MohanPublications Print Books Price List clik Here MohanBookList

పసందైన పిజ్జా పరోటా-Pizza Parota

పసందైన పిజ్జా పరోటా
అడపాదడపా పిజ్జా తినకపోతే నోరు ఏదోలా ఉంటుంది. అవును మరి. ఎన్నో వెరైటీ పిజ్జాలు బేకరీల్లో నోరూరించేస్తూ ఉంటే నోరు కట్టేసుకోవటం కష్టమే. అలాగని వాటిని లాగించేస్తే బోలెడన్ని క్యాలరీలు ఒంట్లో చేరిపోయి లావెక్కటం ఖాయం. ఈ సమస్యలకు చక్కని పరిష్కారం...ఇంట్లోనే రుచి కరంగా, పుష్టినిచ్చేలా పిజ్జాలు తయారు చేసుకోవడమే! పోషకాలతో నిండిన, ఆరోగ్యకరమైన ఈ హోమ్‌మేడ్‌ పిజ్జా పరోటాలు బేకరీల్లో దొరికే పిజ్జాలకు ఏ మాత్రం తీసిపోవు. ఓసారి ట్రై చేసి చూడండి.
చికెన్‌ ఖీమాతో..
(తయారీ సమయం - 40 నిమిషాలు)
కావలసిన పదార్థాలు:
ఫిల్లింగ్‌ కోసం:
చికెన్‌ ఖీమా - 3/4 కప్పు
ఉల్లి ముక్కలు - అర కప్పు
టమాటా ముక్కలు - అర కప్పు
వెల్లుల్లి తరుగు - 2 టీస్పూన్లు
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీస్పూను
నూనె - 3 టే.స్పూన్లు
కారం - 1 టీస్పూను
పసుపు - కొద్దిగా
గరం మసాలా - 1 టీస్పూను
ఉప్పు - తగినంత
పిండి ముద్ద కోసం:
గోధుమ పిండి - 3/4 కప్పు
నూనె - 2 టీస్పూన్లు
నీళ్లు - పిండికి సరిపడా
తయారీ విధానం:
పిండికి ఉప్పు, తగినన్ని నీళ్లు చేర్చి పిసుక్కోవాలి. పిండి ముద్దను 8 సమ భాగాలుగా చేసుకుని చదునుగా చేసి పక్కనుంచాలి.
ఫిల్లింగ్‌ తయారీ కోసం...నాన్‌ స్టిక్‌ ప్యాన్‌లో నూనె వేడి చేసి, వెల్లుల్లి ముక్కలు వేయించాలి.
అవి గోధుమ రంగుకి మారిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి.
తర్వాత కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి.
తర్వాత చికెన్‌ ఖీమా వేసి బాగా కలపాలి.
5 నిమిషాలు ఉడికిన తర్వాత 2 టేబుల్‌ స్పూన్ల నీళ్లు పోసి మూత ఉంచి నీళ్లు ఇగిరిపోయేవరకూ ఉడికించాలి.
తర్వాత టమాటా ముక్కలు వేసి మరో 7-8 నిమిషాలపాటు ఉడికించాలి.
నీరంతా ఇగిరిపోయి పొడిగా మారేవరకూ మూత ఉంచి ఉడికించాలి.
ఇప్పుడు పిండి ముద్దలను పరోటాల్లా గుండ్రంగా ఒత్తుకోవాలి.
చదునైన పీట మీద పరోటా ఉంచి లోపల ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఫిల్లింగ్‌ సమానంగా పరచాలి.
దాని పైన మరో పరోటా ఉంచి అంచులు వేళ్లతో లోపలికి ఒత్తేయాలి.
ప్యాన్‌ వేడి చేసి 1 టీస్పూను నూనె వేసి పరోటాలను మద్యస్థమైన మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి.
పిజ్జా పరోటా రెడీ అయ్యాక కత్తితో నాలుగు భాగాలుగా కోసి చిల్లీ సాస్‌తో వేడిగా వడ్డించాలి.
బీట్‌రూట్‌తో..
(తయారీ సమయం - 35 నిమిషాలు)
కావలసిన పదార్థాలు:
బీట్‌రూట్‌ తరుగు - 1 కప్పు
ఉల్లి ముక్కలు - అర కప్పు
పన్నీర్‌ ముక్కలు - 3/4 కప్పు
జీలకర్ర పొడి - 1 టీస్పూను
కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు
ఉప్పు - తగినంత
గోధుమ పిండి - 1 కప్పు
నూనె - 1 టేబుల్‌ స్పూను
కారం - అర టీస్పూను
నెయ్యి - వేపుడుకు సరిపడా
తయారీ విధానం:
బీట్‌రూట్‌ తరుగుకు ఉప్పు చేర్చి మూత ఉంచి మెత్తగా ఉడికించాలి.
దీనికి ఉల్లి ముక్కలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కారం, పన్నీర్‌, ఉప్పు చేర్చి బాగా కలిపి మరో 2 నిమిషాలు ఉడికించాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని నాలుగు సమ భాగాలుగా చేసుకోవాలి.
గోధుమ పిండికి నూనె, ఉప్పు, నీళ్లు చేర్చి ముద్దగా పిసుక్కోవాలి.
సమ భాగాలుగా చేసుకుని ఒక్కో పిండి ముద్దను పరోటాగా ఒత్తుకోవాలి.
ఈ పరోటాలో ఉడికించి పెట్టుకున్న బీట్‌రూట్‌ మిశ్రమాన్ని ఉంచి పైన మరో పరోటా ఉంచి అంచులు మూసేయాలి.
నాన్‌ స్టిక్‌ ప్యాన్‌ వేడి చేసి, నెయ్యి వేసి, పిజ్జా పరోటాలను రెండు వైపులా కాల్చుకోవాలి.
వేడిగా టమాటా సాస్‌తో వడ్డించాలి.
పన్నీర్‌తో..
(తయారీ సమయం - 45 నిమిషాలు)
కావలసిన పదార్థాలు:
పన్నీర్‌ ముక్కలు - 100 గ్రాములు
పిజ్జా సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు
ఉప్పు, మిరియాల పొడి రుచికి సరిపడా
నూనె - వేపుడుకు సరిపడా
తులసి ఆకులు - 4 (సన్నగా తరగాలి)
మెజెరెల్లా చీజ్‌ - తగినంత
గోధుమ పిండి - 2 కప్పులు
నూనె - సరిపడా
పాలు - అర కప్పు
మిరియాల పొడి - 1 టీస్పూను
తయారీ విధానం:
గోధుమ పిండికి పాలు చేర్చి మెత్తగా పిసుక్కోవాలి.
ముద్దను సమ భాగాలుగా చేసుకుని పరోటాలు ఒత్తుకోవాలి.
ఈ పరోటాను పీట మీద ఉంచి పైన పిజ్జా సాస్‌ పరుచుకుని, పన్నీర్‌, మోజెరెల్లా చిలకరించాలి.
ఉప్పు, తులసి ఆకులు, మిరియాల పొడి చల్లి అంచులు నీళ్లతో తడి చేసుకోవాలి.
దీని మీద మరో పరోటా ఉంచి అంచులు మూసేయాలి.
పెనం మీద నూనె వేసి ఈ పరోటాలను రెండు వైపులా కాల్చుకోవాలి.
వేడిగా పుదీనా చట్నీతో సర్వ్‌ చేయాలి.
న్యూటెల్లాతో..
(తయారీ సమయం - 30 నిమిషాలు)
కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి - 4 కప్పులు
నీళ్లు, ఉప్పు - తగినంత
నెయ్యి - పరోటా కాల్చటానికి సరిపడా
న్యూటెల్లా - 1 టేబుల్‌ స్పూను
నూనె - 1 టేబుల్‌ స్పూను
తయారీ విధానం:
పిండికి ఉప్పు, నూనె, నీళ్లు చేర్చి
పిసుక్కోవాలి.
పిండి ముద్దను సమ భాగాలుగా విభజించుకోవాలి.
వీటిని పరోటాల్లా ఒత్తుకోవాలి.
పరోటా మీద న్యూటెల్లా సగానికి పరిచి పరోటాను మధ్యకి మడవాలి.
న్యూటెల్లా బయటకు రాకుండా అంచులు మూసేయాలి.
ప్యాన్‌ వేడి చేసి నెయ్యి వేసి పిజ్జా పరోటాను రెండు వైపులా కాల్చుకోవాలి.
మధ్యకు కోసి వేడిగా సర్వ్‌ చేయాలి.





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం