MohanPublications Print Books Online store clik Here Devullu.com

సంగమేశ్వరుడి ఆలయం, తంగిడి_Sangameshvara Temple Tangidi,



సకల పాపాలనూ నివృత్తి చేసే... తంగిడి సంగమం
పుణ్య తీర్థం

ఇటు మహబూబ్‌నగర్‌ జిల్లా.. అటు కర్ణాటక సరిహద్దు.. మధ్యలో కృష్ణానది. మరోవైపు భీమానది పరవళ్లు... సాక్షాత్‌ జగద్గురు శ్రీదత్తాత్రేయ స్వామి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు స్నానమాచరించిన కృష్ణ, భీమ నదుల సంగమక్షేత్రమిది. అతి పురాతనమైన సంగమేశ్వరుడి ఆలయం ఈ క్షేత్రంలోనే ఉంది. కర్ణాటక బ్రహ్మంగారిగా పేరు పొందిన కొడెకల్‌ స్వామి మాటల్లో చెప్పాలంటే... ఈ నది నీటి ద్వారానే ఓ శక్తి పుడుతుంది. ఆ తరువాత సంగమంలోని రాతి కోడి కూస్తుంది. ఆ కోడి కూసిన రోజు ఈ ప్రపంచమంతా జలసమాధి అయిపోతుంది’’ ఇది ఓ శిలాశాసనంలో ఉంది. ఆ శాసనంలో చెప్పినట్లే ఇక్కడున్న బురుజుపై రాతికోడి ఉండేది. అది ప్రస్తుతం శిథిలమైంది. అదే విధంగా ఆ శాసనమూ ప్రస్తుతం శిథిలమైపోయింది. కానీ ఈ ప్రాంత ప్రజలు మాత్రం ఈ మాటలను ఎప్పుడూ తలచుకుంటూనే ఉంటారు.
ప్రత్యేకతలకు సంగమం
మహబూబ్‌నగర్‌ జిల్లా కృష్ణా మండల పరిధిలోని తంగిడి గ్రామం వద్ద కృష్ణ, భీమనదులు కలిసే చోటును సంగమ క్షేత్రంగా అభివర్ణిస్తారు. ఈ క్షేత్రానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడ దేవతలు, రుషులు, మునులు తపస్సు ఆచరించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణమ్మ అడుగిడుతున్న ప్రాంతమిది. ఒకప్పుడు ఇది దివ్యక్షేత్రంగా వెలుగొందిందని ప్రసిద్ధి. దత్తాత్రేయ స్వామి మొదటి అంశావతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించాడు. ఇప్పటికీ ఆయన జన్మించిన ఇల్లు అక్కడ ఉండడం విశేషం. అక్కడ 16 సంవత్సరాల వరకు ఉండి దేశసంచారం నిమిత్తం వెళ్లిపోయాడు. ఆలా వెళ్లిన వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు ఎవరికీ కన్పించకుండా మాయమయ్యాడు. ఆ తరువాత కార్తీక పౌర్ణమి నాడు తంగిడిలోని నివృత్తి సంగమంలో ప్రత్యక్షమయ్యాడు.
ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు తపస్సు ఆచరించి ఇక్కడినుంచి కర్ణాటకలోని కుర్మగడ్డకు వెళ్లాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఈ సంగమంలో శ్రీపాద శ్రీవల్లభుడు పూజించిన వినాయక విగ్రహం, ఆయన పాదుకలు, శివలింగం ఉన్నాయి. ఆయన ఇక్కడినుంచి కుర్మగడ్డకు కాలినడకన వెళ్లిన మార్గంలో నదిలోని రాళ్లు నల్లరాయితో రోడ్డు వేసినట్లు ఇప్పటికీ ఇక్కడా ప్రత్యక్షంగా కన్పిస్తాయి. ఇంతటి విశేషమైన ఈ స్థానాన్ని తెలుసుకున్న విఠల్‌బాబా ఇక్కడా ఓ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. అందులో భాగంగానే ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ దత్తభీమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ నివృత్తి సంగమంలో స్నానం ఆచరించిన వ్యక్తులకు పాపాలు నివృత్తి అవుతాయని ప్రసిద్ధి. అందుకే ఈ క్షేత్రానికి తంగిడి సంగమమని, నివృత్తి సంగమమనీ పేరొచ్చింది.
సంగమ క్షేత్రానికి వెళ్లే మార్గం
నివృత్తి సంగమ క్షేత్రానికి వచ్చే భక్తులు హైదరాబాద్‌ నుంచి లేదా మహబుబ్‌నగర్‌ నుండి నేరుగా రాయచూర్‌ వెళ్లే బస్సులో రాష్ట్ర సరిహద్దులోని టైరోడ్డులో దిగి, అక్కడి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణాగ్రామం వరకూ ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాలి. అక్కడి నుండి 5 కి లోమీటర్లు వెళితే ఈ తంగిడి సంగమ క్షేత్రానికి చేరుకోవచ్చు. కృష్ణా నుండి ఇక్కడికి ప్రైవేటు ఆటోలు ఉంటాయి. ఇక వ్యక్తిగత వాహనాల్లో వచ్చే భక్తులు మహబుబ్‌నగర్‌ నుండి నేరుగా రాయచూర్‌ మార్గంలో 74 కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే నల్లగట్టు మారెమ్మ ఆలయం ఉంటుంది. అక్కడి నుండి 9 కిలోమీటర్లు ప్రయాణిస్తే కృష్ణాగ్రామం. కృష్ణా నుండి 5 కిలోమీటర్లు వెళితే ఈ తంగిడి నివృత్తి సంగమ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి వచ్చేవారు బెంగుళూర్‌కు వెళ్లే ట్రెయిన్‌లో వచ్చినట్లయితే నేరుగా కృష్ణా రైల్వేస్టేషన్‌లో దిగితే అక్కడి నుండి ఆటోల ద్వారా సంగమ క్షేత్రానికి చేరుకోవచ్చు.
– జంగం గురుప్రసాద్, సాక్షి, మాగునూరు

సంగమేశ్వరుడి ఆలయంతంగిడి
Sangameshvara Temple Tangidi,

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list