MohanPublications Print Books Online store clik Here Devullu.com

సంస్కారం లేని చదువు వ్యర్థం!- Read, Library


చెక్కతో డయాబెటిస్‌కు చెక్‌
గుడ్‌ఫుడ్‌
దాల్చిన చెక్క వంటల్లో రుచిని పెంచడానికి మాత్రమే కాక, ఆరోగ్యాన్ని కుదుట పరచడానికి కూడా దోహదం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి డయాబెటిస్‌ (టైప్‌ 2 డయాబెటిస్‌) వ్యాధిగ్రస్థులు దీనిని వారానికి కనీసం రెండుసార్లయినా తీసుకుంటే మంచిది.దాల్చిన చెక్క పొడిని రోజుకు అర టీ స్పూన్‌ తీసుకుంటే గుండెకు హాని చేసే (ఎల్‌డిఎల్‌) కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తుంది.
ల్యుకేమియా, లింఫోమా (క్యాన్సర్‌) వంటి క్యాన్సర్‌ కారక కణాల వృద్ధిని నిరోధించడంలో దాల్చిన చెక్క సమర్థంగా పనిచేస్తుంది. రోజూ ఉదయం పరగడుపున అర టీ స్పూన్‌ దాల్చిన చెక్క పొడిని ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెతో కలిపి వారం పాటు తీసుకుంటే ఆర్థరైటిస్‌ సమస్య తగ్గుతుంది. ఒక నెల రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది.ఇది ఆరోగ్యదాయని మాత్రమే కాదు, ఆహారపదార్థాలను బ్యాక్టీరియా బారిన పడకుండా కాపాడే సహజసిద్ధమైన ప్రిజర్వేటివ్‌ కూడా.

సంస్కారం లేని చదువు వ్యర్థం!
ఆత్మీయం

కొందరికి తాము ఎంతో చదువుకున్నామని, అవతలి వారు ఏమీ చదువుకోలేదనీ, వారికి ఏమీ తెలియదనే భావన అణువణువునా ఉంటుంది. అయితే ఏవో కొన్ని పుస్తకాలు చదువుకున్నంతమాత్రాన విర్రవీగితే అంతకన్నా అహంకారం మరొకటి ఉండదు. ఉదాహరణకు ఒక గ్రంథాలయంలోకి మనం సమకూర్చుకున్న జ్ఞానం ఏపాటిదో అర్థమౌతుంది. నాకు అన్నీ వచ్చు అనుకున్నవాడు గొప్పవాడు కాదు. రానివెన్నో అనుకోవడమే గొప్ప. పర్వతాల గురించి అంతా చదువుకున్నవాడు, భూగోళ శాస్త్రమంతా చదివినవాడు ఆఖరున ఏమంటాడంటే... ‘‘నేను పర్వతాల గురించి చదివాను.
ఇన్నిరకాల నేలల గురించి చదివాను. ఎన్నోరకాల మైదానాలు, పీఠభూములను గురించి చదివాను. అసలు ఇన్ని పర్వతాలు, ఇన్ని మైదానాలు, ఇన్ని పీఠభూములు, ఇన్ని నదులు సృష్టించిన ఆ పరమాత్ముడు ఎంత గొప్పవాడో’’ అంటాడు. అది సంస్కారం. ఎందుకంటే, చదువు సంస్కారంతో కలసి ఉంటుంది. ఆ సంస్కారం లేకుండా, ఆ వినమ్రత లేకుండా ఊరికినే చదువుకోగానే సరిపోదు. అవతలివారి మనస్సు నొప్పించకుండా మాట్లాడటం తెలియాలి. మనం ఏమి చేస్తే ఎదుటివాళ్లు బాధపడతారో తెలుసుకుని ఉండాలి. అలా తెలియకపోతే ఆ చదువు ఎందుకూ పనికి రాదు.
సయాటికా! నీకు సెలవిక!!
యోగా
ఏకపాదరాజ కపోతాసన
అధోముఖ శ్వాసాసనం లేదా పర్వతాసనంలో ఉండి (సూర్య నమస్కారంలో 8వ భంగిమ. రెండు అరచేతులు రెండు అరిపాదాలు భూమి మీద ఉంచి నడుమును పైకి లేపి, భూమికి త్రికోణంలా ఉండాలి) శ్వాస తీసుకుంటూ ఎడమకాలిని మడిచి మోకాలిని ముందుకు, ఎడమ మడమను జననేంద్రియాలకు దగ్గరగా, కుడికాలిని వెనుకకు స్ట్రెయిట్‌గా స్ట్రెచ్‌ చేయాలి. రెండు అరచేతులు నడుముకు పక్కన నేల మీద ఉంచి సపోర్ట్‌ తీసుకుంటూ ఛాతిని ముందుకు ప్రొజెక్ట్‌ చేస్తూ మెడని తలను వీలైనంత వెనుకకు వంచి నెమ్మదిగా కుడికాలిని మడిచి కుడిచేత్తో కుడికాలి మడమను పట్టుకుని, శరీరానికి వెనుక వీపునకు దగ్గరగా కుడిపాదాన్ని లాగుతూ ఎడమ చేతిని పైనుంచి తీసుకుని రెండు చేతులతో కుడి కాలివేళ్లను లేదా పాదం ముందు భాగాన్ని పట్టుకుని వీలైతే తల మూడు భాగాలను కుడి అరిపాదానికి ఆనించే ప్రయత్నం చేయవచ్చు. శ్వాస వదులుతూ మళ్లీ వెనుకకు పర్వతాసనంలోకి వచ్చి తిరిగి రెండో వైపు చేయాలి. దీనికి ముందు భుజంగాసనాన్ని సాధన చేస్తే శరీరం తేలికగా వంగుతుంది. ఫొటోలో చూపిన విధంగా చేయలేకపోతే ఏదైనా ఒక టవల్‌ లేదా తాడును కుడి కాలి మడమ చుట్టూ పోనిచ్చి తాడు ఆధారంగా చేయవచ్చు.
జాగ్రత్తలు: మోకాళ్లు బలహీనంగా ఉన్నా, మోకాలు, మడమ, కాలి ఎముకలకు ప్రాక్చర్స్‌ అయినా ఈ ఆసనం చేయరాదు. మోకాళ్ల కింద సపోర్ట్‌గా టవల్‌ లేదా పలచని దిండు వాడవచ్చు.
పరివృత్తపార్శ్వ కోణాసన
సమస్థితిలో నిలబడాలి. కుడికాలు ముందుకి ఎడమ కాలు వెనుకకి (కాళ్ళ మధ్యలో 3 లేదా 4 అడుగుల దూరం) ఉంచాలి. కుడి మోకాలు ముందుకు వంచి ఎడమ కాలుని వెనుకకు బాగా స్ట్రెచ్‌ చేయాలి, నడుమును ట్విస్ట్‌ చేస్తూ ఛాతీని కుడివైపుకి తిప్పి, ఛాతీని తొడభాగానికి నొక్కుతూ ఎడమ ఆర్మ్‌పిట్‌ (చంకభాగం) కుడి మోకాలు మీదకు సపోర్టుగా ఉంచి వెనుకకు చూస్తూ రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచాలి. కొంచెం సౌకర్యంగా ఉండటానికి ఎడమ మడమను పైకి లేపి పాదాన్ని, కాలి వేళ్ళను ముందు వైపుకి తిప్పవచ్చు. 3 లేదా 5 శ్వాసలు తరువాత తిరిగి వెనుకకు వచ్చి ఇదే విధంగా రెండో వైపు కూడా చేయాలి. నమస్కార ముద్రలో చేతులు ఉంచలేని వాళ్లు ఎడమ అరచేతిని పూర్తిగా నేలమీద ఉంచి కుడిచేతిని కుడి చెవికి ఆనించి ముందుకు స్ట్రెచ్‌ చేస్తూ కుడి అరచేతిని చూసే ప్రయత్నం చేయవచ్చు. అలా కూడా చేయడం సాధ్యం కానప్పుడు చేతులు లేని కుర్చీలో కుడి తొడ వెనుక భాగం సపోర్టుగా ఉంచి కూర్చుని, ఎడమకాలుని వెనక్కి స్ట్రెచ్‌ చేస్తూ కుర్చి బ్యాక్‌ రెస్ట్‌ని రెండు చేతులతో పట్టుకుని నడమును కుడివైపుకి బాగా తిప్పుతూ కుడి భుజం మీదుగా వెనుకకు చూడాలి.
ఉత్తిత హస్త పాదాం గుష్టాసనం
ఇది చేయాలంటే ముందుగా సమస్థితిలో నిలబడండి. ఇప్పుడు ఎడమకాలి మీద నిలబడి కుడికాలును ముందు నుంచి తీసుకొని బొటనవేలును లేదా పాదాన్ని కుడిచేతితో పట్టుకుని శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్‌ చేస్తూ పైకి లేపాలి. మోకాలు నిటారుగా ఉండేటట్లుగా భూమికి సమాంతరంగా వచ్చేటట్లుగా ప్రయత్నించాలి. ఎడమచేతిని నడముకు పక్కన సపోర్ట్‌గా పెట్టుకుని కాలిని ఇంకొంచెం పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయవచ్చు. 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ కుడికాలి పాదాన్ని కిందకు తీసుకురావాలి. ఇదే విధంగా రెండో కాలిమీద నిలబడి చేయాలి. సపోర్ట్‌ కావాలనుకుంటే కుర్చీ లేదా డైనింగ్‌ టేబుల్‌ ఇంకా బాగా చేయాలంటే కిటికీ గ్రిల్‌ సపోర్ట్‌ తీసుకుంటూ కాలుని అంచెలంచెలుగా పైకి తీసుకువెళ్లవచ్చు.
