ఆ ఇబ్బందులకి ఇవే కారణం!
శరీరంలో ఏదో ఇబ్బంది, కొంత అసౌకర్యం, కొన్ని రకాల వ్యాధి లక్షణాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కాకపోతే అలా కనిపించేవాటిల్లో కొన్ని వ్యాధిమూలంగా కాకుండా, విటమిన్ లోపాల కారణంగా తెలుస్తుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని....
మెగ్నీషియం లోపం ఉంటే... కండరాలు పట్టేయడం, గుండె అపసవ్యంగా కొట్టుకోవడం, మనసు అల్లకల్లోలంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పొటాషియం లోపం ఉంటే.... కండరాల బలహీనత, గుండె
కొట్టుకోవడంలో తేడాలు, అలసట, తీవ్రమైన మలబద్దకం ఉంటాయి.
విటమిన్- బి6 లోపం ఉంటే, అశక్తత, శరీరమంతా మొద్దు
బారినట్లు అనిపించడం, కాళ్లూ, చేతుల్లో పొడిచినట్లు ఉండడం వంటివి వేధిస్తాయి.
విటమిన్- బి12 లోపం ఉంటే, ఒళ్లంతా పొడిచిన ట్లు ఉండడంతో పాటు, బలహీనత, అవయవాలు మొద్దుబారడం, అయోమయం ఉంటాయి. వీటితో పాటు పరీక్షలు చేయిస్తే, ఎర్ర రక్తకణాలు తగ్గినట్లు తెలుస్తుంది
విటమిన్-బి9 (ఫోలిక్ యాసిడ్) లోపం ఉంటే, ఎర్రరక్త
కణాలు తగ్గడం, నీరసం, చర్మం పాలిపోవడం, మాట తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
విటమిన్- డి, క్యాల్షియం లోపాలుంటే ఎముకలు బలహీనం పడటం, ఎముకలు పెళుసుబారిపోవడం వంటివి జరుగుతాయి.
జింక్ లోపాలుంటే, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, రుచి, వాసన తెలియకపోవడం, జుత్తు రాలిపోవడం, తరుచూ విరేచనాలు కావడం వంటివి లక్షణాలు కనిపిస్తాయి.
మధుమేహం అదుపులో ఉండాలంటే...
ప్రతిదానికీ మందు షాపుల చుట్టూ తిరుగుతాం. కానీ, ప్రకృతి సిద్ధంగా లభించే కొన్ని ఆ మందులకంటే గొప్పగా పనిచేస్తాయి. కాకపోతే ఏదో కొద్ది రోజులు కాకుండా, క్రమం తప్పకుండా రోజూ తీసుకోవాలి. ఈ విషయంలో మందు మాత్రల విషయంలో ఉన్నంత శ్రద్ద ఎందుకో చాలా మందికి ఇలాంటి సులభ విధానాల మీద ఉండదు. ప్రకృతి సహజమైన వాటితో కలిగే మరో అద్భుత ప్రయోజనం ఏమిటంటే, మాత్రల వల్ల కలిగే దుష్ప్రభావాలేవీ వీటితో ఉండవు. మధుమేహం విషయానికి వస్తే ఇవి వ్యాధి నియంత్రణకే కాకుండా షుగర్ జీవక్రియలన్నీ తిరిగి చక్కబడేలా చేస్తాయి. ఈ కింది గృహ వైద్యం ఆ క్రమంలో పనిచేస్తాయి.
రెండు తులాల పసుపు దుంప రసాన్ని, కొంచెం తేనెతో కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే షుగర్ తీవ్రత బాగా తగ్గుతుంది.
నేరేడు విత్తనాలనుగానీ, గింజలనుగానీ, దోరగా వేయించి, పొడిచేసి ఆ తర్వాత కషాయం సిద్ధం చేసుకోవాలి. ఈ కషాయాన్ని అరగ్లాసు పాలల్లో రెండు స్పూన్లు కలిపి రోజూ ఉదయం పూట సేవిస్తే, మధుమేహం నియంత్రణలో ఉండడంతో పాటు వ్యాధి దుష్ప్రభావాలకు తావు లేకుండా పోతుంది.
దొండ ఆకు రసం గానీ, దొండ తీగ రసం గానీ, ప్రతి రోజూ ఉదయం పూట 3 ఔన్సులు తాగుతుంటే షుగర్ నిల్వలు చాలా త్వరితంగా అదుపులోకి వస్తాయి.
పత్తిగింజల్ని మెత్తగా దంచి, ఒక లీటర్ నీళ్లల్లో వేసి అవి పావు లీటర్ మిగిలేంతగా మంట మీద కాయాలి. ఆ కషాయాన్ని రోజూ తాగితే షుగర్ నిల్వలు ఎంత ఎక్కువగా ఉన్నా, 40 రోజుల్లో నార్మల్ స్థాయికి వచ్చేస్తాయి.
మారేడు ఆకుల రసాన్ని రోజూ 6 చెంచాల చొప్పున ప్రతి రోజూ ఉదయం వేళ తీసుకుంటే షుగర్ పూర్తి అదుపులోకి వస్తుంది మధు మేహుల షుగర్ నియంత్రణకూ, ఆరోగ్యానికి దొండకాయ, కాకరకాయ, మునక్కాయ, దోసకాయలు, ఆకుకూరలు, మెంతులు నేరేడు కాయలు ఎంతో శ్రేష్టమైనవి.
మానవులు పుట్టింది ఎక్కడ?
మానవుడు మొదట పుట్టింది ఎక్కడ? ఆఫ్రికాలో అంటారా... మీ సమాధానం తప్పని అంటున్నారు పరిశోధకులు. మానవ మానవ ఆవిర్భావం యూర్‌పలో జరిగిందని అంటున్నారు. జర్మనీలోని టుబిన్‌జెన్ విశ్వవిద్యాలయం, బల్గేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సె్‌సకి చెందిన పరిశోధకులు 72 లక్షల ఏళ్ల కిందటి.. అవశేషాలను పరిశీలించారు. ఈ అధ్యయనంలో వీరు చింపాంజీల నుంచి మానవులు విడిపోవడం అన్నది తూర్పు మధ్యధరా ప్రాంతంలో జరిగిందని గుర్తించారు. దీంతో ప్రస్తుతం అందరూ అనుకుంటున్నట్లు మానవ ఆవిర్భావం ఆఫ్రికాలో జరగలేదని.. యూర్‌పలో జరిగి ఉంటుందని వివరించారు. కానీ ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలన్నీ మనిషి పుట్టుక ఆఫ్రికా ఖండంలోనేనని వెల్లడించాయి.
ఆఫీసు పనిలో తలమునకలు అవుతున్నపుడు ఆన్‌లైన్‌లో ఎవరైనా అంతరాయం కలిగిస్తే ఏకాగ్రత దెబ్బ తింటుంది. పని మొత్తం పెండింగ్‌లో పడిపోతుంది. సమయం తక్కువగా ఉంటే చిర్రెత్తుకొస్తుంది. అయితే అలాంటి అంతరాయాలకు చెక్ పెట్టడానికి ఒక మార్గం ఉంది. ఇదిగో ఈ ‘ఫ్లో లైట్’ ఉంటే చాలు, మీ పనికి ఎలాంటి అంతరాయం కలగదు. ఆన్‌లైన్‌లో ఉన్నా సరే చాటింగ్‌కు రమ్మంటూ మిత్రుల నుంచి సందేశాలు రావు. మీరు పనిలో బిజీగా ఉన్నారంటూ ఈ బల్బ్ ఎరుపు రంగులోకి మారడం ద్వారా అవతలి వ్యక్తులకు చెబుతుంది. దీంతో చేసే పనిపైన ఏకాగ్రత కుదురుతుంది. పనిలో తప్పులు దొర్లడమూ తగ్గుతుంది. అంతేనా.. పనిని తొందరగా ముగించేందుకు తగిన ప్రేరణను ఇది అందిస్తుంది. కీ బోర్డు, మౌస్‌లపై మీ చేతుల కదలికలను పసిగట్టి తనకు తానుగా రంగులు మారడం దీని ప్రత్యేకత!
