అమ్మ దేవతల ఆరాధన
ఆషాఢం వచ్చిందంటే చాలు.. మేఘసందేశాలతో ప్రకృతి పరవశిస్తుంది. వర్షధారలతో పుడమి పులకరిస్తుంది. పచ్చకోక చుట్టుకుని మాగాణం మురిసిపోతుంది. ఊరి జనం జాతరలో.. పల్లె పదం వినిపిస్తుంది. ఇంత సందడికి కారణం... ఆ పల్లె పొలిమేరలో కొలువై ఉన్న శక్తి స్వరూపమేనని జానపదులు విశ్వసిస్తారు. ఆ తల్లి అనుగ్రహం కోరుతూ భోజనం నివేదిస్తారు. అదే బోనం. ఆషాఢ మాసంలో గోల్కొండ నుంచి లష్కర్ వరకు, తెలంగాణలోని మారుమూల పల్లె నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కుగ్రామం వరకు.. తెలుగునాట భక్తి ఉత్సవం వెల్లువలా సాగుతుంటుంది.
పల్లెలను పచ్చగ చూసే తల్లి.. గ్రామ సరిహద్దులో ఉంటూ.. తన బిడ్డలను కాచే కల్పవల్లి.. గ్రామదేవత. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మారెమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ.. ఏ పేరున పిలిచినా.. ఆమె శక్తి స్వరూపమే! వేద మంత్రాలు చదవకున్నా, మంత్రయుక్తంగా పూజించకున్నా, యజ్ఞయాగాదులు చేయకున్నా.. భక్తి అనే పాశానికి కట్టుబడిపోతుంది ఆ తల్లి. కోరుకున్న వారికి కొంగు బంగారమై.. భాసిల్లుతుంది. ఆ గ్రామదేవతల ఉత్సవం ఆషాఢం మాసంలో పల్లెపల్లెలో జరుగుతుంది. తెలంగాణలో ఇది ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించడం కనిపిస్తుంది. ఆషాఢ మాసంతో పాటు శ్రావణ మాసంలోనూ గ్రామదేవతల ఆరాధన విశేషంగా సాగుతుంటుంది.
మా ఇంటి మహాశక్తి
ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తుందని భక్తుల నమ్మకం. ఆ దేవి తమ ఇంటినే పుట్టింటిగా భావించి వచ్చిందని వారు భావిస్తారు. తమ ఇంటికి విచ్చేసిన మహాశక్తికి సంతోషంతో బోనాల ఉత్సవం చేసుకుంటారు. ఆ సమయంలో అమ్మను ప్రసన్నం చేసుకుంటే.. అంతా మంచే జరుగుతుందని వారి విశ్వాసం. అందుకే బోనం సమర్పించి ఆమె అనుగ్రహం కోరుతారు.
బోనం.. భోజనం...
బోనం అంటే భోజనం. సకల జీవరాశులకు ఆహారం సమర్పించే తల్లికి భక్తులు బోనం రూపంలో భోజనం నివేదిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారాల్లో ఈ వేడుకలు జరుగుతాయి. కొత్త కుండలో బియ్యం, బెల్లం వేసి అన్నం వండుతారు. తరువాత కుండను పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. బోనానికి వేపాకులు కంకణంగా కడతారు. గుగ్గిలం పొగవేస్తారు. బోనం కుండపై చిన్న గురిగి, దానిపై బోనం జ్యోతి కంచుడు (మట్టి పాత్ర)లో వెలుగుతుంటుంది. ఇంటికో కుండతో ముత్తయిదువులు బయలుదేరుతారు. ఊరేగింపు ముందు బైయిండ్ల వాళ్లు జమిడికె వాయిస్తారు. ఊరేగింపు ముందు శివసత్తులు శివమూగుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. అట్టహాసంగా బయల్దేరి అందరూ గుడికి చేరుకుంటారు. అక్కడ పరచిన తెల్లటి వస్త్రంపై బోనాల్లోని అన్నం గుమ్మరిస్తారు. దీనిని ‘కుంభం’పోయడం అంటారు. ఇలా బోనాన్ని ఆ తల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజలు పూర్తయ్యాక కుంభంలోని కొంత భాగాన్ని అమ్మ ప్రసాదంగా బంధుమిత్రులకు పంచుతారు. మిగిలిన బోనాన్ని ఊరి పొలిమేరల్లోని పంటపొలాల్లో చల్లుతారు. తెలంగాణలో శుభకార్యాలు జరిగే సందర్భంలో కూడా చాలామంది బోనాలు నిర్వహిస్తుంటారు.