శరీరం వెనుక భాగంలో లంబార్‌ ప్రాంతం వెన్నెముక దగ్గర నుండి బయల్దేరి పిరుదుల భాగం, కాలి వెనుక భాగం నుండి కింది కాలి చివరి వరకు పయనించే నరం సయాటిక్‌ నరం. ఈ నరం ఒత్తిడికి గురవ్వడం వల్ల...నడుం కింద నుండి తుంటిభాగంలో, తొడ వెనుక, కాలు మొత్తం లాగడం, గుంజడం, విపరీతమైన నొప్పి, మంటలు, తిమ్మిర్లు ఉండడం, సమస్య తీవ్రత పెరిగితే కుంటుతూ నడిచే పరిస్థితి, మరీ ఎక్కువ అయితే కాలు చచ్చుపడిపోవడం కూడా జరుగుతుంది.
కారణాలివి... డిస్క్‌హెర్నియేషన్, డిస్క్‌ డిజనరేషన్‌ లేదా డిస్క్‌బల్జ్‌ లేదా స్టిఫ్డ్‌ డిస్క్‌ వల్ల ఈ నరం మీద ఒత్తిడి పడటం గాని లేదా స్పైనల్‌ కార్డ్‌ సన్నగా మారి సయాటిక నరం మూల భాగంలో ఒత్తిడికి గాని దారి తీయవచ్చు. ప్యాంటు వెనుక జేబులో లావు పర్సు పెట్టుకోవడం, గంటల తరబడి కూర్చోవడం కూడా పిరిఫార్మిస్‌ సిండ్రోమ్‌కి దారి తీయవచ్చు. 
నొప్పి చెబుతుంది... ఈ సమస్య సరైన కారణాన్ని సి.టి స్కాన్, ఎం.ఆర్‌.ఐ టెస్ట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. సమస్యను నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువులు ఎత్తేటప్పుడు నేల మీద ఉన్న బరువులను లిఫ్ట్‌ చేసేటప్పుడు మోకాళ్లు ముందుకు ఫోల్డ్‌ చే సి వాటిని పైకి లేపినట్లయితే లంబార్‌ ప్రాంతం సేఫ్‌గా ఉంటుంది. సమస్య పరిష్కారానికి ఉన్న వివిధ పద్ధతులలో ఫిజియోథెరపీ, ఓస్టియో, కైరోప్రాక్టీసు వంటివి ఉన్నాయి. అయితే ఈ సమస్యకు యోగా అద్భుతమైన పరిష్కారం అనేది నిస్సందేహం. దీనిని హార్వర్డ్‌ యూనివర్శిటీ చేసిన పరిశోధనలు ధ్రువీకరించాయి కూడా. సయాటికాకు పరిష్కారంగా ఉపకరించే
కొన్ని ఆసనాలివి.
సమన్వయం ఎస్‌. సత్యబాబు
సాక్షి ప్రతినిధి


బరువులెత్తే వ్యాయామాలు అమ్మాయిలకు అవసరం...
సిక్స్‌ప్యాక్‌ క్వీన్‌ సోనాలి స్వామి
జిమ్‌దగీ

‘‘వయసుతో సంబంధం లేకుండా మహిళలు వర్కవుట్స్‌ చేసి, ఫిట్‌గా మారవచ్చు. బరువులు మోస్తే మగవాళ్లలా కండలు వస్తాయనేది అపోహ మాత్రమే’’ అంటున్నారు బెంగుళూర్‌కు చెందిన ఫిట్‌నెస్‌ మోడల్‌ సోనాలి స్వామి. పెళ్లయి, పిల్లలు పెద్దయ్యాక 38 ఏళ్ల వయసులో బాడీబిల్డింగ్‌లోకి ప్రవేశించిన సోనాలి... మూడేళ్ల క్రితం బాడీ పవర్‌ ఇండియా 2014’లో ఫిట్‌నెస్‌ మోడల్‌ టైటిల్‌ విజేతగా నిలిచారు. బెంగుళూర్‌ నుంచి ఏకైక మహిళా బాడీబిల్డర్, సిక్స్‌ప్యాక్‌ క్వీన్‌గా కూడా పాప్యులరైన సోనాలి...ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించారారు.
వెయిట్‌ అండ్‌ షీ!
ఎరోబిక్స్, డ్యాన్సింగ్, కార్డియో ఎంతైనా చేస్తారు కాని పురుషుల్లా కనపడతామేమో అని బరువులు ఎత్తే స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలకు అమ్మాయిలు దూరంగా ఉంటారు. నేను 40కిలోల బరువు ఎత్తగలను. నేనేమీ మగవాడిలా కనపడడం లేదు కదా. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళలు మజిల్‌ కోల్పోతుంటారు. అలా కోల్పోవడాన్ని వీలైనంత ఆలస్యం చేయడానికి స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ తప్పనిసరి. అలాగే శరీరంలో ప్రతి అవయవానికీ, ప్రతి మజిల్‌కీ వ్యాయామం ఇవ్వాలి. దీనికి బరువులు ఎత్తడమే మార్గం.

