పుణ్యరాశి పెరగంగ!
దైవస్వరూపం గంగానది. ఆ నదీమతల్లి ... వైకుంఠంలో అరవై లక్షల యోజనాల విస్తీర్ణంలో, బ్రహ్మలోకంలో ముప్పై లక్షల యోజనాల విస్తీర్ణంలో, శివలోకంలో ముప్పై లక్షల యోజనాల విస్తీర్ణంలో పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అదే తీరులో ధ్రువ, చంద్ర, సూర్య, తపో, జన, మహర్లోక, ఇంద్రలోక, పాతాళలోకాల్లోనూ పరుగులు పెడుతూ ఉంటుందంటారు.
గంగను ఇంద్రలోకంలో మందాకిని అనీ, పాతాళలోకంలో భోగవతి అనీ, భూలోకంలో అలకనంద అనీ అంటారు. కృత యుగంలో పాల నురుగులా, త్రేతా యుగంలో వెన్నెలలా, ద్వాపర యుగంలో మంచి గంధంలా, కలి యుగంలో నీళ్లలాగా ఉంటుందట గంగ. స్వర్గలోకంలో మాత్రం అన్ని యుగాల్లోనూ పాలలా ప్రవహిస్తూ ఉంటుందని చెబుతారు.
గంగావతరణం
దేవనది గంగ భూలోకానికి రావడం వెనుక ఓ గొప్ప కథ ఉంది. ఆ కథలో గంగమ్మ పవిత్ర శక్తి ఉంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలున్నాయి. నిస్వార్థ పితృభక్తి ఉంది. పూర్వం సగరుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయనకు వైదర్భి, శైబ్య అనే భార్యలు. శైబ్య తనకు కుమారుడు జన్మిస్తే చాలని కోరుకుంది. వైదర్భి మాత్రం అరవైవేల మంది బిడ్డలు కలగాలని శివుడిని ఆరాధించింది. శైబ్యకు ఆమె కోరిక ప్రకారం, అసమంజుడు అనే కుమారుడు జన్మించాడు. కొద్దికాలం తర్వాత వైదర్భికి ఒక పెద్ద సొరకాయ లాంటి పిండం కలిగింది. అప్పుడామె మళ్లీ పరమేశ్వరుడిని ఆరాధించడంతో... ఆ కాయ లోపల గింజలలా ఉన్న అరవై వేల మంది పుత్రులు ఉద్భవించారు. వారంతా బలపరాక్రమవంతులుగా ఎదిగారు. అయితే, పెద్దల మీద గౌరవం, క్రమశిక్షణ లాంటివి ఉండేవి కావు. ఒకసారి సగరుడు అశ్వమేధయాగం చేస్తుండగా యాగాశ్వం కనిపించకుండా పోయింది. అరవై వేల మంది సగర కుమారులు అన్నిచోట్లా వెతుకుతూ పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర యాగాశ్వాన్ని చూశారు. కపిలుడే ఆ గుర్రాన్ని దొంగిలించాడనుకొని ధ్యానంలో ఉన్న ఆ మహర్షిని ఇబ్బంది పెట్టారు. దాంతో ఆయన కోపాగ్నికి మాడి మసైపోయారు. ఈ విషయం సగరుడికి తెలిసింది. దుఃఖంతో రాజ్యాన్ని వదిలి అరణ్యాలకు వెళ్లిపోయాడు. అసమంజుడు మాత్రం సోదరప్రేమతో వారిని బతికించాలని అనుకొన్నాడు. స్వర్గంలో ఉన్న గంగానది ఆ బూడిదరాశుల మీదుగా ప్రవహిస్తే వారంతా బతుకుతారని తెలిసి, గంగాదేవి కోసం చాలాకాలం పాటు తపస్సు చేసి కన్నుమూశాడు.
అసమంజుడి కొడుకు అంశుమంతుడు అదే తపస్సును కొనసాగించాడు. కానీ ఆయన వల్ల కూడా కాలేదు. ఆ తర్వాత అతని కుమారుడు భగీరథుడు గోలోక శ్రీకృష్ణుడి గురించి తపస్సు చేసి, పరమాత్మ అనుగ్రహంతో గంగమ్మను భూలోకానికి తెచ్చేందుకు వరం పొందాడు. అయితే గంగాదేవి, భూలోకంలో పాపాత్ములు ఎక్కువగా ఉంటారనీ వారంతా వచ్చి స్నానం చేస్తే ఆ పాపం తనకు అంటుకుంటుందనీ ... మనసులోని సందేహాన్ని కృష్ణుడికి చెప్పింది. అప్పుడాయన, ఎంతమంది పాపాత్ముల పాపం అంటుకున్నా... ఒక్క భక్తుడు, మంత్ర ఉపాసకుడు, యోగసాధకుడు గంగలో స్నానం చేస్తే చాలు, ఆ పాపాలన్నీ పోతాయని అన్నాడు. అలాగే, పండగ పబ్బాల్లో గంగలో స్నానం చేసిన వారికి అత్యధిక పుణ్యఫలాలు దక్కుతాయని మాటిచ్చాడు. ఆ తర్వాత తనే స్వయంగా గంగను పూజించాడు.
