MohanPublications Print Books Online store clik Here Devullu.com

Pushpaka Vimanam_ పుష్పక విమానం


పుష్పక విమానం

ప్రకృతిలో మాట లేదు. చెట్లు, పక్షులు, పశువులు మాట్లాడుకోవు. కాని వాటి మధ్య కమ్యూనికేషన్‌ ఉంటుంది. జీవన ప్రవాహం ఉంటుంది. పరస్పర అవగాహన ఉంటుంది. మనిషికి మాట ఉంది. అయినప్పటికీ అతడు ఎక్కడ లేని కమ్యూనికేషన్‌ ప్రాబ్లమ్స్‌తో బాధ పడుతుంటాడు. చెప్పాల్సినవి చెప్పడు. చెప్పకూడనివి చెప్తాడు. చెప్పేది సరిగా చెప్పడు. సరిగా చెప్పినా పూర్తిగా చెప్పడు. ఇన్ని సమస్యలేల అసలు మాటనే తీసేస్తే? అలాంటి ఆలోచనే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు వచ్చింది.

అసలు సినిమాలు ‘మూకీ’గా మొదలయ్యాయి. డైలాగ్‌ను ఎలా ఫిల్మ్‌ మీదకు తేవాలో ఆ రోజుల్లో అర్థం కాలేదు. ఆ తర్వాతే మెల్లగా ‘టాకీ’లు మొదలయ్యాయి. టాకీలు మొదలయ్యి, మాటలు ఆటలు పాటలు కొనసాగుతూ, సినిమా మాధ్యమం పూర్తిస్థాయి అభివృద్ధి చెందాక తిరిగి దానిని వెనక్కు తీసుకెళ్తూ మళ్లీ ‘మూకీ’ సినిమా తీయాలనే ఆలోచన రావడం విడ్డూరం. విచిత్రం. కాని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పట్టుపట్టారు. తీయాల్సిందే అని కమలహాసన్‌తో జట్టు కట్టారు. ఆ విధంగా తయారయ్యిందే ‘పుష్పక విమానం’. అసలు డైలాగులే లేని ఈ రెండు గంటల సినిమాలో చక్కని కథ ఉంది, ప్రేమ ఉంది, భావోద్వేగం ఉంది, క్లయిమాక్స్‌ ఉంది, అది చెప్పే ఒక అర్థవంతమైన సందేశం ఉంది. ఇన్ని ఇమిడ్చి ఈ సినిమా తీయడం సృజనాత్మకత మెండుగా ఉన్నవారికే సాధ్యం.

ఈ సినిమాలో కమలహాసన్‌ బెంగుళూరులో పూర్తిస్థాయి నిరుద్యోగి. చేతిలో చిల్లిగవ్వ ఉండదు. పొద్దున లేస్తే ఫుల్‌ టీ కూడా ఆర్డర్‌ ఇవ్వలేని కటకట. ఇతని కంటే బిచ్చగాడే నయం అనిపించేలా ఉంటాడు. ఆ సమయంలోనే ఇతనికి తాగుబోతైన ఒక శ్రీమంతుడు రోడ్డు మీద తప్పతాగి స్పృహలో లేకుండా పడి కనిపిస్తాడు. ఆ శ్రీమంతుడు కేవలం తాగడానికే ‘పుష్పక్‌’ అనే పెద్ద స్టార్‌ హోటల్‌లో రూమ్‌ తీసుకుని ఉంటాడు. ఆ తాళం చెవి అతడి జేబులో ఉంటుంది. కమలహాసన్‌ అది గమనిస్తాడు. వెంటనే శ్రీమంతుణ్ణి మోసుకుని తన రూముకు తీసుకెళ్లి కట్టేస్తాడు. హోటల్‌ కీతో తానే వెళ్లి రూమ్‌లో దిగుతాడు. రూమ్‌లో ఉన్న డబ్బును ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు.

అక్కడే అతనికి అమల కనిపిస్తుంది. ఇతణ్ణి నిజంగానే శ్రీమంతుడు అనుకుంటుంది. వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కాని రాను రాను కమలహాసన్‌కి ఆ హోటల్‌ రూమ్‌ జీవితం విసుగు పుట్టిస్తుంది. అది తనది కాని జీవితం. మోసం వల్ల వచ్చిన జీవితం. అతడిలో మార్పుకు ఆ హోటల్‌ యజమాని ఒక కారణం. ఆ యజమాని చిన్న టీ స్టాల్‌ నుంచి కష్టపడి ఎదిగి స్టార్‌ హోటల్‌ కట్టే స్థాయికి చేరుకుని ఉంటాడు. అతడు చనిపోతే ఎందరో ఏడుస్తారు. అలా తను కూడా కష్టపడి పైకి రావాలి కదా అనుకుంటాడు. మరో కారణం ఒక బిచ్చగాడు. అతడు రోడ్డు మీద బిచ్చమెత్తుకుంటూ ఉంటాడు. చనిపోతే అతడి శవాన్ని కూడా పట్టించుకోకుండా అతడు దాచుకున్న చిల్లర కోసం కొట్టుకుంటారు జనం. ఎంత డబ్బు దాచుకున్నా ఏమిటి ఫలం? మనిషి పోయాక అది పరుల పాలే కదా. చివరకు కమలహాసన్‌ తాను కట్టేసి దాచిన శ్రీమంతుణ్ణి విడిచిపెట్టేస్తాడు. అతడికి సారీ లెటర్‌ రాస్తాడు. అతడి సొమ్ములన్నీ హోటల్‌ రూమ్‌లోనే ఉంచేసి తిరిగి పాత జీవితానికి వస్తాడు. అదే సంగతి ప్రియురాలైన అమలకు చెప్తే ఆమె మొదట ఆశ్చర్యపోయినా క్షమిస్తుంది. తాను ఆ ఊరి నుంచి వెళ్లిపోతూ తన అడ్రస్‌ ఉన్న కాగితాన్ని కమల్‌ వైపు విసురుతుంది. కాని ఆ కాగితం డ్రయినేజ్‌లో పడిపోతుంది. కమలహాసన్‌ సినిమా మొదలులో ఎలా ఉన్నాడో సినిమా చివరలో కూడా అలాగే ఉండగా సినిమా పూర్తవుతుంది.

‘దురాశ దుఃఖానికి చేటు’ అని పెద్దలు ఏనాడో చెప్పారు. ‘పరుల సొమ్ముకు ఆశపడకూడదు’ అని కూడా చెప్పారు. ఆ రోజులలో నిరుద్యోగం వల్ల అడ్డదారులు తొక్కైనా సరే లగ్జరీలు అనుభవించాలి అని ఆలోచించే యువతను వీపున చరచి వాస్తవంలోకి తీసుకొచ్చిన సినిమాగా ‘పుష్పక విమానం’ను చెప్పుకోవచ్చు. ఇందులో క్రైమ్‌ ఎలిమెంట్‌ కూడా ఉంది. శ్రీమంతుడి భార్య ప్రతాప్‌ పోతన్‌తో సంబంధం పెట్టుకుని ఉంటుంది. కనుక ప్రతాప్‌పోతన్‌ శ్రీమంతుణ్ణి చంపడానికి టీనూ ఆనంద్‌ను ప్రొఫెషనల్‌ కిల్లర్‌గా రంగంలోకి దింపుతాడు. ‘పుష్పక్‌’లో ఫలానా రూమ్‌లో ఉన్న మనిషిని చంపమని సుపారీ ఇస్తాడు. కాని వాస్తవంగా ఆ రూమ్‌లో శ్రీమంతుడు బదులు కమలహాసన్‌ ఉన్నాడు. ప్రొఫెషనల్‌ కిల్లర్‌ నిజంగానే చంపేసి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. నిజ జీవితంలో ఇలాంటి సందర్భాల్లో క్రైమ్‌కు వీలుంటుందని కూడా దర్శకుడు హెచ్చరిస్తాడు.

అయితే ఈ కథ ఇంత లోతు కలిగినా కథనం లైటర్‌గా సాగిపోతుంది. హాస్యరస ప్రధానంగా కథ నడుస్తుంది. ఒక్క మాట వినకుండా, పాట లేకుండా కేవలం నేపధ్య సంగీతం వింటూ సినిమా చూస్తున్నా బోరు కొట్టకుండా హాయిగా ఉంటుంది. ఇందులో శ్రీమంతుణ్ణి రూమ్‌లో కట్టేశాక అతడి టాయిలెట్‌ని నీట్‌గా ప్యాక్‌ చేసి కమలహాసన్‌ బయట పారేస్తుంటాడు. ఆ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. శ్రీమంతుణ్ణి చంపేందుకు సాక్ష్యాధారాలు ఉండకుండా ‘ఐస్‌ నైఫ్‌’ను వాడుతుంటాడు టీనూ ఆనంద్‌. అదీ నవ్వే. 1985లో ఈ సినిమాను కన్నడలో తీసినా మాటలు లేవు కాబట్టి హాయిగా హిందీ, తెలుగు, తమిళంలో రిలీజ్‌ చేశారు. కేవలం 24 లక్షల పెట్టుబడి పెడితే బోలెడన్ని లాభాలు తెచ్చి పెట్టింది ఈ సినిమా.ఎప్పుడైనా బోర్‌ కొడితే తప్పక చూడదగ్గ సినిమా – పుష్పక విమానం.


ఈజీ మనీ కోసం మోసాలు, నేరాలు చేయడానికి నేటి యువత వెనుకాడటం లేదు. అలాంటి షార్ట్‌కట్‌ ఆశలు ప్రమాదకరమనీ కష్టపడి పైకి రావడంలోనే తృప్తి ఉంటుందని ఆ రోజుల్లోనే చెప్పినా నేటికీ రిలవెంట్‌గా అనిపించే చిత్రం ‘పుష్పక విమానం’.

‘భాగ్యచక్రం’ నుంచి వచ్చిన ఐడియా
దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కె.వి.రెడ్డి శిష్యుడు. కె.వి.రెడ్డి ‘భాగ్యచక్రం’ సినిమా తీస్తుండగా ఒక సన్నివేశంలో కమెడియన్‌ ‘ఈ చీకటిని చూస్తుంటే నాకు భయమేస్తోంది’ అంటా డు. అది చూసిన కె.వి. రెడ్డి రచయిత పింగళిని పిలిచి ‘ఈ డైలాగ్‌ ప్రత్యేకంగా ఎందుకు? అదే విషయాన్ని కమెడియన్‌ ఎక్స్‌ప్రెషన్‌తో చూపించవచ్చుగా’ అన్నారు. ఆ సమయానికి అక్కడే ఉన్న సింగీతంకు ‘నిజమే కదా... చాలా విషయాలు ఎక్స్‌ప్రెషన్‌తోనే చెప్పవచ్చు. కనుక మాటలే అవసరం లేని సినిమా తీస్తే ఎలా ఉంటుంది’ అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు సినిమా రూపం దశాబ్దాల తర్వాత దర్శకుడిగా స్థిరపడి ఆచరణలో పెట్టారు. దీనికి నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోతే కన్నడలో ఒక నిర్మాతతో కలిసి తానూ పెట్టుబడి పెట్టి సినిమా తీశారు సింగీతం. ఆయన నమ్మకం వమ్ముకాలేదు. సినిమా సక్సెస్‌.

– కె

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list