బాడీబిల్డింగ్‌ అంటే... కండలు పెంచడం కాదు
బాడీ బిల్డింగ్‌ పట్ల మహిళలు విముఖత చూపనక్కర్లేదు. ఎందుకంటే... దీనిలో విభిన్న రకాల కేటగిరీలు ఉంటాయి. నేను ఫిట్‌నెస్‌ మోడల్‌ కేటగిరీలో చేశాను. బాడీబిల్డింగ్‌ అంటే ఫిట్, టోన్డ్‌ లుక్‌ కూడా. మనం తీసుకుంటున్న శిక్షణ, డైట్, వీటన్నింటినీ బట్టి మార్పు చేర్పులుంటాయి. అలాగే ఫిట్‌నెస్‌కు సంబంధించి షార్ట్‌టైమ్‌ టార్గెట్స్‌ వద్దు. పెళ్లి కుదరింది కాబట్టి బరువు తగ్గాలి. లేదా డాక్టర్‌ చెప్పాడు కాబట్టి తగ్గాలి అనుకోకూడదు. వ్యాయామం అనేది జీవిత కాలం కొనసాగించే అలవాటుగా భావించాలి. కొత్తవాళ్లయితే ప్రారంభంలో కనీసం 30 నిమిషాల వ్యాయామం సరిపోతుంది. అయితే కాస్త అనుభవం వచ్చాక రోజుకు 1గంట వరకూ చేయాలి. ఈ గంటలోనే కార్డియో, వెయిట్‌ ట్రైనింగ్‌... అన్నీ బ్యాలెన్స్‌ చేసుకోవాలి. ఓపిక పట్టాలి. ఇన్‌స్టాంట్‌ రిజల్ట్స్‌ కోసం చూడొద్దు.
కుటుంబమే బలం
ఉదయం 5గంటలకు నా దినచర్య ప్రారంభం అవుతుంది. పిల్లల్ని స్కూల్‌కి పంపేశాక, నా ట్రైనింగ్‌ సెషన్‌ స్టార్ట్‌ చేస్తాను. పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేలోపు నా పర్సనల్‌ ట్రైనింగ్‌ వగైరాలన్నీ పూర్తవుతాయి. ఇక సాయంత్రం నుంచి నా టైమ్‌ అంతా వారికే కేటాయిస్తాను. అలా ఇంటినీ, నా పేషన్‌నీ బ్యాలెన్స్‌ చేసుకోవడం అలవాటైంది. నా భర్త సంజయ్‌ ప్రోత్సాహం బాగా లభిస్తోంది. నేను ట్రైనింగ్‌ సెషన్స్‌ మిస్సవ్వకుండా, సరైన ఆహారం తీసుకునేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటారు. నా ఆహారంలో వెజిటబుల్స్‌ అత్యధికంగా ఉంటాయి. రెడ్‌ మీట్‌ ఉండదు. అయితే ప్రొటీన్స్‌ కోసం చికెన్‌ను తరచు తీసుకుంటాను. ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని గుర్తించి ఆమె ఫిట్‌నెస్‌ విషయంలో కుటుంబం అంతా శ్రద్ధ చూపించాలి.
సమన్వయం ఎస్‌. సత్యబాబు


మొక్కలు నాటిద్దాం.. ఎరువులు చేయిద్దాం!
చిన్నపిల్లలు ఏం చెప్పినా ఇట్టే పట్టేసుకుంటారు. వాళ్లకు క్రమశిక్షణతోపాటూ.. ప్రకృతి వనరుల్ని ఎంత పొదుపుగా వాడాలో చిన్నతనం నుంచీ అలవాటు చేస్తే.. పెద్దయ్యాకా కొనసాగిస్తారు. 
* అవసరం లేనప్పుడు టీవీలూ, ఫ్యానులూ, విద్యుత్‌ బల్బులను ఆపేయమనండి. దాన్నో అలవాటుగా మార్చండి. అలాగే వాళ్లు ఆడుకున్న తరవాత ఆటవస్తువుల్ని ఎక్కడపడితే అక్కడ ఉంచేయకుండా ఓ పద్ధతిగా సర్దుకోవడం కూడా నేర్పండి. 
* నీటి వృథాని అరికట్టే దిశగా వారికి అవగాహన కల్పించండి. ఉదాహరణకి వాళ్లు పళ్లు తోముకునేటప్పుడు కుళాయిని అలాగే వదిలేసి తోముకుంటుంటే అలా చేయొద్దని వివరించండి. రెండుమూడు రోజులు మీరు పక్కనుండి చెబితే.. అర్థంచేసుకుంటారు. 
