విశ్వరక్షకుడి విశేషయాత్ర
జగన్నాథుడు విశ్వరక్షకుడు. శతాబ్దాల చరిత గల ఆ దేవదేవుడికి ఏటా జరిపే రథయాత్ర నిత్యనూతన శోభితం. శ్రీమహావిష్ణువు దారుబ్రహ్మగా కొలువుదీరిన పూరీ క్షేత్రంతో పాటు దేశవిదేశాల్లో జగన్నాథ రథచక్రాలు కదులుతాయి.ఆ దృశ్యాన్ని వీక్షించడాన్ని భక్తులు దానిని పూర్వజన్మ సుకృతంగా, నేత్రోత్సవంగా భావిస్తారు. ఈ సారి ఈ నెల 25వ తేదీ ఆదివారం రథయాత్ర కన్నుల పండువగా జరగనుంది.
దేశంలోని ఏడు మోక్షదాయక క్షేత్రాలలో పూరీ ఒకటి. మత్స్య, స్కంధ, విష్ణు, వామన పురాణాల్లో ఈ క్షేత్రం ప్రస్తావన కనిపిస్తుంది. అన్నాచెల్లెళ్ల ప్రేమకు నిదర్శనం ఈ క్షేత్రం. శ్రీకృష్ణుడు జగన్నాథస్వామిగా దేవేరులతో కాకుండా అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో కొలువు తీరడం ఇక్కడి విశిష్టత. శ్రీమహావిష్ణువు రామేశ్వరంలో స్నానసంధ్యాదులు ముగించుకుని, బదరీనాథ్‌లో అల్పాహారం స్వీకరించి, మఽధ్యాహ్న భోజనానికి పూరీ చేరుకుంటాడని, రాత్రి ద్వారకలో విశ్రమిస్తాడని ప్రతీతి.
‘ఎంత మాత్రమును ఎవరు కొలిచిన అంత మాత్రమే నీవు...’అని అన్నమాచార్యులు తిరుమలేశుని కీర్తించినట్లు పూరీలోని జగన్నాథుడి ఆలయంలో వైష్ణవ సంప్రదాయం కొనసాగుతున్నా... స్వామిని శైవులు శివుడిగా, శాక్తేయులు భైరవునిగా, బౌద్ధులు బుద్ధునిగా, జైనులు ‘అర్హర్ద’గా, అలేఖ్యులు శూన్య స్వరూపునిగా పూజిస్తారు.
కళ్లెదుట దైవం
శంకర భగవత్పాదులు, రామానుజ యతీంద్రులు తదితర ఎందరో మహనీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించి మఠాలు నెలకొల్పారు. శంకరాచార్యులు దేశ పర్యటనలో భాగంగా నలుదిక్కుల స్థాపించిన మఠాలలో పూరీలోని మఠం ఒకటి. బదరిలో జ్యోతిర్మతి’. రామేశ్వరంలో ‘శృంగేరి’, ద్వారకలో ‘శారద’, పూరీలో ‘భోగవర్ధన’ మఠం స్థాపించారు. వీటిని వరుసగా త్యాగ, భోగ, ఐశ్వర్య, కర్మ క్షేత్రాలుగా అభివర్ణిస్తారు. స్వామి ఎల్లప్పుడూ తన కళ్ల ముందే ఉండాలన్న అపేక్షతో శంకరాచార్యులు ‘జగన్నాథస్వామి నయన పథగామి భవతు మే’ మకుటంతో ‘జగన్నాథాష్టకం’లో స్తుతించారు. సిక్కుగురువు గురునానక్ ఈ క్షేత్రాన్ని సందర్శించారని చరిత్ర. జయదేవుడు ఈ స్వామి సన్నిధిలో ‘గీత గోవింద’ కావ్యాన్ని రచించారు.
