప పనులకు సమయం ఎక్కువ కావాల్సి ఉంటుంది. అలా అని, ఉన్న ఇరవై నాలుగు గంటల్ని ఎవరూ నలభై ఎనిమిది గంటలు చేయలేరు. ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఎనిమిది గంటల పనినీ పూర్తిచేసుకునే వీలు కల్పించుకోవాలి. చేయగల నైపుణ్యాన్ని పెంచుకోవాలి.
సాధన రెండు రకాలుగా చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ పని సాధించుకునే ప్రయత్నం ఒకటి. ఉన్న సమయాన్ని క్షణం వృథా చేయకుండా పూర్తిగా వినియోగించుకోవడం మరొకటి. ఆధునిక కాలంలో రోజునంతా సాధనకు వినియోగించుకునే అవకాశమే లేదు... ఎవరైనా కేవలం సాధనకే అంకితమై, దాని కోసమే జీవిస్తే తప్ప! ఏ హిమాలయ ప్రాంత గుహల్లోనో, కీకారణ్యం మధ్యలోనో తప్ప అందుకు అవకాశం లేదు. మరి సాధారణ మానవుడు, అందునా సంసార సాగరంలో చిక్కి ఉక్కిరిబిక్కిరవుతున్న వ్యక్తి ఏం చేయాలి? ఆ సాగరంలో తాను ఉంటూనే, లేశమైనా జలం అంటని తామరాకులా మారాలి.
భగవత్ స్పృహ అనే మాధుర్యాన్ని ఆస్వాదించే సాధకుడికి, అదే సమయంలో జ్ఞానసాధన ఎంతైనా అవసరం. అందుకు అవకాశాల కోసం అతడు అన్వేషించాలి. ధ్యానం, జపతపాలు, నోములు వ్రతాలు, యజ్ఞయాగాది క్రతువులు...అధిక సమయాన్ని ఆశించే సాధన ప్రక్రియలు. వాటిని చేయనివారికి, వాటి కోసం సమయం కేటాయించలేనివారికి- ముక్తి అందని ద్రాక్షేనా? కాదు.
భగవత్ సమయ సాధనకు, ఇతరత్రా సమయ సాధనకు సంబంధమే లేదు. కొన్ని ప్రత్యేకమైన పనులకు కేటాయించాల్సింది కేవలం కొద్దిపాటి సమయాన్ని కాదు; వీలైనంత ఎక్కువగానే కేటాయించాలని పెద్దలు చెబుతారు. సమయాన్ని ఎంత అమూల్యంగా, అమృతతుల్యంగా ఉపయోగిస్తున్నాం అన్నదే ప్రధానం. ప్రతి క్షణాన్నీ ఒడిసి పట్టుకోవాలి. చకోర పక్షిలా వేచి చూడాలి. ఆ పక్షి ఆకాశం నుంచి జాలువారే ప్రతి వర్ష బిందువునూ నోరు తెరచి గ్రోలేందుకు సిద్ధంగా ఉంటుంది. సాధకుడూ అదేవిధంగా క్షణాల్ని ఆస్వాదించాలి. కాలాన్ని సాధనకు ఉపకరణంగా రూపుదిద్దాలి. సంపూర్ణ వినియోగానికి ఆతృత చూపాలి. అప్పుడు క్షణమైనా వృథా అయ్యే ప్రసక్తే తలెత్తదు. సంపూర్ణ సాధన సమయాన్ని అతడు పొందినట్లవుతుంది.
భగవత్ సాధన సమయానికి, అదే సమయంలో గృహస్థు లేదా మరెవరైనా చేసే వేరే పనికి సంబంధం లేదు. సాధకుడు ఏ పని చేస్తున్నా అతడి మనోబంధం, సంబంధం పరమాత్మతోనే! పారమార్థిక కార్యాల్ని అతడు ఓ యతిగా నిర్వహించగలిగితే, జీవితంలోని ప్రతి క్షణమూ సాధన కాలంగానే మారుతుంది.
ఎంత కార్యనిమగ్నుడైన ఉద్యోగి అయినా, అక్కడ తన బాధ్యత ముగించి ఇంటికి వచ్చి కుటుంబంతో గడిపే కొంత సమయమే...అతడి నిజమైన జీవితం. జీవితంలో సాధనా అంతే! జీవితంలో సాధన ఒక భాగం కాదు. సాధనలో జీవితమే ఒక భాగం. సాధనే మనిషి సొంత జీవితం. మధ్యలో వచ్చిపోయే వ్యవహారాలు తనకు చీకాకు కలిగించకుండా అతడు చూసుకోవాలి. వాటిని వీలైనంతగా కుదించుకోవాలి. కాలంలో ‘సాధన కాలం’ అని వేరుగా ఏదీ ఉండదు. ఉన్న సమయాన్ని మలచుకునే విధానమే అన్నింటికంటే మిన్న.
జీవితం ఓ ఉద్యానవనం. అందులోని ఫలాల రుచిని మనిషి తన జీవితకాలంలో ఆస్వాదించాలే తప్ప, ఆ ఫలాలు ఎన్ని ఉన్నాయా అని పనిగట్టుకొని లెక్కపెట్టుకోవడం... ఉన్న సమయాన్ని కోల్పోవడమే! సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే, ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల పనుల్ని పూర్తిచేసుకోగలం. ‘కాలం సంపూర్ణ వినియోగం’ అంటే అదే! - చక్కిలం విజయలక్ష్మి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565