* మనచుట్టూ ఉండే పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడండి. చిన్నారులకూ ఇదే నేర్పండి. స్కూల్‌, ఇల్లూ, పార్క్‌... ఇలా ఎక్కడికి వెళ్లినా శుభ్రత పాటించేలా చూడండి. ముఖ్యంగా వాళ్లు తినే చాక్లెట్‌, బిస్కెట్‌ ప్యాకెట్ల కాగితాలను ఎక్కడపడితే అక్కడ కాకుండా చెత్తడబ్బాలో పారేసేలా చూడండి. నిర్లక్ష్యం చేసినా.. మీరు దగ్గరుండి చెత్త డబ్బాలో వేయించండి. 
* మీ పెరటిలో కూరగాయలూ, పండ్లూ, పూల మొక్కలను పెంచండి. వాటి సంరక్షణా బాధ్యతల్లో పిల్లల్ని భాగస్వాములను చేయండి. ఇంట్లో వాడేసిన కూరగాయల ముక్కలూ, పండ్ల తొక్కలు ... ఇలా వ్యర్థాలతో సహజ ఎరువులను వారితో తయారు చేయించండి. వాటిని మొక్కలకు ఎరువుగా వేయమనండి. ప్రతి వారం మీతోపాటు వారిని కూరగాయల మార్కెట్‌కు తీసుకువెళ్లి అక్కడి తాజా కాయగూరలనూ, పండ్లనూ చూపించండి. వీలైతే అవి ఎలా పండుతున్నాయో వారికి చూపించండి. వాళ్లకో అవగాహన వస్తుంది.
సువాసనే కాదు.. సుగుణాలెన్నో!
యాలకుల్ని మసాలా కూరలు మొదలు మిఠాయిల వరకూ ఎన్నో వంటకాల్లో వాడతారు. వీటికి సువాసనతోపాటూ మరెన్నో ప్రత్యేక సుగుణాలున్నాయి. అవి మనకు ఆరోగ్యపరంగానే కాదు, అందం పరంగానూ మేలుచేస్తాయి. అవేంటో తెలుసుకుందామా! 
యాలకుల్లో మాంసకృత్తులూ, పీచూ, పిండిపదార్థాలతోపాటూ మరెన్నో పోషకాలూ ఉంటాయి. యాలకుల్లోని ఇనుము, రాగి, విటమిన్‌-సి, రైబోఫ్లేవిన్‌ రక్తహీనతను నివారిస్తాయి.. ప్రతిరోజూ పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చటి పాలల్లో అరచెంచా యాలకులపొడీ, పసుపూ, చక్కెరా వేసుకుని తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. 
* పొటాషియం, మెగ్నిషియం, క్యాల్షియంలతోపాటు యాలకుల్లో కావాల్సినంత స్థాయిలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. పొటాషియం గుండె కొట్టుకునే వేగాన్ని క్రమబద్ధంగా ఉంచుతూ, అధికరక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది. 
* యాలకులు ఆకలినీ పెంచుతాయి. రోజూ రెండు బుగ్గన పెట్టుకుని నమిలినా చాలు.. ప్రయోజనం ఉంటుంది. 
* వికారం, వాంతి వస్తున్నట్టు అనిపించినప్పుడు రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే చాలు. ఆ సమస్యలు అదుపులో ఉంటాయి. 
* గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు రెండుమూడు యాలకులు వేసి మరిగించిన నీటిని పొద్దున్నే పుక్కిలిస్తే ప్రయోజనం ఉంటుంది. 
* యాలకులని నమలడం వల్ల నోటిదుర్వాసన సమస్య అదుపులో ఉంటుంది. చిగుళ్ల సమస్యలు కూడా చాలామటుకూ తగ్గుతాయి. యాలకులతో చేసిన నూనెని పెదాలకు రాయడం వల్ల ఆరోగ్యంగా కనిపిస్తాయి. అలాగే ముఖానికి రాస్తే ఛాయ పెరుగుతుంది.
అసూయ నాశనానికే!
పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వారిద్దరూ బద్ధ శత్రువులు. ఒకరంటే ఒకరికి అసూయ. ఒకరోజున ఇద్దరిలో ఒక వ్యక్తి బ్రహ్మదేవుడి గూర్చి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసి రెండో వ్యక్తి కూడా తపస్సు ప్రారంభించాడు. కొన్నేళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేశారిద్దరూ. మొదటివాడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ‘నాయనా! ఏం వరం కావాలో కోరుకో!’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘దేవా! రెండో వాడు కూడా తపస్సు చేస్తున్నాడు కదా! వాడికీ నువ్వు ప్రత్యక్షమవుతావా?’ అని అడిగాడు. ‘అవున’న్నాడు బ్రహ్మ. ‘అయితే, ముందుగా వాడు ఏం కోరుకుంటాడో అది ప్రసాదించు స్వామి.