మా వాడు నోరు తెరిస్తే అబద్ధాలే!
మా అబ్బాయి వయసు ఏడేళ్లు. వాడు చీటికీమాటికీ అబద్ధాలు చెబుతుంటాడు. ఒక్కోసారి కోపం వస్తుంది. ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు. ఏం చేయాలో దిక్కు తోచదు. దండిస్తే.. ఏడుస్తాడు. కొడితే ఎదురు తిరుగుతాడు. సైకియాట్రిస్టుకు చూపించాలనుకుంటున్నాం. ఏం చేయాలి?
-సరిత, విడపనకల్లు
పిల్లలకు అబద్ధాలు ఆడటం తెలియదు. పెద్దలను చూసే నేర్చుకుంటారు. లేదంటే తోటి పిల్లలను చూసి అనుకరిస్తారు. అంతేతప్ప వాళ్లకు వాళ్లే అబద్ధాలు చెప్పరు. పెద్దలు గమనించరు కానీ.. ఇంట్లో ఉన్నప్పుడు భర్తకు ఫోన్ వచ్చిందనుకోండి. ఆయనకు మాట్లాడే మూడ్ లేక ‘ఇంట్లో లేడని చెప్పు’ అని చెబుతాడు. అవతలి వ్యక్తులతో అదే విషయం చెబుతుంది భార్య. ఆ సంఘటనను పిల్లలు గమనిస్తారు. ఇలాకూడా చెప్పొచ్చా అని వాళ్లకు అర్థమవుతుంది. ప్రతి చిన్న విషయానికి పిల్లలు ప్రభావితం అవుతుంటారు. కానీ, మనం అర్థం చేసుకోము. ఎప్పుడో కోపం వచ్చినప్పుడు ‘‘చెబుతావారా అబద్ధం.. చెబుతావా? ఇంకోసారి చెబితే చీరేస్తాను’’ అని గద్దిస్తాం. విసుగొచ్చినప్పుడు రెండు దెబ్బలు కూడా వేస్తాం. అయినా పిల్లల్లో మార్పు రాదు. అదీ నయానోభయానో చెబితే వచ్చే మార్పు కాదు. ముందుగా ఏ ఇంట్లో ఆ ఇంటి పెద్దలు అబద్ధం ఆడటం మానేయాలి. పిల్లల ఎదుట అసలే చెప్పకూడదు. అబద్దం ఆడటం ఎంత తప్పో పరోక్షంగా పిల్లలకు తెలియాలి. తోటి పిల్లలతో వాళ్లు అబద్ధం చెప్పినా.. అప్పటికప్పుడే మందలించాలి. ‘అబద్ధం చెబితే ఎదుటివాళ్లకు మన మీద విశ్వాసం పోతుంది. తద్వార మనలోను అపరాధభావం ఉండిపోతుంది’ అని విపులంగా చెప్పాలి. పెద్దలు నిజాయితీగా ఉంటే అదే మార్గాన్ని పిల్లలు అనుసరిస్తారు. పెద్దలు అసత్యపూరితంగా వ్యవహరిస్తూంటే.. వాళ్ల పిల్లలు కూడా చెడుమార్గంలోకి వెళ్లేందుకు ఆస్కారం ఉంది. ఇక, వీటన్నిటితో నిమిత్తం లేకుండా అబద్ధాలు చెప్పే పిల్లలూ ఉంటారు. అది వాళ్ల సైకలాజికల్ డిజార్డర్‌ను బట్టి ఉంటుంది. ఆ స్థితిలో ఉన్నవాళ్లకయితే సైకియాట్రిస్ట్ ట్రీట్‌మెంట్ అవసరం.
