పెయిన్ పెయిన్‌గో అవే
వానాకాలమొస్తే ‘ రెయిన్ రెయిన్ గో అవే..’ అంటూ సరదాగా వాన జల్లులో తడిసిపోతాం. అలా తడిసిన శరీరాలపై ఆడుకోవడం వైరస్‌లకు సరదా! అందుకే వానాకాలంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవి పాటిస్తే.. ఇన్‌ఫెక్షన్ల వలన కలిగే బాధలను ‘పెయిన్ పెయిన్ గో అవే’ అంటూ వెనక్కి పంపొచ్చు.
వానలో తడవటం చాలామందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్నా లేకపోయునా కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటలేనట్టే వర్షంలో ఒళ్లు తడవకుండా వానాకాలాన్ని కూడా దాటలేం! అయితే వానలో తడిస్తే ఒళ్లు తుడుచుకుని ఊరుకుంటే సరిపోదు. వాతావరణంలోని రసాయనాలు వాన నీటితో కలిసి మన ఒంటిని తడిపేస్తే వాటి దుష్ప్రభావాలకు చర్మం పాడవటం ఖాయం. అందుకే వానలో తడిసిన వెంటనే శుభ్రంగా స్నానం చేయాలి. అలాగే ఈ కాలంలో నేల ఎప్పుడూ తడిగానే ఉంటుంది. అలాంటి నేల మీదే నడుస్తూ ఉంటే కాళ్లు ఎక్కువ సమయం పాటు తడిగానే ఉంటాయి.
ఇదీ ప్రమాదమే! తడి చర్మం ఇన్‌ఫెక్షన్లను ఆకర్షించడంతోపాటు, వాటిని వ్యాప్తి చేస్తుంది. కాబట్టి చర్మాన్ని వీలైనంత పొడిగా ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు సరే! మరి వర్షాకాలం వచ్చే ఇన్‌ఫెక్షన్లు ఎన్ని రకాలు, వాటి లక్షణాలేంటి? అనే విషయాలు తెలుసుకుంటే వాటిని ప్రారంభంలోనే అరికట్టవచ్చు.
రకరకాల ఇన్‌ఫెక్షన్లు
ఈ కాలంలో బ్యాక్టీరియా, ఫంగస్, ఈస్ట్‌లు ఎక్కువ ఇన్‌ఫెక్షన్లను కలగజేస్తాయి.
వీళ్లలో ఎక్కువ
ఎక్కువగా నీళ్లలో పని చేసేవాళ్లు, ఇంటి పనులు చేసే గృహిణులు, పొలం పనులు చేసే రైతులు, కూలీలు, చెమట ఎక్కువగా పట్టే తత్వం ఉండి రోజూ బూట్లు వేసుకుని ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు...వీళ్లే ఎక్కువగా వర్షాకాలం ప్రభావానికి గురవుతూ ఉంటారు. గాలిలోని తేమ, నేల మీద ఉండే తడి వల్ల వీళ్లకు అర చేతులు, గజ్జలు, పాదాల వేళ్ల మధ్య ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు వ్యాపిస్తాయి. మరీ ముఖ్యంగా మధుమేహ రోగులు ఈ కాలంలో షుగర్‌ను అదుపులో ఉంచుకోకపోతే కాలి వేళ్ల మధ్య ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు తేలికగా చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది.
ఫంగల్ ఇన్‌ఫెక్షన్
వెంట్రుకల కుదుళ్లు, జననేంద్రియాలు, చర్మం, గోళ్లు... ఇలా శరీరంలోని కొన్ని ప్రదేశాలలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ చోటు చేసుకుంటుంది. దురద, మంట, చర్మం పొట్టు రాలడం, రంగు మారడం ఇలాంటివన్నీ ఈ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు. ‘ఇంటర్‌ట్రైగో’ అనేది కాలి వేళ్ల మధ్య పెరిగే ఫంగల్ ఇన్‌ఫెక్షన్. కాలి వేళ్లతోపాటు తొడల మధ్య, గజ్జల్లో కూడా ఈ ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఇన్‌ఫెక్షన్ కుటుంబంలో ఒక్కరికి ఉన్నా మిగతావారికి కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి.