జై జై పోతురాజు
బోనాల ఉత్సవం జానపదుల భక్తికీ, వారి జీవన సరళికీ అద్దం పడుతుంది. కాలం మారుతున్నా.. బోనాల దగ్గరికి వచ్చేసరికి సంప్రదాయం వైపే మొగ్గు చూపుతారు భక్తులు. నిర్మలమైన భక్తి, నిష్కల్మషమైన ఆరాధన కనిపిస్తుంది. అంతేకాదు ఈ జనజాతరలో కొన్ని అంశాలు వింతగా, అద్భుతంగా తోస్తాయి. అలాంటి వాటిలో పోతురాజు విన్యాసాలు ఒకటి. పోతురాజును అమ్మవారి సోదరుడుగా భావిస్తారు. అందుకే బోనాల సందర్భంగా ఒక వ్యక్తి పోతురాజులా వేషం కడతాడు. కొరడాలతో కొట్టుకుంటూ, జయ జయ ధ్వానాలు చేస్తూ భక్త బృందాన్ని తన వెంట అమ్మవారి గుడికి తీసుకెళ్తాడు. పోతురాజు వేషం కట్టే వ్యక్తికి పుష్టి కలిగిన దేహం, స్ఫురద్రూపం తప్పనిసరి. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాళ్లకు గజ్జెలు ధరించి, ఎర్రని చిన్న ధోవతి కట్టుకుని భక్త బృందానికి ముందుగా చిందేస్తూ పండుగ వాతావరణాన్ని రెండింతలు చేస్తుంటాడు. పోతురాజు పూజల ఆరంభకుడిగా, భక్తుల రక్షకుడిగా
భావిస్తారు.
రంగం
బోనాల పర్వంలో మరో ముఖ్యమైన సందర్భం రంగం. ఇది పండుగ రెండో రోజున జరుగుతుంది. రంగం సందర్భంగా పోతురాజు వేషం కట్టిన వ్యక్తికి పూనకం వస్తుందంటారు. ఆయన కోపాన్ని చల్లార్చడానికి ఆక్కడున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును పోతురాజుకు అందిస్తారు. ఆయన శాంతించిన తర్వాత యథాప్రకారంగా వేడుక కొనసాగుతుంది.
ఘటం
అమ్మవారి ఆకారంలో అలంకరించిన రాగి కలశాన్ని ఘటం అంటారు. ఆలయ పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. బోనాల పండుగ మొదటి రోజు నుంచి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మోతలు, మేళ వాద్యాల మధ్య ఊరేగిస్తారు. పోతురాజులతో పాటు, ఇతర కళాకారులు, వేలమంది భక్తుల సమక్షంలో ఘటం ఊరేగింపు సాగుతుంది. చివరగా వీటిని నీటిలో నిమజ్జనం చేస్తారు. కొన్ని గ్రామాల్లో రంగం, ఘటం సంప్రదాయం కనబడదు.
ఎక్కడైనా ఒక్కటే...
హైదరాబాద్ శివారు గ్రామాల్లో శ్రావణ మాసంలో బోనాలు నిర్వహించే సంప్రదాయం ఉంది. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి కూడా ఆషాఢ మాసంలో బోనం సమర్పించడం అనవాయితీగా వస్తోంది. రాయలసీమ ప్రాంతంలో గ్రామదేవతలకు ఆషాఢ, శ్రావణ మాసాల్లో బోనాలు చేస్తుంటారు. అట్టహాసంగా కాకపోయినా.. ఒక సంప్రదాయ పండుగగా దీనిని నిర్వహిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో శాకాంబరీ దేవిగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రాంతాలు, ఆచారాలు ఏవైనా.. అమ్మవారి ఆరాధనలో బోనాలు ప్రత్యేకమైనవి. అడుగడుగునా భక్తి కనిపించే ఈ పండుగ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ద్విగుణీకృతం చేస్తుందనడంలో సందేహం లేదు.
-కణ్వస
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565