విద్యారుణం.. వడ్డీ రాయితీతో!
ప్రతిభ ఉండీ ఆర్థిక స్థితి అనుకూలించక పై చదువులు మానేసిన వారెందరో! స్వదేశంలో ఉన్నత విద్య లేదా విదేశీ విద్య అందని ద్రాక్షగా మారుతున్న రోజులివి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, షెడ్యూలు కులాల వారికీ, మైనార్టీలకూ ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలనే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశ పెట్టింది. ఇందులో ఒకటి ‘వడ్డీ రాయితీతో విద్యా రుణ పథకాలు’. ఇవి పేద విద్యార్థుల పాలిట వరంగా చెప్పుకోవచ్చు. భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) రూపొందించిన మోడల్ ఎడ్యుకేషనల్ లోన్ నిబంధనల ప్రకారం వివిధ బ్యాంకులు మంజూరు చేస్తున్న విద్యా రుణాలకు ఈ వడ్డీ రాయితీ పథకాలు వర్తిస్తాయి.
స్వదేశంలో.. రూ.10లక్షల వరకూ...
దేశీయంగా ఉన్నత చదువులు అభ్యసించాలని కోరుకునే వారికి బ్యాంకులు నిబంధనల మేరకు రుణాలను మంజూరు చేస్తాయి. ఇక ఈ రుణాన్ని తీసుకున్న వారికి వడ్డీ రాయితీ పథకం ఎలా వర్తిస్తుందంటే...
* విద్యార్థి సామాజిక వర్గంతో సంబంధం లేకుండా అతని కుటుంబ ఆర్థిక స్థితిని అనుసరించి ఈ పథకం లబ్ది చేకూరుస్తుంది.
* ‘సెంట్రల్ స్కీం ఆఫ్ ఇంట్రస్ట్ సబ్సిడీ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్’ (సీఎస్‌ఐఎస్) పేరుతో అమలు చేస్తున్న ఈ పథకం, వృత్తి సంబంధిత, సాంకేతిక విద్యా కోర్సులలో, భారతదేశంలో విద్యనభ్యసించాలనుకునే వారికి వర్తిస్తుంది.
* విద్యార్థుల తల్లిదండ్రుల లేదా వార్షిక కుటుంబ ఆదాయం (అన్ని ఆదాయ వనరులూ కలిపి) రూ.నాలుగున్నర లక్షల వరకూ ఉన్న వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వం నిర్దేశించిన అధికారులు ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా అర్హత నిర్ణయిస్తారు.
* ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి అర్హతతో, అనుమతి పొందిన విద్యా సంస్థలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రవేశం పొందేవారు అర్హులు.
* బ్యాంకుల నుంచి పొందే విద్యా రుణంలో రూ.10లక్షల వరకూ విధించే మొత్తం వడ్డీని రుణ గ్రహీత తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.10లక్షల పైన విద్యా రుణం తీసుకుంటే.. ఆ పై (రూ.10లక్షల తర్వాత) మొత్తానికి బ్యాంకులు విధించే వడ్డీని రుణ గ్రహీత చెల్లించాల్సి ఉంటుంది.
* ఇంటర్మీడియట్ తర్వాత చేరే తొలి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా, ఏకీకృత పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలలో చేరాలనుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది.
* ఒక విద్యార్థి ఒక కోర్సుకు మాత్రమే వడ్డీ రాయితీ పొందడానికి అర్హుడు.
విదేశాల్లో చదువుతుంటే...
విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే ఆర్థికంగా వెనకబడిన, ఇతర వెనకబడిన సామాజిక వర్గ విద్యార్థులకు, మైనార్టీలకు వేర్వేరు పథకాల ద్వారా వడ్డీ రాయితీ పథకాలు అందుబాటులో ఉన్నాయి.
* డా.అంబేడ్కర్ ‘సెంట్రల్ సెక్టార్ స్కీం ఫర్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ ఎడ్యుకేషనల్ లోన్స్’ పేరుతో అమలవుతున్న ఈ పథకంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇతర వెనుకబడిన సామాజిక వర్గ విద్యార్థులకు లబ్ది చేకూరుతుంది.
* ‘పడో పరదేశి’ పేరుతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా విదేశాలలో విద్యనభ్యసించాలనుకునే మైనార్టీ విద్యార్థులకు లబ్ది చేకూరుతుంది.
* ఈ పథకంలో లబ్ది పొందడానికి, వార్షిక కుటుంబ ఆదాయ పరిమితిని ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల విషయంలో రూ.ఒక లక్ష, ఇతర వెనకబడిన సామాజిక వర్గ విద్యార్థుల విషయంలో రూ.3లక్షలు, మైనార్టీలకు రూ.6లక్షలుగానూ నిర్దేశించారు.
* విదేశాల్లో మాస్టర్స్, ఎంఫిల్ లేదా పీహెచ్‌డీ చేయాలనుకునే వారికి ఈ పథకాలు వర్తిస్తాయి.
* బ్యాంకుల నుంచి పొందే విద్యా రుణంలో రూ.20లక్షల వరకూ విధించే మొత్తం వడ్డీని రుణ గ్రహీత తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.20లక్షల పైన విద్యా రుణం పొందిన పక్షంలో, ఆ పై మొత్తానికి బ్యాంకులు విధించే వడ్డీని రుణ గ్రహీత చెల్లించాల్సి ఉంటుంది.
* రుణ అమలులో ఉన్న కాలంలో విద్యార్థి భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటే వడ్డీ రాయితీ వర్తించదు.
* ఆదాయపు పన్ను ధ్రువీకరణ పత్రాలు లేదా ప్రభుత్వం నిర్దేశించిన అధికారులు ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అర్హత నిర్ణయిస్తారు.
* ఆర్ట్స్, కామర్స్, వివిధ శాస్త్ర సాంకేతిక కోర్సులు, వైద్య విద్య, నానో టెక్నాలజీ, ఎంబీఏ, ఎంసీఏ సహా 40కి పైగా కోర్సులు ఈ పథకం ద్వారా రాయితీ పొందడానికి అర్హమైనవి.
* ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలలో చదువుకున్న విద్యార్థులకు ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది.
* ఒకే కోర్సులో కొంత కాలం భారతదేశంలోను మరికొంత కాలం విదేశాలలోనూ చదవాల్సిన సందర్భంలో, విదేశీ యూనివర్సిటీ పట్టా ప్రదానం చేసే సందర్భంలోనే ఈ పథకం వర్తిస్తుంది.
రాయితీ ఎంత కాలానికి?
* కోర్సు ప్రారంభం నుంచి మొదలుకొని, పూర్తయిన తర్వాత 12 నెలలు లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత ఆరు నెలల కాలాన్ని పరిగణనలోనికి తీసుకొని, ఈ రెండింటిలో ఏది ముందయితే దాన్ని మారటోరియం అవధిగా నిర్ణయిస్తారు. కాలానికి పూర్తి వడ్డీ రాయితీని అందిస్తారు.
* మారటోరియం అవధి దాటిన కాలానికి రుణగ్రహీత వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
* కోర్సు మధ్యలో మానేసిన వారికి, విద్యా సంస్థలు తొలగించిన విద్యార్థులకు వడ్డీ రాయితీ వర్తించదు.
నైపుణ్యం ఉండీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యావకాశాల్ని చేజార్చుకుంటున్న యువతకు ఈ ప్రోత్సాహక పథకాలు చేయూతనిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇంటి నుంచే దరఖాస్తు...
విద్యారుణం కోసం ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తును సమర్పించే వీలుంది. దీనికోసం అందుబాటులోకి వచ్చిన వెబ్‌సైట్ ‘విద్యాలక్ష్మి’. కేంద్ర ఆర్థిక శాఖ, మానవ వనరుల శాఖ, భారతీయ బ్యాంకుల సంఘం సంయుక్తంగా అందిస్తోన్న www.vidyalakshmi.co.in వెబ్‌సైట్ ద్వారా అల్పాదాయ వర్గాలతో సహా అన్ని వర్గాల విద్యార్థులూ విద్యారుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకుల సంఘం రూపొందించిన ఉమ్మడి దరఖాస్తు పత్రాన్ని నింపి, గరిష్ఠంగా 3 బ్యాంకులకు రుణ అభ్యర్థనను పంపవచ్చు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న బ్యాంకులు ఆ రుణ దరఖాస్తును పరిశీలించి, అర్హతననుసరించి, అభ్యర్థికి సమాచారాన్ని తెలియజేస్తాయి. విద్యార్థి తన దరఖాస్తు పరిస్థితిని ఈ వెబ్‌సైట్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
* అభ్యర్థి తన మొబైల్ నెంబరు, ఈ మెయిల్ ఐడీ సహాయంతో విద్యాలక్ష్మి పోర్టల్‌లో తొలుత నమోదు చేసుకోవాలి. ఉమ్మడి దరఖాస్తును పూర్తి చేసి, తండ్రి/సంరక్షకుని పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఎంపిక చేసుకున్న కోర్సు, రుణ మొత్తాన్ని నమోదు చేసి, మార్కల జాబితాను అప్‌లోడ్ చేయాలి. వివిధ బ్యాంకులు ఉన్నత విద్యాభ్యాసం కోసం అందించే విద్యా రుణ పథకాల సమగ్ర సమాచారాన్ని కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.
ఆంధ్రాబ్యాంకు, స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంకు, ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కరూర్ వైశ్యా బ్యాంకుతో సహా అనేక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తులను అంగీకరిస్తున్నాయి.
పున్నమరాజు
క్రాంతీ.. మీ ఆర్థిక ప్రణాళిక ఇలా!
ఆర్థిక ప్రణాళిక అంటే.. ఒక్క రోజులో పూర్తయ్యే విషయం కాదు. ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూ.. భవిష్యత్తు లక్ష్యాల కోసం లెక్కలు వేసుకోవాలి. అప్పులు తగ్గించుకుంటూ.. ఆస్తులను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ఉన్న ఆర్థిక వనరులతో.. అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు వీలవుతుంది.
క్రాంతి కుమార్.. హైదరాబాద్‌లోని ఒక బహుళ జాతి సంస్థలో మార్కెటింగ్ ఉద్యోగి. భార్య మహాలక్ష్మి. వీరికి నాలుగేళ్ల అబ్బాయి... ఆదిత్య.
వీరి ఆదాయ, వ్యయాలను పరిశీలిస్తే.. ఇద్దరికీ కలిపి రూ.63వేల వరకూ వస్తున్నాయి. ఇందులో నుంచి నెలకు ఇంటి ఖర్చులు రూ.12,000; ఆదిత్య స్కూలు ఫీజు రూ.3,300; క్రాంతి తల్లిదండ్రులకు పంపే మొత్తం రూ.10,000; ఇంటి రుణం వాయిదాలు, ఇతర అప్పులకు సంబంధించిన నెలవారీ వాయిదాలు కలిపి రూ.20,206 వరకూ చెల్లిస్తున్నారు. ఇవన్నీ మొత్తంగా రూ.45,506 వరకూ అవుతున్నాయి.
అతను తీసుకున్న అప్పుల విషయానికి వస్తే...
* గృహరుణానికి నెలకు రూ.14,683 వాయిదా చెల్లిస్తున్నారు. ఇంకా రూ.15,00,000వరకూ చెల్లించాల్సి ఉంది.
* వ్యక్తిగత రుణానికి నెలకు రూ.3,313 చెల్లిస్తున్నారు. ఇంకా మిగిలిన మొత్తం రూ.1,50,000
* ఇతర రుణాలకు నెలకు రూ. 2210 వాయిదా కడుతున్నారు. మిగిలిన మొత్తం రూ.1,00,000. అంటే.. క్రాంతిపై దాదాపు రూ.17,50,000 రుణ బాధ్యత ఉంది.
సంపాదన, ఖర్చు విషయానికి వస్తే.. అతని మొత్తం అప్పులకు చెల్లిస్తున్న వాయిదాలు అతని సంపాదనలో దాదాపు 32శాతం వరకూ ఉన్నాయి. ఈ నిష్పత్తిని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉంది.
ఇక ఖర్చులు, రుణ వాయిదాలు పోను దాదాపు 21శాతం వరకూ మిగులు కనిపిస్తోంది.
ఏం చేయాలంటే...
ముందుగా బీమా: కుటుంబానికి ఆధారంగా ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జీవిత బీమా తీసుకోవాలి. ఒకవేళ జరగరానిది జరిగినా కుటుంబానికి ఏ ఆర్థిక ఇబ్బందీ రాకుండా, సాధించాల్సిన లక్ష్యాలకు ఇది ఒక రక్షణగా ఉపయోగపడుతుంది. ఇక క్రాంతి విషయానికి వస్తే.. అతని బాధ్యతల దృష్ట్యా కనీసం రూ.కోటి జీవిత బీమా పాలసీని టర్మ్ పాలసీ రూపంలో తీసుకోవాలి. మార్కెటింగ్ ఉద్యోగ రీత్యా ఎక్కువగా ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి, కనీసం రూ.50లక్షల వ్యక్తిగత ప్రమాద, డిజేబిలిటీ బీమా పాలసీలు తీసుకోవాలి.
అత్యవసర నిధి: అనుకోని ఖర్చులు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో చెప్పలేం. కొన్నిసార్లు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయమూ ఆగిపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా అట్టి పెట్టుకోవాలి. ఈ మొత్తాన్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఉత్తమం.
ఆదిత్య చదువు..
ప్రస్తుతం విద్యా ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వారి ఉన్నత చదువులకు అవసరమ్యే మొత్తం గురించి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి. లేకపోతే.. వారు ఉన్నత చదువులకు వచ్చే నాటికి అది పెద్ద భారంగా మారుతుంది.
* ఆదిత్య ఏ ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నాడు అనే విషయంలో రెండు, మూడింటిని పరిశీలించండి.
* ప్రస్తుతం ఆ కోర్సును అభ్యసించడానికి ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని తెలుసుకోండి. పెరుగుతున్న ఖర్చులను చూసుకుంటూ భవిష్యత్తులో ఆదిత్య ఆ కోర్సు చదివే నాటికి అయ్యే మొత్తం ఖర్చు ఎంతో లెక్క వేసుకోవాలి.
* ఆ దిశగా మీరు నెలవారీ పెట్టుబడులు ప్రారంభించండి. మీ దగ్గర మిగులు పెరిగినప్పుడు పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచండి. మదుపు కోసం డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు.
పదవీ విరమణ కోసం...
ప్రస్తుతం ఉన్న మీ ఖర్చులు, ఇతర బాధ్యతలను పరిశీలిస్తే.. క్రాంతి పదవీ విరమణ చేసేనాటికి దాదాపు రూ.3కోట్ల నిధి చేతిలో ఉండాలి. దీనిని సాధించాలంటే.. ఇప్పటి నుంచే నెలకు రూ.16,500 వరకూ మదుపు చేయాలి. అయితే, ఇప్పుడు ఇంత పొదుపు చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, వెంటనే రూ.5వేలను పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడం మేలు. వ్యక్తిగత రుణం తీరిన తర్వాత దానికి చెల్లిస్తున్న వాయిదా మొత్తాన్ని కూడా పెట్టుబడుల వైపు మళ్లించాలి. పదవీ విరమణ పెట్టుబడి కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ‘సిప్’ ప్రారంభించాలి.
* క్రాంతి ప్రస్తుత వయసు 34ఏళ్లు. మహాలక్ష్మి వయసు 28. క్రాంతి పదవీ విరమణ 60ఏళ్ల వయసులో చేస్తారనుకుందాం. అప్పుడు మహాలక్ష్మికి 54 ఏళ్లు ఉంటాయి. క్రాంతి పదవీ విరమణ తర్వాత 25ఏళ్లు లెక్కలోకి తీసుకుందాం.
* పదవీ విరమణ చేసిన తర్వాత అతనికి నెలవారీ కావాల్సిన మొత్తం రూ.1,13,735
* ఎన్ని నెలలపాటు అవసరం (మహాలక్ష్మికి కూడా 85ఏళ్ల వయసును లెక్కలోకి తీసుకుంటే) 372నెలలు
* మొత్తం కావాల్సిన నిధి రూ.3,16,43,836
* పెట్టుబడి పెట్టేందుకు మిగిలిన నెలలు 312
* రాబడి అంచనా 12శాతం
* నెలకు అవసరమయ్యే పెట్టుబడి రూ.16,488
- సాయి కృష్ణ పత్రి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
వరద వచ్చినా... నష్టం లేకుండా!
గట్టిగా ఒక్క వాన పడితే చాలు.. అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకు పోవడం.. ఇళ్లలోకి ఆ నీరు చేరడం.. విలువైన వస్తువులు పాడవటం ఇప్పుడు సర్వసాధారణమైంది. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులతో గృహోపకరణాలు కాలిపోవడమూ చూస్తుంటాం. మరి, ఇలాంటి ఆర్థిక నష్టాల గురించి గట్టెక్కించే ‘హౌస్ హోల్డర్స్’ పాలసీని మీరు తీసుకున్నారా?
ప్రకృతి వైపరీత్యాలు.. దొంగతనాలు... అనుకోని ప్రమాదాల కారణంగా ఎంతో విలువైన ఇంటికే కాదు... అందులోని ఖరీదైన వస్తువులకూ వాటిల్లే ఆర్థిక నష్టం నుంచి కాచుకోవాలంటే ఏకైక సాధనం హౌస్‌హోల్డర్స్ పాలసీ. న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్, బజాజ్ అలియాంజ్, రాయల్ సుందరం, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో తదితర బీమా సంస్థలన్నీ ఈ పాలసీని ఇస్తున్నాయి.
ఇంటితో బాటు అందులో నివసించే వ్యక్తులు, ఉండే వస్తువులకు కూడా బీమా రక్షణ కల్పించటం ఈ పాలసీ ప్రత్యేకత. వారు వీరు అన్న తేడా లేకుండా సొంతిల్లు ఉన్న వారంతా హౌస్‌హోల్డర్స్ పాలసీ తీసుకోవచ్చు. గ్రామాలు, పట్టణాలన్న తేడా ఏమీ ఉండదు.
* హౌస్‌హోల్డర్స్ పాలసీలో పది సెక్షన్లు ఉంటాయి. ఒకో సెక్షన్ ఒకో రకం నష్టానికి పరిహారం ఇస్తుంది. మీ అవసరాలను బట్టి కావాల్సిన సెక్షన్లను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, సెక్షన్ 1ఎ ఇంటికి వర్తిస్తుంది. సెక్షన్ 1బి ఇంట్లోని వస్తువులకు వర్తిస్తుంది. ఇందులో సెక్షన్ 1బి తప్పనిసరి. మిగిలిన సెక్షన్లలో మీకు కావాల్సిన వాటినే ఎంచుకోవచ్చు.
వివిధ సెక్షన్ల కింద...
* ఇంటికి, ఇంట్లోని వస్తువులకు
* దొంగలు పడి ఇల్లంతా దోచుకున్నా
* అగ్నిప్రమాదం సంభవించి గృహోపకరణాలు ధ్వంసమైనా
* షార్ట్ సర్క్యూట్ వల్ల టీవీ, వీసీడీ, కంప్యూటర్ వంటి వస్తువులు పాడైతే
* మీరెంతో ముచ్చటపడి కొనుక్కున్న సైకిల్ అపహరణకు గురైనా (బైకుకు వాహన బీమా ఉంటుంది)
* ప్రయాణ సమయాల్లో లగేజీని అపహరించినా పరిహారం లభిస్తుంది. ప్రకృతి ప్రకోపాల నుంచి ఉగ్రవాదుల దాడుల వరకూ కారణం ఏదైనప్పటికీ బీమా అండగా నిలుస్తుంది.
ఖర్చు తక్కువే..
గృహ బీమా పాలసీకి ప్రీమియం నామమాత్రంగానే ఉంటుంది. ప్రీమియాన్ని లెక్కించేప్పుడు కొన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకుంటారు. ఇంటి వైశాల్యం, భౌగోళిక పరిస్థితులు, నిర్మాణం తీరు తదితర వాటి ఆధారంగా ప్రీమియం ఉంటుంది. ఇంటికీ, ఇంట్లోని వస్తువులకూ కలిపి రూ.లక్ష బీమా పాలసీ తీసుకుంటే.. ఏడాదికి ప్రీమియం రూ.50-100కు మించదు. టీవీ, ఫ్రిజ్, ఎల్‌ఈడీ టీవీ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులకు కలిపి రూ.లక్ష వరకూ పాలసీ తీసుకుంటే.. రూ.1100 వరకూ ఉంటుంది. అన్ని సెక్షన్లనూ కలిపి తీసుకున్నా.. రూ.లక్షకు ప్రీమియం ఖర్చు రూ.2,000 దాటదు. కంపెనీలను బట్టి ప్రీమియం రేట్లు మారవచ్చు. (జులై 1 నుంచి జీఎస్‌టీ అదనం)
తీసుకునేప్పుడు చూడాలివీ!
పాలసీని ఎంచుకునేముందు పాలసీ నిబంధనలను ఒకటికి రెండుసార్లు పరిశీలించండి. ఏదో కొన్నింటికే కాకుండా సాధ్యమైనన్ని ఎక్కువ నష్టాలకు క్లెయిం ఇచ్చే పాలసీని ఎంపిక చేసుకోవాలి.
* ఇంటి నిర్మాణం విలువ, ఇంటిలోని వస్తువుల విలువను కచ్చితంగా లెక్కించి, దానికి అనుగుణంగా పాలసీ మొత్తాన్ని ఎంచుకోవాలి.
* పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వేటికి వర్తిస్తుంది.. వేటికి వర్తించదు అనే వివరాలు సేకరించాలి. చాలావరకు పాలసీలు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో పరిహారం ఇస్తుంటాయి. అయితే, యుద్ధ సమయంలో జరిగిన నష్టానికి మాత్రం ఇవి పరిహారం ఇవ్వవు.
* ప్రీమియం మాటేమిటి? ఏమైనా రాయితీలు ఇస్తున్నారా? ఒకే వ్యక్తి రెండు మూడు హోం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే ఏమైనా అదనపు ప్రయోజనాలు ఉన్నాయా అనేది చూసుకోండి.
క్లెయి కోసం..
పాలసీ తీసుకున్న తర్వాత ఇంటికిగానీ, ఇంట్లోని వస్తువులకు గానీ నష్టం జరిగినప్పుడు పరిహారాన్ని క్లెయిం చేసుకునేముందు పాలసీదారుడు చేయాల్సిన పనులేమిటంటే...
* సాధ్యమైనంత తొందరగా జరిగిన నష్టం, కారణం గురించి బీమా కంపెనీకి తెలియజేయండి. ఆలస్యం చేస్తే క్లెయిం ఇవ్వకపోవచ్చు.
* నిర్ణీత గడువులోగా క్లెయిం కోసం లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేయండి. ఇందులో ఏయో వస్తువులకు నష్టం కలిగింది? వాటి అసలు విలువ ఎంత? ఎంత పరిహారం కోరుతున్నారు? తదితర పూర్తి వివరాలు పొందుపర్చండి.
* బీమా సంస్థ సర్వేయరును పంపిస్తే.. అతను అడిగిన అన్ని వివరాలనూ ఓపిగ్గా చెప్పండి. అవసరమైన పత్రాలను సమర్పించండి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565