MohanPublications Print Books Online store clik Here Devullu.com

ప్రకృతి రమణీయం.. చరిత్రకు దర్పణం- Telangana government, Kakatiya period, Forts, తెలంగాణ ప్రభుత్వం, కాకతీయ కాలం, కోటలు

ప్రకృతి రమణీయం.. చరిత్రకు దర్పణం
నల్లమల అడవుల్లో దాగిన విశేషాలెన్నో 
- కాకతీయకాలం నాటి కోటలు.. 140 మైళ్ల మేర రాతిగోడలు 
- నిజాం కాలంనాటి కాలాపాని జైలు 
- ఫరాహాబాద్‌ వద్ద వేసవి విడిది కేంద్రాలు 
- ప్రాచుర్యంలోకి రాని ఆలయాలు మరెన్నో.. 
ఎటుచూసినా పచ్చదనం.. ఆకాశాన్ని ముద్దాడే చెట్లు.. గలగలా పారే జలపాతాలు.. సెలయేళ్లు.. పక్షుల కిలకిలారావాలు.. నల్లమల అటవీప్రాంతంలో ఎటుచూసినా ఆహ్లాదకర వాతావరణమే! ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ప్రకృతి అందాలను వర్ణించడానికి మాటలు చాలవు. నల్లమల అంటే ఈ రమణీయ దృశ్యాలే కాదు.. ఇన్నాళ్లూ ఎవరికీ పెద్దగా తెలియని ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు నెలవు కూడా! కాకతీయకాలం నాటి పటాలభద్రుని కోట.. 140 మైళ్ల పొడవున నిర్మించిన రాతిగోడలు.. నిజాం కాలంలో నిర్మించిన కాలాపాని జైలు.. ఫరాహాబాద్‌ వద్ద వేసవి విడిది కేంద్రాలు.. ఇలా ఎన్నెన్నో చారిత్రక ఘట్టాలు అబ్బురపరుస్తాయి. అటు చారిత్రక ప్రదేశాలు, ఇటు ప్రకృతి సోయగాలతో అలరారుతున్న నల్లమలపై ఈవారం ఫోకస్‌.. 
– గంగాపురం ప్రతాప్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌
430 చెంచు ఆవాసాలు.. 
నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుగూడేలు ప్రధాన ఆకర్షణ. అడవిలో అక్కడక్కడ విసిరేసినట్లుగా చిన్నచిన్న గుడిసెలు కనిపిస్తాయి. నల్లమలలో దాదాపు 430 చెంచు ఆవాసాలున్నాయి. వీటిల్లో అధికారిక లెక్కల ప్రకారం 60 వేల జనాభా ఉంది. వీరంతా కేవలం అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మదనగడ్డలు, సిలగింజలు, తేనె, చింతపండు, థౌప్సీబంక తదితర వాటి మీదే జీవనం గడుపుతున్నారు. గత ఏడేళ్లుగా నల్లమలలో అత్యంత విలువైన యురేనియం నిక్షేపాలను వెలికితీయడం కోసం చెంచులను బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వాల యత్నాలను చెంచులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. 2010లో డీబీర్స్‌ అనే సంస్థ వజ్రాలు, యురేనియం నిక్షేపాల కోసం నల్లమలలో సర్వేలు, భూపరీక్షలు నిర్వహించింది. ఇందులో దాదాపు 2 వేల ఎకరాల విస్తీర్ణంలో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు వెలుగు చూశాయి. 
టైగర్‌ జోన్‌.. అమ్రాబాద్‌ 
పులులకు నెలవైన ప్రాంతం నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు. మొత్తం 9 వేల చ.కి.మీ. అటవీప్రాంతంలో 3,865 చ.కి.మీ. ప్రాం తాన్ని అభయారణ్యంగా గుర్తించారు. వేటగాళ్ల బారి న పడి పులుల సంఖ్య తగ్గిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి 1983లో అభయారణ్యం గా ప్రకటించింది. అప్పటి నుంచి నిషేధిత ప్రాం తంగా పేర్కొంటూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అత్యంత దట్టమైన అడవి కావడంతో చెంచులనే పర్యవేక్షకులుగా అటవీశాఖ నియమించింది. టైగర్‌ ట్రాకర్స్, స్ట్రైక్‌ఫోర్స్‌గా పిలవబడే వీరికి ప్రతినెల రూ.9 వేల పారితోషికం అందజేస్తున్నారు. 