రథయాత్రలో చీపురు పట్టే రాజు
‘రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన న విద్యతే’....రథంపై విష్ణుమూర్తి ఊరేగుతున్న దృశ్యం వీక్షించిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అందునా పూరీలో జగన్నాథ రథోత్సం మరింత విశిష్టమైందిగా భావిస్తారు. ఈ ఉత్సవాన్ని శతాబ్దాల తరబడి నిర్వహిస్తున్నా నిత్యనూతనమే. స్వామి నవనవోన్మేషుడు. జగములనేలే దేవదేవుడు సోదరసోదరీ సమేతంగా. ‘శ్రీ మందిరం వీడి జనం మధ్యకు రావడం, రోజులు తరబడి ఆలయానికి దూరంగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఊరేగింపునకు బయలుదేరిన రథం మరునాడు సూర్యోదయంలోగా యథాస్థానానికి చేరాలన్నది శాస్త్ర వచనం. కానీ పూరీ ఉత్సవంలో బయలుదేరిన రథాలు తొమ్మిది రోజుల తర్వాతే తిరిగి వస్తాయి. పూరీ రాజు స్వామికి తొలి సేవకుడు. ఆయన కిరీటాన్ని తీసి నేలమీద ఉంచి బంగారు చీపురుతో రథాన్ని శుభ్రపరచి మంచిగంధం నీటితో కడుగుతారు. రథాల ముందు పన్నీరు కళ్లాపి చల్లుతారు. ‘చెర్రాపహరా’అనే ఈ ప్రక్రియ విశిష్టమైనది.
చెల్లెమ్మ సు‘భద్రం’
ఏ ఆలయంలోనైనా ఉత్సవమూర్తులందరినీ ఒకే రథంలో తీసుకు వెళ్లడం సహజం. పూరీలో మాత్రం ముగ్గురు దేవతామూర్తులు జగన్నాథ, బలభద్ర, సుభద్రలను వేర్వేరు రథాల్లో ఊరేగిస్తారు. అన్నగారి రథం అగ్ర భాగాన ఉంటే ఆ తర్వాత చెల్లెలి రథం వెళుతుంది. జగన్నాథుని రథం వారిని అనుసరిస్తూ సోదరి సుభద్రను సు‘భద్రం’గా చూసుకునే తీరు, ‘చెల్లెలి’పై అనురాగాన్ని చాటిచెబుతుంది.
అశ్లీల పదార్చన
ఇతర క్షేత్రాల రథయాత్రల్లో కనిపించని దృశ్యాలు, వినిపించని మాటలు ఆక్కడ కనిపిస్తాయి. దోషంగా భావించే మద్యం పానాన్ని ఇక్కడ సాధారణంగా పరిగణిస్తారు. రథంలాగే సమయంలో అశ్లీల పద ప్రయోగం ఆచారంగా వస్తోంది. రథయాత్ర సందర్భంగా ‘జై జగన్నాథ...జై.జై జగన్నాథ’ నినాదాలతో పాటు అశ్లీల పదప్రయోగం ఉంటుంది. రథం ఆగినప్పుడు ఆ పదాలను ఉపయోగిస్తూ కొబ్బరికాయలు కొడుతుంటారు. ‘దాహుక’ అనే జగన్నాథ సేవకుడు ఇందు నిమిత్తం ప్రత్యేకంగా రథం వద్ద ఉంటాడు.
పరమాత్మకు ‘పథ్యం’
జగన్నాథ ఆరాధన శైలి మానవ జీవితచక్రాన్ని పోలి ఉంటుంది. ఆకలిదప్పులు, అనారోగ్యం, మమతలు, అభిమానాలు, అలకలు గోచరిస్తాయి. జ్యేష్ఠ పౌర్ణమి నాడు దేవస్నాన యాత్రలు ప్రారంభమవుతాయి. 108 బిందెల సుదీర్ఘ స్నానంతో మానవ సహజమైన అనారోగ్యం బారిన పడిన తిరిగి కోలుకునేందుకు రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో దైతపతులు అనే సవరలకు తప్పించి ఒడిశా మహారాజు సహా ఎవరికి స్వామివార్ల దర్శన భాగ్యం కలగదు. వీరు తమతమ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. నిత్యం 64 రకాల పదార్థాలు ఆరిగించే స్వామికి ఆ సమయంలో ‘పథ్యం’గా కందమూలాలు, పండ్లు మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు.
ప్రతి రథమూ ప్రత్యేమే!
