తాంబూలంవల్ల ఉపయోగం ఏమిటి?
(Benefits of Tambulam)
ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం హైందవ మతం. హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం. ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై వుంటుంది.
ఉగాది పండుగకు వేపచెట్టు, సంక్రాంతి పండుగకు ధాన్యరాశులు, పశు సంతతి పట్ల ప్రేమ చూపటం... అలాగే వినాయక చవితి అంటే నానావిధ ఫల.పత్ర, పుష్పాలతో స్వామిని అర్చించటం వుంటుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి మరి ఏ ఇతర మతంలోనూ కనబడదు. ఇక ప్రతి పండుగలో, ప్రతి శుభ సందర్భంలో తాంబూలానికి అగ్రస్థానం ఉంటుంది.
హిందూ సంస్కృతిలో తాంబూలానికి - అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత వుంది. కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. తమలపాకుల తాంబూలం కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది. ఇలా ఆయర్వేదం కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని సూచిస్తుంది.
అందరు దేవుళ్లకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికి. ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది అని చెబుతారు. శత పత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని ఒక నమ్మకం వుంది.
వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు.
ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వాక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి.
తాంబూల సేవనం
భారతీయుల జీవితంలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒకప్పుడు తాంబూలం లేని భోజనం ఉండేది కాదు. సర్వ సామాన్యంగా ధనిక బీద భేదం లేకుండా అందరు తాంబూల సేవనం చేసేవారు. షడ్రసోపేతమైన భోజనానికి ఘుమ ఘుమ లాడే తాంబూలం కొసమెరుపు. భోజనం మోతాదు కాస్త ఎక్కువైతే పచ్చ కర్పూరం, యాలకులు, లవంగాలు, సోంపు ధట్టించిన తాంబూలం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణని భోగంగా మలచి ఆయుర్వేదాన్ని నిత్యజీవితంలో భాగం చేశారు మన పెద్దలు. అది శాస్త్రం అంగీకరించిన కొద్ది పాటి మత్తు కలిగించే పదార్థం. ఆ మత్తు ఆహ్లాదం కలిగించటం వరకు మాత్రమే పరిమితం.
తాంబూలంలో నాగవల్లి అంటే తమలపాకు, కర్పూరంతో కూడిన వక్కలు, ముత్య భస్మంతో చేసిన సున్నం ముఖ్యాంగాలు. అటుపై ఎవరి శక్తి ననుసరించి వారు సుగంధ ద్రవ్యాలను చేర్చుకోవచ్చు. ముఖ్యంగా యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, కస్తూరి, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, పుదీనా [పిప్పరమింట్ పువ్వు(మింట్)], కొబ్బరి తురుము , గుల్ఖన్, సోంప్ మొదలైనవి కూడా రుచి కోసం చేర్చుతుంటారు . పూర్వం కైరవళ్లు, కాచు, శొంఠిపొడి, మొదలైన వాటిని కూడా చేర్చేవారట. ఇంకా వెండి బంగారు రేకులను కూడా తాంబూలానికి చేర్చుతారు ధనవంతులు . మామూలు సున్నానికి మారుగా ముత్యభస్మమో, పగడ భస్మమో, వాడే అలవాటు ప్రాచీనులకి ఉండేది.
అన్నిసమయాలలో అందరూ వేసుకొనేది ఒకే రకమైన తాంబూలం కాదు. ఉదయం భోజనం ముందు, భోజనం తరువాత,సాయం సమయం, రాత్రి నిదురించే ముందు,… ఇలా ఒకొక్కప్పుడు ఒక్కొక్క రకం. వీలుని బట్టి ఎన్ని సుగంధ ద్రవ్యాల నైనా చేర్చవచ్చు. ఈ రోజుల్లో పుగాకు కూడా చేర్చుతున్నారు. కానీ మౌలికంగా తాంబూలంలో ఉండేవి మాత్రం తమలపాకులు, వక్క, సున్నం. తమలపాకు తీగకి నాగవల్లి అనే పేరుంది. ఆకు పాము పడగలాగా ఉండటం వల్ల ఆ పేరు వచ్చి ఉండవచ్చు. స్వర్గం నుండి వచ్చిన తీగ అవటం వల్ల నాకవల్లి అనే పేరు సార్థకమై, కాలక్రమంలో నాకవల్లి నాగవల్లి అయిందట! పాము విషాన్నిహరించగల శక్తి తమలపాకుకి ఉన్నదట. ఇంకా ఎన్నో రకాలైన విషాలను కూడా హరించగల ఔషధీగుణాలు తమలపాకుకి ఉన్నాయట.
తమలపాకు జీర్ణశక్తిని పెంచి, శరీర ఉష్ణోగ్రతని పెంచి, జలుబుని, శ్లేష్మాన్ని,వాతాన్ని హరిస్తుంది. అందుకే చిన్న పిల్లలకి జలుబు చేస్తే తమలపాకు రసం ఒకటి రెండు చుక్కలు పాలతో రంగరించి ఇస్తారు. సున్నం శరీరంలో కాల్షియం సరిగా ఉండేట్టు చూస్తుంది. ఎముకలు, దంతాలు అరిగిపోకుండా ఉంటాయి. అందుకే పాలిచ్చే తల్లులు, బాలెంతలు, తప్పనిసరిగా తాంబూలం వేసుకోవాలంటారు. సున్నం నేరుగా తీసుకున్నదానికన్న తమలపాకు రసంతో కలిపి తీసుకుంటే కాల్షియం వంటపడుతుంది. వక్క ఈ రెండిటినీ అనుసంధానమ్ చేస్తుంది. అంతే! విడిగా తింటే మాత్రం రక్తహీనత కలిగిస్తుందంటారు. ఈ విషయంలో వండిన వక్క కన్నా పచ్చి వక్క నయం.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565