MohanPublications Print Books Online store clik Here Devullu.com

కావేరీ పుష్కరాలు-Kaveri Pushkaralu 2017

ఈ నెల 12 నుంచి కావేరీ పుష్కరాలు
    జలం ప్రాణికోటికి జీవనాధారం. ‘‘పంచానామపి భూతానాం ఆపఃశ్రేష్టత్వ మాగతః’ అంటే పంచభూతాల్లో శ్రేష్టమైనదని అర్థం. ‘‘ఆపోవై దేవానాం ప్రియం ధామ’’ దేవతలకు ప్రియం కలిగించేది అని కూడా ఉపనిషత్తుల్లో ఉంది. భారతీయులు జలాన్ని దేవతా స్వరూపంగా పరిగణించి, వైదిక కర్మల్లో పవిత్రత కోసం మంత్రాలతో ఆవాహన చేస్తారు.

నదులు జలపూరితాలు. దేవతలకు ప్రతీకలు. నదీ స్నానాలు పాపహరాలు, పుణ్యప్రదాలంటున్నాయి పురాణాలు. నదులు భౌతికంగా అన్నపానీయాదులే కాక మానవుల నిత్య అవసరాలన్నింటినీ తీరుస్తాయి. ఆధ్యాత్మికంగా జీవుల మరణానంతరం ఉత్తమగతులను ప్రాప్తింపచేస్తాయి. స్వతహాగా నదులు పరిశుద్ధాలు. ఇవి రెండు రకాలు. తూర్పు సముద్రంలో కలిసేవి మహానదులు. పశ్చిమ సముద్రంలో కలిసేవి మహానదాలు. ఈ దేశంలో పుణ్యప్రదాలుగా పరిగణన పొందుతున్నవి పన్నెండు. వీటన్నింటికీ ఒక్కొక్క దేవతామూర్తిగా ఒక్కొక్క నామాన్ని అనుసంధానించారు. ఇవి భారతీయుల ఆరాధనలందుకుంటున్నాయి.

విశేష ఫలాన్నిచ్చే దక్షిణగంగ
ఈ దేశ ప్రజలు నిత్యం స్నాన, జప, పూజా విధుల్లో స్మరించే పుణ్య నదుల్లో కావేరి నది ఒకటి. దక్షిణ భారతంలో ప్రవహించే జీవనదుల్లో కావేరి దక్షిణగంగగా ప్రసిద్ధి పొందింది.
ఈ పన్నెండు పుణ్యనదులకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కర సమయం. పుష్కరం అంటే పవిత్ర సమయం అని అర్థం. ఒక్కొక్క నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కర సమయం. ఆ సమయంలో చేసే నదీస్నానాలు, జప ధ్యానాదులు, దాన ధర్మాలు విశేష ఫలితాలందిస్తాయని శాస్త్రవచనం. బృహస్పతి (గురుడు), పుణ్యతీర్థాధిపతి పుష్కరునితో కలిసి ఒక రాశి నుండి మరొక రాశి (మేషాది పన్నెండు రాశులు)లోనికి ప్రవేశించినపుడు ఒక్కొక్క నదికి పుష్కర సమయం. అప్పుడు ఆ నది సమృద్ధిగా ఔషధీపూరితంగా ఉంటుంది. బాహ్యాభ్యంతరంగా ఆరోగ్యాన్ని కలిగిస్తుందని ఆయుర్వేదం అంటున్నది. అందుకే భారతీయులు పుష్కర స్నానాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ సంవత్సరం బృహస్పతి పుష్కరునితో కలిసి తులారాశిలో 12-9-2017న ప్రవేశిస్తాడు. ఆ సమయం కావేరీ నదికి పుష్కర సమయం.

కావేరీ జన్మ వృత్తాంతం
కవేరుడనే రాజర్షి ముక్తిని కోరి బ్రహ్మను గురించి తపస్సు చేయగా బ్రహ్మ సాక్షాత్కరించి కవేరుని అంతరంగాన్ని తెలుసుకుంటాడు. ముక్తికి బదులు కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆమె ద్వారా ముక్తి లభిస్తుందని వరదానం చేస్తాడు. కవేర కన్య యుక్త వయస్కురాలై తండ్రి మనోరథాన్ని తెలుసుకుని శ్రీహరి కోసం తపస్సు చేస్తుంది. శ్రీహరి ప్రత్యక్షమై కవేర కన్య కోరిక తెలుసుకుని ‘‘నా అంశతో జన్మించిన అగస్యుని వివాహం చేసుకున్న క్షణంలో నదిగా మారుతావు, ఆ నదిలో స్నానం చేసి నీ తండ్రి తన మనోరథాన్ని పూర్తి చేస్తాడు’ అని వరం ఇస్తాడు.
అలా అగస్యుని వివాహం చేసుకున్న కవేర కన్య నదీరూపం పొందిందని ఒక కథ. మరొక కథననుసరించి- ఒకప్పుడు దక్షిణ భారతంలో కరువుకాటకాలు తాండవించాయి. ప్రాణికోటి ఆకలిదప్పులతో అశువులు బాసింది. ఆ పరిస్థితిని చూసి శయన మహర్షి చలించి, క్షామ నివారణకోసం శివుని గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివునికి పరిస్థితి విన్నవించి గంగను విడువమన్నాడు. శయన మహర్షి నిస్వార్థతకు సంతసించి ఆదుకోమని శివుడు గంగను కోరాడు. పతి కోరికను మన్నిస్తూ గంగ తనలోని ఒక అంశను సహ్యాద్రిపర్వత శ్రేణిలోని బ్రహ్మగిరి నుండి నదిగా ప్రవహింపచేసింది. కవేరుని కుమార్తె పేరున కావేరి నదిగా, గంగ అంశగా జన్మించడం వల్ల దక్షిణ గంగగా నాటి నుంచి ప్రసిద్ధి చెందింది.