-డాక్టర్ శశాంక్, మానసికనిపుణులు
ఇయర్ బడ్స్‌తో ఇలాకూడా..!
చెవులను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే కాటన్ ఇయర్ బడ్స్‌ని మేకప్ వేసుకొనేప్పుడు కూడా వాడుకోవచ్చు. ఎలాగంటే....
పెదాలకు రంగు వేసుకునే ముందు లిప్ పెన్సిల్‌తో అవుటర్ లైనర్ వేసుకోవడం చాలామందికి అలవాటు. అయితే ఒక్కోసారి ఆ లైను వంకరగా రావచ్చు. అలాంటప్పుడు దాన్ని సరిచేయడానికి కన్సీలర్ లేదా కాంపాక్ట్ పౌడర్ రాసి.. దాన్ని ఇయర్ బడ్‌తో తుడిచేస్తే సరిపోతుంది.
* ఐలైనర్ సరిగా రాకపోయినా దీన్ని వాడుకోవచ్చు. ఇయర్‌బడ్‌ని మేకప్ రిమూవర్‌లో ముంచి.. తుడిస్తే సరిపోతుంది.
* మేకప్ బ్రష్ అందుబాటులో లేనప్పుడు లేదా ప్రయాణాల సమయంలో దానికి ప్రత్యామ్నాయంగా ఇయర్ బడ్స్‌ని వాడుకోవచ్చు. చెంపలపై బ్లష్ వేసుకోవడానికి ఇది చాలా అనువుగానూ ఉంటుంది.
* కొందరికి కనుబొమలు పలుచగా ఉంటాయి. అలాంటి వారు ఐబ్రో పెన్సిల్‌తో దిద్దుతుంటారు. బదులుగా ఐషాడోని ఇయర్ బడ్‌తో కనుబొమలకు అద్ది చూడండి. కనుబొమలు షేప్ చేసినట్లుగా కనిపిస్తాయి.
* గోళ్ల రంగును తొలగించడానికి దూది అందుబాటులో లేనప్పుడు ఇయర్‌బడ్స్‌ను రిమూవర్‌లో ముంచి తుడిచేస్తే చాలు. రంగు పూర్తిగా వదిలిపోతుంది. అలానే గోళ్లకి రంగు వేసుకునేటప్పుడు చర్మానికి అదనంగా ఆ రంగు అంటినా వీటితో తుడిచేసుకోవవచ్చు.
మందారం మెరిపిస్తుంది...
నిగనిగలాడే నల్లని జుట్టు కావాలని ఎవరికుండదు? దానికి ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉండే మందారం చాలు మెరిపించడానికి. అదెలాగో చూడండి..
* మందారం పూలని ఎండబెట్టి పొడిగా చేయండి. మూడు టేబుల్ స్పూన్ల మందార పొడికి అరకప్పు పెరుగు కలిపి తలకు పూతలా వేయండి. ఓ అరగంటాగి గాఢతలేని షాంపూతో తలస్నానం చేస్తే సరి. జుట్టు పట్టుకుచ్చులా మెత్తగా తయారవుతుంది.
* మందారం పూలని పాలతో కలిపి మెత్తగా చేసి జుట్టు ఎక్కువగా రాలుతున్న ప్రదేశంలో రాసుకుంటే.. సమస్య తగ్గుతుంది. కొత్త జుట్టుకూడా వస్తుంది.
* ఎక్కువగా ఎండలో తిరిగే వారి జుట్టు బాగా పొడిబారి కాంతి విహీనంగా కనిపిస్తుంది. మందార ఆకులనీ, గుంటగలగరాకుని సమానంగా తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమానికి కాస్త నిమ్మరసం జతచేసి తలకు పూతగా వేయాలి. ఇలా కనీసం పదిహేను రోజులకోసారి చేస్తే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.
తింటున్నా.. ఉండొచ్చు నాజూగ్గా!
ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్కిన్నీ జీన్స్ రెండు నెలలకే బిగుతైపోతున్నాయి... ఎందుకు? ముచ్చటపడి కొనుక్కున్న టాప్ అసలు పట్టడమే లేదు... కారణం? అన్నం తగ్గించి ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నామని అనుకుంటున్నా ఇదే సమస్య.. బరువు పెరుగుతూనే ఉంటాం! దీనికి కారణమేంటీ? ఆహారపరంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఏం చేయాలి?
బరువు ఎందుకు పెరుగుతున్నామో కనిపెట్టగలిగితే బరువు తగ్గడం తేలిక అవుతుంది. ఎందుకంటే అందరూ ఆహారం కారణంగానే బరువు పెరగరు. దానికీ ఇతర కారణాలూ ఉంటాయి. ముందుగా అవేంటో తెలుసుకుందాం.
థైరాయిడ్: అకారణంగా బరువు పెరుగుతుంటే థైరాయిడ్ ఉందేమో పరీక్షించుకోవాలి. మన శరీరంలో వివిధ భాగాల పనితీరుతో పాటూ జీవక్రియల నియంత్రణ మొత్తం థైరాయిడ్ హార్మోన్ విడుదలపై ఆధారపడి ఉంటుంది. హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారు బరువు వేగంగా పెరుగుతారు.
మందుల వాడకం: మానసిక ఒత్తిడి ఎక్కువై దానిని తగ్గించుకునేందుకు యాంటీ డిప్రసెంట్ మాత్రలు వాడే వారిలో కూడా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలా ముందులు వాడే వారిలో దాదాపు ఇరవై ఐదుశాతం మంది వూబకాయం సమస్యతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం చెబుతోంది. అలాగే బీపీ వంటి సమస్యతో బాధపడుతూ దాదాపుగా పాతికేళ్లపాటూ ముందులు వాడిన వారిలో కూడా కొన్ని కారణాల వల్ల బరువు అధికమవుతుంది. అలాగే హార్మోన్లని ప్రేరేపించే గర్భనిరోధక మాత్రలు వాడకం వల్ల కూడా బరువు పెరుగుతారు.
పనివేళల్లో మార్పులు: పనివేళల్లో మార్పుల వల్ల కార్యాలయంలో ఎక్కువ సమయం ఉండిపోవడం, రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోవడం వంటివీ బరువు పెరగడానికి కారణాలే. నిజానికి నిద్రలేమి సమస్య వల్ల ఆకలిని నియంత్రించే గ్రెలిన్ హార్మోను ఎక్కువగా విడుదల అవుతుంది. తినే తిండిపై నియంత్రణ లేకపోవడం వల్ల బీఎంఐ పెరిగిపోతుంది. అలాగే ఆహారం తిన్న తరవాత సంతృప్తినిచ్చే లెప్టిన్ అనే హార్మోను స్థాయి కూడా తగ్గిపోతుంది. దాంతో ఎక్కువగా తిని బరువు పెరిగిపోతారు.
ఒత్తిడి... ఒత్తిడిలో ఉన్నప్పుడు విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ ట్రైగ్లిజరాయిడ్లని విడుదల చేస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర నిల్వలు పెరుగుతాయి. దానివల్ల ఆకలివేయకపోవడం లేదా అతిగా తినేయడం చేస్తారు.
ఉప్పు వాడకం: రుచికరమైన ఆహారం తినడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో! దానికి కరిగించుకోవడానికి వ్యాయామానికీ అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ మనలో చాలామంది ఆ పని చేయడం లేదు. అలాగే రెస్టరెంట్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఉపయోగించే ఆహారంలో ఉప్పు వాడకం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని నీటి నిల్వల్ని తగ్గించి అధికబరువుకి కారణమవుతుంది.
వాటితోనూ అందుతాయి...
