MohanPublications Print Books Online store clik Here Devullu.com

భవిష్యత్తును చక్కదిద్దుకునే బాటలు-Intellectuals, future

భవిష్యత్తును చక్కదిద్దుకునే బాటలు
ఆత్మీయం
మన పూర్వీకులు ఎంతో మేధావులు. దూరదృష్టి కలిగిన వారు. వారు ఏర్పరచిన ఆచార సాంప్రదాయాలన్నీ మానవాళికి మార్గదర్శకాలు. పురాణాలు, ఇతిహాసాలను లోతుగా పరిశీలిస్తే ఒక మనిషి ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి, సమాజ పురోగతికి తోడ్పడే ఎన్నో అంశాలు ఉపాఖ్యానాల రూపంలో దర్శనమిస్తాయి. ఇందులో స్త్రీపాత్రలు ఉన్నత విలువలతో, సమాజాన్ని ముందుకు నడిపించడంతో పాటు చక్కని సందేశాలనిస్తాయి. ముఖ్యంగా పతివ్రతల కథలు స్త్రీల అభ్యుదయానికి మేలుకొలుపుల వంటివి. వీటిని సరిగ్గా అర్థం చేసుకోనివారు మాత్రమే ఈ కథలు. స్త్రీ స్వేచ్ఛకు ప్రతిబంధకాలని అనుకుంటారు. అయితే ఆయా పురాణాలలోని పతివ్రతలందరూ ఎన్నో విధాలైన కష్టాలు పడినట్లు ఉన్నా, ఎవరూ కూడా అబలలమని కన్నీరు కారుస్తూ చతికిలపడలేదు.
విధినే ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించారు. కన్నవారు, కట్టుకున్నవాడు, సమాజం, చివరకు ప్రార్థించే భగవంతుడు... ఇలా ఎవరివల్ల ఆపద వాటిల్లినా, తాము నమ్ముకున్న సత్యాన్ని ఆచరించడంలో వెనుకడుగు వేయని ఆ ధీరత్వం ముందు సర్వజగత్తు తలవంచి దాసోహమనేలా చేసుకున్న ఆ స్త్రీల ఆత్మస్థైర్యం ఆదర్శప్రాయం. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో ఆటంకాలు, ఒడుదుడుకులు ఎదురౌతాయి. వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తిని చిన్నతనంనుండే నూరిపోసే క్రమంలో భాగంగానే ఆనాటి పెద్దలు, పురాణాలలోని పతివ్రతల కథలు చెప్పడం వారిని స్మరిస్తూ నోములు–వ్రతాలు చేయించడం అనే ఆచారాలు ఏర్పరచారు. ఆలోచిస్తే...పెద్దల అడుగుజాడలలో ఎందుకు నడవాలో అవగతం అవుతుంది. వారు చెప్పినట్లు పురాణాలు, రామాయణ, భారత భాగవతాలు చదివితే భవిష్యత్తుకు కావలసిన పాఠాలు నేర్చుకుంటారనే తప్ప వారినేదో చదువులేని దద్దమ్మలుగా వంటింటి కుందేలుగా చేయడానికి కాదు.

ఐరన్‌ ఇచ్చే అరటిపువ్వు!
గుడ్‌ ఫుడ్‌
అరటిపువ్వు ఆరోగ్యానికి కలిగించే మేలు అంతా ఇంతా కాదు. అరటిపువ్వుతో కూర చేసుకుని తినడం వల్ల కలిగే ప్రయోజనాల్లో కొన్ని...
అరటిపువ్వులో ఐరన్‌ ఎక్కువ, కాబట్టి అనీమియాను సమర్థంగా అరికడుతుంది. అరటిపువ్వులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థం, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్‌–ఈ పుష్కలంగా ఉంటాయి. అరటిలోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్‌ తగ్గించడానికి ఉపయోగపడతాయి.
ఇందులోని ఇథనాల్‌ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. అరటిపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ను కలిగించే ఫ్రీరాడికల్స్‌ అనే కాలుష్య పదార్థాలను హరిస్తాయి.వయసుపైబడే ప్రక్రియనూ అరటిపువ్వు మందగింపజేస్తుంది. అలా ఏజింగ్‌ ప్రక్రియను ఆపుతుంది. అరటిపువ్వు రక్తంలోని చక్కెర పాళ్లను కూడా నియంత్రిస్తుంది.