భగీరథుడు కూడా గంగమ్మను పూజించి... భూలోకానికి గంగ దూకేటప్పుడు ఆమెను భరించే బాధ్యతను శివుడికి అప్పగించాడు. భగీరథుడి వెంట భూలోకానికి వచ్చింది కనుక భాగీరథి అయింది గంగ. భగీరథుడి వెంట వెళుతున్నప్పుడు జహ్నుమహర్షి గంగను మింగాడు. మళ్లీ భగీరథుడు ప్రార్థించడంతో ఆయన విడిచిపెట్టాడు. ఆ క్రమంలోనే ఆమెకు జాహ్నవి అనే పేరొచ్చింది.
రూప సౌందర్యం
గంగమ్మది దివ్య సౌందర్యం. దేవీభాగవతంలో ఆ రూప వర్ణన కనిపిస్తుంది. గంగాదేవి గోలోక శ్రీకృష్ణుడి నుంచి ఆవిర్భవించింది. అప్పుడామె తెల్ల కలువలాగా మెరిసిపోతూ అగ్నిజ్వాలల లాంటి మేలిముసుగుతో, రత్నాభరణాలతో కాంతులీనుతూ ఉంటుంది. నూరు శరత్‌పూర్ణిమల దివ్యకాంతితో చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. నిత్య యవ్వనంతో శాంతస్వరూపిణిగా సౌభాగ్య వంతురాలుగా, మాలతీ పుష్పమాలికలను ధరించి చెక్కిళ్లమీద సిందూర చందన కస్తూరి బిందువులతో కళకళలాడుతూ ఉంటుంది. దొండపండ్ల లాంటి ఎర్రటి పెదవులు, ముత్యాల కోవలలాంటి పలువరుస, అందమైన కళ్లు, క్రీగంటి వాలుచూపులతో మనోహరంగా ఉంటుంది.
రాధాకృష్ణులే గంగాదేవి
గంగాదేవి సాక్షాత్తూ దైవస్వరూపమే అని చెప్పేందుకు ఓ ఐతిహ్యం ఉంది. ఓసారి గోలోకంలో రాధాకృష్ణులు కొలువుదీరి ఉన్నారు. సకల దేవతలు, రుషి, మునిగణాలు ఆ కొలువులో ఉన్నారు. అప్పుడు సరస్వతీదేవి చక్కటి పాట పాడింది. ఆ పాటకు అందరూ పరవశించిపోయారు. బ్రహ్మదేవుడు శివుడి దగ్గరకొచ్చి ఆయనను కూడా ఒక పాటపాడమని కోరాడు. శివుడు పాడిన పాటకు అంతా మైమరచిపోయారు. పాట పూర్తికాగానే అందరూ తేరుకుని చూసేసరికి రాధాకృష్ణులు కనిపించలేదు. దేవతలంతా కంగారుపడ్డారు. బ్రహ్మ కృష్ణుడిని ప్రార్థించాడు. అప్పుడు అశరీరవాణిలా కృష్ణుడి గొంతు వినిపించింది. శివుడి పాటకు తామిద్దరం కరిగిపోయినట్టు, మళ్లీ శివుడు వేదాలలోని అపూర్వ మంత్రాలను తమ కోసం రచిస్తే... అప్పుడు అసలు రూపంలోకి వస్తామని చెప్పాడు. వెంటనే శివుడు అక్కడ జలరూపంలో ప్రవహిస్తున్న నీటిని దోసిటలోకి తీసుకొని స్తోత్రాలను చదివి పూజ చేశాడు. రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారు. అప్పుడక్కడ ఉన్న జలమే గంగానది అయింది.
రామాయణ, మహాభారతాలలో గంగ ప్రస్తావన ఉంది. గంగకు, శంతనుడికి జన్మించిన దేవవ్రతుడే కురువృద్ధుడైన భీష్మాచార్యుడు. కాశీ లాంటి క్షేత్రాలలో గంగకు నిత్యపూజలూ, హారతులూ అర్పిస్తున్నారు. ఆ అవకాశం లేనివారు గంగను ధ్యానించి ఏ నీటిని నెత్తిన పోసుకున్నా గంగాస్నాన ఫలమే దక్కుతుంది. - శ్రీమల్లి,
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565