సంజయుడు
విశ్వసనీయ మేధాశక్తి కలిగిన వ్యక్తిత్వం వికసించీ, వికసించనట్టుగా ఉంటుంది. కానీ ఆ ఉన్నత వ్యక్తిత్వమే మహోత్కృష్ట జీవితానికి నాంది పలుకుతుంది. ఉన్నత వ్యక్తిత్వాలూ, గొప్పవైన జీవితాలూ అభివ్యక్తమై వాటికవే ప్రకటించుకోవడం కద్దు. వాటిలోకి చొచ్చుకొని పోయి పరిశీలించడం అవివేకం. కానీ వాటిని అర్థం చేసుకోవడం ఒక ప్రక్రియలో సాగితే అంతులేని అద్భుతభావాలు అనంతమై పలుకరిస్తాయి. ఆ ప్రక్రియ ఎటువంటిదంటే ఒక సరుస్సు అడుగు నుంచి నీటి బుడగ బయలుదేరి, పైకి వచ్చినప్పుడు మాత్రమే మనకు కనిపిస్తుంది. దాని నిర్మాణం, సమయం అంచనా వేయడం అసంభవం. ఈ ప్రక్రియ నిలువెత్తు నిజరూపంగా మారితే సార్వత్రిక, సార్వజనీన, స్వాతంత్య్ర సంస్కార భావాలకు ప్రతిరూపంగా నిలిచిన సూతపుత్రుడు సంజయుడు కనిపిస్తాడు. ధృతరాష్ర్టుని ఆప్తమంత్రిగా మహాభారత గాథ సంజయున్ని ప్రపంచానికి పరిచయం చేసినా దైవత్వం ఉట్టిపడే మానవత్వంగా తనను తాను ప్రకటించుకునేంత స్థాయికి మౌనంగా ఎదిగిన అసామాన్యుడు సంజయుడు.
సంజయుడు ధృతరాష్ర్టునికి గౌరవప్రదమైన మంత్రి. సూత కులంలో పుట్టిన ఉత్తముడు. కులం కన్నా గుణం గొప్పదని నిరూపించిన సంజయుడు ధర్మ విచక్షణ, నైతికత ఎదిగిన వాడై మంచికి అండగా నిలబడ్డాడు. భయమెరుగని సత్యవాదిగా వాసికెక్కాడు. అపారమైన నమ్మకాలను కాపాడటానికి జీవితమంతా కష్టపడ్డాడు. ప్రశాంతతకు నిజభక్తుడై దానిని ప్రతీ ఒక్కరూ కోరుకోవాలని తపించాడు. శాంతమైన మనసుతో ప్రపంచమే జయించవచ్చని విశ్వసించే మానవతావాది సంజయుడు.
ధృతరాష్ర్టునికి సదా ధర్మవిశేషాలను తెలియజెపుతూ దుర్యోధనుని ప్రవర్తనకు తాను విరోధినని చెబుతుండేవాడు. అయినా మంచి ఎప్పుడూ చేదుగానే అది ఎవ్వరికీ రుచించదనీ, అయినా మంచిని ప్రోత్సహించడమే మానవత్వమని చెప్పేవాడు సంజయుడు. వేదవ్యాసుడు అమితంగా ఇష్టపడే సంజయుడు కృష్ణార్జునులను భక్తితో, ప్రేమతో గౌరవించేవాడు.
పాండవులను పదేపదే మోసగిస్తూ వస్తున్న దుర్యోధనుని దుశ్చర్యలను తాళలేక సంజయుడు ధృతరాష్ర్టునితో నీ కుటుంబమంతా నీ కొడుకు చేసే పనుల వల్ల నాశనం అవ్వడం ఎవ్వరూ ఆపలేరనీ, భీష్మద్రోణ విదురులు ద్రౌపదిని సభలో అవమానపరచడాన్ని అన్యాయమని గొంతు చించుకొని చెబుతున్న దుర్యోధనుని మీరు అడ్డుకోకపోవడం మీరు చేసిన అన్యాయమని నిక్కచ్ఛిగా చెబుతాడు. ధుర్యోధనునిపై మీరు పెంచుకున్న ప్రేమ అతడు దుర్వినియోగ పరుచుకుంటున్నాడనే విషయం మీరు గ్రహించినా ఎటువంటి ధర్మ నిర్ణయాన్ని తీసుకోలేకపోవడం అత్యంత బాధాకరమని అంటాడు.
