ధర్మానికి స్థానం యుధిష్ఠిరుడు
మనకు మనం చేసుకొనే స్వయం సూచన, సామాజిక సూచనగా ఎదిగేందుకు మనిషి మాత్రమే వేదికవుతాడని చెప్పిన యుధిష్ఠిరుడు ధర్మానికి నిలయమై ధర్మరాజుగా ఖ్యాతిగాంచాడు. ధర్మరాజు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం నిజమైన ధర్మాన్వేషకులం కావాలి. జీవితం పట్ల ఖచ్చితత్వం, భిన్నమైన మనస్తత్వం, దృఢత్వం, సహనం, వినయం, విధేయత, జాలి, మంచి నడవడిక, ఓర్చుకునే గుణం, తనవారిపట్ల సడలని ప్రేమ, ఆలోచించే ఉన్నత దృక్పథం.. లాంటి ఎన్నో విశేషాలు ధర్మరాజు వ్యక్తిత్వాన్ని మలచడంలో కీలకపాత్ర పోషించాయి. మరెన్నో సుగుణాలు నిగర్వియైన ధర్మజుని వ్యక్తిత్వ నిర్మాణంలోనే ఒదిగిపోయి అతన్ని చరిత్రలో నిలబెట్టాయి.
యుధిష్ఠిరుని జీవితంలో జరిగిన కీలక విషయాలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహించే ధర్మ స్రవంతి ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా తట్టుకొని నిలబడితే ైస్థెర్యాన్నిచ్చిందని ధర్మజుని విశ్వాసం. పాండురాజు తదనంతరం ధర్మజుని పాలన చూసి ఓర్వలేని కౌరవులు లక్క ఇంటిలో తమని చంపాలని చూసినా, మారుమాట్లాడక ప్రాణాలు దక్కించుకొని అడవుల్లో కాలం గడిపారు. పాండవులు ప్రాణాలతోనే ఉన్నారని తెలుసుకొని ధృతరాష్ర్టుడు విదురునితో కబురు పంపితే, రాజ్యాన్ని పంచుతాననీ, దాన్ని ఏలుకోమనీ అన్నప్పుడు సరేనంటాడు ధర్మరాజు. కుంతిగానీ, ద్రౌపదిగానీ, భీమార్జున నకుల సహదేవులు గానీ ఏనాడూ ధర్మజుని నిర్ణయాన్ని తప్పుబట్టలేదు. ధృతరాష్ర్టుని ప్రస్తావన మన్నించి ఇంద్రప్రస్థమనే రాజ్యాన్ని అమోఘంగా నిర్మించి విస్తరించిన ధర్మజుని కౌశల్యం పగలూ, ప్రతీకారాలూ జీవితాన్ని మరింత వెనక్కు నెట్టేస్తాయనీ, గతాన్ని మరిస్తేనే భవిత బాగుంటుందనీ నిరూపించింది.మంచిని ఓర్వలేని కౌరవులు పాండవుల వైభవాన్ని చూసి తట్టుకోలేక జూదానికి పిలిస్తే క్షత్రియ ధర్మం ప్రకారం ఆహ్వానాన్ని కాదనడం అగౌరవమనీ, నేను రాను అనడం అవమానకరమనీ భావించి వెళ్ళిన ధర్మరాజు తననూ, తన సోదరులనూ, ద్రౌపదినీ పందెం కాసి ఓడిపోయాడు. మళ్ళీ అడవుల పాలయ్యాడు. అడవుల్లో అనుభవించిన కష్టాలూ, చేసిన సాహసాలూ అనేకమే. అయినా ధర్మరాజు నిశ్చితత్వాన్ని ఏమాత్రం సడలించలేకపోయాయి.
హస్తినాపురాన్ని వదిలి పాండవులు వెళ్ళిపోతుంటే ధర్మరాజుపై గౌరవంతో ఎంతోమంది బ్రాహ్మణులు వెంటరాగా వారందరికీ ఆతిథ్యమిచ్చి, నచ్చజెప్పి వెనక్కి పంపించేస్తాడు. ద్వైతవనంలో ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నప్పుడు పాండవుల పరిస్థితిని తెలుసుకుందామని వచ్చిన కౌరవులు గంధర్వుల సరస్సులో స్నానం చేయడానికని దిగి వారి చేతిలో ధర్మరాజే వారిని విడిపిస్తాడు. ధుర్యోధనుని బావమరిది ద్రౌపదితో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నిస్తే పాండవులతన్ని చంపబోగా నివారించి క్షమిస్తాడు. మంచితనంతో, మానవత్వంతో ఆలోచించే యుధిష్ఠురుని ధర్మనిరతి తనని అజాత శత్రువుగా ప్రపంచంలో స్థిరీకరించింది.యక్షప్రశ్నలకు సమాధానమిస్తూ మనుషులు మరణించడం మనం ప్రతీక్షణం చూస్తూనే మనమెప్పుడూ మరణించమని భావించే ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకోలేక పోవడం మనిషి బలహీనతంటాడు ధర్మజుడు. అరణ్యవాసం అయిపోయాక రాజ్యంలో సగభాగాన్ని తిరిగి ఇవ్వాలని ధృతరాష్ర్టుని దగ్గరకు యుధిష్ఠిరుడు దూతను పంపగా సూది మొనంత కూడా నేలనివ్వనని చెప్పిన దుర్యోధనుని మాటలకు నొచ్చుకోక కనీసం ఐదూళ్ళైనా ఇవ్వమని కృష్ణుని రాయబారిగా పంపిస్తాడు. శాంతిని కోరిన ధర్మజుడు ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి యుద్ధానికి ఒప్పుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ పక్షంలోనే నిలిచిన పెద్దలందరి ఆశీర్వాదాన్ని తీసుకొని యుద్ధానికి తలపడిన యుధిష్ఠిరుని వ్యక్తిత్వం అద్భుతం.
చివరి నిమిషంలో కూడా దుర్యోధనునికి తన ప్రాణాలు ఎవరి చేతిలో పోవాలో నిర్ణయించుకోమంటాడు. విశాలమైన మనసుగల ధర్మరాజు శత్రువును సైతం మానవత్వంతో చూడాలని చెబుతాడని అంటుందీ ఘటన. యుద్ధం ముగిసి విజయం వచ్చినా ఒకింత గర్వమెరుగని యుధిష్ఠిరుడు గాంధారీ ధృతరాష్ర్టులను గౌరవంగా చూసుకుంటాడు. వారి పిల్లలు చేసిన తప్పులకు వారెలా బాధ్యులని అంటాడు. చక్రవర్తిగా పాలన చేయడానికి నా మనసు అంగీకరించడం లేదనీ తన వారంతా పోయాక ఎవరిని పాలించాలనీ అన్న ధర్మజుని సున్నితత్వం అమోఘం. 33 సంవత్సరాలు రాజ్యపాలన చేసి కృష్ణ నిర్యాణం తర్వాత ద్రౌపదీ, సోదరులతో హిమాలయాలకు మహా ప్రస్థానం సాగిస్తాడు ధర్మరాజు.నైతికత, విలువలు, ధర్మం, శాస్త్రం, లోకరీతి, యుద్ధం, మంచితనం, నిండైన వ్యక్తిత్వంగా రూపుదిద్దుకున్న యుధిష్ఠిరుని జీవిత ప్రతిభ భారతీయులకే దక్కిన వారసత్వ సంపద. ఆ ధార్మికతను కాపాడుకోవడమే మన కర్తవ్యం.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565