ఆషాఢంలో పెళ్లిళ్లు
ఎందుకు చేయరు?
ఆషాఢమాసంలో ఎవరూ పెళ్లిళ్లు తలపెట్టరన్న విషయం తెలిసిందే! ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలనూ తలపెట్టరు కాబట్టే ఆషాఢానికి ‘శూన్య మాసం’ అన్న పేరు కూడా స్థిరపడి ఉండవచ్చు. ఇంతకీ ఆషాఢమాసంలో పెళ్లిళ్లు చేసుకోవద్దంటూ పెద్దలు ఎందుకు సూచించినట్లు అనేదానికి చాలా వివరణలే వినిపిస్తాయి.
- ఆషాఢంలోనే వర్షరుతువు ప్రారంభమవుతుంది. వ్యవసాయ పనులను ఆరంభించేందుకు ఇదే సరైన సమయం! వ్యవసాయపు పనులను మొదలుపెట్టడానికి ఎంతో కొంత వ్యయం తప్పదు. ఇటు పొలంలోనూ విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. అంటే శ్రమరీత్యా, ధనం రీత్యా పొలం పనులకి తొలి ప్రాధాన్యత ఇవ్వవలసిన సందర్భం ఇది. అందుకనే ఈ మాసం గడిచిన తర్వాతే వివాహాలకు సంబంధించిన ప్రయత్నాలు సాగించాలని చెబుతారు.
- ఆషాఢం గృహనిర్మాణానికి అనువైన సమయంగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ సమయంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టడం వల్ల, నెత్తిన ఇంత నీడ ఏర్పడుతుంది. పొలంలో అప్పటివరకూ వృధాగా ఉంచిన గడ్డినీ వినియోగించినట్లు అవుతుంది. పక్కా ఇళ్ల విషయంలో అయితే, నిర్మాణాన్ని నీటితో తడపాల్సిన పని కూడా ప్రకృతే చూసుకుంటుంది. మరి కొత్త ఇంటి పనులలో ఉన్నప్పుడు కొత్త సంసారం గురించి తావు దక్కదు కదా!
- ఆషాఢంనాడు శుభకార్యాలు నిషిద్ధమైనప్పటికీ ఆలయాలు మాత్రం ప్రత్యేక ఉత్సవాలతో కిటకిటలాడుతుంటాయి. ఒడిషాలో రథయాత్ర అయినా తెలంగాణలో బోనాల జాతర అయినా ఈ సందర్భంలోనే వస్తాయి. ఆయా ఉత్సవాలతో తలమునకలై ఉండే బంధువులుగానీ, పూజార్లు కానీ శుభకార్యాలకు అందుబాటులో ఉండకపోవచ్చు.
- ఆషాఢమాసంలోని శుక్ల ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ సమయంలో విష్ణుమూర్తి యోగనిద్రలోకి జారుకుంటాడని ఓ నమ్మకం. యోగనిద్రలోకి జారుకునే విష్ణుమూర్తి ఆశీస్సులు ఉండకపోవచ్చుననే ఊహ కూడా ఆషాఢంలో పెళ్లిళ్లని నిషేధించేందుకు కారణమై ఉండవచ్చు.
- హైందవులు సముద్రస్నానాలకు అనువైనవిగా పేర్కొనే ‘ఆ, కా, మా, వై’ మాసాలలో ఆషాఢం కూడా ఒకటి. ఈ సందర్భంలో చేసే నదీస్నానాలు, పితృతర్పణాలు, దానాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెబుతారు. మరి ఇందుకోసం పెద్దలు తీర్థయాత్రలకు బయల్దేరవచ్చు. పెళ్లి వేడుకని చేరుకునే తీరిక లేకుండా ఎక్కడో దూరాన ఉండవచ్చు!
- ఆషాఢంలోని శుక్ల ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ నాలుగు మాసాలూ విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడనీ... జపతపాలతో ఆధ్యాత్మికమైన పురోగతిని సాధించేందుకు ఈ నాలుగు నెలలూ అనుకూలమనీ చెబుతారు. మరి ఆధ్మాత్మికతకూ కొత్త సంసారానికీ లంకె కుదరదు కదా!
- ఆరోగ్యరీత్యా కూడా ఆషాఢమాసం ఏమంత అనుకూలంగా ఉండదు. ఒక్కసారిగా వచ్చిన గాలి, నీటి మార్పులతో జలుబులు, జ్వరాలు వస్తాయి. అంటువ్యాధులు ప్రబలుతాయి. ఇలాంటి సమయంలో భార్యాభర్తలు కలిసినప్పుడు ఏర్పడే పిండం మీద ఆయా అనారోగ్యాల ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు.
- ఆషాఢమాసంలో పెళ్లి చేయడం సంగతి అలా ఉంచితే... కొత్త అల్లుడు ఇంటికి వచ్చినా కూడా సమస్యలే! అటు అత్తవారింట్లోని వారు పొలం పనులలో తలమునకలై ఉంటారు. అల్లుడికి మర్యాదలు చేసేందుకు తగిన తీరిక కానీ ధనం కానీ వారి చేతిలో ఉండకపోవచ్చు. ఇక అల్లుడు కూడా కొత్త మోజులో పడి అత్తవారింట ఉండిపోతే... అక్కడ తన ఊరిలోని పొలం పనులూ కుంటుపడతాయి. అందుకే ఆషాఢంలో నూతన దంపతులు ఒకే ఇంట్లో ఉండకూడదని చెబుతూ ఉంటారు.
ఆషాఢంలో పెళ్లిళ్లు ఎందుకు వద్దన్నారో ఆలోచిస్తే మాఘమాసంలోనూ, చైత్రమాసంలోనూ పెళ్లిళ్లని ఎందుకు ప్రోత్సహిస్తారో కూడా అర్థమవుతుంది. మాఘమాసంలో వ్యవసాయపు ఆదాయం చేతికి చిక్కి, వాతావరణం వేడుక చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇక చైత్ర మాసంలో ఎండలు కాస్తాయి కాబట్టి బంధువులంతా అందుబాటులో ఉంటారు. పెళ్లి పనులకు ఎలాంటి వర్షాలూ అడ్డరావు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565