రాళ్లను కరిగించే జ్యూస్‌
హెల్త్‌ టిప్స్‌
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పడే బాధ వర్ణనాతీతం. ఆపరేషన్‌ చేయించుకునేవరకు ఉపశమనం లభించదు. అయితే కొందరికి ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత కూడా మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటివారు రోజూ నారింజ పండ్ల రసం తీసుకుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చునంటున్నారు వైద్యపరిశోధకులు.నిద్రలేమి చాలా సమస్యలకు దారి తీస్తుంది. అలాగని నిద్రమాత్రలు వాడితే మరిన్ని సైడ్‌ఎఫెక్ట్‌లు వస్తాయి. అందుకోసం ఏం చేయాలంటే రోజూ ఒకటి రెండు కప్పుల దానిమ్మ జ్యూస్‌ తాగాలి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది.
పులిపిర్లు పెద్ద సమస్య. ఇవి ఏర్పడటానికి ప్రధాన కారణం వైరస్‌. కొందరు వీటిని గిల్లడం, లాగడం వల్ల కొత్తచోట్లలో కూడా పులిపిర్లు ఏర్పడతాయి. పులిపిర్ల నివారణకు ఇలా చేయడం ఉత్తమం.వెల్లుల్లిపాయలను వొలిచి పులిపిర్ల పైన రుద్దుతూ ఉండాలి. ఉల్లిపాయను సగానికి కోసి మధ్యభాగాన్ని తొలగించి అందులో ఉప్పు నింపాలి. దీనినుంచి వచ్చే రసంతో పులిపిర్లపైన సున్నితంగా రుద్దాలి. అలా దాదాపు నెలరోజులపాటు చేయాలి. బంగాళదుంపను మధ్యకు కోసి ఆ ముక్కలతో రుద్దుతూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా 15, 20 రోజులపాటు చేస్తే పులిపిర్లు ఎండి రాలిపోతాయి.
ఆస్తమా ఉన్నవాళ్లు పది నల్లమిరియాలు, రెండు లవంగాలు, గుప్పెడు తులసి ఆకులను తీసుకుని వాటిని మరుగుతున్న నీటిలో వేయాలి. అనంతరం స్టవ్‌ను పావుగంటపాటు సిమ్‌లో ఉంచి నీటిని మళ్లీ మరిగించాలి. ఈ ద్రవాన్ని వడకట్టి ఒక జార్‌లోకి తీసుకుని అందులో రెండు టేబుల్‌ స్పూన్ల తేనె వేయాలి. ద్రవం చల్లారేదాకా ఉంచి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఒకటి రెండు స్పూన్ల ద్రవాన్ని రెండు వారాలపాటు రోజూ సేవించాలి.


కుర్ర తల్లులే ఎక్కువ!
మనదేశంలో అమ్మాయిలెక్కువగా విద్యా, ఉద్యోగాల వైపు వెళుతున్న ధోరణి విషయంలో చూసేవారెవరికైనా ఓ అపోహ ఉంటుంది. ఇక్కడ తల్లులయ్యేవారి వయసు రాన్రాను పెరుగుతోందని! అంటే పాశ్చాత్యదేశాల్లా ఇక్కడా కెరీర్‌ కారణంగా అమ్మాయిలు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారని! అంతే ఆలస్యంగా పిల్లల్ని కంటున్నారని. కానీ ఈ అభిప్రాయంలో నిజం లేదని చెబుతోంది ఐకరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన ‘ప్రపంచ జనాభా భవిష్యత్తు-2017 సమీక్ష’. భారత్‌లో తల్లులయ్యేవారి సగటు వయసు ఇంకా ఇరవై ఆరు మాత్రమేనని చెబుతోందీ అధ్యయనం. సాధారణంగా పాశ్చాత్యదేశాల్లో స్త్రీలు పెళ్లీ, పిల్లలు కనడం రెండూ ఆలస్యంగానే ఉంటాయి. ఒకరిద్దరు పిల్లల్ని చూసేసరికే వయసు నలభైకి దగ్గర్లో ఉంటుంది. అందువల్ల ఆ తర్వాత పిల్లల్ని కనే ఆలోచనా మానుకుంటారు. మన స్త్రీలు అలాకాదు.. ఇంచుమించు పాతికేళ్లకే పెళ్లి చేసుకుంటున్నారు. వయసూ, ఆరోగ్య రీత్యా పెద్ద సమస్యలేకున్నా అంతటితో ఆపేస్తున్నారని వివరిస్తోంది ఈ అధ్యయనం. నిజానికి, పిల్లలు కనడంలో పద్దెనిమిది సగటు వయసు నుంచి 26కి వచ్చారనీ వివరిస్తోంది. కాబట్టి.. ఇప్పట్లో ఈ ధోరణి మారే అవకాశం కూడా లేదంటోంది. మరో డెభ్భై అయిదేళ్లకుగాని ఈ ధోరణి మారదంటున్నారు.. అంటే సుమారు 2100 దాకా! ఐరాస విడుదలజేసిన ఈ సర్వే మరో సంతోషకరమైన విషయాన్నీ చెబుతోంది. మనదేశం తీవ్రంగా ఆందోళన చెందుతున్న స్త్రీ-పురుష నిష్పత్తి మరో మూడేళ్లకి తగ్గిపోతుందట. అంటే ఆడపిల్లల సంఖ్య మగవారికి దగ్గరగా వచ్చేస్తుంది. అంతేకాదు, ఇదివరకు ఐదేళ్లలోపు మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల మరణాలు ఎక్కువగా ఉండేవి. అది కూడా తగ్గుతుందని జోస్యం చెబుతోందీ సర్వే!


మీరూ రంగులేయొచ్చు..!
ఆఫీసు ఒత్తిడి కావొచ్చు... చదువుల భారం అవ్వొచ్చు.. వ్యక్తిగత సమస్యలు కావొచ్చు..కారణం ఏదైనా మనలో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. లోలోన ఆదుర్దా, గాభరా వంటివి మొదలవుతాయి. కళ్లుమూసినా తెరిచినా అవే కనబడుతూ ఉంటాయి. వాటి నుంచి బయటపడటానికి ఇలా చేసి చూడండి. 
* క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ తెలుసుగా! కాసేపు వాటిని ప్రయత్నించండి. మనసుకు వూరటగా ఉంటుంది. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు గుర్తుకురాకుండా ఉంటాయి. 
* పుస్తకాల్లో రంగులు నింపండి అనే కాలమ్‌ పిల్లలకు మాత్రమే అనుకోకండి. మీకూ మంచి వ్యాయామమే అది. ఈ మధ్యకాలంలో కలరింగ్‌ మండలా పేరుతో ఆన్‌లైన్‌లో పుస్తకాలు దొరుకుతున్నాయి. ఓ సారి వాటి పని పట్టండి. 
* దీర్ఘశ్వాస తీసుకునే వదిలే ప్రాణాయామాలు ఒత్తిడి తాలుకూ గాభరాని తగ్గిస్తాయి. మనసుకు సాంత్వనా అందిస్తాయి.
* రోజువారీ ఆహారంలో కెఫీన్‌ లేకుండా జాగ్రత్త పడండి. ఒత్తిడి చాలా సులువుగా తగ్గుతుంది. 
* మీలోని భావాలని మరీ అణచిపెట్టేయొద్దు. దానివల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. కొన్నిసార్లు భావోద్వేగాలని యథాతథంగా స్వీకరించండి. 
* వేడినీళ్లస్నానం కూడా తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుంది. లేదంటే మార్కెట్‌లో దొరికే స్ట్రెస్‌ బంతిని తీసుకుని కాసేపు వ్యాయామం చేసి చూడండి. మనసు చాలా సులువుగా తేలిక పడుతుంది.




ఏవేవి.. ఎప్పుడెప్పుడు?
గదులు ప్రతిరోజూ తుడిచి శుభ్రం చేస్తాం... దుస్తులు ఒక్కసారి వేసుకోగానే ఉతికి ఆరేస్తాం. మరి మనం పడుకునే పరుపులని ఎన్ని రోజులకు శుభ్రం చేయాలి? అవనే కాదు మన ఇంట్లో వాడే వస్తువుల్ని ఎప్పుడెప్పుడు శుభ్రం చేయాలో తెలుసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.... 
*ముందుగా మనం నిత్యం ఉపయోగించే దుప్పట్ల విషయానికొద్దాం. సాధారణంగా... మాసిపోయాయి అనుకుంటే వాటిని ఉతుకుతాం. కానీ ఉబ్బసం, ఎలర్జీ వంటి సమస్యలు ఉండేవారికి దుప్పట్లలోని డస్ట్‌మైట్స్‌ ఆ సమస్యల్ని తీవ్రతరం చేస్తాయి. అందుకని ఈ సమస్యలున్నవారు ప్రతివారానికోసారి దుప్పట్లని ఉతికేస్తూ ఉండాలి. అది కూడా వేడివేడి నీళ్లతో ఉతికి ఎండలో ఆరేయాలి. 
*గలేబులని అయితే తరచూ ఉతుకుతాం. కానీ దిండ్లని మాత్రం ఉతకం. పైన కవరు మార్చాంగా అనుకుంటాం. కానీ వీటల్లో డస్ట్‌మైట్లు పేరుకుని అనేక అలర్జీలు రావడానికి కారణమవుతాయి. అందుకని నెలకోసారయినా ఉతకాలి. అయితే బాగా గట్టిగా పిండేయకూడదు. ఆకృతి పోతాయి. నెమ్మదిగా పిండి ఎండలో పెట్టేస్తే సరిపోతుంది. 
* పరుపులు నల్లగా అయిపోయినా అలానే వాడేస్తున్నారా? అది మంచి పద్ధతి కాదు.. ప్రతి ఆరునెలలకోసారి వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. దుమ్ము పోతుంది. అలాగే ఎండలోపెట్టి... షాంపూ ముంచిన వస్త్రంతో మరకలు ఉంటే తుడిచేయండి. 
* కార్పెట్లని సంవత్సరాలు తరబడి అలానే వదిలేయద్దు. కనీసం ఏడాదికి ఒకసారైన వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేస్తే అది అలర్జీ కారకాలతో నిండకుండా ఉంటుంది. 
* జీన్స్‌ కదా ఉతకడం కష్టం అని చెప్పి... ఓ పదిసార్లు వేసుకున్న తర్వాత నానబెట్టకండి. రెండూ లేదా మూడు సార్లు వేసుకున్న తర్వాత చన్నీళ్లతో ఉతికేస్తే మంచిది.


బ్రహ్మజ్ఞానం
పూర్వం జనకుడనే మహారాజు ఉండేవాడు. పరమ ధార్మికుడు. యజ్ఞయాగాది క్రతవులు నిర్వహిస్తూ.. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాజుకు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది. విషయం అష్టావక్రుడనే మహర్షి రాజు దగ్గరికి వెళ్లాడు. ‘రాజా! నీకు నేను బ్రహ్మజ్ఞానం అనుగ్రహిస్తాను’ అన్నాడు అష్టావక్రుడు. సంతోషించిన రాజు ఒక షరతు విధించాడు. ‘నేను గుర్రం అధిరోహించే లోపు బ్రహ్మజ్ఞానం అనుభూతిలోకి తీసుకురావాల’ని కోరాడు. అందుకు సమ్మతించాడు అష్టావక్రుడు. కానీ, తనతో పాటు నిర్జన ప్రదేశానికి రావాలన్నాడు.

అందుకు రాజు సమ్మతించాడు. మంత్రి, సేనాధిపతి వెంటరాగా రాజు, అష్టావక్రుడు అడవికి బయల్దేరారు. అడవి సమీపించిన తర్వాత మంత్రిని, సేనాధిపతిని అక్కడే ఉండమని ఇద్దరూ అడవిలోకి వెళ్లారు. ‘రాజా! ఇక నీవు గుర్రం ఎక్కవచ్చు’ అన్నాడు అష్టావక్రుడు. గుర్రం ఎక్కడానికి ఉండే రికాబులో రాజు కాలు పెట్టగానే.. ‘మరి నా గురుదక్షిణ సంగతేమిటి?’ అన్నాడు అష్టావక్రుడు. రికాబులో కాలు పెట్టి నిల్చున్న రాజు.. గుర్రం ఎక్కడం ఆపేసి ‘ఏదడిగినా ఇస్తాను’ అన్నాడు. ‘అయితే నీ మనస్సు ఇచ్చేయ్‌!’ అన్నాడు అష్టావక్రుడు. ‘అలాగే’ అంటూ మనస్సు ఇచ్చేశాడు జనకుడు. మరుక్షణంలో ఏ చలనం లేకుండా అలాగే ఉండిపోయాడు రాజు.

అష్టావక్రుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంత సమయం అయినా రాజు రాకపోయేసరికి మంత్రి, సేనాధిపతి అడవిలోనికి వెళ్లారు. కదలక, మెదలక గుర్రం ఎక్కుతున్నట్టు నిలబడి ఉన్న రాజును చూసి కంగారుపడ్డారు. ఇంతలో అష్టావక్రుడు మళ్లీ అక్కడికి వచ్చాడు. వెళ్లి రాజును స్పృశించాడు. అతడిలో చలనం కలిగింది. ‘రాజా! మనసు ఇవ్వమనగానే ఏదో వస్తువు ఇచ్చేసినట్టు ఇచ్చేశావు. ఒక పదార్థంలా మనసును త్యజించావు. అదే బ్రహ్మజ్ఞానం. నీకు కొత్తగా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాల్సిన అవసరం లేదు’ అన్నాడు అష్టావక్రుడు. రాజు సంతోషించాడు. మనసును బహిర్ముఖంగా పోనీయకుండా అంతర్ముఖంగా ఆత్మలో లయం చేసి ఆత్మరూపుడై ప్రవర్తించడమే మోక్షం. అలాంటి స్థితిని మనిషి సాధించగలగాలి. అదే బ్రహ్మజ్ఞానం.

గురకను నియంత్రించవచ్చు!
ఏవ్యాధి అయినా ఆ రోగిని మాత్రమే వేధిస్తుంది. గురక సమస్య వేరు. గురకపెట్టే వ్యక్తి ఇంట్లో ఒకరుంటే చాలు ఇంటిల్లి పాదీ జాగారం చేయాల్సిందే. స్లీప్‌ అప్నియా సమస్య అంటూ లేకపోతే కుటుంబ సభ్యులందరికీ నిద్రపట్టకుండా చేసి తాము మాత్రం గురకపెడుతూ హాయిగా నిద్రపోతారు. చూడటానికి అమానుషంగా అనిపిస్తుంది కానీ, వాళ్లు మాత్రం ఏంచేస్తారు? అది వాళ్ల చేతుల్లో లేని పని.

స్లీప్‌ అప్నియా
మనం ఊపిరి తీసుకునే సమయంలో కొండనాలుక, దాని వెనుక ఉండే కండరాలు కదులుతాయి. దానివల్ల చిన్న శబ్దం వస్తుంది. దీన్నే మనం గురక అంటాం. గురక పెట్టేవారందరికీ స్లీప్‌ అప్నియా సమస్య ఉండనవసరం లేదు. అయితే టాన్సిల్స్‌లో సమస్యలు ఉన్నప్పుడు ఎడినాయిడ్స్‌ తలెత్తినప్పుడు గురక కాస్తా అప్నియాగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే, అప్నియాకు దారితీసే అంశాలే గురకకూ కారణమవుతాయి. నిద్రా సమయంలో ఎవరికైనా దేహక్రియలు తమ సహజ వేగాన్ని కోల్పోతాయి.

దీనికి తోడు సైనసైటిస్‌, రైనైటిస్‌, స్థూలకాయం, టాన్సిల్స్‌. ఎడినాయిడ్స్‌ సమస్యలు కూడా ఉంటే మరికొన్ని ఇతర ఇబ్బందులు కూడా తోడవుతాయి. ప్రత్యేకించి శ్వాస క్రియలో ఆటంకం ఏర్పడే స్లీప్‌ అప్నియా సమస్య మొదలవుతుంది. జీవప్రక్రియల వేగం పడిపోవడం వల్ల శ్వాస మందగించి కొన్ని క్షణాల పాటు నిలిచిపోవడం అందరిలోనూ ఉండేదే. అయితే ఇది అంత పెద్ద సమస్య కాదు. కానీ, స్లీప్‌ అప్నియా సమస్య ఉంటే 10 నుంచి 15 సెక న్ల దాకా శ్వాస ఆగిపోవచ్చు. దీనివల్ల హఠాత్తుగా మెలకువ వచ్చి లేచి కూర్చుంటారు. ప్రతి పది నిమిషాలకూ ఈ అనుభవమే ఎదురై రాత్రంతా నిద్రకు దూరమవుతారు.

కారణాల్లో కొన్ని...
గొంతులో అన్నవాహిక, శ్వాస నాళం పక్కపక్కనే ఉంటాయి ఏ కారణంగానైనా వీటి పక్కన ఉండే కండరాలు బలహీనపడితే గురక పెద్దదవుతుంది. ముక్కుదూలంలో సమస్యలున్నా గురక తద్వారా స్లీప్‌ అప్నియా బాధిస్తాయి.
టాన్సిల్స్‌ సమస్యలు, ముక్కుకూ గొంతుకూ మధ్య పెరిగే ఎడినాయిడ్స్‌, సైనసైటిస్‌ లాంటివి ఊపిరి తీసుకోవడంలో ఆటంకం కలిగిస్తాయి. ఇలా శ్వాసక్రియకు ఏ చిన్న అవరోధం ఉన్నా అది గురకకు, స్లీప్‌ అప్నియాకు దారి తీస్తుంది.
మద్యపానం వల్ల దేహక్రియలు నిద్రలో తక్కువగా సాగుతాయి. ఫలితంగా శ్వాసక్రియలోనూ లోపాలు ఏర్పడతాయి. ముక్కు లోపలి భాగంలో కణుతులు ఏర్పడినప్పుడు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. థైరాయిడ్‌ గ్రంథి తక్కువగా పనిచేసినప్పుడు కూడా స్లీప్‌ అప్నియా రావచ్చు.
హోమియోతో అప్నియా దూరం
శ్వాసనాళాలను తెరిచి ఉండే కృత్రిమ యంత్రాలు ఏ రోజుకారోజు తోడ్పడతాయే తప్ప అవి శాశ్వత పరిష్కారం కాదు. హోమియోలో మూలకారణాన్ని తొలగిస్తారు. స్లీప్‌ అప్నియాకు కారణమైన ఆటంకమే గురకకీ కారణమవుతుంది. అందుకే ఆ కారణాన్ని తొలగించే దిశగా హోమియో ప్రయత్నిస్తుంది.

సైనసైటిస్‌, ఎడినాయిడ్స్‌, థైరాయిడ్‌ సమస్యల వల్ల ఎదురయ్యే స్లీప్‌ అప్నియాను తగ్గించాలంటే ఆయా జబ్బులకు మందులు వాడాల్సి ఉంటుంది. స్థూలకాయమే సమస్యకు కారణమైతే స్థూలకాయాన్ని తగ్గించడం తప్ప మరో దారి లేదు.
సైనసైటిస్‌, పాలిప్స్‌, ఎడినాయిడ్స్‌ కారణంగా వచ్చే గురక అయితే తొందరగానే తగ్గిపోతుంది. ఒకవేళ సమస్య వారసత్వంగా వస్తుంటే అది అంత తొందరగా తగ్గదు.

హోమియో మందుల్ని ఎక్కువ కాలం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పెద్దవాళ్లల్లో కన్నా చిన్న పిల్లల్లో ఉండే గురక సమస్య చాలా తొందరగా తగ్గుతుంది. సాంబికస్‌, టి.ఎం.వి, లామ్నోమైనరా, ఆర్సనిక్‌ ఆల్బ్‌ వంటి మందులు గురకను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. కాకపోతే హోమియో వైద్యుల పర్యవేక్షణలోనే వాటిని తీసుకోవాలి.

-డాక్టర్ బి.సోహన్ సింగ్, రిటైర్డ్ సూపరిటెండెంట్
ప్రభుత్వ హోమియో వైద్యిశాల,హైదరాబాద్
క్యాల్షియం అవసరం ఎంత?
30ఏళ్లు దాటితే క్యాల్షియం సప్లిమెంట్‌ మొదలు పెట్టాల్సిందేనని అంటూ ఉంటారు. పెద్ద వయసులో ఎముకలు గుల్లబారకుండా ఉండాలంటే క్యాల్షియం సప్లిమెంట్‌ తీసుకోక తప్పదని మన నమ్మకం. కానీ క్యాల్షియం సప్లిమెంట్లు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివి. వీటి వాడకంలో అప్రమత్తత ఎంతో అవసరం. 19 నుంచి 50 సంవత్సరాల మహిళలకు రోజుకి 1,000 మి.గ్రా, 51-70 ఆ పైవయసులో ఉన్న మహిళలకు 1,200 మి.గ్రా క్యాల్షియం అవసరమవుతుంది. కానీ ఈ క్యాల్షియం ఆహారం ద్వారా పొందే ప్రయత్నం చేయాలంటున్నారు వైద్యులు. క్యాల్షియం సప్లిమెంట్లను వాడేవాళ్లు ఇతరత్రా ఆరోగ్య ఇబ్బందులకు కూడా గురికాక తప్పదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరానికి మించి క్యాల్షియం శరీరంలో చేరటం వల్ల కిడ్నీలో రాళ్లు, మిల్క్‌ ఆల్కలై సిండ్రోమ్‌లాంటి రుగ్మతలతోపాటు శరీరం ఐరన్‌ను పీల్చుకునే స్వభావాన్ని కుంటుపరుస్తుంది. అలాగే ఇతరత్రా వ్యాధులకు వాడే మందుల మీద కూడా ప్రభావం పడుతుంది. ఆహారం ద్వారా శరీరంలోకి ఎంత క్యాల్షియం చేరుతుందో గమనించి లోపించిన క్యాల్షియాన్ని మాత్రల ద్వారా భర్తీ చేసే ప్రయత్నం చేయాలేగానీ చేతికందిన సప్లిమెంట్‌ను తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలు ఎముకల నొప్పలు, నీరసం లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించి తగిన మోతాదు క్యాల్షియం సప్లిమెంట్లను తీసుకోవాలి.

పిల్లల్లో నిద్రలేమి
ఎంతటి బలవర్థకమైన ఆహారం ఇచ్చినా, పిల్లల శుచి శుభ్రతల విషయంలో ఎంత శ్రద్ద చూపినా ఒక్కోసారి ఏ ఫలితమూ కనిపించదు. దీని వెనుక కొన్ని సార్లు నిద్రలేమి సమస్యే కారణంగా కనపడుతూ ఉంటుంది. నిద్రలేమి వల్ల జీర్ణక్రియ సన్నగిల్లి, మలబద్దకం వంటి సమస్యలు మొదలై చర్మవ్యాధులు మొదలవుతాయి. ఆకలి తగ్గుతుంది. వీటికి తోడు నిద్రలేమి వల్ల చురుకుదనం కోల్పోవడం, ఏకాగ్రత లోపించడం, ముఖం పీక్కుపోవడం, శరీరం కాంతి కోల్పోవడం, మెదడు కణాలు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

గృహవైద్యంగా....
100 మి.లీ. నీళ్లు బాగా మరగబెట్టి దించేయాలి. ఆ తర్వాత అందులో 50 గ్రాముల గీరిన ఉల్లిపాయలు వేసి 10 నిమిషాల పాటు అలా ఉంచాలి. అవి చల్లారిన తర్వాత వడబోసి ఆ నీటిని చెంచాడు మోతాదులో తీసుకుని అందులో 5 చుక్కల తేనె వేసి పిల్లలకు తాగిస్తే నిద్రబాగా పడుతుంది.
పిప్పలి మూలం చూర్ణం చేసి పెట్టుకోవాలి. ప్రతిరోజూ నిద్రబోయే ముందు సగం చెంచాడు చూర్ణంలో బెల్లం కలిపి తినిపించి వేడిపాలు తాగిస్తే మంచి నిద్రపడుతుంది. ఉదయం లేవగానే మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది.

నూరేళ్లూ బలంగా... ఆరోగ్యంగా...
ప్రతి మనిషికీ జీవితకాలానికి సరిపడా పథకాలు, ఎన్నెన్నో ప్రణాళికలూ ఉంటాయి. జీవితకాలం అంటే ఏమిటి? నిండు నూరేళ్లు అని కదా! అయితే నూరేళ్లూ అహోరాత్రులు శ్రమించినా పూర్తికాని లక్ష్యాలు ఉంటాయి. అలాంటిది మధ్య వయసులోనే శరీరం మారాం చేస్తే, సర్వశక్తులూ ఉడిగిపోయి జీవచ్ఛవంలా మారిపోతే.. పథకాలూ, లక్ష్యాలూ గూడు చెదిరిన పక్షులవుతాయి.

వాస్తవానికి, ప్రకృతి సహజ జీవనంలో నూరేళ్ల జీవితం అసాధ్యమేమీ కాదు. కాకపోతే, శరీరపు సహజస్థితిని దెబ్బతీసే పరిణామాలు అనేకం లోపలా, బయటా కొన్ని జరగుతూ ఉంటాయి. అలాంటి స్థితిలో ఆయుర్వేదాన్ని ఆశ్రయించైనా, ఆరోగ్యాన్ని పరిపుష్టం చేసుకోవచ్చు. శతవసంతాల్ని పూర్తిచేయవచ్చు. ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం. అంటే మౌలికంగా, అమూల్యమైన రసాయనాల్ని ఆశ్రయించడమే. రసాయన చికిత్సల్ని ఆశ్రయించడమే.

జీవన యానంలో రసాయనం...
మనం తీసుకునే ఆహార పానీయాలు శరీరంలోని ఏడు ధాతువుల ద్వారా అంటే వివిధ కణజాలాల ద్వారా శుద్ధి అవుతాయి. ప్రతి ఽధాతువులోనూ ఆహారంలోని జీవరసాన్నీ, వ్యర్థ పదార్థాన్నీ విడగొట్టే ప్రక్రియ సాగుతుంది. ఈ సప్తధాతువులను జీవరసం శుద్ధి చేస్తూ పోతుంది. జీవరసం అన్ని ధాతువులకూ చేరే ప్రక్రియ... మన జీవనశైలి, తీసుకునే ఆహారపానీయాలు, శరీరంలో జరిగే అన్ని రకాల జీవక్రియల మీద ఆధారపడి ఉంటుంది. మనలోని ధాతువుల పోషణకు, జీవచైతన్యానికి ఈ జీవరసమే ప్రాణం. ఈ జీవరసం ఒక ధాతువు నుంచి మరో ధాతువుకు అలా చివరి వరకూ చేరడానికి ఈ ఏడు ధాతువుల మధ్య మార్గం ఉంటుంది. ఆ మార్గాన్నే ఆయుర్వేద పరిభాషలో రసాయనం అంటారు. అయితే వివిధ కారణాల వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కల్మషాలు జీవరసం ధాతువులకు చేరే రసాయన ప్రక్రియకు ఆటంకంగా మారతాయి.

మీ జీవనశైలి ఎలాఉంది?
ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడంతో పాటు ఆయుర్వేద వైద్యచికిత్సల ద్వారా ఈ రసాయన ప్రక్రియను సక్రమంగా ఉంచవచ్చు. అందుకే నిత్యం సరైన వ్యాయమాలు చేయడం, సమతుల ఆహారం, చక్కని పానీయాలు తీసుకోవడం చాలా అవసరం. రసాయన ప్రక్రియ సరిగ్గా సాగితే మొత్తం శరీర వ్యవస్థ అంతా సక్రమంగా ఉంటుంది. అయితే, భౌతిక అంశాలే కాకుండా మానసిక అంశాలు కూడా ఆయుఃప్రమాణాన్ని నిర్ణయిస్తా యనే సత్యాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు.

జ్ఞానేంద్రియాలకూ కర్మేంద్రియాలకూ మధ్య మనసు వారధిలా ఉంటుంది. రసపోషణ సరిగా ఉంటే శరీరమే కాకుండా మనసు కూడా స్థిరంగా, బలంగా ఉండాలి. అలా ఉంచడంలో రసాయనాల పాత్ర కీలకం. రసాయన చికిత్స ఒక ధాతువు నుంచి మరో ధాతువుకు రసాన్ని చేరవేసే మార్గాన్ని సుగమం చేస్తుంది. రోగ నివారణకు ఉపయోగపడేవన్నీ ఈ రసాయనాలే. రసాయన చికిత్స శరీర కణజాలంలోని క్రియా శక్తిని, వాటి జీవన కాలాన్ని పెంచుతుంది. కణాల పునరుత్తేజానికీ, పునరుత్పత్తికి ఈ చికిత్స తోడ్పడుతుంది. తద్వారా మనుషులను దీర్ఘాయుష్యులను చేస్తుంది.

పంచకర్మ చికిత్స
సాధారణంగా శరీరంలోని కణాలన్నీ మలినాలు, కల్మషాలతో పూడుకుపోయి ఉంటాయి. జీర్ణ క్రియలు సరిగా లేనప్పుడు కూడా ఆహార పదార్థాలు పులిసిపోయి చివరికి అవే విష పదార్థాలుగా మారుతాయి. తద్వారా ధాతువులన్నీ మాలిన్యాలతో నిండిపోతాయి. ఈ స్థితిలో శరీరంలోని శ్రోతస్సులు (వాహికలు, నాళాలు, సిరలు, ధమనులు) మూసుకుపోవడం ఒక ప్రధాన సమస్య. వాహికలు మూసుకుపోతే రసాలు ఆ కణజాలానికి అందవు. అందుకే ఈ వాహికలను శుద్ధి చేయడానికి కూడా పంచకర్మ చికిత్సలు చేయాలి. కణజాలంలోని మలినాలు తొలగిపోతేనే శ్రోతస్సులు శుభ్రమవుతాయి. రసాలు లోనికి ప్రవేశించడానికి దారి ఏర్పడుతుంది. అప్పుడు జీవరసాలు కణాల్లోకి వెళ్లే చోటు ఉండదు.

మలినాలు కణంలో నిండిపోతే ఆ కణజాలం పనితనం తగ్గిపోతుంది. దీనివల్ల మనిషి జీవన సామర్థ్యం తగ్గిపోతుంది. ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నామన్నది ముఖ్యమే. అయితే తీసుకున్న ఆహార రసాలను ఆస్వాదించే స్థితిలో శరీరం ఉండడం అంతకన్నా ముఖ్యం. శరీరాన్ని ఆ స్థితిలో ఉంచడానికి పంచకర్మ చికిత్సలు అద్బుతంగా తోడ్పడతాయి. పంచకర్మ చికిత్సల తర్వాత రసాయన చికిత్స ప్రారంభించాలి. అప్పుడే వైద్య రసాలతో పాటు ఆహారపానీయాల్లోని పోషకాలన్నీ శరీరంలోని సమస్త కణజాలాలకు సక్రమంగా చేరతాయి.

అలాంటి ప్రధాన రసాయనాల్లో కొన్ని...
బ్రహ్మ రసాయనం: ఇది మొత్తం శరీరం మీద పనిచేస్తుంది. ప్రత్యేకించి మెదడును ఉత్తేజితం చేస్తుంది.
భల్లాతక రసాయనం: కాలేయం,, చర్మం మీద పనిచేస్తుంది.. ఒంటి నొపలను తగ్గిస్తుంది.
పిప్పళి వర్థ్‌మాన రసాయనం: ఇది కాలేయం, జీర్ణ వ్యవస్థ, క్లోమగ్రంథి మీద అద్భుతంగా పనిచేస్తుంది.
కుష్మాండ రసాయనం (బూడిద గుమ్మడి కాయ): ఇది మెదడు శక్తిని పెంచుతుంది.
వాతాతపిక రసాయనం, మేధ్య రసాయనం కూడా రసాయన చికిత్సలో కీలక పాత్ర వహిస్తాయి.