రెండు రాష్ట్రాల అన్నపూర్ణ
కావేరీ నది 1,276మీటర్ల ఎత్తులోనున్న బ్రహ్మగిరిపై తల కావేరి వద్ద జన్మించింది. కర్ణాటక రాష్ట్రం, కొడగు జిల్లా ఇది. కావేరి నది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో 756 కిమీ. ప్రవహించి తమిళనాడులోని పుంపుహార్‌ వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తున్నది. కావేరీలోని ప్రతి నీటి బొట్టు సాగునీరు, తాగునీరు అందించడంతో పాటు, రెండురాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కారణమవుతోంది.

కళాసంస్కృతుల కాకాని
కావేరీ నదీ తీరం సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలం. సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పకళకు ఆటపట్టు. ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు, ఆలయాలు తీరాన్ని నిలయంగా చేసుకున్నాయి. నాయనార్లూ, ఆళ్వార్లూ కావేరిని ప్రస్తుతించారు. శైవగ్రంథమైన ‘పెరియపురాణం’, వైష్ణవకావ్యం ‘‘మణిమేఖలై’’ కావేరిని బహుదా శ్లాఘించాయి. ప్రాచీన, ఆధునిక సాహిత్యం వేనోళ్ల పొగిడింది. రెండు రాష్ట్రాల్లో కావేరీ నదీ తీరాన ఎన్నో ప్రఖ్యాతి గన్న ఆలయాలను ఆనాటి పల్లవ, చోళ ప్రభువులు నిర్మించారు. వాటిలో ప్రసిద్ధమైనవి- కర్ణాటకలోని తలకావేరి, భగమండలం, శ్రీరంగ పట్ణణం, మైసూరు వద్ద చాముండేశ్వరి, శివసముద్రం. తమిళనాడు శ్రీరంగం, జంబుకేశ్వరం, కుంభకోణం, చిదంబరం, తంజావూరు, తిరువయ్యూరు ముఖ్యమైనవి.

జన్మస్థానమైన తలకావేరిలో కావేరి మాత ఆలయం ఉంది. తులా సంక్రమణం రోజున ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తారు. లక్షలాదిమంది భక్తులు కావేరీ మాతను దర్శించి చరితార్థులవుతారు. ఇక్కడ వెలసిన విశ్వనాథ ఆలయంలో పార్వతీసహిత పరమ శివుడు తమ కుటుంబంతో భక్తులను అనుగ్రహిస్తారు. భగమండలంలో అగస్యుడు తపస్సు చేసి సుబ్రహ్మణ్యుని సాక్షాత్కరించుకున్నాడు. అగస్యుడు ఇక్కడ పార్వతీ పరమేశ్వరులకు, విష్ణుమూర్తికి, గణపతి, స్కందులకు ఆలయాలు నిర్మించాడు. ఈ ఆలయ సముదాయాల్లో ఉండే అక్షయ పాత్రలోని ధాన్యం విత్తులను, తమ విత్తులలో కలిపి జల్లితే వరిపంట పుష్కలంగా ఉంటుందని కర్షకుల నమ్మకం. మైసూరు నగరానికి సమీపాన చాముండీ కొండలలో ఆదిపరాశక్తి మహిషాసురుని వధించాక, విశ్రాంతి కోసం ఈ కొండల్లో నివసించిందని క్షేత్రపురాణం. అష్టాదశ శక్తి పీఠాల్లో నాల్గవదైన చాముండీ దేవి కొలువై ఉన్న క్షేత్రం ఇది.

సంవత్సరమంతా భక్తులు చాముండేశ్వరీ దేవిని దర్శించి అనుగ్రహం పొందుతున్నారు. పర్వత ప్రాంతాల్లో ప్రవహిస్తూ వస్తున్న కావేరీ నది శివ సముద్రం వద్ద రెండు పాయలుగా చీలి మైదాన ప్రాంతంలోకి కొండలపైనుంచి దూకుతున్న ప్రాంతం శివ సముద్రం. రెండు జలపాతాలతో అత్యంత రమణీయంగా ఉంటుంది. రెండు జలపాతాల కారణంగా ఏర్పడ్డ మధ్య భూభాగం ద్వీపంగా రూపుదిద్దుకుంది. ఈ ద్వీపంలో మూడు రంగనాథ క్షేత్రాలు. ఆదిరంగం, మధ్య రంగం, అంత్య రంగం ఉన్నాయి. మొదటి రెండు కర్ణాటకలో, చివరిది తమిళనాడులో ఉన్నాయి. మొదటిది చరిత్ర ప్రసిద్ధి పొందిన శ్రీరంగపట్నంలో ఉంది. రెండవది శివసముద్రం వద్ద ఉన్నది. ఈ రంగనాథుని జగన్మోహన రంగనాథుడంటారు.