జగన్నాథస్వామి రథాన్ని ‘నందిఘోష’ అంటారు దీని ఎత్తు 44 అడుగులు.పదహారు చక్రాలుంటాయి. తేరును తెలుపు, పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు. రథాన్ని లాగే తాడును ‘శంఖచూడ నాగ’ ’ అంటారు.
బలభద్రుడి రథం ‘తాళధ్వజం’. 43 అడుగుల ఎత్తు. 14 చక్రాలు ఉంటాయి. రథాన్ని ఎరుపు, ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరిస్తారు. రథానికి ఉపయోగించే తాడును ‘వాసుకీ నాగ’ అంటారు.
సుభద్ర రథాన్ని ‘దర్పదళన్’ అంటారు. ఎత్తు 42 అడుగులు. 12 చక్రాలు ఉంటాయి. ఎరుపు, నలుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. దానికి వాడే తాడును ‘స్వర్ణచూడ నాగ’ అంటారు.
ప్రతి రథానికీ 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం గల తాళ్లను కడతారు.
ప్రసాదం-సర్వం జగన్నాథం
జగన్నాథుడు నైవేద్య ప్రియుడు. నిత్యం 64 రకాల పిండివంటలను కట్టెల పొయ్యి మీద తయారు చేస్తారు. ఆకుకూరలు, కూరగాయలతో ప్రత్యేకంగా తయారు చేసిన పదార్థాలను నివేదిస్తారు. ఆయన వంటశాల దేశంలోని అన్ని దేవాలయల్లో కన్నా పెద్దది. వంటలకు మట్టి పాత్రలనే వాడతారు వంటకు ఒకసారి వాడిన కుండలను మరోసారి వాడరు. వాటన్నిటిని సమీపంలోని ‘కుంభారు’ గ్రామస్థులు తయారు చేస్తారు.
ఇక్కడ కుండ మీద కుండ పెట్టి అన్నం వండే విధానం విచిత్రమే. కట్టెల పొయ్యిపై ఒకేసారి ఏడుకుండలను పెట్టి వండినా అన్ని కుండల్లోని పదారాలూ చక్కగా ఉడుకుతాయి. శ్రీమహాలక్ష్మి స్వయంగా వంటను పర్యవేక్షిస్తుందని భక్తుల విశ్వాసం.
ఈ ప్రసాదాన్ని ‘ఓబడా’ అని, ప్రసాద వినియోగ ప్రదేశాన్ని ‘ఆనందబజార్’ అనీ అంటారు. అన్నప్రసాదంతో పాటు ‘శుష్క ప్రసాదం’ తయారు చేస్తారు. దైవదర్శనానికి వచ్చేవారు అక్కడికక్కడ ప్రసాదాన్ని స్వీకరించడం అన్నప్రసాదం కాగా ఇంటివద్ద ఉన్నవారికి తీసుకువెళ్లేది శుష్కప్రసాదం. స్వామికి నివేదించిన అన్నప్రసాదం గల పెద్ద పళ్లాన్ని అర్చకులు (పండాలు) అక్కడ ఉంచగానే భక్తులు తమకు కావలసిన ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తారు. అన్నం, పప్పు అయ్యాక ఆ పక్కనే విశాలమైన మూతి ఉన్న పాత్రలో మజ్జిగ ఉంటుంది. ‘ఎంగిలి’ ప్రసక్తి ఉండదు. ‘సర్వం జగన్నాథం’ అనే మాట ఇక్కడ అలాగే పుట్టి ఉంటుంది.
‘నవ్య’త జగన్నాఽథుని ప్రత్యేకత
జగన్నాథ, సుభద్ర, బలభద్ర విగ్రహాల నుంచి అన్నీ నిత్య నూతనమే. దేవతామూర్తుల విగ్రహాలను ఏటా తయారు చేస్తారు. ఆలయ శిఖరంపై ఎగిరే ‘పతిత పావన’ పతాకాన్ని ప్రతి ఉదయం మార్చి కొత్తది ఎగురువేస్తారు.
ఇతర క్షేత్రాల్లో కంటే భిన్నంగా పూరీలో రథయాత్ర శూన్యమాసంగా పిలిచే ‘ఆషాఢం’లో జరుగుతుంది.
-డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565