స్వీయ జాగ్రత్తలే ప్రధానం
ఈ ఇన్‌ఫెక్షన్ ఉన్న వ్యక్తులు వాడే దుస్తులు, టవల్స్ వేరుగా ఉంచాలి. మైల్డ్ క్లీన్సర్లతో చర్మాన్ని శుభ్రం చేసుకుంటూ యాస్ర్టింజెంట్లు, కఠినమెనౖ రసాయనాలకు దూరంగా ఉంటే ఈ ఇన్‌ఫెకషన్లు రాకుండా నియంత్రించుకోవచ్చు. కాలి వేళ్ల మధ్య ఇన్‌ఫెక్షన్ రాకుండా యాంటీ ఫంగల్ పౌడర్ చల్లుకుంటూ ఉండాలి. పెరుగులో హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పిహెచ్ లెవల్‌ను సమం చేసి ఇన్‌ఫెక్షన్‌ను కలిగించే ఫంగ్‌సను చంపేస్తుంది. కాబట్టి ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకిన చోట పెరుగు పూసినా కొంత ఫలితం ఉంటుంది. యాంటీ ఫంగల్ క్రీమ్, పౌడర్, జెల్స్ వాడొచ్చు. రాత్రి వేళ లోదుస్తులు వేసుకోకపోవడమే మంచిది.
ఎగ్జిమా
వానా కాలంలో చర్మం మీద ‘ఎగ్జిమా’ అనే ఇన్‌ఫెక్షన్ సర్వసాధారణం. బుగ్గలు, తల మీది చర్మం ఎర్రబారి, దురద పెడుతూ, పగుళ్ళు తలెత్తే ఈ రకం ఇన్‌ఫెక్షన్‌లో నీటి పొక్కులు కూడా కనిపిస్తాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌నే ‘అటామిక్ డెర్మటైటిస్’ అని కూడా అంటారు. వానాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే పూల పుప్పొడి, తేమ ఈ వ్యాధికి ప్రధాన కారణం. కొందరిలో ఉండే అలర్జిక్ రియాక్షన్ మూలంగా కూడా ఎగ్జిమా తలెత్తుతుంది. పెద్దలతో పోలిస్తే పిల్లలే ఎక్కువగా ఈ ఇన్‌ఫెక్షన్ బారిన పడుతూ ఉంటారు. పిల్లల్లో మోకాళ్లు, మోచేతుల వెనుక ఈ ఇన్‌ఫెక్షన్ కనిపిస్తుంది. అలాగే చర్మపు మడతలకు వీలుండే మెడ, మణికట్టు, పిరుదులు, తొడల మధ్య కూడా తలెత్తుతుంది. కొందరిలో ఈ వ్యాధి చికిత్సకు లొంగుతుంది. మరికొందరిలో తిరగబెడుతూ ఉంటుంది.
చికిత్స సులభమే: ఎగ్జిమాకు శాశ్వత చికిత్స లేకపోయినా వ్యాధి లక్షణాలను అదుపు చేయవచ్చు. రోగి వయసు, లక్షణాలు, ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు చికిత్సను ఎంచుకుంటూ ఉంటారు. చర్మం ఆరోగ్యాన్ని మెరుగు పరచడం కోసం, లక్షణాలను అదుపు చేయడం కోసం ఈ కింది చిట్కాలు పాటించాలి.
గోరు వెచ్చని నీటితో క్రమం తప్పకుండా స్నానం చేయాలి.
స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
బిగుతైన, గరుకుగా ఉండే దుస్తులకు బదులు మెత్తని కాటన్ దుస్తులు ధరించాలి.
మైల్డ్ సోప్స్ వాడాలి.
స్నానం చేసిన వెంటనే ఒంటిని పొడిగా తుడుచుకోవాలి.