బరువు తగ్గాలనుకున్న చాలామంది అన్నం తినడం మానేస్తారు. నిజానికి దానికన్నా నూనెలూ, చక్కెర్లు మానేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. వీటివల్ల మన శరీరానికి అవసరమైన కొవ్వులు అందుతాయనే మాట నిజమే కానీ.. వాటి వల్ల మాత్రమే అవి అందుతాయని కాదు! కొన్నిరకాల ఇన్‌విజబుల్ ఫ్యాట్లు మనం గింజల నుంచీ, మాంసాహారం నుంచి పొందొచ్చు. మనం ఆహారం తగ్గించాలని అనుకున్నప్పుడు ఒక్క కార్బోహైడ్రేట్లనే మానేసి వూరుకుంటే సరిపోదు. ప్రొటీన్ల నుంచీ కొంతా, కొవ్వుల నుంచి కొంతా ఇలా అన్నింటినీ నుంచి కొంత కొంత తగ్గించుకోవాలి. అంటే.. ఆహారం తగ్గించుకోవడం కూడా సమతులంగానే ఉండాలన్నమాట!
నిజం తెలియాలి...
అపోహ: బరువు తగ్గాలంటే కార్బొహైడ్రేట్‌ని పూర్తిగా దూరం పెట్టాలి.
నిజం: ఇది పొరబాటు. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన పిండి పదార్థాలు అందక ఇతర సమస్యలొస్తాయి. కార్బొహైడ్రైట్ అధికంగా ఉండే కాయగూరలూ, పండ్లూ, ధాన్యాలూ కూడా పోషకాహారంలో భాగమేనని గుర్తుంచుకోవాలి. పీచు కూడా కార్బోహైడ్రైటేనండోయ్!
అపోహ: తినడం మానేస్తే సన్న బడతాం...
నిజం: బరువు తగ్గాలన్న తాపత్రయంలో అల్పాహారం, భోజనం మానేయడం వల్ల రోజంతా ఆకలితో ఉంటారు. ఫలితంగా ఒక్కసారిగా అధికంగా తినేస్తారు. లేదంటే చిరాకు, అసహనం వంటివీ ఎదురవుతాయి. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. క్రమంగా మీ జీవక్రియ రేటు పడిపోతుంది. అందుకే వీలైతే ఒక భోజనాన్ని ఒకేసారి తినడం కంటే మూడు సార్లు తినండి. వీటిల్లో అన్ని పోషకాలూ ఉండేట్టు చూసుకోండి.
ఇలా తినొచ్చు..
నేటి యువతరం పోషకాహారం పేరుతో అవకాడో, ఓట్‌మీల్, క్వినోవా, డార్క్ చాక్లొట్, నట్స్ వంటి వాటిని అతిగా తినేస్తోంది. కానీ అవన్నీ అధికబరువుని పెంచేవే. పండ్లూ, పచ్చి కూరగాయలు తిన్నప్పుడు మాత్రమే తక్కువ కెలొరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్నామని అర్థం చేసుకోండి!
* పీనట్ బటర్, చీజ్ తురుములను రోజుకి చిన్న బంతి (పింగ్‌పాంగ్ బంతి) అంటే టీస్పూన్ పరిమాణంలో తీసుకోవాలి.
* వయసూ, బరువుని బట్టే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆరోగ్యవంతమైన మహిళ సగటున రోజుకి 60 గ్రా పప్పూ, 50 గ్రాముల వరకూ మాంసం తీసుకోవచ్చు.
* అన్నం, రాగులూ, జొన్నలూ, పాస్తా ఏవి తిన్నా సరే రోజుకి 270గ్రా నుంచి మూడొందల గ్రాములు మించకుండా తీసుకోవాలి. 100గ్రా పండ్లూ, 200గ్రా కాయగూరలు తీసుకోవచ్చు.
* చక్కెర రోజుకి 20 గ్రాములు మించకూడదు. అంటే నాలుగు చెంచాలు మించకూడదు. అలాగే నూనె ఒక రోజులో 30 ఎమ్‌ఎల్ మించకూడదు.
ఉద్యోగినులకు వ్యాయామ మంత్రం!