ధృతరాష్ర్టునికి అత్యంత సన్నిహితుడు, తనను బాగా ఎరిగిన వాడైన సంజయున్నే కౌరవులకూ పాండవులకూ మధ్య సంధి కుదర్చమని రాయభారంగా పంపుతాడు ధృతరాష్ర్టుడు. యుద్ధానికి విరోధియైన సంజయుడు తన ప్రమేయంతో శాంతి నెలకొంటుందనీ, పాండవులకు జరిగిన అన్యాయాన్ని కొంతైనా నిరోధించవచ్చనీ భావించి సంతోషంతో పాండవులకు విషయం వివరిస్తాడు. ప్రసన్న చిత్తంతో, ప్రశాంత మనసుతో పాండవులతో చర్చిస్తూ సంజయుడు ధర్మాన్నీ, బాధ్యతలనూ, రాజ్యాన్నీ యుద్ధంతో గెలవలేమనీ ఒకవేళ గెలిచినా అవి తృప్తినివ్వక పోగా భారమై బాధిస్తాయనీ అంటాడు. తాను శాంతిని కాంక్షించి మీ దగ్గరకు వచ్చాననీ నన్ను నిరుత్సాహపరచరనే నమ్మకం నాకుందనీ కృష్ణార్జునులను ఉద్దేశించి చెబుతాడు. అంతా విన్న ధర్మరాజు ఇంద్రపస్థాన్ని మాత్రం తనకు అప్పజెప్పాలనే షరతును పెట్టగా, కృష్ణుడూ దానినే సమ్మతిస్తాడు. అదంతా నాకు వదిలేయండని చెప్పి ధర్మరాజు సమాచారాన్ని ధృతరాష్ర్టునికి చేరవేస్తాడు. అటునుంచి అటే కౌరవులనూ సంధికై ప్రోత్సహించగా సంజయుడూహించినట్టుగానే తిరస్కారం వస్తుంది. సంజయుడూ భీష్మ ద్రోణ విదురులు నలుగురూ ధర్మం పక్షంలో పాండవులను గౌరవిస్తూ నిలబడ్డవారే.
సంజయుడు ఎన్నో సందర్భాల్లో కౌరవ విరోధాన్ని వ్యక్తపరిచినా ధృతరాష్ర్టుడు సంజయుని ధర్మనిరతిని మనసులోనే ప్రస్తుతిస్తూ వచ్చాడే గానీ, సంజయుని పట్ల ఏనాడూ అపనమ్మకాన్ని చూపెట్టలేదు. అది సంజయుని వ్యక్తిత్వ ధర్మానికి పరాకాష్ఠ.
వేదవ్యాసుని ద్వారా పొందిన దివ్యశక్తితో సంజయుడు హస్తినలోనే ఉండి ధృతరాష్ర్టునికి భారత కురుక్షేత్ర యుద్ధంలోని విశేషాలన్నీ వివరంగా తెలియపరుస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన భగవద్గీతనూ విని తరించిన వాడు సంజయుడు. దాని వైశిష్ట్యాన్నీ, కృష్ణుని దైవత్వాన్నీ, అర్జునుని బలాన్నీ తాదాత్మ్యంతో వివరించగల సంజయుడు కృష్ణార్జునుల చెంతకు ఏ సమయంలోనైనా వెళ్ళగల చనువున్న వాడు. అర్జునుడు మాత్రమే చూడగల్గిన శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం తన దివ్యశక్తితో చూసిన అదృష్టఘనుడు సంజయుడు. కృష్ణుడున్న చోట ధర్మం, అర్జునుడు ఉన్నచోట విజయం తప్పక ఉండగలవనే నమ్మకాన్ని ప్రశస్తించిన సంజయుడు చివరివరకూ ధర్మం కోసం, శాంతికోసం నిరాటంకంగా పోరాడాడు. తన మాటలతో మానవత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సంజయుని వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం.
ధృతరాష్ర్టునితో పాటు గాంధారి, కుంతి అడవులకు పయనమవగా సంజయుడు వారితోనే పయనమయ్యాడు. అడవిలో దావానలం వ్యాపించగా సంజయున్ని దాన్నుండి బయటపడేసి అందరూ అందులోనే ఆహుతి అవుతారు. సంజయుడు అట్నుంచటే హిమాలయాలకు వెళ్ళిపోతాడు. సామాన్యమైన జీవితంలా కనిపించే సంజయుని జీవన చిత్రాన్ని దైవత్వదృష్టితో వర్ణించగలిగితే విలువల రంగులు మానవతా దృక్పథానికే కొత్త రూపునిస్తాయని అర్థమవుతుంది
.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565