ఆధ్యాత్మిక సౌరభం
మైసూరు దర్శించే యాత్రికులు బెంగుళూరు, మైసూరు రాజభవనం, కృష్ణరాజసాగరం, బృందావన్‌ గార్డెన్సు, శివసముద్రం వద్ద జలపాతాలను వీక్షించవచ్చు. కావేరీ నది ధర్మపురి వద్ద తమిళనాడులో ప్రవేశిస్తుంది. ఇక్కడ కావేరీ తీరంలో తొలి పుణ్య క్షేత్రం శ్రీరంగం. ఇది అంత్యరంగం. ప్రసిద్ధి పొందిన శ్రీరంగనాథ క్షేత్రం. వైష్ణవ మతానుయూయులకు కేంద్రస్థానం. శ్రీరంగనాథ ఆలయమే ఒక పెద్ద పట్టణం. 7 ప్రాకారాలు, 26 గోపురాలు అనేక ఉపాలయాలు, మంటపాలు, లెక్కకు మిక్కిలిగా వీధులతో అలరారుతుంటుంది. గోపురాలు, మంటపాలపై శిల్పసంపద మాటలకందనిది. దేశంలోనే అతి పెద్ద ఆలయ సముదాయమిది. సమీపంలో పరమశివుని పంచభూతాల్లో ఒకటైన జలలింగం జంబుకేశ్వరంలో ఉంది. మిగతావి వృద్ధ లింగం(కంచి), అగ్ని లింగం(తిరుమణ్ణాలై), వాయులింగం (శ్రీకాళహస్తి), ఆకాశలింగం (చిదంబరం). స్వామిని జంబుకేశ్వరునిగా, అమ్మవారిని అఖిలాండేశ్వరిగా ఆరాధిస్తారు.

పల్లవ, చోళ సామ్రాజ్యాధిపతులు కుంభకోణంలో పలు శైవ, వైష్ణవ ఆలయాలు నిర్మించారు. కొన్ని 9వ శతాబ్దికి ముందే నిర్మించారు. ఇప్పుడు కావేరీ నదికి పుష్కర సమయంలో ‘మక్కర కుండ’ అనే ఉత్సవం జరుగుతుంది. త్రివేణీ సంగమంలో జరిగే మహా కుంభమేళాను మించి ఉంటుందని అంటారు. సమీపంలోని చిదంబరంలో పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశ లింగం చిదంబరంలో ఉంది. పుష్కర యాత్రికులు చిదంబరం తప్పక దర్శించాల్సిన క్షేత్రం. ఈ ఆలయాల్లో శిల్పసంపద మనోహరం.

కావేరీ నది మహత్యాన్ని స్కంద పురాణంలో-
వారిపానేన కావేర్యాః శతక్రతు ఫలం పుమాన్‌
లభతే స్నాన తస్తస్యాః కింభవేతి వక్తికః అన్నది. కావేరీ జలాన్ని పానం చేసినంతమాత్రాన నూరు యజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతారు. ఇక కావేరీ నదిలో స్నానం చేస్తే వచ్చే ఫలాన్ని ఏమని చెప్పగలం? అని దాని భావం. పుష్కర సమయంలో కావేరీ నదిలో స్నానం చేసి, కావేరీ నదీ మహత్మ్యంలో చెప్పిన విధానాలను ఆచరించి ఫలితాలను పొందుదాం.

పర్వత ప్రాంతాల్లో ప్రవహిస్తూ వస్తున్న కావేరీ నది శివ సముద్రం వద్ద రెండు పాయలుగా చీలి మైదాన ప్రాంతంలోకి కొండలపై దూకుతున్న ప్రాంతం శివ సముద్రం. రెండు జలపాతాల్లో అత్యంత రమణీయంగా ఉంటుంది. రెండు జలపాతాల కారణంగా ఏర్పడ్డ మధ్య భూభాగం ద్వీపంగా రూపుదిద్దుకుంది. ఈ ద్వీపంలో మూడు రంగనాథ క్షేత్రాలు. ఆదిరంగం, మధ్యరంగం, అంత్యరంగం ఉన్నాయి.

కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా పేరెన్నికగన్న త్యాగరాజు, శ్వామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు జన్మించిన ప్రాంతం తిరువాయూరు. కావేరి నది ఒడ్డున శ్రీత్యాగేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ త్యాగ బ్రహ్మం సమాధి ఉన్నాయి.

ప్రతిసంవత్సరం పుష్యబహుళ పంచమి రోజున శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దేశంలోని సంగీత విద్వాంసులందరూ ఈ ఉత్సవాల్లో పాలు పంచుకుని తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటారు.  - ఎ. సీతారామారావు, విజయనగరంNo comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం