చిరంజీవులు ఎవరు!
పురాణ పాత్రలు గురించి చదువుతున్నప్పుడు అక్కడక్కడా ఆయన చిరంజీవి (మృత్యువు లేనివాడు) అన్న విశేషం కనిపిస్తుంది. నిజానికి ఈ ప్రకృతిలో ఏ ఒక్కరికీ మృత్యువు లేకపోవడం అంటూ ఉండదు. ఆఖరికి బ్రహ్మదేవుని స్థానంలోకి కూడా మరొకరు చేరవలసిందే! కానీ సుదీర్ఘకాలమో, యుగాంతం వరకో ఆయుష్మంతులుగా ఉండే అదృష్టం కొందరికి కలిగింది. వారే చిరంజీవులు. మన పురాణాలు ఏడుగురు చిరంజీవుల గురించి ప్రస్తావన చేస్తున్నాయి. వారు...
హనుమంతుడు: శివుని తేజస్సుతోనూ, వాయుదేవుని అంశతోనూ జన్మించిన ఈ కేసరీనందనుడిది రాముని జీవితంలో ఓ ప్రముఖ పాత్ర. సాధారణంగా ఎవరన్నా నవవిధ భక్తుల్లోని ఏదో ఒక రూపంలో భగవంతుని కొలుచుకుంటారు. కానీ హనుమంతుడు మాత్రం రాముని కొలిచేందుకు ఏ అవకాశాన్నీ జారవిడుచుకోలేదు. కీర్తనం, స్మరణం, దాస్యం... ఇలా రాముని పరిపరివాధాలా సేవించి, భక్తులకు నిదర్శనంగా నిలిచాడు హనుమంతుడు. ఆ భక్తి కారణంగానే చిరంజీవిగా నిలిచాడు. ఇక చిరంజీవిగా ఉండిపొమ్మంటూ చిన్నప్పుడు సకలదేవతలూ ఆయనకు అందించిన వరాలు ఎలాగూ ఉన్నాయి.
విభీషణుడు: రావణాసురునికి సొంత తమ్ముడే అయినా, ధర్మం తప్పిన అన్నగారిని కాదని రాముని చెంతకు చేరినవాడు విభీషణుడు. ధర్మం కోసం చివరి వరకూ పట్టుపట్టినవాడు. ఆ విభీషణుడే కనుక రావణాసురుని మరణరహస్యాన్ని, రాముని చెవిన వేయకపోతే... రావణునికి మరణమే ఉండేది కాదంటారు. శత్రువర్గం వాడైనప్పటికీ, రాముని అభయాన్ని పొందాడు కాబట్టి చిరంజీవిగా నిలిచిపోయాడు.
బలి: ప్రహ్లాదుని మనవడైన బలి అవడానికి రాక్షసుడే అయినా తాతలోని సద్గుణాలన్నింటినీ పునికి పుచ్చుకున్నాడు. కానీ త్రిలోకాధిపత్యం కోసమని ఏకంగా స్వర్గాన్నే జయించడంతో, బలిని సంహరించక తప్పింది కాదు విష్ణుమూర్తికి. అందుకోసం వామనుడి అవతారంలో వచ్చిన విష్ణువు తనకు మూడడుగుల స్థలం దానంగా కోరుకుంటాడు. ఆ తరువాత కథ అందరికీ తెలిసిందే! మొదటి పాదంతో ఆకాశాన్నీ, రెండో పాదంతో భూమినీ కప్పివేసి ఇక మూడో పాదం కోసం అడగగా... తన శిరస్సునే చూపుతాడు బలి చక్రవర్తి. తన దానగుణంలో ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. చిరంజీవివి కమ్మంటూ వరాన్ని పొందుతాడు.
పరశురాముడు: విష్ణుమూర్తి దశావతారాలలో ఒక భిన్నమైన అవతారం పరశురాముని అవతారం. రేణుక, జమదగ్నులకు జన్మించిన పరశురాముడు తన తండ్రిని వధించారన్న కోపంతో ముల్లోకాలలోని రాజులందరినీ వధిస్తాడు. అందుకోసం ఆయన ధరించిన పరశు (గండగొడ్డలి) కారణంగానే ఆయనకు పరశురాముడు అన్న పేరు వచ్చింది. అసలే విష్ణుమూర్తి అవతారం, ఆపై అపారమైన భుజశక్తి. ఆ భుజశక్తికి తోడు అమిత తపస్సు... ఇక పరశురాముడు చిరంజీవి కాక మరేమవుతాడు!
కృపాచార్యుడు:శరధ్వంతుడు అనే రుషి అంశతో రెల్లుగడ్డి నుంచి జన్మించినవాడు కృపాచార్యుడు. దిక్కు లేకుండా పడి ఉన్న ఆ శిశువుని అటుగా వేటకు వచ్చిన శంతనమహారాజు చూసి తన రాజ్యానికి (హస్తినాపురం) తీసుకువెళ్తాడు. హస్తినాపురంలో సకల విలువిద్యలలోనూ ఆరితేరిన కృపాచార్యుడు తరువాతి కాలంలో కౌరవ, పాండవులకు ధనుర్విద్యలను నేర్పాడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరఫున పోరాడినప్పటికీ, యుద్ధం ముగిసిన తరువాత సజీవంగా ఉన్న అతి కొద్దిమందిలో కృపాచార్యుడు ఒకరు. మానవగర్భమందు జన్మించకపోవడం వల్ల ఆయనకు మానవులకు ఉండే చావు కూడా ఉండదని పురాణాలు పేర్కొంటున్నాయి.
వేదవ్యాసుడు: వ్యాసుడు లేనిదే భారతమే లేదు. ఎందుకంటే ఆయన అంశతోనే కౌరవుల తండ్రి అయిన దృతరాష్ట్రుడు, పాండవుల తండ్రి అయిన పాండురాజు జన్మించారు కాబట్టి. భారతంలో అడుగడుగునా వ్యాసుని ప్రస్తావన ఎలాగూ ఉంది. దానికి తోడు ఆ భారతాన్ని అక్షరబద్ధం చేసిన వ్యక్తి కూడా ఆయనే! కేవలం భారతం మాత్రమే కాదు అష్టాదశ పురాణాలని కూడా రాశారు. వేదాలను క్రమబద్ధీకరించి ‘వేద వ్యాసుడు’ అనే బిరుదాన్ని గ్రహించారు. ప్రపంచాన్ని అజరామరమైన జ్ఞానాన్ని అందించారు కాబట్టి చిరంజీవిగా మిగిలిపోయారు.
అశ్వత్థామ: ఇప్పటివరకూ చెప్పకొన్న చిరంజీవులు అంతా తమతమ ప్రతిభతో ఆ స్థాయిన చేరుకుంటే... శాపవశాన చిరంజీవి అయిన చిత్రమైన వృత్తాంతం అశ్వత్థామది. కౌరవులకు, పాండవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడే అశ్వత్థామ. తన తండ్రి చావుకి కారణమైన పాండవులను సంహరించి తీరాలనే క్రోథంతో అశ్వత్థామ యుద్ధధర్మాన్ని విస్మరించి రాత్రివేళ పాండవుల శిబిరం మీద దాడి చేస్తాడు. ఆ శిబిరంలో ఉన్న ఉపపాండవులనే పాండవులనుకొని వారిని నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు. ఫలితం! చిరకాలం కుష్టువ్యాధితో జీవచ్ఛవంలా ఉండమని కృష్ణుని శాపాన్ని పొందుతాడు.
పైన పేర్కొన్నవారే కాకుండా మార్కండేయుడు, ధ్రువుడులాంటి మరికొందరు కూడా చిరంజీవులే! కానీ సప్త చిరంజీవులు ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం జాబితాలో ఉన్నవారి గురించే చెప్పుకొంటారు.
++++++++++++++++++++++
చిరంజీవులు ఎవరు?
హనుమంతుడు, బలి చక్రవర్తి, కృపాచార్యుడు, విభీషణుడు, పరశురాముడు, వ్యాసుడు, అశ్వత్థామ... వీరిని చిరంజీవులు అని అంటారు. వీరికి మృత్యువు అనేది వుండదు. రామభక్తి చేత హనుమంతుడు, మహావిష్ణువు అవతారమైన వామనుడి అనుగ్రహం చేత బలిచక్రవర్తి, విచిత్ర జన్మ వలన కృపాచార్యుడు చిరంజీవులయ్యారు. అదే విధంగా రాముడి దగ్గర అనుగ్రహం పొందిన విభీషణుడు, అష్టాదశపురాణాలు, మహాభారతం రచించిన వ్యాసుడు, మహాశక్తివంతుడైన పరశురాముడు, కృష్ణుడి శాపంతో అశ్వత్థామ చిరంజీవులుగా వున్నారు. వీరితో పాటు భక్త మార్కండేయ కూడా శివానుగ్రహంతో చిరంజీవిగా వున్నారు. అందరికీ భగవంతుడు అనుగ్రహంతో చిరంజీవులుగా వుండమని వరమివ్వగా అశ్వత్థామకు మాత్రం శాపంగా ఇవ్వడం గమనార్హం. ఉపపాండవులను అకారణంగా వధించినందుకు శ్రీకృష్ణభగవానుడి సూచన మేరకు అశ్వత్థామ నుదుటి నుంచి మణిని తీసివేస్తారు. దీంతో అతను తన శక్తిని కోల్పోతాడు. రోగ భారంతో కలియుగం ముగిసేవరకు అరణ్యాలలో సంచరించమని కృష్ణుడు అతనికి శాపం పెడతాడు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565