వెలుగుచూడని ఆలయాలు ఎన్నో.. 
దట్టమైన అడవిలో ఏ మూలన చూసినా శివాలయాలే దర్శనమిస్తాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రాచుర్యం పొందాయి. అందులో కొన్ని ఉమామహేశ్వరం, సలేశ్వరం, మల్లెల తీర్థం, లొద్దిమడుగు. ఈ ప్రాంతాలకు చేరుకోవాలంటే సాహసయాత్ర చేయాల్సిందే. ఏడాదిలో చైత్ర పౌర్ణమి సందర్భంగా కేవలం 5 రోజులే సలేశ్వరంలో పూజలు నిర్వహిస్తారు. చాలా ఆలయాలు దట్టమైన అడవిలో నెలకొనడంతో ప్రాచుర్యంలోకి రాలేదు. భైరవుని గుడి, కదిలివనం, అంతర్‌గంగ, అమరేశ్వరాలయం, కేదారేశ్వరాలయం, వంకేశ్వర శివాలయం, నాగేశ్వరం, రాయలగండి చెన్నకేశవాలయం తదితర దేవాలయాలు ఇక్కడ కొలువై ఉన్నా.. ఆలనాపాలనా లేక శిథిలావస్థకు చేరాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన పటాలభద్రుని కోటలోని శివాలయం కనుమరుగవుతోంది. 
కాలగర్భంలో కాకతీయుల కోటలు.. 
కాకతీయుల పాలన అనగానే టక్కున గుర్తొచ్చేది వరంగల్‌ ప్రాంతం. కానీ దక్షిణ తెలంగాణ ముఖ్యంగా పాలమూరు ప్రాంతంలో కూడా వారి పాలన ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా నల్లమలలో కాకతీయుల నాటి కాలంలో నిర్మించిన కోటలు అందుకు సజీవసాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 13వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడి పాలనలో కొన్ని కోటలు నిర్మించారు. వాటిలో ప్రధానమైన పటాలభద్రుడి కోట కాలగర్భంలో కలిసిపోతోంది. అంతేకాదు శత్రుదుర్భేద్యంగా ఉండేందుకు అతి పొడవైన రాతిగోడ కూడా నిర్మించారు. నల్లమల అటవీ ప్రాంతంలో 140 మైళ్ల మేర పొడవు, 6 అడుగుల వెడల్పుతో నిర్మించిన రాతిగోడపై అప్పట్లో గుర్రాలతో కాపలా కాసేవారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. అలాగే ఈ కోట సమీపంలో నిర్మించిన కోనేరు, ఆలయాలు శిథిలమైపోయాయి. అత్యంత దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఎవరూ అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతున్నారు. 
పర్యాటక సంపదపై నిర్లక్ష్యం 
నల్లమలలోని ప్రకృతి రమణీయమైన ప్రాంతాలను వీక్షించడానికి అనువైన పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నల్లమల, కృష్ణానదీ తీర ప్రాంతాల్లో ఎకో టూరిజం పేరిట నిధులు విడుదల చేసినా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఏపీలోని కర్నూలు జిల్లా పరిధిలో ఒక రోజంతా అడవిలో గడిపేలా చర్యలు చేపట్టారు. బైరుట్లీ, పచ్చర్ల వద్ద 14 కాటేజీలను అందుబాటులోకి తెచ్చారు. ఒక రోజంతా అడవిలో గడపడంతో పాటు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రత్యేక సఫారీ వాహనంలో తిప్పుతారు. అలాంటి విధానాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.92 కోట్ల నిధులు మంజూరు చేసినా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం