MohanPublications Print Books Online store clik Here Devullu.com

జగన్నాథ ఆలయం చెన్నూరు_jagannadhaswamyTemple-chennur



మనకూ ఉన్నాడు జగన్నాథుడు!
జగన్నాథుడు అనగానే మనకు పూరీలోని స్వామే గుర్తొస్తాడు. కానీ తెలుగు గడ్డ మీదా ఓ జగన్నాథస్వామి గుడి ఉంది. ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూరులో ఉన్న ఈ ఆలయంలోని స్వామి సాక్షాత్తూ పూరీజగన్నాథుడే అంటారు. రెండు ఆలయాలకూ చాలా పోలికలే ఉన్నాయి.
శ్రీకృష్ణ స్వరూపుడైన జగన్నాథుడు సుభద్ర, బలభద్ర సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఆశ్రితపాలకుడిగా, భక్తజన వరదుడిగా స్వామికి పేరు. అలాంటి దేవుడికి తెలుగునాట ఓ ప్రాంతం ఎంతగానో నచ్చిందట. అక్కడికి సపరివారంగా వస్తున్నానంటూ తనంతట తానే ప్రకటించాడట. ఆ చోటే తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలో పవిత్ర గోదావరీ తీరాన ఉన్న చెన్నూరు. పూజలన్నీ పూరీ ఆలయం తరహాలోనే జరుగుతాయిక్కడ.

కాకతీయుల కాలంలో... 
పురాణ కాలంలో చెన్నూరుని రమ్యపురి అని పిలిచేవారు. గోదావరి ప్రవాహంతో పాటు అందమైన అటవీ క్షేత్రం ఉండటం వల్లే ఈ ప్రాంతానికి ఈ పేరు ఉండేదట. ఇక్కడి గోదావరిని పంచక్రోశ ఉత్తర వాహినిగా పిలుస్తారు. అంటే సహజంగా గోదావరి తూర్పు దిశగా ప్రయాణం చేస్తుంది. కానీ ఇక్కడ ప్రవాహాన్ని ఉత్తర దిశగా మార్చుకుని ఐదు క్రోసుల దూరం ముందుకు ప్రయాణించి అక్కడి నుంచి మళ్లీ తూర్పునకు ప్రయాణిస్తుంది. శాస్త్ర ప్రకారం ఇదో ప్రత్యేకత. ఇక ఇక్కడ అగస్త్య మహాముని తపస్సు చేయడం వల్ల కూడా ఈ నేలకు ఎనలేని పవిత్రత వచ్చిందంటారు. అందుకే జగన్నాథస్వామే తనంతట తానుగా చెన్నూరు క్షేత్రానికి రావడానికి నిశ్చయించుకున్నాడట. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన సామంతరాజుకు కలలోకి వచ్చిన జగన్నాథస్వామి ‘నన్ను.. నా పరివారంతో సహా ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేయ’మని చెప్పాడట. నిద్ర లేచిన తర్వాత రాజు ‘ఏమిటి ఇలా కల వచ్చింద’ని ఆలోచించాడు. ఇలాంటి కల పదే పదే వస్తుండటంతో తన ఆస్థాన పండితులతో చర్చించాడు. బ్రహ్మముహూర్తంలో వచ్చిన కల సాక్షాత్తూ భగవంతుడి ఆదేశమంటూ పండితులందరూ రాజుకు చెప్పడంతో, రాజు వెంటనే ఆలయ నిర్మాణం చేపట్టాలని సంకల్పించాడు. అయితే ఆ ప్రాంతంలో ఎక్కడా జగన్నాథుడి విగ్రహాలు దొరికే అవకాశం కానీ, ఆ తరహా ఆలయ నిర్మాణాలు కానీ లేకపోవడంతో ఆ భగవంతుడే తనకు మార్గం చూపించాలని వేడుకున్నాడట. మరుసటి రోజు జగన్నాథస్వామి మళ్లీ కలలోకి వచ్చి, ‘రాజా... నీవు పూరీ క్షేత్రానికి వెళ్తే అక్కడ నా మూర్తులు పరివారము సహా లభ్యమవుతాయి. వాటిని నిత్యారాధనలూ, ధూపదీప నైవేద్యాదులతో అక్కడి నుంచి తీసుకువచ్చి ప్రతిష్ఠించ’మని మార్గనిర్దేశం చేశాడట. స్వామి ఆజ్ఞను శిరసావహించి రాజు సకల పరివారముతో పూరీ క్షేత్రానికి వెళ్లాడు. అక్కడ ఒక శిల్పి దగ్గర స్వామి విగ్రహమూర్తులు కనిపించాయట. వాటిని తీసుకొని త్రికాల ఆరాధన చేస్తూ చెన్నూరు క్షేత్రానికి తీసుకొచ్చారు. ఇందుకు ఒకటిన్నర సంవత్సరాల కాలం పట్టిందట.

పూరీలోలాగే... 
ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం మాదిరిగానే ఇక్కడా గుడిని నిర్మించి దేవదారు విగ్రహాలను ప్రతిష్ఠించారు. స్వామివారి రథం, నిత్య పూజలూ, నైవేద్యాలూ అన్నీ పూరీక్షేత్రాన్ని పోలిఉంటాయి. ఇక్కడి స్వామికి బాలభోగం (దద్ధ్యోదనం, పొంగలి), రాజభోగం (శుద్ధాన్నము, మల్హోర), మహాభోగం (చిత్రాన్నం, రవ్వకేసరి) పేరిట ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రాలు నైవేద్యం సమర్పిస్తారు. ఆలయంలో సుభద్రాదేవి, బలరామకృష్ణుడు, నృసింహస్వామి, ఆండాళమ్మ, సుదర్శనం, ఆళ్వారులతోపాటు ఉత్సవ మూర్తులైన అలమేలు మంగా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి కొలువుదీరి ఉన్నారు.

అవతార విశేషం 
జగన్నాథస్వామి విగ్రహ మూర్తులకు హస్తాలూ, పాదాలూ ఉండవు. అందుకే ఈయన్ను మొండి జగన్నాథుడిగా పిలుచుకుంటారు. ఇక్కడి స్వామి కళ్లను ప్రత్యేకంగా చెబుతారు. ఆయన కళ్ల ద్వారానే ఆశీస్సులు అందిస్తారని భక్తుల నమ్మకం. మందిరంలో వెలిసిన గోదా తాయారు(ఆండాళమ్మవారు)ను మహిమాన్వితురాలిగా భక్తులు పూజిస్తారు. ఆలయంలో ఆరాధన కార్యక్రమాలన్నీ పాంచరాత్ర ఆగమోక్త
సంప్రదాయాన్ని అనుసరించి జరుపుతారు. సంవత్సరాది నుంచి శ్రీరామనవరాత్రులూ, శ్రీరామ నవమి నుంచి పౌర్ణమి వరకూ బ్రహ్మోత్సవాలూ నిర్వహిస్తారు. అందులో భాగంగా పాడ్యమి రోజు రథోత్సవం నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో చందనోత్సవం, నృసింహ, హనుమాన్‌ జయంతులు విశేషంగా జరుపుతారు. జ్యేష్ఠ మాసంలో పూర్ణిమాభిషేకం, జ్యేష్ఠ పంచకవ్రతం నిర్వహిస్తారు. కార్తీక మాసంలో అఖండ నామ సంకీర్తన ఉత్సవం (నాద సప్తాహం), గరుడ సేవ చేపడతారు. ధనుర్మాసంలో వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో సుదర్శనహోమం,
ఉత్తర ద్వారదర్శనం, కుడారై ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తారు.

ఇలా చేరాలి 
జగన్నాథ ఆలయం మంచిర్యాల పట్టణానికి 38కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లే ప్రధాన రైలు మార్గంలో మంచిర్యాలకు వచ్చి ఆలయానికి వెళ్లొచ్చు. మంచిర్యాల నుంచి చెన్నూరుకు ప్రతి 20 నిమిషాలకూ బస్సు సౌకర్యం ఉంది.
- ముప్పూరి వెేంకటేశ్వర్లు, ఈనాడు, ఆదిలాబాద్‌ 
చిత్రాలు: ఎస్‌.వెంకటేశ్వర్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list