దానికి రెట్టింపు నాకు అనుగ్రహించ’మని వేడుకొన్నాడు. ‘అలాగే’ అన్నాడు బ్రహ్మ. మరు నిమిషంలో తపస్సులో ఉన్న రెండోవాడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘భక్తా! ఏం వరం కావాలో కోరుకో?’ అన్నాడు. ‘స్వామి! మొదటివాడి తపస్సుకు మెచ్చారా! ఏం కోరుకున్నాడు వాడు’ అని అడిగాడు. దానికి బ్రహ్మ.. ‘నాయనా! వాడు నీవు కోరుకున్నదానికి రెట్టింపు తనకు అనుగ్రహించమన్నాడు’ అని బదులిచ్చాడు. రెండోవాడు వెంటనే.. ‘స్వామీ! నాకు ఒక కన్ను దృష్టి కోల్పోయేలా వరమివ్వగలవు’ అని కోరుకొన్నాడు. ‘తథాస్తూ’ అన్నాడు బ్రహ్మ. రెండోవాడి ఒక కన్ను చూసే శక్తిని కోల్పోయింది. మరుక్షణంలో మొదటివాడి రెండు కన్నులూ దృష్టిని కోల్పోయాయి. అసూయ వలన ఇద్దరూ నష్టపోయారు. అసూయ నాశనానికే దారితీస్తుందనడానికి ఇది ఒక దృష్టాంతం. అసూయను వదలడం ఉత్తముల లక్షణం.
బాధ్యత మొత్తం మహిళలదే!
నిర్ణయాలు తీసుకోవడంలోనే కాదు. ఆ నిర్ణయాలను అమలుపరచడంలోనూ మహిళలు అగ్రస్థానంలో ఉంటున్నారు. అది పిల్లల స్కూల్‌ విషయమైనా, ట్రావెల్‌ ప్లాన్‌ అయినా మహిళల మాటే నెగ్గుతోంది. విహారయాత్రలకు వెళుతున్నట్లయితే ఆ టూర్‌కు సంబంధించిన ప్లాన్‌ మొత్తం మహిళల కనుసన్నల్లోనే జరుగుతోందని ఓ సర్వేలో తేలింది. స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువులతో మాట్లాడి మహిళలు ట్రావెల్‌ ప్లాన్‌ను అమలు చేస్తున్నారని వెల్లడయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఓయో’ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. 18 ఏళ్లు పైబడిన 400 భారతీయ మహిళలను సర్వేలో భాగంగా అధ్యయనం చేశారు. ఇందులో 63 శాతం మంది మహిళలు తమ జీవితభాగస్వామితో ట్రావెల్‌ చేయడానికి ఇష్టపడుతున్నారని తేలింది. 51 శాతం మంది మహిళలు బడ్జెట్‌ హోటల్‌లో చేయడాన్ని ఇష్టపడుతున్నారని వెల్లడయింది. ఇక 80 శాతం మంది మహిళలు ట్రావెల్‌ ప్లాన్‌కు సంబంధించి బాధ్యతలన్నీ తీసుకుంటున్నారని సర్వేలో తేలింది.
శ్రమ లేకుండా బరువు తగ్గే మార్గం లేదా?
నా వయసు 39, ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు, బరువు 96. ఈ స్థూలకాయంతో వాకింగ్‌ చేయడం కూడా కష్టంగానే ఉంటోంది. పైగా సొంత వ్యాపారం కాబట్టి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల దాకా క్షణం తీరిక లేకుండా ఉంటాను. రోజు రోజుకూ పెద్ద బొజ్జ ఏర్పడుతోంది. అయితే, జిమ్‌లు, రన్నింగ్‌లు కాకుండా సులభమైన మార్గంలో బరువు తగ్గే సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి.
- ఎన్‌ సూర్యప్రకాశ్‌, విశాఖపట్నం

వ్యాయామం అసలే చేయనంటే కుదరదు. అయితే ఎంతో కొంత వ్యాయామం చేస్తూనే ఈ కింది సూచనలు పాటిస్తే మీ బరువు క్రమంగా తగ్గుతారు. ఎలాగంటే..
అల్లం, ఊబకాయాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది అల్లంలో కొవ్వును కరిగించే అంశాలతో పాటు జీవక్రియల్ని వేగవంతం చేసే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందుకోసం అల్లాన్ని దంచి రసం తీయాలి. ఆ రసాన్ని పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి. పాత్రలో ఎంత అల్లం రసం ఉంటే దానికి సమానంగా తేనె కలిపి, మళ్లీ కాసేపు పొయ్యి మీద ఉంచి దించేయాలి. చల్లారిన తర్వాత సీసాలో నిల్వ చేయాలి. అందులోంచి ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్‌ రసం తీసుకుని, గ్లాసు వేడి నీళ్లు కలిపి భోజనానికి ముందు సేవించాలి. ఇలా రోజూ చేస్తే బొజ్జ కరిగిపోవడం మొదలవుతుంది..