వ్యాయామం వల్ల వచ్చే లాభాలపై ఇవాళ మనందరికీ అవగాహన ఉంది! లేనిదంతా సమయం మాత్రమే. ముఖ్యంగా ఉద్యోగినులు అటు ఇల్లూ, ఇటు పనీ రెండూ చూసుకోవడంలోపడి ఆరోగ్యం గురించి పట్టించుకోరు! మీరూ అలాకాకూడదంటే..
ఒక్క ప్రశ్న : ‘వ్యాయామానికి ప్రతిరోజూ సమయం కేటాయిస్తే బావుణ్ణు!’ ఇలా ప్రతి ఒక్కరం అనుకుంటాం కానీ.. ముందుకు అడుగేయం. ‘చేయాలి’ అనుకునే బదులు ‘చేసి తీరాలి!’ అని నిశ్చయించుకోండి. ఆహారం, నిద్రతోపాటూ దాన్ని తప్పనిసరి చేసుకోండి. అప్పుడు మీరే వ్యాయామానికి సమయం వెతుక్కోగలుగుతారు. ఓ అర్ధగంటతో మొదలుపెట్టండి చాలు.
పిల్లలతోపాటూ.. : పిల్లలతో కలిసి నడక వంటి వ్యాయామాలు చక్కగా చేయొచ్చు. ఇందుకని పిల్లల కోసమంటూ ఓ ‘స్ట్రాలర్’ తీసుకోండి. దాన్ని తోస్తూనే మీ నడక కొనసాగించండి. విదేశీ మహిళల్లో ఈ ‘స్రాలర్ ఎక్సర్‌సైజ్‌లు’ పెరుగుతున్నాయిప్పుడు.
స్నేహాలు : మీరు ప్రతిరోజూ వాకింగ్, జాగింగ్ వెళ్లేచోటో, జిమ్‌లోనో పరిచయాల్ని పెంచుకోండి. ఆ ఇద్దరో, ముగ్గురో రోజూ ఒకేసమయానికి వ్యాయామానికి వచ్చేలా చూడండి. ఈ స్నేహితులు వ్యాయామానికని తటపటాయిస్తున్న రోజుల్లో మనకు ప్రేరణగా నిలుస్తారూ.. ప్రోత్సహిస్తారు.
సాంగత్య బలం
ఆత్మీయం
జనన మరణ చక్రంనుండి విడుదల పొందడం అనేది వాసనాబలం ఉన్న మనుష్యజన్మలో మాత్రమే సాధ్యం. వాసనలలో అన్నివేళలా మంచివే ఉండవు. ఎన్ని మంచి గుణాలు ఉన్నా, ఒక్కొక్క దాంట్లో చెడు వాసన కూడా ఉంటుంది. ఇక్కడ వాసన అంటే ముక్కుతో పీల్చేదికాదు, గత జన్మలనుంచి లేదా గత అనుభవాలనుంచి తెచ్చుకున్నవి. మనలో ఉన్న ఒక్క చెడు వాసన... అంటే అలవాటు మిగిలి ఉన్న మంచి గుణాలను పాడు చేసేస్తుంది. ఇది పోవాలంటే భగవంతుడిని శరణాగతి వేడుకోవాలి. లేదా సత్పురుషుల సాంగత్యం చేయాలి. అప్పుడు ’ఛీ ! ఛీ ! నేనిలా బతక్కూడదు...’ అనే బుద్ధి కలుగుతుంది.
దీని గురించే రామకృష్ణ పరమహంస ఏమంటారంటే....‘‘ఏనుగు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు తొండం ఎత్తి ఒక జాజితీగ పీకుతుంది, ఓ చెట్టుకొమ్మను పట్టుకుని విరిచేస్తుంది. అలా వెళుతూ పక్కన ఒక దుకాణంలోంచి ఒక అరటిపళ్ళగెల ఎత్తి లోపల పడేసుకుంటుంది. అదే ఏనుగు పక్కన మావటివాడు అంకుశం పట్టుకుని నడుస్తూ పోతున్నాడనుకోండి. అది తొండం ఎత్తినప్పుడల్లా అంకుశం చూపగానే దించేస్తుంది తప్ప దేనినీ పాడుచేయదు. అలాగే మంచివారి సాంగత్యబలం మనలో ఉన్న వాసనాబలం పాడవకుండా రక్షింపబడుతుంది’’ అంటారు.