నువ్వు ఎలా స్పందిస్తావన్నదే ముఖ్యం..
మీరేదైనా ప్రాజెక్ట్‌ చేపట్టి దాన్ని విజయవంతం చేయలేకపోయారా? ఎదుటి వాళ్లంతా అదే పనిగా మీ పైన విమర్శల్ని ఎక్కుపెడుతున్నారా? అయితే విమర్శల్ని ఆహ్వానించాల్సిందే! కానీ, ఆ విమర్శల్లోని వాస్తవికత ఎంత? సత్యశీలత లేని విమర్శల్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ విమర్శించినవారు అంతకు ముందు ఎప్పుడైనా మిమ్మల్ని ప్రశంసించారా? నిజానికి ప్రశంసించలేని వారికి విమర్శించే అర్హత కూడా ఉండదు. ఏ సమాజంలోనైనా, విజయాల్ని ప్రశంసించే వాళ్లు చాలా తక్కువ. ఎందుకంటే అలా ప్రశంసించడం ద్వారా తాము తక్కువైపోతామన్న భావన వారిలో ఉంటుంది. అందుకే ఓడిపోయినప్పుడు విరుచుకుపడేవాళ్లు, నువ్వు గెలిచినప్పుడు మౌనంగా ఉండిపోతారు. ఒకవేళ మాట్లాడినా ‘అదేమంత గొప్ప!’ అంటూ పెదవి విరిచేస్తారు.

విజయాలకు సమయం కావాలి
తొలి ప్రయత్నంతోనే విజయం రావడం అనేది ఎప్పుడో అరుదుగా తప్ప జరగదు. ఎన్నో వైఫల్యాల తర్వాత గానీ, ఒక్క విజయం చేతికి రాదు. కానీ, లోకం తీరు వేరు. అది మీ తొలిప్రాజెక్టే అయినా, విమర్శకుల నాలుకలు విరుచుకుపడకుండా ఉండవు. ఇదొక్కటే కాదు. ఇలాంటి సంఘటనలే ఇంకా ఎన్నో ఎదురవుతాయి. అవన్నీ వాళ్ల వ్యక్తిత్వ స్థాయిని చెబుతాయి. వాళ్లంతా ఏమంటున్నారనేది ప్రధానం కాదు. వాటికి మీరు ఎలా స్పందిస్తున్నారనేది ముఖ్యం. మీరు ఎదుటి వాళ్ల వ్యవహారశైలిని నియంత్రించలేకపోవచ్చు. ఆ శక్తి మీలో లేదు. కానీ, మీ ప్రతిస్పందనను మీరు నియంత్రించుకోగలరు. ఆ శక్తి మీలో ఉంది.

నువ్వు ఇచ్చేదే విలువ!
ఏ విషయమైనా దానికదిగా ఎలా ఉంటుందనేది ప్రామాణికం కాదు. మనం దాన్ని ఎలా చూస్తున్నామన్న దాని మీద.. ఎలా స్వీకరిస్తున్నామన్న దాని మీద దాని విలువ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా తాము వెళుతున్న మార్గాన్ని తీవ్రంగా ఖండిచారనుకోండి. ఆ ఖండనకు గురైన వారిలో కొందరు ఆగ్రహానికి గురవుతారు, కొందరు ఆ ఖండనకు బాధపడతారు. మరికొందరేమో అసలు పట్టించుకోరు. ఖండన ఒకటే కానీ, దానికి ఒక్కొక్కరు ఒక్కోలా ప్రతిస్పందిస్తారు. అందుకే, నీ పరిధిలో దేని విలువైనా నువ్వు ఇచ్చే దాన్ని బట్టే ఉంటుంది.

ఏ సంఘటనైనా మనల్ని తీవ్రమైన క్షోభకు గురిచేస్తోందీ అంటే ఆ శక్తిని నువ్వే దానికి ఇచ్చావని అర్థం. ఆ సంఘటనను నీకు నువ్వు ఎలా అన్వయించుకుంటున్నావన్నదాని మీదే అది నీ మీద ప్రభావం చూపడం ఉంటుంది. నిప్పు గడ్డి మీద పడితే కాలిపోతుంది. అదే రాయిమీద పడితే గడ్డికేమీ కాదు నిప్పే చల్లారిపోతుంది. అందుకే మనిషి గడ్డిలా కాకుండా రాయిలా ఉండాలి. ఎవరైనా తమ ఆలోచనా వైఖరిని దృఢంగా మార్చుకుంటే స్థితిగతులు మారిపోతాయి. మొత్తంగా జీవితమే మారిపోతుంది. మానవ జీవితాల్లోని అద్భుతాలన్నీ ఏ సంఘటనల మీద ఎలా స్పందిస్తావన్న దానిమీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయనేది వాస్తవం.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list