మహాభక్తుడి వరదానం
కనుచూపు మేరలో పచ్చదనం.. చుట్టూ కొండలు.. ప్రకృతి సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తూ కనువిందు చేస్తుం ది రామకృష్ణ తీర్థం. ఏటవాలుగా పరుచుకున్న కొండ మీది నుంచి ఈ పుణ్య జలాలు జలజలా జారుతూ పరవళ్లు తొక్కుతుంటాయి. వర్ష రుతువులో అయితే కొండపై తెల్లటి పరదాలు కట్టినట్లుగా సాగే జలప్రవాహాన్ని చూస్తుంటే మనసు తన్మయం చెందుతుంది.
ముక్తి జలాలు
రామకృష్ణ తీర్థం ప్రస్తావన స్కాంద పురాణంలో ఉంది. పూర్వం రామకృష్ణ అనే మహాభక్తుడు శ్రీహరి కోసం తిరుగిరుల్లో ఘోరమైన తపస్సు చేశాడట. ఆయన తపస్సు భగ్నం చేయదలచి ఇంద్రుడు కారు మేఘాలకు పంపించి వర్షింపజేశాడట. పిడుగులతో కూడిన కుంభవృష్టి కురిసినా... రామకృష్ణుడు తపస్సును విరమించలేదు. చివరికి శ్రీహరి ప్రతక్ష్యమై రామకృష్ణుణ్ణి అనుగ్రహించాడు. నాటి నుంచి ఆయన తపమాచరించిన తీర్థం రామకృష్ణ తీర్థంగా విరాజిల్లుతోంది. ముక్తి జలాల సంతరించుకుని భక్తులకు పుణ్యం ప్రసాదిస్తోంది. ఈ తీర్థానికి సమీపంలో శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడి విగ్రహాలు కనిపిస్తాయి.
ఏటవాలు దారిలో...
రామకృష్ణ తీర్థం పాపవినాశనం డ్యామ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అయితే ఈ దారి చాలా కష్టతరంగా ఉంటుంది. ఏటవాలు కొండలపై నడక ప్రమాదకరంగా సాగుతుంది. ఏమరపాటు ఎంత మాత్రం తగదు. దారి ఎలా ఉన్నా.. రాళ్లు రప్పలు కాళ్లకు గుచ్చుకున్నా.. భక్తులు వాటినేమీ లెక్క చేయరు. ఏటా సూర్యుడు మకరరాశిలో ఉండగా.. పుష్యమీ నక్షత్ర యుక్త పౌర్ణమి నాడు.. రామకృష్ణ తీర్థానికి ముక్కోటి ఉత్సవం నిర్వహిస్తారు. ఆ రోజున వేల మంది భక్తులు ఈ తీర్థానికి తండోపతండాలుగా తరలివస్తారు. తీర్థంలో ప్రత్యేక పూజలు చేసి.. పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తర్వాత శ్రీరాముడు, శ్రీకృష్ణుడి మూర్తులను భక్తితో పూజిస్తారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565