హెల్త్ టిప్స్
పళ్లు, చిగుళ్లకు సంబంధించి ఏ రకమైన అసౌకర్యం ఉన్నా పుదీనా ఆకులను నమిలినట్లయితే సమస్య పరిష్కారమవుతుంది. ప్రతిరోజూ రాత్రి భోజనం తరువాత ఒకటి–రెండు పుదీనా ఆకులను తింటే నోట్లో క్రిములు చేరవు. నోటి దుర్వాసనతో బాధపడే వాళ్లు ఉదయం, సాయంత్రం రెండు– మూడు ఆకులను నములుతుంటే శ్వాస తాజాగా ఉంటుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగుతున్నట్లయితే ఒంట్లోని కొవ్వు కరిగిపోతుంది. దీనిని పరగడుపున తీసుకుంటే మంచిది.
ప్రతి రెండు గంటలకు ఒకసారి ఒక కప్పు వేడినీటిలో ఒక టీ స్పూను నిమ్మరసం కలుపుకుని తాగాలి. దీని వల్ల శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు వెళ్లిపోయి శరీరం శుభ్రపడుతుంది. విరేచనాలతో బాధపడుతుంటే దానిమ్మగింజలు, కిస్‌మిస్‌లో చిటికెడు ఉప్పు కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.పిల్లలు ఒక్కొక్కసారి వాళ్లకు ఆకలి వేస్తున్నా కూడా నోటికి రుచించక ఏదీ తినకుండా ఇబ్బంది పెడుతుంటారు. అలాంటప్పుడు ఒక టీ స్పూను తేనెలో అంతే మోతాదులో అల్లం రసం కలిపి నాలుకకు రాయాలి. ఇలా చేస్తే నోటి అరుచి పోయి లాలాజల గ్రంథులు ఉత్తేజితం అవుతాయి. అప్పుడు చక్కగా తింటారు.
మతిమరుపు దూరం
గుడ్‌ఫుడ్
పాలకూర ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ అంటే అతిశయోక్తి కానే కాదు. పాలకూరతో సమకూరే ఉపయోగాలలో ఇవి కొన్ని...ఐరన్ చాలా ఎక్కువగా ఉండే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. ఇందులో దాదాపు 25 శాతం ఐరన్ ఉంటుంది. అందుకే రక్తహీనత ఉన్నవారికి డాక్టర్లు పాలకూరను సిఫార్సు చేస్తుంటారు.పాలకూరలో విటమిన్–ఏ తోపాటు విటమిన్–సి కూడా చాలా ఎక్కువ. అందుకే దీనితో మంచి వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది.ఇందులో ఉంటే ల్యూటిన్, జియాగ్జాంథిన్ వంటి శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్‌ను అరికట్టి, క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి.
పాలకూరలో విటమిన్–కె పాళ్లు కూడా ఎక్కువ. రక్తం గడ్డకట్టేందుకు తోడ్పడటంతోపాటు ఎముక సాంద్రత పెంచుతుంది. మెదడులోని న్యూరాన్లకు రక్షణ కల్పిస్తూ... వయసు పెరిగాక వచ్చే అలై్జమర్స్ వ్యాధిని నివారిస్తుంది.పాలకూరలో విటమిన్–బి కాంప్లెక్స్‌లోని అన్ని పోషకాలూ ఉన్నాయి. పుట్టుకతో వచ్చే అనేక జబ్బులను ఈ పోషకాలు నివారిస్తాయి. అందుకే డాక్టర్లు పాలకూర ఎక్కువగా తినమంటూ గర్భిణులకు సిఫార్సు చేస్తారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565