జీలకర్రను రుచికోసం తప్ప అందులోని ఔషధ గుణాల్ని పెద్దగా పట్టించుకోం. అయితే భోజనంతో పాటు లేదా భోజనం తర్వాత రోజూ తింటే, జీర్ణక్రియ సవ్యంగా జరిగి క్రమంగా బరువు తగ్గుతారు.
పసుపులో ఉండే కర్‌క్యూమిన్‌ గొప్ప యాంటీ- ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ- ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇందులోని గుణాలు రక్తకణాల్లో అడ్డుపడే కొవ్వు కణాలు విస్తరించకుండా అడ్డుపడతాయి. ఇది అల్లంలాగే పనిచేస్తుంది. బరువు పెరగకుండా అరికడుతుంది. అందువల్ల రోజూ పరగడుపున ఒక చిన్న పసుపు ముద్దను మింగడం మేలు.
కొవ్వు కరిగించి, బరువు తగ్గించే మరో దినుసు దాల్చిన చె క్క. ఇది శరీర బరువును తగ్గించడంతో పాటు రక్తంలోని చక్కెర నిలువల్ని కూడా తగ్గిస్తుంది.
నల్ల మిరియాల్లోని పెవరీన్‌ కొవ్వుతో శక్తివంతంగా పోరాడుతుంది. కొత్తగా కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుపడుతుంది.
వీటిని పాటించి చూడండి కొద్ది కాలంలోనే ఫలితం కనిపిస్తుంది. కాకపోతే, వ్యాపారం కోసం 12 గంటలు కేటాయించడం ఇప్పుడు బాగానే ఉంది. ఆ కారణంగా శరీర శ్రమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ పోతే శరీరం రోగగ్రస్తమై ఒక దశలో 6 గంటలు కూడా పనిచేయలేని స్థితి ఏర్పడుతుంది. అందువల్ల శరీర వ్యాయామానికి మీరు ఎంతో కొంత సమయం కేటాయించక తప్పదు.
- డాక్టర్‌ ఎస్‌ ఉదయభాస్కర్‌, ఆయుర్వేద వైద్యులు
నులి పురుగుల నిర్మూలనకు
కడుపులో పురుగులుండడం పెద్దవారిక న్నా చిన్నపిల్లల్లోనే ఎక్కువ. ఆ పురుగుల్ని గమనించకపోతే ఎంత పౌష్టికాహారం ఇచ్చినా పిల్లలు రోజురోజుకు బరువు తగ్గుతూ బాగా నీరసించిపోతూనే ఉంటారు. దీనివల్ల తరుచూ జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు వారిని తరుచూ వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి పిల్లలు చదువులో బాగ వెనకబడటంతో పాటు రోజూ స్కూలుకు వెళ్లనంటూ మారాం చేస్తుంటారు. ఈ పరిణామాలన్నింటికీ అసలు తావే లేకుండా, ఈ సమస్యకు సాధారణ గృహవైద్యంతోనే స్వస్తి పలకవచ్చు. అలాంటి వైద్యాల్లో కొన్ని... 
దానిమ్మ చెట్టు చెక్కను బాగా నలగ్గొట్టి, నీళ్లల్లో వేసి కషాయం తయారుచేసుకోవాలి. ఆ కషాయాన్ని ఉదయాన్నే తీసుకుని ఆ తర్వాత గంటగంటకూ కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉంటే, కడుపులోని పురుగులన్నీ నశిస్తాయి.
వేపాకు, ఇంగువలను తేనెలో మర్థించి, మాత్రలు చేసి, రోజుకొక మాత్ర చొప్పున వేసుకుంటే కడుపులోని పురుగులన్నీ చాలా త్వరితంగా హరించుకుపోతాయి.
మోదుగు మాడల చూర్ణాన్ని తేనెతో కలిపి, ప్రతిరోజూ ఉదయం వేళ, మూడు రోజుల పాటు తీసుకుంటే చాలా కాలంగా ఉన్న పురుగులన్నీ అంతరించిపోతాయి.
వేపపువ్వును నూరి బొడ్డుకు దిగువ భాగాన పట్టువేస్తే, కడుపులోని నులిపురుగులు, ఎలికపాములు హరిస్తాయి.
రేల చిగుళ్లు, చింతపండు సమంగా తీసుకుని నూరి రోజూ తీసకుంటే కడుపులోని ఎలికపాములన్నీ నశిస్తాయి.
వర్షాల వేళ టూర్‌కు వెళుతుంటే..!
తొలకరి జల్లులు కురుస్తున్నాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఈ సమయంలో టూర్‌ వెళితే చాలా ఎంజాయ్‌ చేయవచ్చు. మీరూ టూర్‌ ప్లాన్‌ చేసుకుంటున్నట్లయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి.