ఈస్ట్ ఇన్‌ఫెక్షన్
వర్షాకాలంలో మహిళల్లో ‘వెజైనల్ ఈస్ట్ ఇన్‌ఫెక్షన్’ సహజం. వెజైనల్ కాండిడియాసిస్ అనే ఈస్ట్... మర్మాంగాల్లో ఉంటుంది. అయితే వానాకాలంలో ఈ ఈస్ట్ అపరిమితంగా పెరిగి ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌కు దారి తీస్తుంది. మరీ ముఖ్యంగా మధుమేహం అదుపు తప్పినవారిలో, గర్భిణులలో, కుటుంబ నియంత్రణ మందులు వాడే స్త్రీలల్లో ఈ ఇన్‌ఫెక్షన్ విజృంభించే అవకాశాలు ఎక్కువ. దురద, మంట ఈ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు.
చికిత్స: ఈ ఇన్‌ఫెక్షన్‌ను మందులు, యాంటీ ఫంగల్ క్రీమ్స్‌తో తేలికగానే అదుపు చేయొచ్చు. వీటిని వాడటంతోపాటు రోజుకి రెండు సార్లు స్నానం చేస్తూ జననేంద్రియాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే, వదులుగా ఉండే కాటన్ లోదుస్తులు ధరించాలి.
అథ్లెట్స్ ఫుట్
వానాకాలం వేధించే మరో సమస్య ఇది. పాదాల మీద దురదతో కూడిన మచ్చలు రావడం, అలాగే పొట్టు రాలుతూ ఉంటే అథ్లెట్స్ ఫుట్‌గానే భావించాలి. క్యాండీడా అనే సాధారణ ఫంగస్ మూలంగా తలెత్తే ఈ సమస్య తలెత్తితే కాలి బొటనవేళ్లు రంగు మారి చిట్లుతాయి.
చికిత్స
అథ్లెట్స్ ఫుట్‌కు యాంటీ ఫంగల్ క్రీమ్‌లే పరిష్కారం. మరింత తీవ్రమైన సమస్యల్లో నోటి మాత్రలు కూడా వాడాల్సి ఉంటుంది. అయితే తేమ వాతావరణంలో ఫంగస్ మరింత విజృంభిస్తుంది కాబట్టి పాదాలను పొడిగా ఉంచుకోవాలి. పాదాలకు గాలి ఆడే చెప్పులు ధరించటం, ప్రతిరోజూ పాదాలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి యాంటీ ఫంగల్ పౌడర్, లేదా క్రీమ్ అప్లై చేయాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు
వర్షాకాల ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.
చర్మాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.
కాలి వేళ్ళ మధ్య తడిని ఎప్పటికప్పుడు తుడిచి, యాంటీ ఫంగల్ పౌడర్ చల్లుకోవాలి.
పాదాలకు ఎక్కువ చెమట పట్టే తత్వం ఉన్న వాళ్లు సాక్స్ వేసుకునే ముందు పాదాలను పొడిగా తుడుచుకోవాలి. యాంటీ ఫంగల్ పౌడర్ చల్లుకోవాలి. అలాగే చెమటతో సాక్స్ తడిస్తే వెంటనే పొడి సాక్సు వేసుకోవాలి.
పాదాలకు చెమట పట్టే తత్వం ఉన్నవాళ్లు ఈ కాలంలో బూట్లకు బదులుగా గాలి ఆడే చెప్పులు ధరించడమే మేలు.
చెప్పులు కూడా పాదాలను అంటి పెట్టుకునేవి కాకుండా ‘ఓపెన్ ఫుట్‌వేర్’ వాడాలి.
నీళ్లలో ఎక్కువ సేపు పని చేయవలసి వచ్చినప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి.
గజ్జల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం లేకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు అండర్ వేర్ వాడకూడదు.
అలాగే మధుమేహం ఉన్నవాళ్లు వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే వర్షాకాలంలో మధుమేహుల పాదాలకు ఇన్‌ఫెక్షన్లు తేలికగా ప్రబలుతాయి.
పొలాల్లో పనిచేసేవాళ్లు, నీళ్లలో ఎక్కువ సమయం పని చేసే గృహిణులు పని పూర్తయ్యాక చేతులను శభ్రంగా కడిగి, పొడిగా తుడుచుకోవాలి.
వానలో తడవకుండా గొడుగులు, రెయిన్ కోట్లు వాడాలి.
పొడి టవల్స్ మాత్రమే వాడాలి.
డాక్టర్. ఒగ్గు ఆనంద్ కుమార్
కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్
కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565