వర్షాకాలంలో దుస్తులు తొందరగా ఆరవు. పూర్తిగా ఆరకపోతే బట్టలు వాసన వస్తుంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ సీజన్‌లో సింథటిక్‌ క్లాత్స్‌ ఎక్కువ తీసుకెళ్లడానికి ప్రయత్నించండి.
దోమలు కుట్టకుండా రీపెల్లెంట్స్‌ను పట్టుకెళ్లండి. ఈ సీజన్‌లో సులభంగా జబ్బులు వ్యాపిస్తుంటాయి. కాబట్టి అవసరమైన మందులను వెంట తీసుకెళ్లడం మరువద్దు.
వీలైనంత వరకు బయట నీరు తాగకుండా ఉండటం మేలు. వెంట ఎప్పుడూ ఒక బాటిల్‌లో తాగే నీరు వెంట ఉంచుకోవాలి. వీలైతే కాచి చల్లార్చిన నీటిని తాగితే ఉత్తమం.
బయట ఆహారపదార్థాలు ఆకర్షిస్తాయి. కానీ ఈ వానల సీజన్‌లో స్ట్రీట్‌ ఫుడ్‌కు దూరంగా ఉండటం చాలా అవసరం.
మీరు వెళుతున్న టూర్‌ హిల్‌ స్టేషన్‌ అయితే వాతావరణ సూచనలను తరచుగా చెక్‌ చేసుకోండి. వార్తలు వింటూ ఉండండి. భారీ వర్షాలు కురిసినపుడు కొండచరియలు విరిగిపడే, రోడ్డు మార్గం దెబ్బతినే అవకాశాలుంటాయి.
వెంట ఒక హెయిర్‌ డైయర్‌ను తీసుకెళ్లండి. తల తడిసినపుడు ఆరబెట్టుకోవడానికి ఇది మంచి మార్గం. జలుబు, జ్వరం బారినపడకుండా ఉండటానికి ఇది అవసరం.
రెయిన్‌కోట్‌, గొడుగును మరువద్దు. వర్షాకాలంలో వీటి అవసరం ఎప్పుడైనా ఉంటుంది.
ఎప్పుడూ వెంట ఒక వాటర్‌ప్రూఫ్‌ బ్యాగ్‌ను ఉంచుకోండి. స్మార్ట్‌ఫోన్‌, గ్యాడ్జెట్స్‌ తడవకుండా ఉండాలి. జిప్‌లాక్‌ బ్యాగ్స్‌ను ఎంచుకోండి.
భారీవర్షాల వల్ల హోటల్‌ గదికే పరిమితం కావాల్సి రావచ్చు. అలాంటి సమయంలో బోర్‌ కొట్టకుండా ఉండటానికి బుక్స్‌ తీసుకెళ్లండి. మీకిష్టమైన బుక్స్‌ చదవడం ద్వారా సమయం ఇట్టే గడిచిపోతుంది.
వర్షాకాలంలో రోడ్లన్నీ బురదమయం అవుతాయి. జారే అవకాశం ఉంటుంది. కాబట్టి షూస్‌, స్లిప్పర్స్‌ను తీసుకెళ్లండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో టూర్‌లో ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు.
వాహ్‌.. నయా సమురాయ్స్‌!
జపాన్‌లో విచిత్రంగా శునకాలు, పిల్లులు సరికొత్తగా కనిపిస్తున్నాయి. ఒంటిమీద యోధుడి కవచాలతో జపాన్‌ ‘సమురాయ్‌’ లా కనిపిస్తున్నాయి. విషయమేంటంటే.. జపాన్‌లోని పెంపుడు పిల్లులు, శునకాలను ‘సమురాయ్‌ ఏజ్‌’ అనే ఓ కంపెనీ యోధుల దుస్తుల్ని తయారు చేస్తోంది. బాణాలు, కత్తులు మాత్రం లేవు కానీ యుద్ధంలోని యోధుల్లా శునకాలు, పిల్లులు ఫోజులు కొడుతున్నాయి. లెదర్‌తో పర్ఫెక్ట్‌ క్వాలిటీతో తయారు చేసిన ఈ సమురాయ్‌ దుస్తులు ఎరుపు, బంగారం, నలుపు రంగుల్లో లభిస్తున్నాయి. వీటి ధర 129 డాలర్ల నుంచి 150 డాలర్ల లోపు ఉన్నాయి. జపనీస్‌ కంపెనీ సమురాయ్‌ మాత్రం పెంపుడు జంతువులకూ రాజసం లుక్‌ ఇస్తూ సరికొత్తగా జనాలను ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెంపుడు జంతువుల సమురాయ్‌ దుస్తులను ఆ సంస్థ షేర్‌ చేస్తోంది. తమ పెంపుడు జంతువులకు సమురాయ్‌ దుస్తులు వేసిన యజమానులూ ఆ ఫొటోలను సోషల్‌ వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list